కనక నారాయణీయం-1    

పుట్టపర్తి నాగపద్మిని 

కథలు వినటంలోని ఆనందాన్ని ఆస్వాదించటం మా  అమ్మమ్మ శ్రీమతి శేషమ్మ గారి ద్వారా మొదలైందన్నాను కదా!! అసలు నా పుట్టుక వెనుక కూడా ఓ ఉత్కంఠభరితమైన ఉదంతముందని అమ్మమ్మే చెబుతుంటే………వినటం…ఒక మహత్తరానుభూతి నాకైతే!!

అదేమిటో మీరూ ఆలకించండి…కాస్త ఉపోద్ఘాతం తరువాత!!

ప్రొద్దుటూరినుండీ..కడపకు వలస వచ్చేసిన కారణం, ఇక్కడి మోచంపేటలో శ్రీ రామకృష్ణా హైస్కూల్ లో తెలుగు పండితుడిగా అయ్యకు ఉద్యోగం రావటం. జీతం అప్పట్లో తక్కువే, పైగా తెలుగు పండితుడికి కాబట్టి, మంచమున్నంతవరకూ కాళ్ళు చాచుకోవాలి కాబట్టి, మోచంపేట, నరసరామయ్య వీధిలో ఒక మట్టి మిద్దెలో కాపురం. నాకంటే పెద్ద వాళ్ళు, కరుణక్కయ్యా, తరులతక్కయ్యా, తులజక్కయ్యా, వీళ్ళ తరువాత అన్నయ్య అరవిందూ!!

1953 ప్రాంతాలు..అయ్యకు షిర్దీ బాబా పై చాలా గురి. గురువారాలు మరీ ప్రత్యేకంగా పూజలు!! మా అక్కయ్యలు వరుసగా, కరుణ,తరులత, తులజ, అన్నయ్య అరవింద్..అందరూ అయ్యతో పాటూ భజన పాటలలో సహగానం  చేయాల్సిందే!! వాళ్ళు కర్నాటక సంగీతంలో శ్రీ కొండప్పగారివద్ద చక్కటి శిక్షణనందారు కదా మరి!!  ఈ కొండప్పగారెవరు?  ఉండండుండండి..చెబుతున్నా చెబుతున్నా….!! 

అయ్యకు కర్నాటక శాస్త్రీయ సంగీతంలో మంచి నైపుణ్యం ఉంది. బాల్యంలో పెనుగొండలో పక్కా హనుమంతాచార్యులవారివద్ద శిక్షణ తీసుకున్నారు కదా మరి!! అంతే కాదు, స్వయంగా వారు వాగ్గేయకారులు కూడా!! పెళ్ళై, ప్రొద్దుటూరులో స్థిరపడినప్పుడు అక్కడున్న సువిఖ్యాత వాయులీన విద్వాంసులు, పెద్ద జమాలప్పగారితో పరిచయమవటాన్ని అయ్య ఎంతో చక్కగా వినియోగించుకున్నారు. జమాలప్ప గారితో కలిసి తన అష్టాక్షరీ కృతులకు మరింత సాన పట్టే ప్రయత్నంలో సఫలీకృతులయ్యారు అయ్య. కారణం, పెద్ద జమాలప్ప గారు, సప్త తంత్రీ వాయులీన నిపుణులు మైసూరు చౌడయ్య గారి శిష్యులు కావటమే!! అదిగో…ఆ పెద్ద జమాలప్పగారి ప్రియ శిష్యుడే యీ కొండప్ప గారు!! ఈ కొండప్పగారు కూడా శ్రీ రామకృష్ణా హై స్కూల్ లో సంగీతం టీచర్ గా పనిచేస్తున్నారు అప్పుడు!! పెద్ద జమాలప్పగారి దగ్గరే పుట్టపర్తి గారి పరిచయ భాగ్యమూ దక్కటం వల్ల కొండప్పగారు, మా కుటుంబానికి కూడా దగ్గరై, మా అక్కచెల్లెళ్ళందరికీ సంగీతం నేర్పించే సంప్రదాయం మొదలైంది. అలా…అలా…1953 నాటికి, మా అక్కయ్యలు ముగ్గురూ, సంగీత కచ్చేరీలు కూడా బ్రహ్మాండంగా జనరంజకంగా చేస్తున్నారు.

ఇంతకూ…’అమ్మ బొజ్జలో నేనున్నప్పుడేమైందో చెప్పకుండా!!!’…..అనుకుంటున్నారు కదా?? వస్తున్నా వస్తున్నా !!!  ఆ రోజు, ఇంట్లో పూజ తరువాత, భోజనాలైపోయి, పిల్లలంతా నిద్రపోయారు. వంటింట్లో, మా అమ్మ, నిండు గర్భిణి, జలారి దగ్గర( పాత్రలు కడుక్కునే చోటు) పాత్రలు కడుగుతున్నది – లాంతరు వెలుగులో!! అటు, ఉత్తరం చివరి గదిలో అయ్య కరణం బల్ల దగ్గర కూచుని, సారస్వతోపాసనలో ఉన్నారు- మరో లాంతరు వెలుగులో !! వంటింటిలోనే, ఆగ్నేయం మూల ఎత్తుగా ఉన్న అరుగు మీద, పూజ చేసుకునే ఏర్పాటు ఉంది. అక్కడున్న మందాసనం (పూజా విగ్రహాలు పెట్టుకునే చెక్క గోపుర నిర్మాణం)లో వివిధ వర్ణ పరిమళ భరిత పుష్పాల మధ్య, ఆ రోజే బ్రహ్మాండంగా చేసిన షిర్దీ సాయిబాబా ఫోటో చిరునవ్వులొలుకుతూ ఉంది!! అంతవరకూ దేదీప్యమానంగా వెలిగిన దీపాలు అప్పుడప్పుడే…మెల్లిగా కొడిగట్టుతున్నాయి. అంతటా నిశ్శబ్దం!! అప్పుడు…. అప్పుడు….ఆ మందాసనం కిందనుంచీ…?????????  

