నా జీవన యానంలో- (రెండవభాగం)- 3

-కె.వరలక్ష్మి 

ఊళ్లో లయన్స్ క్లబ్ ప్రారంభించిన కొత్తరోజులు. వాళ్ల కమ్యూనిటీ హాలు మేమున్న ఇంటికి దగ్గర్లోనే ఉండేది. వాళ్ల పిల్లలకి ఫీజ్ కట్టడానికొచ్చిన లయన్ మెంబరొకాయన “మాస్టారూ మీరూ లయన్స్ క్లబ్ లో చేరచ్చు కదా” అని అడిగేడు. నేనా విషయం మోహన్ తో చెప్పి ‘చేరదామా’ అని అడిగేను . “శాంత, రుక్కుల పెళ్లిళ్లకి చేసిన అప్పులు నా నెత్తిమీదున్నాయి. నువ్విప్పుడిలాంటి సేవా కార్యక్రమాలు పెట్టకు” అన్నాడు. లయన్స్ సభలు సాధారణంగా ఆది వారాలు జరిగేవి. మైక్ లో వాళ్ల మాటలన్నీ విన్పించేవి. ఒకోసారి పదిమంది పేదలకి తువాళ్లు పంచుతున్నామనీ, మరోసారి ఏడేసి రూపాయలు ఆర్ధిక సాయం చేస్తున్నామనీ అనడం విని నాకు భలే నవ్వొచ్చేది. నెలనెలా వాళ్ల భోజనాల కార్యక్రమాలకి మాత్రం బోలెడు ఖర్చయ్యేదట. ఏ పత్రికకి పంపలేదు కానీ అప్పట్లో ‘కమీలియన్ క్లబ్’ అని ఒక చిన్న వ్యంగ్య కథ ఒకటి రాసేను.

