ఇట్లు  మీ వసుధా రాణి 

 

సహన సముద్రం మా అమ్మ

-వసుధారాణి                  

పెళ్లిళ్లు పేరంటాలు అంటే పిల్లలకు మాచెడ్డసరదా కదా .నాకు ఇప్పటికీ అంతే అనుకోండి.అలా నా పదవ ఏట అనుకుంటా గుంటూరులో ఓ పెళ్లికి పిలుపు వచ్చింది.సాధారణంగా పెళ్లికి వెళ్లాల్సి వచ్చినపుడు ఇంటిలో అందరి కంటే చిన్నపిల్లల్ని తీసుకెళ్తారు. వాళ్ళకి పెద్దగా బడులు , తరగతులు పోయేది ఏమీ ఉండదని.అలా మా అమ్మతో పెళ్లికి చంకన పెట్టుకెళ్లిన పిల్లిలా నేనూ తయారు అయ్యాను. ఆ పెళ్లి కోసం మా అమ్మానాకు కృష్ణ నీలం రంగు మీద బంగారు చుక్కలున్న గౌన్ కుట్టించింది.రిబ్బన్లు,గాజులు కూడా కొత్తవి కొన్నది.నరసరావుపేట రైల్వేస్టేషన్ చాలా గొప్పగా, అద్భుతంగా కనిపించింది నా చిన్న బుర్రకి.గాంధీపార్కు లో ఆడుకునే టప్పుడు పార్కు వెనుక పట్టాలమీద రైలు వెళ్ళేటప్పుడు రైల్లో వాళ్ళకి టాటాలు చెపుతుండే వాళ్ళం. మరి ఆ రైలే  నేను ఎక్కుతుంటే ఇంకెంత సరదా కదా.మీటర్ గేజ్ రైలెక్కి గుంటూరు ప్రయాణం మధ్యలో సాతులూరు, నుదురుపాడు ,ఫిరంగిపురం ఇలా స్టేషన్ల పేర్లు చదువుకుంటూ కదిలిపోయే కొండలు,చెట్లు చూస్తూ ఉండటం ఎంత బాగుందో .మధ్యలో బోలెడు అనుమానాలు ఎదురుగా వచ్చే రైలు మన పట్టాలమీదకి వస్తే ?రైల్లో శనక్కాయలు అమ్మేవాడు కూడా టికెట్ కొనుక్కుంటాడా? ఇలా మా అమ్మని బోలెడు ప్రశ్నలు వేసి విసిగించాను.అమ్మ తక్కువ మాట్లాడేది కానీ ప్రశ్నలు వేస్తే మాత్రం వివరంగా సమాధానాలు ఇచ్చేది.

అలా సంభ్రమాఆశ్చర్యాలతో కూడిన రైలు ప్రయాణం ఓ గంట సాగిన తరువాత గుంటూరు వచ్చింది.బాబోయ్ గుంటూరు రైల్వేస్టేషను ఇంకా పెద్దది మా పేట స్టేషన్  కంటే . గుంటూరు జంక్షన్ అని ఉంది ఎందుకు ? మళ్లీ కొత్త డవుటనుమానం నాకు.ఒకే లైన్ రెండు ఊళ్ళని కలపటం కాకుండా, ఇంకో ఊరినుంచి మరో లైన్ వచ్చి కలిస్తే జంక్షన్ అంటారని అమ్మ చెప్పింది.మళ్లీ 20 ఏళ్ల తరువాత నా ఏడేళ్ల కొడుకు గోపాల్ కి నేను అదే సమాధానం చెప్పాను.ఐతే వాడు నాకంటే మూడేళ్ళ ముందు ఈ ప్రశ్న వేసాడు.

బ్రాడీపేట మొదటి లైను రైలు పట్టాల పక్కన ఉండటం ఆ మొదటి లైను 17వ అడ్డరోడ్డు లో మేము వెళ్లిన పెళ్లి వారి ఇల్లు ఉండటం, నాకు ఎంతో కిక్కునిచ్చిన విషయం.అసలు ఆ లైన్లో ఇళ్లన్నీ ఎంత బాగున్నాయో.పెద్ద పెద్ద  పెరళ్ళు, ప్రతి ఇంటి ముందూ మామిడిచెట్టు,రాచఉసిరి చెట్టు తప్పనిసరిగా ఉన్నాయి.ఇందాక వెళ్ళేటప్పుడు ఎదురుగా ఉన్న పట్టాలపై నుంచే మా రైలు వెళ్ళింది అని తెలిసి భలే అనిపించింది.

