క’వన’ కోకిలలు- విస్లావా సిమ్ బోర్ స్కా

-నాగరాజు రామస్వామి

  విస్లావా సిమ్ బోర్ స్కా

    Wislawa Szymborska

   ( 1923 – 2012 )

                 Wisława  Szymborska is ” Mozart of Poetry” – Nobel committee.

మారియా విస్లావా సిమ్ బోర్ స్కా ( Maria Wisława Anna Szymborska ) పోలాండ్ కు చెందిన గొప్ప కవయిత్రి, రచయిత్రి, అనువాదకురాలు. జులై 2 , 1923 లోజన్మించి,  ఫిబ్రవరి 1 , 2012 లో మరణించింది. 1996 లో నోబెల్ బహుమతి ఆమెను వరించింది. ఆమె కవిత్వంలోని విశిష్టత “వ్యంగ్య నిర్దుష్టత” ( ironic precision ). విశ్వ మానవ వాస్తవ జీవన మానవీయతను చారిత్రిక నేపథ్యంగా, బహుముఖంగా వెలుగులోకి తెచ్చినందున ఈ పురస్కారం ఇవ్వబడిందని నోబెల్ కమీటీ ప్రకటించింది. ఆమె సాహిత్యం యూరోప్ లోని పలు భాషలలోకే కాక అరబిక్, హీబ్రు , జపాన్, పెర్షియన్, చైనీస్ భాషలోకి అనువదింప బడింది.

విస్లావా జీవితం వడ్డించిన విస్తరేం కాదు. 1939 లో రెండవ మహా ప్రపంచ యుద్ధం మొదలయ్యాక, నిర్బంధకూలీగా జర్మనీకి తరలించబడే ముప్పును తప్పించుకునేందుకు రైల్ రోడ్ ఉద్యోగిగా పని చేసింది. రహస్యంగా చదువు కొనసాగించింది. అప్పుడే ఆమె కళాత్మక జీవితం మొగ్గ తొడిగింది. కథలు, కవిత్వం రాయడం ప్రారంభించింది. 2012 లో ఆమె అవసాన దశ దాకా కవిత్వం రాస్తూనే పోయింది. ఆమె మరణానంతరం 2013 లో ఆమె పేరున Wislawa Szymborska Award స్థాపించ బడింది.

వ్యంగ్య నిర్దుష్టతను, విరోధాభాసాన్ని కవిత్వ సాధనాలుగా వాడుకొంది. ఆమె రచనల్లో యుద్ధం, ఉగ్రవాదం పుష్కలంగా ప్రతిఫలించింది. సాధారణ వాడుక భాష, సరళమైన అభివ్యక్తి. మార్కెట్ స్థలాలు, రైల్వే స్టేషన్లు, ఇంటి మెట్లు, మిద్దెలు, తలుపులు లాంటి అతి సామాన్యమైన విషయాలు ఆమె కవితా వస్తువు లైనవి. రాసిన కవితలు 300 కు మించకున్నా, ప్రతి కవితా ఆణిముత్యంలా మెరిసింది.

” కొందరికే కవిత్వం నచ్చుతుంది; వేయి మందిలో ఏ ఇద్దరికో ”  అని ఆమె వెలిబుచ్చిన అభిప్రాయానికి భిన్నంగా ఆమె కవితా సంపుటాలు అత్యధికంగా అమ్ముడు పోయాయి.

ఇదిగో, ఆమె కొన్ని కవితలకు నా అనువాదాలు :

  1. :* కాల్పనిక ద్వీపం :

( **Utopia )

అక్కడ

అంతా విశదం,

గట్టిది కాలి కింది భూమి.

అక్కడ ఉండే తోవలు

నడిద్వీపం లోకి నేరుగా చేర్చే కాలిబాటలు.

అనాదిగా అక్కడి తరుగుల్మాలు

సాక్షాధారాలకు దూరంగా వంగి ఉంటవి;

తలెత్తే సందేహాలను తక్షణం తుడిచేస్తుంది

అక్కడి తడి గాలి.

చిక్కులు లేని అక్కడి అవగాహనా వృక్షాలకు

అరమరికలు లేని మెరుపు శాఖలుంటవి;

చిగురు వసంతాలు పిలుస్తుంటవి.

ఆ సువిశాల అందాల లోయలలో

దట్టమైన తరుశ్రేణులు దారిచూపుతుంటవి.

