యాత్రాగీతం(మెక్సికో)

కాన్ కూన్ 

-డా||కె.గీత

భాగం-5

తిరిగి మా రిసార్టుకి వచ్చేసరికి మధ్యాహ్నం మూడు గంటలయ్యింది.

ఆవురావురంటూ భోజనానికి పరుగెత్తేం. రిసార్టులో ఎకామడేషన్ తో పాటూ భోజనాదులన్నీ కలిపిన పాకేజీ కావడంతో డబ్బులేమీ కట్టకుండా బఫే సెక్షనులో జొరబడి చక్కగా నచ్చినవన్నీ తెచ్చుకుని కడుపారా తిన్నాం. అన్నిటికన్నా చాలా ఇష్టంగా పిల్లలు పుడ్డింగుల వంటి చిన్న కేకుల్ని తిన్నారు. నిజంగానే చాలా బావున్నాయవి. అందానికి అందంగానూ, రుచికి బ్రహ్మాండంగానూ.

మొత్తానికి ఒక పూటంతా మాకు వృధా అయినా టైం షేరింగు స్కీములో చిక్కుకోకుండా బయట పడినందుకు మమ్మల్ని మేం అభినందించుకున్నాం.

ఇక అక్కడుండే మిగతా వారం రోజులూ చూడాల్సిన వాటికి రిజర్వేషన్లు తర్వాతి పని. మా హోటల్ లాబీలో ఉండే టూర్ల సెక్షను వాళ్లే రిజర్వేషన్లు చేస్తుండడం, ముందు రోజు ఎయిర్పోర్టులో అమ్మాయి చెప్పిన డిస్కౌంట్ రేటుకే  ఇస్తుండడం వల్ల అక్కడే అన్ని రోజులకీ టూర్ల రిజర్వేషన్లు తీసుకున్నాం.

ముందుగా అదే రోజు సాయంత్రం తప్పక చూడదగ్గ లిస్టులో ఉన్న డిన్నర్ క్రూజ్ కి బుక్ చేసుకున్నాం.

అదొక పైరెట్ షిప్పు థీం టూరు. దగ్గర్లోని స్మాల్ పోర్టు కి మా అంతట మేమే వెళ్లి ఎక్కాలి.

అదేమంత పెద్ద కష్టమైన పని కాదు అని అప్పటికే అర్థమయ్యింది మాకు. హోటల్ బయటికి ఎడమకి, కుడికి మాత్రమే వెళ్లగలిగే ద్వీపకల్పం వంటిది మేమున్న హోటల్ జోన్.  ప్రతి నిమిషానికో బస్సు, టాక్సీ తిరుగుతూనే ఉంటాయి.

మేం ఈ టూరుతో బాటూ మర్నాటికి ప్రపంచ ఆధునిక వింతల్లో ఒకటైన చిచెన్ ఇట్జా, ఆ మర్నాడు చారిత్రాత్మక ప్రదేశాలైన తులుం కట్టడాలు, ఆ మర్నాడు మరోటూరు అంటూ వరసపెట్టి  అన్ని రోజులకూ బుక్ చేసేసాం.

మధ్యలో ఒక రోజు మాత్రం అందరం వెళ్లలేని అడ్వెంచర్ టూరుకు మాత్రం కేవలం వరు, సత్యలకు బుక్ చేసి నేను సిరి రిసార్టులో ఉండిపోయాం.

హోటలే సముద్రతీరంలో ఉండడం, వాతావరణం నును వెచ్చగా చక్కగా ఉండడం వల్ల నిజ్జానికి రిసార్టు  లోనే బోల్డు కాలక్షేపం.

సరే ఇక సాయంత్రం టూరుకు గబగబా తయారయ్యి బయలుదేరేం.

పొద్దుటంతా ఎండలో తిరిగినా సముద్రతీరంలో తేమ లేనందువల్ల సాయంత్రం ఈ టూరు లో ఆహ్లాదంగానే అనిపించింది.

ఆరు గంటలకు టూరు కావడం, మా హోటలు నించి షిప్ యార్డు పది నిమిషాల వ్యవధిలోనే ఉండడం వల్ల అయిదుంబావు సమయంలో మా హోటలు బయట  టాక్సీ పది డాలర్లకు మాట్లాడుకున్నాం.

ఇక్కడ “పేసో” లు లోకల్ కరెన్సీ అయినప్పటికీ డాలర్లు అన్ని చోట్లా తీసుకుంటారు.

టాక్సీలు అమెరికాలో ఉన్నంత సౌకర్యవంతంగా లేకపోయిన్నపటికీ, ఫర్వాలేదనిపించాయి. 

అనుకున్న సమయానికి పోర్టు చేరుకున్న మాకు టాక్సీ స్టాండు నించే పైరేట్ల వేషధారణ లో ఉన్న సిబ్బంది స్వాగతం పలికారు.

ఒకతను వచ్చిన వాళ్లకల్లా గొంతు మీద పెద్ద కత్తి పెట్టి మరీ స్వాగతిస్తున్నాడు.

అతనితో పాటూ, నేనూ కాసేపు నటించి నవ్వుతూ ఫోటోలకు ఫోజులిచ్చేను.