ఇంటి ముందు వరండాలోకి వెళ్ళగానే మా అమ్మలా ఉన్న, ఐతే ,మా అమ్మకన్నా ఇంకా బాగా తెల్లటి రంగువున్న ఒకావిడ నవ్వుతూ ఇంట్లో నించి బయటికి వచ్చి రాధ వొచ్చింది సావిత్రీ అంటూ కేకేసింది .రా రాధా అంటూ అమ్మచేతిలో బ్యాగ్ తీసుకుంది.నాకేసి చూస్తూ నీ పేరు రాణీయా ? ఏ దేశనికి రాణివి ? అని అడిగింది నవ్వుతూ .నేను కొంచెం సిగ్గుపడి పేటకి అన్నా. ఊహూ పిల్ల ఘనమే ! అంటూ నా నెత్తిన చిన్నమొట్టికాయ వేసింది.అలా లోపలికి వెళితే ఇంట్లో బోలెడు మంది అందరూ అమ్మని రాధా ,రాధపిన్ని,అంటూ పిలుస్తూ ,ఇదేనా రావటం అంటూ పలకరిస్తున్నారు . నాకు ఇంతకు ముందు వాళ్ళని ఎప్పుడూ చూసినట్లుగా అనిపించ లేదు.ఈ లోగా వంటింట్లొనుంచి అనుకుంటా మళ్లీ అలానే మా అమ్మకన్నా ఇంకా తెల్లగా ,మొదట బయటకి వచ్చినావిడ పొలికలతో ఉన్న ఇంకో ఆవిడ వచ్చింది . ఎంతమంది  ఉన్నారిలా అమ్మలాగా ఉన్నవాళ్లు ఈ ఇంట్లో అని నాకు ఆశ్చర్యం వేసింది.

మొదట బయట వచ్చినావిడా పేరు సరస్వతి అనీ ఆవిడ హనుమాయమ్మ హైస్కూల్ టీచర్ అని ఆవిడని ,సావిత్రి అనే ఆవిడని ఆమ్మ అని పిలవాలని అమ్మచెప్పింది.అక్కడ ఇంకో ఆమ్మవుంది ఆవిడ వీళ్ళ పొలికలతో లేదు గానీ భలే సరదాగా ఉంది,ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ. నాకు ఆవిడ బాగా నచ్చింది.ఆవిడని అందరూ వేమూరామ్మ అని పిలుస్తున్నారు.కాసేపటికి ఆ అమ్మ కూతురు అమ్మలఅక్కయ్య అని ఆ అక్కయ్య పెళ్లికి మేము ఇక్కడికి వచ్చామని మొత్తం విషయం అర్ధం అయిపోయింది నాకు. ఇంకేముంది పెళ్లికూతురు అమ్మలఅక్కయ్య ముద్దుల చెల్లి అయిపోయా కాసేపటికి మరి సోషల్ రాణి అంటే అంతే కదా.ఇప్పటికీ మా అమ్మలఅక్కయ్యకి నేనంటే ఇష్టం .

ఐతే వీళ్లంతా ఇంత మంది చుట్టాలు నాకు ఇంతకు ముందు ఎందుకు తెలియలేదు.పేటలో మాఇంటికి వీళ్ళెవరూ రాలేదు.అక్కడ వచ్చే చుట్టాలు అందరూ నాకు తెలుసు కదా. ఇలా డిటెక్టివ్ రాణికి కొన్ని అనుమానాలు వచ్చినా,పెళ్ళికొసం ఇంటి వెనుక పెరట్లో గాడి పొయ్యి వంటలు నన్ను తెగ ఆకర్షించాయి.ఆ పెళ్లిలో తిన్న రంగు రంగుల తీపి బూందీ నేను ఇప్పటికీ మర్చిపోలేదు.చిన్న చిన్న విస్తరి దొన్నెల్లో ఎరుపు,ఆకుపచ్చ,గులాబీ ,నీలం రంగులున్న బూందీ ,అక్కడక్కడా  జీడిపప్పు,కిస్మిస్ పలుకులు నవనాగరీక వంటకంలా భలే అనిపించింది నాకు.