అక్కడి కొండకోనల ప్రతిధ్వనులు

ఆ రహః ప్రపంచాన్ని విప్పేందుకు తొందరిస్తుంటవి.

కుడివైపు గుహలో అర్థం, ఎడమ కొలనులో నిశ్చయం,

ఆ అచల శిఖరాల మీద అచంచల ఆత్మవిశ్వాసం;

అగాధాల లోతుల్లోంచి సత్యం పైకి తేలుతుంటది,

కొండ కొనకొమ్మున సర్వం దృశ్యమానమౌతుంటది.

ఇన్ని ఆకర్షణలు ఉన్నా

ఆ ద్వీపం ఓ నిర్జన భూమి !

పొడి సైకతాల మీద చెదిరిన పాద ముద్రలన్నీ

నడి సముద్రంలోకే వెనుతిరుగుతున్నవి !

ఇక నీవు చేయ గలిగిందల్లా ఒకటే

ఆ ద్వీపఖండానికి శాశ్వతంగా స్వస్తి పలికి

దూకడమే

సముద్రంలోకి; అగాధ జీవన సంద్రంలోకి.

* ఊహాజనిత లోకాలకు మాత్రమే పరిమితమైన వాస్తవాతీత కల్పిత ఆదర్శ ద్వీపం.

**థామస్ మూర్  1516 లో సృష్టించిన వివాదాస్పదమైన వ్యంగార్థకమైన గ్రీక్ పదం.

  1. : గొప్పదేమీ కాదు మృత్యువు !

అది

ఒక చిన్న పరిహాసాన్ని సహించలేదు;

చుక్కలకే౦ నిచ్చనలేస్తుంది ?

చేనేతా, చేతిపనీ అటుంచి

ఓ రొట్టెముక్క కూడా కాల్చడం చేతకానిది

వంతెనలే౦ కడుతుంది?

నౌకలనే౦ నిర్మిస్తుంది ?

అయినా

మన పనులలో వేలు పెడుతూనే ఉంటుంది !

చంపడం ఒక్కటే తెలిసిన దానికి,

ఆ పనీ సరిగా రాదు,

ఏ పనీ సక్రమంగా చేయలేదు;

ఓ గోతిని తవ్వలేదు,

ఓ శవ పేటికను కట్ట లేదు,

చదునైనా చేయలేదు పూడ్చిన మట్టిని !

అనుకుంటాం కాని

అదేం అంత గొప్ప విజేతే౦ కాదు;

ఎన్ని పరాజయాలు!

ఎన్నెన్ని విఫల యత్నాలు!

కొన్ని సార్లు

గాలిలోని ఈగ నైనా కొట్ట ledu

ఆపలేక, తెల్లబోయి చూస్తుంటుంది

కళ్లెదుటే కీటకం సీతాకోకచిలుకై పాకడం.

ప్రకృతి

మిడతల మూతులకు పెట్టిన మీసాలు,

పక్షి రెక్కలకు చెక్కిన రంగుల ఈకలు,

ఉన్నితో అందంగా అల్లిన చలి కోట్లు

గేలి చేస్తుంటవి దాని అశ్రద్ధను,

దాని చేతకాని పనితనాలను.

దాని దుష్టబుద్ధి,

మనం దానికి అందించే యుద్ధ సహకారం

ఏవీ ఆపలేవు

పిట్ట గుడ్డులో కొట్టుకునే గుండె చప్పుళ్లను,

పసి దేహంలో ఎదుగుతున్న అస్థిపంజరాలను,

కూలిన ముసలి మాను చిగురించే అంకురాలను.

అది అనుకున్నంత సర్వశక్తి సంపన్న కాదు,

నిజానికి, అదో అశక్త్య ! అబల !

క్షణిక కాలికంగా నైనా ,

కొన్ని జీవితాలు మరణానికి లొంగవు.

అదే కాక,

ఆ ఘడియలోనూ మరణం వచ్చేది ఆలస్యంగానే ;

అదృశ్యపు తలుపు కొక్కానికి తట్టుకుని

మృత్యువు అక్కడే ఆగిపోతుంది,

గదిలోకి చేరిన మనం నిక్షేపంలా ఉండి పోతాం. .

  1. :.తొలిచూపు ప్రేమ.:

( Love at First Sight )

వాళ్ళిద్దరికీ తెలుసు

ఏదో ఆవేశం హఠాత్తుగా ఆవహించిందని ;

అందమైనదే ఆ నిశ్చయం,

కాని, అంతకన్నా అందమైంది అనిశ్చయం.

