అతి తెలివి 

-అనసూయ కన్నెగంటి 

           పిల్ల దొంగ  రాముడుకి ఆ రోజు దొంగతనం చేయటానికి ఎక్కడా అవకాశం దొరకలేదు. దాంతో అతనిలో పట్టుదల పెరిగి  ఒక్క దొంగతనమైనా చేయకుండా ఇంటికి తిరిగి వెళ్లకూడదని ఊరంతా తిరగసాగాడు. 

     అలా తిరుగుతూ తిరుగుతూ  రోడ్డు పక్కన అరుగు మీద విశ్రాంతి తీసుకుంటున్న సన్యాసి దగ్గర  సొమ్ము ఉన్నట్లు గమనించాడు. దానిని ఎలాగైనా అతని వద్ద నుండి దొంగిలించాలని  సన్యాసికి కనపడకుండా మాటుగాసాడు. 

        కొంతసేపటికి  అలసట తీరిన సన్యాసి అక్కడి నుండి లేచి  కాలి నడకన ఊరు దాటి అడవి మార్గం పట్టాడు. పిల్ల దొంగ రాముడు అది గమనించి  సన్యాసికి కాస్తంత దూరంలో అతని వెంబడి నడవసాగాడు.

       అలా నడుస్తూ ఇద్దరూ  అడవి మధ్యలోకి ప్రవేశించారు. దొంగరాముడికి   చాల ఆనందంగా ఉంది సులభంగా సన్యాసి వద్ద ఉన్న సొమ్మును దొంగిలించబోతున్నానని.  . 

       సన్యాసి  ఎక్కడా ఆగకుండా  సంచి భుజాన వేసుకుని  నడుస్తూనే ఉన్నాడు. అలా నడుస్తూ ఉండగా ఒకచోట అతనికి దారి పక్కనున్న పొదల్లోంచి ఎవరో  మూలుగుతున్న చప్పుడు వినిపించింది.

     వెంటనే ఆగిపోయి ..తన భుజాన ఉన్న సంచిని అక్కడ పెట్టి  మూలుగు వినిపించిన పొదల వైపు నడిచాడు.

        అది చూసిన దొంగరామునికి  ఎంతో ఆనందం వేసింది. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ సంచి వైపు కదిలాడు. సరిగ్గా సంచి మీద చెయ్యి వేయబోతూ ఎవరివో మాటలు వినిపించి చెవులు రిక్కించాడు.

      ఎవరో  పెద్దగా మూలుగుతుంటే..“ఎలా తగిలింది ఇంత పెద్ద దెబ్బ? “ అని అడుగుతున్నాడు సన్యాసి.

      “ దొంగతనం చెయ్యబోతూ కింద పడ్డాను..అమ్మా…అయ్యా.. “ మూలుగుతూనే అన్నాడు అవతలి వ్యక్తి.  

       “  దొంగతనం చేస్తూ కిందపడటమా? అయితే నీకు  దొంగతనం ఎలా చెయ్యాలో రాదన్నమాట..?” అన్నాడు సన్యాసి వెటకారంగా నవ్వుతూ. 

       “ వచ్చు స్వామీ! నేను బ్రతికేదే దొంగతనం  మీద. కానీ అన్ని వేళలూ మనవి కావు గదా….! అయ్యో..” అన్నాడు అడవిదొంగ మూలుగుతూ..

      “  దొంగతనం చెయ్యటం కూడా ఒక కళ నాయనా!  ఒడుపు తెలిసి ఉండాలి. పడినా దెబ్బల తగలకుండా ఉండేలా పడాలి.  దొంగతనం చేసి దొరకకుండా తప్పించుకునే మెళకువలు తెలియాలి. దొరికినా  దెబ్బలు తినకుండా తెలివిగా తప్పించుకునే యుక్తి తెలిసి ఉండాలి. దొంగతనం చేసి బ్రతికే వాడివి ఆ మాత్రం తెలియకపోతే ఎలాగ?” అన్నాడు సన్యాసి దొంగకు తగిలిన దెబ్బలకు మందు వ్రాస్తూ. 

      దొంగరాముడు  ఈ మాటలు విని కాసేపు ఆలోచించాడు.

     “దొంగతనం చేస్తే ఈ కాస్తంత సొమ్ము మాత్రమే దొరుకుతుంది. అదే ఆ సన్యాసి  దగ్గర శిష్యరికం చేసి తెలివిగా దొంగతనాలు ఎలా చెయ్యాలో నేర్చుకుంటే ఆ తెలివితేటలతో ఏకంగా రాజుగారి ఖజానాకే కన్నం వేసి దొరికిన సొమ్ముతో జీవితాంతం హాయిగా బ్రతికేయవచ్చు “ అనుకున్నాడు మనసులో. 