అమ్మలఅక్కయ్యని పెళ్లికూతురుని చెయ్యటం,పెళ్ళివారి అలంకరించిన  అంబాసిడర్ కారు, విడిది మర్యాదలు, బంతి భోజనాలు ,పాటలు,సరదాలు అన్నీ వింతగా ,కొత్తగా ఒక సరికొత్త అనుభవం నాకు .పెళ్లి అయిపోయి అప్పగింతలప్పుడు అంత సరదాగా జోకులు వేసే వేమూరు ఆమ్మ కూతురు అమ్మలఅక్కయ్యని పట్టుకుని ఏడవటం బాధ అనిపించింది.ఉమక్కకి,పద్మక్కకి ,చివరకి నాకు పెళ్లి చేస్తే కూడా అమ్మ ఇలా ఏడుస్తుందా ? అమ్మ కనుక ఏడ్చేటట్లయితే నేను పెళ్లే చేసుకోను ఆ రంగుల తీపి బూందీ తినకపోయినా ఫరవాలేదు అనుకున్నాను.

వడిబియ్యం మూట కట్టుకుని , పసుపుగా మారిపోయిన తెల్లచీరలో బావగారి చిటికిన వేలు పట్టుకుని అమ్మలఅక్కయ్య అలంకరించిన అంబాసిడర్ కారెక్కి వెళ్ళిపోయింది. రెండు రోజులు అక్కకి దగ్గరగా గడిపిన నాకే ఇల్లు బోసి పోయినట్లు అనిపించింది పాపం ఆమ్మా వాళ్ళకి మనసు ఎలా ఉన్నదో అప్పుడు .

బాగా అలిసిపోయి నిద్రపోతున్న నన్ను అమ్మ పొద్దున్నే లేపింది .త్వరగా తయారవ్వాలి బాబఅన్నయ్య మనల్ని తెనాలి తీసుకు వెళ్తాడు అంటూ. నిద్రలేవటం కష్టం అనిపించినా తెనాలి పేరు వినగానే ఉత్సాహం వచ్చేసింది. మా క్లాసులో నాగమల్లేశ్వరి అనే పిల్ల దసరా సెలవలకి తెనాలి వాళ్ళ బాబాయి ఇంటికి వెళ్లి వచ్చి ఒకటే చెప్పేది తెనాలి కబుర్లు అది గొప్పలు చెపుతోందేమో అని నాకు అనుమానం వచ్చినా  ఆసక్తిగానే వినేదాన్ని . ఇప్పుడు ఆ తెనాలి సంగతి ఏమిటో చూడచ్చు అని అమ్మ చెప్పినట్టు విని గబ గబ తయారు అయ్యాను.

గుంటూరు జంక్షన్ లో తెనాలి వెళ్లే రైలు ఎక్కి తెనాలి జంక్షన్లో దిగాము. పేట జంక్షన్ కానందుకు కొంచెం చిన్నతనంగా అనిపించింది.అక్కడ తెనాలి ఒక మార్కు కొట్టేసింది.పెద్ద కాలువ దాని నిండా నీరు ,మా ఊళ్ళో కూడా సాగర్ కాలువ ఉంది కానీ చిన్నది పైగా ఇలా నిండా పారుతుండగా చూడలేదు.తెనాలికి రెండు మార్కులు. మా ఊరికన్నా విశాలమైన రోడ్లు,పెద్ద పెద్ద డాబాలు తెనాలికి ఇంక మార్కులు ఇవ్వటం మర్చిపోయి రిక్షాలోంచి చూస్తూ కూర్చున్నాను వింతలు అన్నీ.మా ఊళ్ళో కూడా జనాలు ఎక్కువగానే వుంటారు రోడ్లమీద కానీ ఈ ఊర్లో ఇంకా ఎక్కువ మనుషులు ఉన్నట్లు రోడ్లు నిండుగా కనపడ్డాయి.

మేము ఎక్కిన రిక్షా ఓ పెద్ద పెంకుటింటి ముందు ఆగింది. 