మునుపెన్నడూ కలువ లేదు కనుక

వాళ్లకు తెలుసు వాళ్ళిద్దరి మధ్య ఏమీ లేదని ;

కాని, లక్షల సార్లు వాళ్ళు వీధులలో, మెట్ల మీదుగా,

వరండాల గుండా పక్క పక్కన నడిచే ఉంటారు;

మరెందుకు ఈ రోజే ఇంత కలవరింత ?

అడగాలనుకుంటాను

అద్దాల రివాల్వింగ్ ద్వారాలవద్ద ముఖాముఖి ఎదురు పడిన,

జన సందోహంలో “సారీ” చెప్పిన,

ఫోన్లో ” రాంగ్ నంబర్ ” అంటూ తెలిపిన

క్షణాలేమైనా గుర్తున్నాయా అని ;

నాకు తెలుసు వాళ్ళ కవేవీ జ్ఞాపకం లేదని.

అవకాశం

వాళ్ళతో ఏళ్లుగా ఆడుకుందని తెలుసుకొని

ఆశ్చర్యపడి  పోతుంటారు.

ఇంకా కుదురుకోని విధి

వాళ్ళను దగ్గరికి చేరుస్తూ, దూరంగా జరుపుతూ,

అడ్డగిస్తూ, నవ్వుకుంటూ పక్కకు తొలిగిపోయింది .

సంకేతాలు అందే ఉంటవి,

నిన్నమొన్ననో, మూడేళ్ళ క్రితమో.

సందేశ పత్రాలు భుజాలు మారే ఉంటవి,

ఏవో పారెయ్యడాలు, ఏవో తీసుకోవడాలు జరిగే ఉంటవి;

వాళ్ళు పారేసుకున్న వలపు బంతులు

వాళ్ళ బాల్య వనాలలోకి వెళ్లే ఉంటవి.

తలుపులు తీస్తూ తీస్తూ చేతులు తాకి నట్టు,

చెక్ఇన్ చేసిన సూటు కేసులు పక్క పక్కనే ఒదిగినట్టు

రాత్రి వచ్చిన అదే కల తెల్లారే సరికల్లా చెదురుతున్నది .

ప్రతి ప్రారంభం ఓ పొడిగింపే కాబోలు;  …..?

ప్రతి సంభవాల గ్రంథం

నడి పేజీతోనే తెరుచుకుంటుంది కాబోలు.

  1. : ఏదీ మరోమారు జరుగదు :

( Nothing Twice )

ఏ ఒక్కటీ రెండో సారి జరుగదు.

మనం అనుకోకుండా వచ్చా౦

హఠాత్తుగా వెళ్ళిపోతాం

ఏ అభ్యాసమూ లేకుండానే .

తరగతిలో ఏ ఒక్కడూ బడుద్దాయి లేకున్నా

ఈ భూమ్మీద నీవే చవటల్లో కెల్లా చవటవైనా

పాఠాలు తిరిగి ప్రారంభించడం కుదురదు.

ఏ రోజూ నిన్నటి రోజుకు ప్రతిరూపం కాదు,

ఏ రెండు రాత్రుల ఆనందానుభవాలు

ప్రణయ చుంబనాలు ఒకేలా ఉండవు.

ఏదో ఒక రోజు, ఏ సోమరి నాలుకో

నీ పేరు పలుకొచ్చు,

అప్పుడో పరిమళాల ఎర్రగులాబి

నా గదిలోకి విసరబడుతుంది.

మరుసటి దినం, నీవు నా చెంతనే వున్నా

నిన్నటి ఆ రోజా పువ్వు

రాయి కాదుకాదా అని నా సందేహం;

కాచుకోకుండా ఉండలేక పోతుంటాను.

ఎగిరిపోయే రోజు కోసం

ఎందుకో ఇంత భయం, ఇంత బాధ ?

ఎలాగూ ఉండిపోదు;

వెళ్లిపోయే “రేపే” కదా ఈనాటి ఈ “నేడు”.

మనం వేరువేరని ఒప్పుకుంటూనే,

బతుకేద్దాం ముద్దులతో, నవ్వులతో

మన రేయి నక్షత్రం కింద;

పక్కపక్కనే వున్న నీటి బిందువుల్లా !

క్లాసికల్ ఆడంబరాలను వర్జించి సాధారణ భాషలో సింఫొనీలను పలికించిన అపర మొజార్ట్ విస్లావా !

”  Mozart of Poetry ” విస్లావా !

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.