మేం చిన్నప్పుడు వైష్ణవ స్వాముల ప్రసాదాల కోసం వెళ్లిన ఇల్లు తీసేసి కొత్త భద్రరావు గారు చక్కని డూప్లెక్స్ ఇల్లు ఒకటి కట్టుకున్నారు. ఆ ఇంటి వారమ్మాయిల కోసం వీణ తెప్పించేరనీ, వీధిలో కోమట్ల అమ్మాయిలు ఇంకొందరు కూడా వీణ నేర్చుకుంటున్నారనీ, పెద్దాపురం నుంచి టీచరు ఒకావిడ వచ్చి నేర్పిస్తున్నారనీ తెలిసింది. నా మనసాగలేదు. సంశయిస్తూనే వెళ్లేను. భద్రరావుగారి భార్య లక్ష్మిగారు ఆప్యాయంగా ఆహ్వానించేరు. అక్కడ అమ్మాయిలు కొందరు వీణ మెట్లను పలికించే సాధనలో ఉన్నారు. టీచరు ఎనభై ఏళ్లకు పైగా వయసున్నావిడ. మొదటి ప్రయత్నంలోనే నాకు సరిగమలు పలకడం, నేను శృతి బద్ధంగా పాడడం చూసి “నీకు సరస్వతీ కటాక్షం నిండుగా ఉందమ్మా” అంటూ ఆశీర్వదించేరు. పాఠాల కోసం వెళ్ళినా, సాధన కోసం రోజూ వారింటికి వెళ్లలేను కదా! సొంతంగా వీణ కొనుక్కోవాలనుకున్నాను. కాని, వెయ్యి రూపాయలు ఒక్క సారిగా ఎక్కణ్ణుంచొస్తాయి? అది తెలిసి లక్ష్మి గారు మధ్యలో ఉండి నెలకి వంద కట్టేలా వీణ ఇప్పించేరు. “వీణ కొనుక్కున్నా పాఠాలకి మాత్రం మా ఇంటికే రండి. మిమ్మల్ని చూడ్డం , మీ గాత్రం వినడం ఎంతో బావుంటుంది నాకు” అనే వారు లక్ష్మి గారు. వారింట్లో ఏ కార్యక్రమం జరిగినా నన్నూ పిలిచేవారు. డైరెక్టర్ విశ్వనాథ్ గారిది ఏం సినిమానో గుర్తు లేదు కాని మా ప్రాంతంలో షూటింగ్ జరుగుతూంటే ఆయన్ని, శారద, చలం గార్లనీ లయన్స్ క్లబ్ తరపున అతిధులుగా పిలిచి లక్ష్మి గారింట్లో డిన్నర్ ఏర్పాటు చేసేరు. “ఆరు గంటల కల్లా మాస్టారూ, మీరూ తప్పక రండి”  అని పిలిచేరు. నేను మోహన్ తో చెప్పేను. “చూద్దాంలే” అన్నవాడు ఏడు గంటలైనా ఇంటికి రాలేదు. అలా వెళ్లడం కోసం పిల్లల్ని సాయంకాలమే మా చెల్లితో మా అమ్మ వాళ్లింటికి పంపించేసాను. కాశీ వెళ్లి వచ్చిన కోమట్లు ఒకరింట్లో బెనారస్ చీరలు తెచ్చి అమ్ముతుంటే రెండు వందల రూపాయలు పెట్టి జరీ బుటాలు , రిచ్ పల్లూ ఉన్న ఆలివ్ గ్రీన్ చీర ఒకటి అంతకుముందు కొనుక్కున్నాను. ఆ చీర కట్టుకుని లక్ష్మి గారింటికి వెళ్లేను . “రండి రండి, ఇంతాలస్యం చేసారేం అంటూ నా చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్లేరు లక్ష్మి గారు. ఇల్లంతా లైట్లతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. లయన్స్ మెంబర్స్ కుటుంబాలతో సందడి సందడిగా ఉంది. మేడ మెట్ల మీద ఇన్ షర్ట్ చేసుకున్న తెల్లని బట్టల్లో విశ్వనాథ్ గారు ఎదురు పడ్డారు. నేను నమస్కారం చేసేను. ఒక్క క్షణం ఆయన చూపు నా మీద నిలిచింది. పైకి వెళ్లి శారద గార్ని పలకరించాను. కాస్సేపటి తర్వాత చిన్న సభా కార్యక్రమంలో ముగ్గురూ సినిమాల గురించి మాట్లాడేరు. చలం తాగి రావడం నాకు నచ్చలేదు. ఇదంతా జరుగుతున్నంత సేపు నా కళ్ళు మోహన్ కోసం వెతుకుతూనే ఉన్నాయి. భోజనాలు ముగిసి ఇంటికి చేరేసరికి పది అయ్యింది. నేను గుమ్మంలో అడుగు పెట్టగానే ఇంగ్లీష్ టీచర్ తో కబుర్లు చెప్తున్న మోహన్ లేచొచ్చి నా చెంప చెళ్ళుమన్పించాడు. “అయ్యాయా నీ తిరుగుళ్లు? భోగందానిలాగా అలంకరించుకుని ఇష్టం వచ్చినట్టు తిరిగొస్తావా!” అన్నాడు. ఆ దుర్మార్గానికి నేను కన్నీటి వరదైపోయేను. “మీ కోసం అందరూ అడిగేరు “అన్నాను. “నిన్ను పిలిస్తే నీవెంటపడి నేనొచ్చేస్తాననుకున్నారా? అసలు నిన్ను స్కూలు పెట్టనిచ్చి నేను చాలా పొరపాటు చేసానే. నీ కాళ్లు నేల మీద ఆనటం లేదు. నీ కొమ్ములు ఎలా కత్తిరించాలో నాకు తెలుసులే” అంటూ బైటికెళ్ళిపోయేడు.

తెల్లవారే సరికి వాచిన చెంపనో, చిట్లిన పెదవినో కవర్ చేసుకుంటూ ముఖాన నవ్వు అంటించుకుని స్కూలు కోసం రెడీ అయ్యే దాన్ని. నా ప్రాణ సమానమైన నా పిల్లలు, వాళ్లకి అన్నం పెట్టే స్కూలు ఇవే ప్రధానమైనవి అప్పటికి నాకు. కష్టాల్ని, బాధల్ని బైటికి చెప్పుకోవద్దనే మొండి ధైర్యమేదోనన్నావహించి ఉండేది. దాంతో సమానంగా ఇలా బతుకుతున్నానేంటి అనే ఓ గిల్టీ ఫీలింగ్ కూడా నన్నంటిపెట్టుకుని ఉండేది. అలా గిల్టీలో ముంచేసిన ఎన్నెన్నో సంఘటనలు —