అమ్మ ముఖం కొంచెం నీలి నీడలు కప్పినట్లుగా కళ తప్పి ఉంది .ఆవిడ చాలా నెమ్మదిగా, ఆ రిక్షా దిగటం కూడా ఒక నెమ్మదించిన వేగంతో దిగింది.సాధారణంగా అమ్మ చురుకుగా కదులుతుంది, ఏ పని అయినా ఆమెలో ఓ వేగవంతమైన కదలికతో చేస్తుంది. అలాంటిది ఈ తెనాలి ఇంట్లోకి మాత్రం చాలా నెమ్మదిగా నా చేయి ఎప్పటి కంటే కొంచెం గట్టిగా పట్టుకుని నడుస్తూ  లోపలికి తీసుకు వెళ్ళింది. ఆ చిన్న వయసులో నాకు అమ్మ ఎట్లాటి భావోద్వేగాలకు గురి అయిందో తెలియలేదు కానీ ,ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటే అప్పటి ఆవిడ మనోస్థితి అర్ధం అవుతుంది.

ఇంట్లోకి  వెలుతురు కొంచెం తక్కువగా వస్తోంది.మొదట బాబఅన్నయ్య లోపలికి వెళ్ళి అమ్మమ్మా అని పిలిచాడు ఒక గదిలోంచి పేటలో మా ఇంట్లో అమ్మమ్మా వాళ్ళు కట్టుకునే లాంటి తెల్ల చీరె కట్టుకుని అమ్మమ్మా వాళ్ళకంటే వయసులో కొంచెం చిన్నగా ఉన్నావిడ బయటకు వచ్చింది. అమ్మమ్మా రాధపిన్నిని తీసుకు వచ్చాను అంటూ బాబఅన్నయ్య అమ్మని చూపాడు.ఒక్క క్షణం ఆవిడ మొఖంలో సంతోషం మెరిసి ,మళ్లీ మామూలుగా అయింది.అమ్మ నా చేయి ఇంకొంచెం గట్టిగా పట్టుకుని ఆవిడ దగ్గరికి రెండడుగులు వేసి బాగున్నావా అమ్మా అని అడిగింది.ఆవిడ నా తలపైన చేయి వేసి నిమిరి అమ్మ భుజం పైన నెమ్మదిగా తట్టి బాగున్నా రాధా అన్నది. వాళ్ళ ఇద్దరి కళ్ళలో కన్నీటి పొర చిన్న పిల్ల నైనా నాదృష్టిని పడకపోలేదు.

అమ్మమ్మ అని పిలవమని బాబఅన్నయ్య చెప్పినా నాకు కొంచెం కష్టం అయింది ఆవిడని అమ్మమ్మ అనటం.ఎందుకంటే ఇంటి దగ్గర ఉన్న ఆ ఇద్దరే నాకు అమ్మమ్మలు అని నా నమ్మకం.అమ్మమ్మతో పాటు అచ్చం అమ్మలా ఉన్న ఆయన వున్నాడు అక్కడ. నాపేరు ప్రభాకరం .నీపేరు ఏమిటి  ? అని అడిగాడు నన్ను ఎత్తుకుని ఆయన మాత్రం నాకు భలే నచ్చాడు ఎప్పుడూ నవ్వుతున్నట్టే ఉంటుంది మొహం ,రాణి వసుధారాణి అని చెప్పాను .సైకిల్ మీద కూర్చో బెట్టికుని ఒక సెంటర్ కి తీసుకు వెళ్ళాడు .వరుసగా బోలెడు జిలేబి మిఠాయిలు అమ్మే అంగళ్లు అవి .మా పేటలో అన్ని అలా ఒకే దగ్గర లేవు.నాకు జిలేబీ ,బూందీ కొనిపెట్టాడు మామయ్య. మళ్లీ నిమ్మకాయ సోడా కూడా తాగించాడు. మిషన్లో పెట్టి అప్పటి కప్పుడు తీసి ఇచ్చిన షోడా భలే పవరుగా ఉంది.వారెవ్వా తెనాలి అనుకున్నాను.నాగమల్లేశ్వరి మీ బాబాయే కాదు మా మామయ్య వున్నాడు తెనాలిలో అని చెప్పాలి అనుకున్నా.