మందాసనం కింద ఏదో అలికిడి!! 

జలారి (జలదారి – దుష్ట సమాసమైనా….జనబాహుళ్యంలోకి వచ్చి పదకోశం లోనూ తిష్టవేసుకుంది…అంగీకరించాల్సిందే మరి..) దగ్గర పాత్రలు కడుగుతున్న అమ్మకు అనుమానం వచ్చింది. తను సరిగ్గానే విన్నదా..అని!!  మళ్ళీ కాసేపటికి మళ్ళీ అలికిడి ..!! పిల్లల్నెవరినీ లేపలేదు..అందరూ..అలిసి సొలిసి నిద్దర్లు పోతున్నారు. అందుకని..”ఏమండీ…ఏమండీ…’ అని అటు ఆఖరి గదిలో అత్తగారి (విద్దెలతల్లి) సేవలో ఉన్న తమ పతిదేవుణ్ణి పిలిచింది..నెమ్మదిగా!! ఆ నిశ్శబ్ద నిశీధిలో..యే కాళీదాసు కవితావైభవం గురించి తల్లితో ముచ్చటిస్తున్నారోగానీ, ఆ పతిదేవునికీ పిలుపు వినబడలేదు.

పిలుపు శబ్దానికి..మందాసనం కింద అలికిడి ఆగిపోయింది.

మందాసనం దగ్గర పూజలో ఉంచిన పండో ఫలాన్నో ఆశించిన  యే ఎలకో తచ్చాడుతూ ఉంటుందిలే..అని ఆ ఇంటి ఇల్లాలు సమాధానపడి, మళ్ళీ అంట్లు తోముకోవటంలో మునిగిపోయింది. పనిమనిషిని పెట్టుకునే స్థోమత లేని దిగువ మధ్యతరగతి సంసారమాయె!! పొద్దునకు వంటింటి పాత్రలు సిద్ధంగా ఉండాలి కదా!! ఐనా ఓ చెవి అటేసి ఉంచింది. మనసులో భయం తారట్లాడుతూనే ఉంది.. పిల్లలున్న ఇల్లు కదా మరి!! మట్టి ఇల్లవటం వల్ల, ఇంటి గోడల్లో అక్కడక్కడ బొక్కలూ (రంధ్రాలు) ఉన్నాయి..ఏ పామో కాదుగదా?? భయం భయంగానే చేతిలో పని ఆపకుండా చేసుకుంటూనే ఉంది…కాస్త తక్కువ శబ్దం వచ్చేలా – మందాసనం కింద అలికిడి మళ్ళీ ఐతే వినబడేలా!!!  

మళ్ళీ.. కాసేపటికి….అలికిడి..!! 

ఆ ఇల్లాలు..చేతిలో పని ఆపేసింది..”ఏమండీ….ఏమండీ…’ ఈ సారి కాస్త గట్టిగానే పిలిచింది. నిండు గర్భిణి. పొద్దుపోయిన రాత్రి…అంతటా నిశ్శబ్దం..పిల్లలు నిద్దర్లు పోతున్నారు. ఈ సారి పిలుపుకు సమాధానం వచ్చింది.

 “ఆ….’

“ఒక్కసారిక్కడికి రాండి..మందాసనం కింద ఏదో శబ్దమౌతూంది..’

“ఆ…ఏ ఎలకో తిరుగుతుంటుందిలే..”

భర్త మాటకు కాస్త ధైర్యం వచ్చింది. మళ్ళీ….పని!!

కానీ మందాసనం కింద అలికిడే కాక, అక్కడున్న దీపపు సెమ్మెలు కూడా కింద పడ్డాయీ సారి!!

ఆ ఇల్లాలిక చేస్తున్న పని ఆపి.. మెల్లిగా లేచి, తాను దగ్గరుంచుకున్న లాంతరును తీసుకుని..మందాసనం దగ్గరికి చేరుకుంది. 

*****

(సశేషం) 

( ఫోటో: పిన్నమ్మ శ్రీమతి అలమేలమ్మ,  అమ్మమ్మ శ్రీమతి శేషమ్మ, అమ్మ శ్రీమతి పుట్టపర్తి కనకమ్మ)  

Please follow and like us:

2 thoughts on “కనక నారాయణీయం-1”

  1. చాలా కృతజ్ఞతలు వాధూలస గారూ…నా యీ ధారావాహిక నామకరణంతో పాటు, కథనం మీకు నచ్చినందులకూ… మరిన్ని కృతజ్ఞతలు…మీ ప్రోత్సాహం ఇలాగే కొనసాగాలని ‌‌‌‌‌‌‌‌‌ఆకాంక్ష…డా.గీత గారి నిర్వహణ లో ‘నెచ్చెలి’.. జనరంజకంగా అభిమానుల నెచ్చెలి గా..ముందడుగు వేస్తూ వుండటం…ముదావహం.. డా.పుట్టపర్తి నాగ పద్మిని

  2. కనకనారాయణీయం అమ్మా అయ్యల కథకు
    చక్కని పేరు.తెలుగు ధారావాహికల్లో లాగా మంచి ఉత్కంఠలో సశేషం అనటం అందామా అంటే అది పత్రికా న్యాయమయ్యె. ఏమిజేతుము.ఎదిరిజూతుము.

Leave a Reply to Puttaparthi Naga padmini Cancel reply

Your email address will not be published.