ఒకసారి మూవీ చూస్తున్నాం. ఇంటర్వెల్ లో లైట్లు వెలిగినప్పుడు రెండు వరసల ముందు కూర్చున్న ఒకతను రెండు మూడు సార్లు వెనక్కి తిరిగి నన్ను చూసేడు. ఇంటికి రాగానే మోహన్ గొడవ మొదలు పెట్టేడు, “అతనెందుకు నిన్ను అలా చూసేడు, మీ ఇద్దరికీ ఏమిటి సంబంధం?” అంటూ, అతన్ని ఇంతకు ముందు నేనెప్పుడూ చూడలేదు. అతనెవరో నాకు తెలీదని చెప్పేను. అతను ఈ ఊరికి కొత్తగా వచ్చిన సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పె క్టరట. ఒక దెబ్బ కొట్టడం, అతను నాకు తెలుసని ఒప్పుకోమనడం. చివరికి అర్ధరాత్రి పన్నెండు దాటేక పోలీసుల చేతిలో ఖైదీలాగ దెబ్బల బాధ భరించలేక తెలుసని అన్నాను. వెంటనే పేపరూ, పెన్నూ ఇచ్చి ఒక లెటర్ డిక్టేట్ చేసేడు. దాని సారాంశమేంటంటే – “నేను అతని కోసం ఎదురు చూస్తున్నాను, వెంటనే రమ్మని”.  దాన్ని పట్టుకుని మోహన్ బైటి కెళ్లి పోయేడు. అతన్ని పిల్చుకొచ్చి గొడవ పెడతాడేమోనని చాలా భయం వేసింది. వెంటనే రెండిళ్లకవతల ఉన్న మా నూజిళ్ళ మాస్టారింటికి వెళ్లిపోయేను. అంత రాత్రి వేళ అలాంటి పరిస్థితిలో నన్ను చూసి ఆశ్చర్యపోయినా, మాస్టారూ అక్కయ్యగారు సాదరంగా ఆహ్వానించేరు. నేను వాళ్లని దాటుకుని వెళ్లి పుస్తకాల బీరువాల మధ్యలో చతికిలబడిపోయేను. తెలతెలవారేవరకూ నేను ఏడుస్తూను, వాళ్లు ఓదారుస్తూనూ ఉండిపోయేం.

ఇంకోపక్క స్కూలు కదా అని ఫీజు కట్టడానికి వచ్చే తండ్రులతో మృదువుగా , మర్యాదగా మాట్లాడితే వాళ్లు బైటి కెళ్లి ‘ఆవిడకి నేనంటే చాలా ఇష్టం’ అని చెప్పుకొనే వాళ్లు.

మేమున్న ఇంట్లో ఉత్తరం వైపున్న మూడు గదుల్ని పది రూపాయలకి వేరే వాళ్లకి 

అద్దెకిచ్చే వాళ్లం. మొదట్లో స్కూల్ టీచర్స్, తర్వాత పశువుల డాక్టర్ల కుటుంబాలు అద్దెకుండేవారు. నాకు వాళ్లతో కబుర్లు చెప్పేటంత తీరిక లేకపోయినా అందరూ స్నేహంగానే మసలే వాళ్లు. నేను MA చదివేటప్పుడు డాక్టరు గారి భార్య తెల్లగా ఎత్తుగా మెరిసిపోతూ ఉండేది. ఒక్కొక్క చేతికీ డజను బంగారు గాజులు వేసుకునేది. వాళ్ల తండ్రి గారు పోలీసు డిపార్టు మెంట్లో ఉద్యోగం చేస్తూ నెలకో తులం బంగారం కొని దాచే వారట. కొంత అతిశయం ప్రదర్శించేది. నాకోసారి జలుబు చేస్తే “మా బ్రహ్మలు తిన్నట్టు పాలూ పెరుగూ చిన్నప్పటి నుంచీ తిని ఉండరు కాబట్టి ఇప్పుడు తింటే మీకు పడవు” అంది. రావి చెట్టుకి అవతలున్న ఇంటికి పొడవైన అరుగులుండేవి. ఈవిడెళ్లి ఆ ఇంటి అరుగుల మీద అమ్మలక్కలతో మాట్లాడేది. ఖాళీ సమయమంతా కబుర్లే కాలక్షేపం వాళ్లకి. నేనెంత గోప్యంగా దాచుకోవాలనుకున్నా నా ఇంటి విషయాలన్నీ ఆ అరుగుల మీదికి వెళ్లి పోయేవి. నేను ఎదుర్కొంటున్న కష్టాలు, సమస్యలు వాళ్లకి ఆనందం కలిగించే సంభాషణలయ్యేవి. నేను ఆదివారం ట్యూషన్ క్లాసులకి వెళ్తూంటే వెనక నుంచి నవ్వులు, ఎగతాళులు విన్పించేవి. “ముదిమి వయసులో చదువులూ (పాతికేళ్లకే )…” అని దీర్ఘాలు తీసేవారు. బొండా వారి వీధిలో వినాయకుణ్ణి నిలిపే అరుగు మీద సత్తులు అనే మిషను కుట్టుకునే వాడొకడుండేవాడు. నన్ను చూడగానే నా కులం పేరెత్తి ‘గొల్ల భామా’ అంటూ అడ్డమైన పాటలూ అందుకునే వాడు. నేను ఎక్కడా తలపైకెత్తి చూడకుండా వెళ్లిపోతూ ఉండేదాన్ని. రెండు మూడు నెలల తర్వాత ఇంట్లో ఏదో ప్రోబ్లమ్ వల్ల మంచి నీళ్ళ చెరువు గట్టు మీది నూతిలో పడి చచ్చి పోయేడు సత్తులు. ఎదుటి వాళ్లని ఏడిపించే వాళ్లంతా ధైర్యవంతులు కాదని నాకప్పుడే అర్ధమైంది.