సాయంత్రం దాకా బాబన్నయ్యతో,ప్రభాకరం మామయ్యతో బోలెడు కబుర్లు ఆటలు ఆడుకుని  మళ్లీ గుంటూరుకు బయలు దేరాం. అమ్మ కొంచె గంభీరంగా ఉంది.అమ్మమ్మ వచ్చేటప్పుడు అమ్మని పట్టుకుని కళ్ళ నీళ్లు పెట్టుకుంది.వస్తూ ఉండు రాధా అన్నది .అమ్మ ఏమీ పలక కుండా తల వంచుకుని వెళ్లిస్తా అని అమ్మమ్మకి ,ప్రభాకరం మామయ్యకి చెప్పి రిక్షా ఎక్కింది.ఇంటి నుంచి స్టేషన్ కి వెళ్లేదాకా అమ్మ ఏడుస్తూనే ఉంది.నాకేమీ అర్ధం కాలేదు.అమ్మ అలా ఏడవటం నేను ఎప్పుడూ చూడలేదు.

రైల్లో అమ్మ ఆడవాళ్ల పక్కన కూర్చుంది.నేనూ బాబన్నయ్యా వేరే చోట కూర్చోవాల్సి వచ్జింది రైలు రద్దీగా ఉండటం వలన.బాబన్నయ్యని నెమ్మదిగా అడిగాను అమ్మ ఎందుకు అన్నయ్యా ఏడ్చింది అని.బాబన్నయ్య నెమ్మదిగా చెప్పాడు .వాళ్ళ అమ్మని వదిలి పెట్టి వస్తోంది కదా అందుకు ఏడుస్తోంది అని.అదేంటి పేటలో మా అమ్మమ్మ కదా అమ్మకి అమ్మ అన్నాను.కాదు రా వాళ్ళు చిన్నప్పుడే పిన్నిని తీసుకు వెళ్లి పెంచుకున్నారు .ఈ అమ్మమ్మ మీ అమ్మకి ,మా అమ్మకి,సరస్వతి అమ్మకి,ప్రభాకరం మామయ్యకి అమ్మ అనిచెప్పాడు.అచ్చం సినిమాలోలా అమ్మ అసలు అమ్మ దగ్గర నుంచి చిన్నప్పుడే విడిపోయింది.నాకు వెంటనే అమ్మ దగ్గరికి వెళ్లాలనిపించింది.గబగబా వెళ్లి అమ్మ వళ్ళో కూర్చుని నీకు మీ అమ్మ ఇష్టమా,పేటలో అమ్మమ్మ ఇష్టమా అని అడిగాను. అమ్మ నన్ను గట్టిగా పొదువుకుని నాకు అమ్మ అంటే పేటలో చిన్నమ్మనే . నీకూ అలాగే  ఇష్టం కదా అన్నది.అవునమ్మా తెనాలి అమ్మమ్మ మంచిదే కానీ అమ్మమ్మ మాత్రం మన అమ్మమ్మే అన్నాను.

అమ్మ దుఃఖం అంతా మర్చిపోయి హాయిగా నవ్వేసింది. మర్నాడు గుంటూరు నుంచి పేటకి వెళ్లలోపు అమ్మ తన కథ చెప్పింది నాకు.అమ్మ మూడవ యేటనే తాతగారు చనిపోయారట.అమ్మమ్మ ఆరుగురు పిల్లలతో అక్కగారింటికి చేరిందట . స్వాతంత్య్ర సమరం జరిగే టప్పుడు  కాంగ్రెస్ పార్టీ నడపటానికి కొంత డబ్బుతమ వంతుగా సమకూర్చాలని పెద్దఅమ్మమ్మ ఖద్దరు అమ్మి ఆ డబ్బును కాంగ్రెస్ ఫండ్ కి పంపేదట. అలా ఒక మీటింగ్ లో తప్పిపోయి ఆవిడ దగ్గరికి వచ్చిన మూడేళ్ళ పిల్ల బుల్లి రాధమ్మని వాళ్ళ ఇంట అప్పచెప్పినప్పుడు  పరిచయం . తండ్రి చనిపోవడం, చిన్నపిల్లలు ఇంతమంది,అమ్మమ్మ అక్కగారి ఇంట ఇంతమందితో ఉండటం ఇవన్నీ ఒక ఎత్తయితే, పేటలో అమ్మమ్మ ఈ పెద్దమ్మమ్మ ఖద్దరు అమ్మకాలకి ఊర్లు తిరుగుతుంటే ఒక్కతే పొలం పనులు అవీ చేయిస్తూ ఇంటి పట్టున ఉండేది.పెద్దఅమ్మమ్మ ఇవన్నీ ఆలోచించి ఈ అమ్మాయిని మాకిస్తే పెంచుకుంటాం అన్నదట. అమ్మమ్మ అక్కగారి భర్త ముక్కామల సుబ్బారావు గారు ( మా వేమూరు ఆమ్మ నాన్నగారు) డిస్రిక్ట్ మేజిస్ట్రేట్ అట  అప్పట్లో, వస్తే తీసుకు వెళ్ళండి అన్నాడట.