         దొంగలో ఈ రకమైన ఆలోచన రాగానే సన్యాసి సంచిలో సొమ్మును కాజేయటం మాని వేసి సన్యాసి వచ్చే వరకూ ఆ సంచికి కాపలా కాయసాగాడు. 

        సన్యాసి చేసిన వైద్యంతో నొప్పులు తగ్గి లేచి కూర్చున్నాడు అడవిలో దొంగ. 

     దాంతో సంచి దగ్గరకి వచ్చిన సన్యాసి అక్కడ ఉన్న వ్యక్తిని చూసి”  ఎవరు నాయనా నువ్వు? “ అని అడిగాడు.

     “ మీ శిష్యరికం స్వీకరించటానికి వచ్చిన భక్తుణ్ణి స్వామీ “ అన్నాడు పిల్ల దొంగ.

    “ స్వీకరించాను. ఈ సంచి మోస్తూ నా వెంటరా” అన్నాడు సన్యాసి ముందుకు నడుస్తూ.

         అతనిచ్చిన బరువైన సంచిని మోస్తూ ఆ అడవిలో చాల దూరం ప్రయాణించి ఒక గ్రామం చేరుకున్నారు ఇద్దరూ.  అక్కడికి చేరుకోగానే..సన్యాసి విరగబడి నవ్వాడు. నవ్వుతూ..తన సన్యాసి వేషాన్ని తొలగించి..

     “ చూడు శిష్యా..! నేను నిజమైన సన్యాసిని కాను. కాకపోతే నీ కంటే పెద్ద దొంగను. నువ్వు నన్ను చూసేటప్పటికి పెద్ద దొంగతనం చేసి ఎంతో సొమ్మును కాజేసాను.  ఆ సొమ్ముతో ఈ అడవి ఎలా దాటాలా అని ఆలోచించి ఈ సన్యాసి వేషం వేసాను. ఆ సమయంలోనే నువ్వు నన్ను చూసావు. నా సొమ్మును దొంగిలించాలని నా వెంటపడ్డావు. నీ నుండి  తప్పించుకోవటమే కాదు నీ రక్షణతోనే అడవి దాటాలనుకున్నాను. అందులో భాగంగా నా తోటి దొంగకు సమాచారం ఇచ్చి కొంత సొమ్ము ఇస్తానని ఒప్పించి దారి మధ్యలో దెబ్బ తగిలినట్టుగా నాటకమాడమన్నాను. 

      అదే సమయంలో నువ్వు నా సంచి దగ్గరకు రావటం గమనించి  నా తెలివి తేటలు ప్రదర్శించాను.

నువ్వు నా బుట్టలో పడ్డావు. నీతోనే  ఆ సొమ్ములు ఉన్న సంచి మోయించి నీ నుండి నా సొమ్మును కాపాడుకున్నాను.

         దొంగతనం చేయాలంటే కండబలమే కాదు, ఆ దొంగిలించిన సొమ్మును కాపాడుకునే యుక్తి కూడా తెలియాలి.      నీ దగ్గర ఆ యుక్తి లేదు. ముందు అది నేర్పుకో..” అంటూ అప్పటి దాకా తన సంచి మోయించుకున్నందుకు తాను దొంగిలించిన దానిలో కొంత సొమ్మును పిల్ల దొంగకు ఇచ్చాడు.  

        అది తీసుకున్న దొంగరాముడు ఫకాల్న నవ్వాడు.

      “ఎందుకు నవ్వుతున్నావ్?” అన్నాడు సన్యాసి దొంగ.

    “ఎందుకా? నువ్వు ఆ అడవి దొంగకు సేవ చేసేంత వరకూ నిజమనే నమ్మాను. అయితే నువ్వు అతనికి సొమ్ము ఇవ్వటం నేను గమనించాను. అప్పుడంతా నాకు అర్ధమైపోయింది. అయినా తప్పించుకోవాలన్నా నేను తప్పించుకోలేను. ఎందుకంటే మీరు ఇద్దరు. నేను ఒక్కణ్నే. కాబట్టి నీ సంచే మోస్తూ నీసొమ్మే కాజేసాను..” అన్నాడు నవ్వుతూ..

      “ అవునా..? ఎలా కాజేసావు?” అన్నాడు కంగారుపడుతూ  సన్యాసి దొంగ.

   “.. సంచి అడుగున చిల్లు పెట్టాను చూడు. దాన్నుండి ఒక్కో  నగా తీసి అడవిలో విసిరేస్తూ వచ్చాను..అవి ఎక్కడ విసిరానో నాకే తెలుసు..నువ్వే తెలివైన వాడిని అనుకున్నావ్. కదూ..” అంటూ అడవిలోకి పరుగు తియ్యబోతుంటే  అంతకు ముందే అడవి దొంగను పట్టుకున్న రాజభటులు వీళ్ళిద్దరి వెన్నంటే వచ్చారేమో..ముగ్గుర్నీ పట్టుకుని రాజుగారి దగ్గరకి లాక్కుపోయారు.  

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.