మొదట్లో నేను గమనించుకోలేదు కాని మోహన్ మా ఇంగ్లీషు టీచరు బార్బరాతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని అర్ధమైంది. అడిగితే పెద్ద గొడవ చేసేసి ‘ నా ఇష్టం ‘ అన్నాడు. ఒకసారి మా అత్తగారు పశ్చిమగోదావరి జిల్లా నుంచి తన ఫ్రెండు అని ఒకావిడను తీసుకొచ్చేరు. నేను స్కూల్లోంచి భోజనం చెయ్యడానికి లోపలికి వచ్చేసరికి మోహన్ ఆవిడతో ఒకే మంచం మీద ఉన్నాడు. నేను భోరుమని ఏడ్చేస్తూంటే “ఏడవకమ్మాయ్, ఆవిడకి చాలా డబ్బుంది, ఎంతో కొంత ఇస్తుంది” అన్నారు. “ఛీ , డబ్బు కోసం ఎవత్తెనో ఇంట్లో పెట్టి కాపలా కూర్చునే పని నేను చెయ్యలేను” అంటూ ఆవిడ మీద విరుచుకు పడ్డాను. ఆ మాట ఆవిడకి ఎక్కడో తగిలింది. “పెద్దంతరం , చిన్నంతరం, భయమూ, భక్తీ లేని గడుగ్గాయి” అంటూ తిట్టిపోసి ‘నీ కర్మ ఇలాక్కాలింది.  ఎలాగేడుస్తావో ఏడు’ అని కొడుకుని తిట్టి వెళ్ళిపోయారు.

నా శరీరం మీద నాకే అసహ్యం పుట్టుకొచ్చింది. అతను నన్ను ముట్టుకున్నా భరించలేకపోయేదాన్ని. “ నువ్విక బార్బరాతోనే ఉండు, నా జోలికి రాకు” అని వేడుకున్నాను. అతని పశుబలం ముందు నేనెంత! చివరికి కండోమ్ వాడేలాగ ఒప్పించేను, క్రమంగా మేమిద్దరం శారీరికంగా, మానసికంగా దూరమయ్యాం అతనికి ఒక ఊరు నుంచి మరో ఊరికి ట్రాన్స్ఫ రైనప్పుడల్లా పదో, ఇరవయ్యో వేలు అప్పు తీర్చాలి. నువ్వు తెచ్చి ఇస్తావా లేదా అని నా పీక మీద కత్తి పెట్టేవాడు. చివరికి ఎవర్నో తీసుకొచ్చి ఆ డబ్బు వీళ్లిచ్చేరు అని నాచేత సంతకం పెట్టించే వాడు. ఆ అప్పు అంచెలంచెలుగా నేను తీర్చవలసొచ్చేది. ఎంత అత్యవసరమైనా తన జీతం నుంచి పది రూపాయలు కూడా ఇచ్చేవాడు కాదు. ఎప్పుడు చూసినా నేను డబ్బు ఇబ్బందుల్లో కూరుకుపోయి ఉండేదాన్ని.

*****

(ఇంకా ఉంది )

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.