మూడేళ్ళ అమ్మని మా పెద్ద అమ్మమ్మ వస్తావా నాతోటి అని అడగటం మా బుజ్జి అమ్మ  సరే అనటం .ఆవిడ తీసుకు వచ్చేయటం అయిపోయాయి.పేటలో అమ్మమ్మ చాలా మెత్తటి మనిషి సున్నితంగా మాట్లాడుతుంది ఎవరితో అయినా అమ్మకి అమ్మమ్మ నచ్చేసినట్లుంది అలా వచ్చిన అమ్మ అమ్మమ్మల దగ్గర ఉండిపోయింది. కనీసం వాళ్ళ అమ్మని ఒక్క సారి కూడా అడగలేదట. అలా పెరిగి పెద్దయి పెళ్లి పిల్లలు,మళ్ళీ వాళ్ళ పెళ్లిళ్లు వచ్చాక ఇలా రాకపోకలు చేస్తున్నాం .అని చెప్పింది.

నరసరావుపేట వచ్చి ఇల్లు చేరగానే నేను పరిగెత్తుకుంటూ  వెళ్లి అమ్మమ్మ నడుము ను చుట్టుకుని పట్టుకున్నాను.ఎంత హాయిగా అలవాటైన అమ్మమ్మ.అమ్మ కూడా అమ్మా అంటూ అమ్మమ్మకి పెళ్లి కబుర్లు చెపుతుంటే , అమ్మమ్మ చెప్పే కృష్ణుని కథల్లో యశోదా కృష్ణులు గుర్తొచ్చారు నాకు.ఈ కథ మాత్రం నాగమల్లేశ్వరి చెప్పాలని పించలేదు.ఒక్క మిషన్ నుంచి తీసిన గోలీ షోడా గురించే బడిలో కోతలు కోసాను.అమ్మమ్మని మర్చిపోయాను కానీ ప్రభాకరం మామయ్య ఓ ఆత్మీయ జ్ఞాపకం నాకు ఇప్పటికీ.

*****

Please follow and like us:

4 thoughts on “ఇట్లు  మీ వసుధా రాణి- సహన సముద్రం మా అమ్మ”

  1. వసుధ రాణి గారూ మీ అమ్మ కథ, కేవలం నువ్వే కవితలు చదువు చున్నాను.మీతో ఎప్పటిదో నాకు ఏదో ఋణాను బంధం ఉందమ్మా.లేకపోతే ఎలా మీ ఇంట్లో మీ అందరితో కలసి తిరుగుతున్నాను, అమ్మ మెత్తని చీర స్పర్శ , చేతి రుచి,పండుగ ఆనందం ఎలా అనుభవానికి వస్తుంది. మీ కవిత లలో భగవత్ దర్శనం ఎలా సంభవిస్తుంది.

    1. ధన్యవాదములు ఉదయలక్ష్మి గారు.పూర్వజన్మ సుకృతం ఈ రచనా వ్యాసంగం అబ్బటం.మీకు నచ్చి మీరు ఇలా మనసుతో కనెక్ట్ అవ్వటం చాలా సంతోషంగా ఉంది.మీ లాంటి వారి ఆశీర్వాదాలు మాకు అండ.🙏💐

  2. పెంచిన ప్రేమ యెంత గొప్పదైనా కన్నతల్లి పేగు బంధం కలకాలం జీవన కాలం. ” అమ్మ ఇంటి నుండి స్టేషన్ కు వెళ్ళే దాకా యేడుస్తూనే వుంది ” ఈ వాక్యంలో అమ్మ కళ్ళలో కన్నీళ్ళే అందుకు సాక్ష్యం.పేట రాణి గారూ .. అభినందనలు. చక్కగా వ్రాస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.