ఈ నౌక పెద్ద షిప్పూ, చిన్న బోటూ కాకుండా మధ్యస్థంగా ఉంది. మొత్తం పైరేట్ షిప్పు థీం కావడం వల్ల నల్ల రంగు, అస్తి పంజరాలు, ఒక కన్నుకి గంతలు కట్టుకున్న సముద్రపు దోపిడీ దొంగలు, తుపాకులు మొ.న అలంకరణతో నిజంగా పైరేట్ షిప్పు ఇలాగే ఉండేదని అనిపింపజేస్తూ ఉంది.

షిప్పు ఎక్కే ముందే లైనులో నిలబెట్టి షిప్పులో జరగనున్న కథకు పూర్వ ఘట్టాన్ని ప్రదర్శించేరు.  

నిజమైన ఫీట్లు, తుపాకీ మోతలు, షిప్పు కేప్టెను అధికారిక ఆహ్వానం తో సందర్శకుల్ని గాథలోకి సహజంగా తీసుకెళ్లడం చాలా చక్కగా చేసేరు.

ఏడు గంటల ప్రాంతంలో చీకట్లు కమ్ముకునే సమయంలో నావ కదిలింది.

ఓపెన్ డెక్ లో అటు పది, ఇటు పది వరసల్లో దాదాపు వంద మంది పట్టగలిగే బెంచీలు వేసున్నాయి. అన్నీ నిండిపోవడం విశేషం. ప్రతీ రెండు వరసలకు ఒక మనిషి చొప్పున సందర్శకులకు ఏం కావాలన్నా చూసుకోవడానికి షిప్పు సిబ్బంది ఉన్నారు. టిక్కెట్టులోనే భోజనం, కూల్ డ్రింకులు భాగం. ఆల్కహాలు కావాలంటే మాత్రం విడిగా పే చేయాలి.

కూల్ డ్రింకులు వాళ్లే సీట్ల వద్దకు తెచ్చి ఇస్తారు.

నౌక బయలుదేరగానే ప్రదర్శన ప్రారంభం అయ్యింది.

అన్ని పైరేట్ల కథల్లాగే ఎక్కడో గుప్త నిధులకోసం బయలుదేరిన నౌక, సిబ్బంది, సగం చినిగిన మేప్,  విలన్ల ప్రవేశం, నౌకని ముట్టడించడం, కొందరు సముద్రం పాలు కావడం, మంటలు, హాహాకారాలు, తుపాకుల మోతలు…ఒకటేమిటి అన్నీ అత్యద్భుతంగా ప్రదర్శించేరు.

అందులో భాగంగా ఒకరిద్దరు నిజంగా అంతెత్తు నౌకలో నుంచి సముద్రంలోకి దూకడం మాత్రం ఒళ్లు గగుర్పొడిచేలా చేసింది.

ఒక గంట పాటు కథా  ప్రదర్శన, మధ్యలో భోజనానికి ఒక గంట బ్రేకు, చివరి గంట గానాబజానాతో  సమయం తెలీకుండా గడిచిపోయింది.

మంచి వెన్నెల కాస్తున్న రోజులు కావడం వల్ల మధ్యలో నిశ్శబ్దం ఆవరించిన  సమయంలో చల్లని వెన్నెల్లో సముద్ర ప్రయాణం ఎంత ఆహ్లాదంగా అనిపించిందో చెప్పలేను. అతి స్పష్టంగా కనిపిస్తున్న చుక్కలతో ఆడుకుంటున్న చందమామ చల్లని చిరునవ్వులు మా మధ్యా ప్రసరించాయి.

భోజనాలకు నౌకలోని లోపలి భాగానికి దిగి వెళ్లాలి. అక్కడ నిర్దేశించిన ప్రదేశాలలో టేబుల్ దగ్గిర కూచోబెట్టి డిన్నర్  తీసుకొచ్చి ఇచ్చేరు. ఏవో బర్గర్ల వంటివైనా బానే అనిపించేయి.

భోజనం కాగానే డెక మీదికి వెళ్లగానే ప్రతీ ఒక్కరినీ ఏ దేశం నించి వచ్చారో అడిగి వారి పాటల్ని వినిపించడం, అందుకు అనుగుణంగా నాట్య ప్రదర్శనలు చెయ్యడం బాగా అనిపించింది.

నౌక మొత్తంలో ఇండియా నుంచి వచ్చినవాళ్లం మేం మాత్రమే ఉన్నాం.

ఇండియా పేరు వినగానే హిందీ పాటొకటి వేసి చక్కగా బాలీవుడ్ డాన్సు చేసి నమస్కారాలు చేసేరు చివర.

అందులో భాగంగా డాన్సుకోసం స్టేజీ మీదకు పిలవగానే పిల్లలూ, సత్య నన్ను ముందుకు తోసేరు.

అలా స్టేజీ మీదికి వెళ్లిన నేను చివర్లో  గ్రూపు డాన్సుల వరకు అక్కడే ఉండిపోవలసి వచ్చింది.

మొత్తానికి ఆ సాయంత్రం ఎంతో ఉత్సాహపూరితంగా బాగా గడిపేం.

కాన్ కూన్ వెళ్లినవారికి ఈ టూరు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు.

తిరిగి వచ్చేటపుడు సమయం పదవడంతో టాక్సీకి ఇరవై డాలర్లు ఇవ్వవలిసి వచ్చింది.

ఇలా సమయాన్ని బట్టి ధర మార్చేయడం అంతటా ఉన్నా, సగానికి సగం పెంచేయడం లో ఇండియాకి ఏ మాత్రం తీసిపోలేదు ఇక్కడి వాళ్లు.

*****

(ఇంకా ఉంది) 

ఫోటోస్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి – 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.