కథా మధురం

  కథా సాహిత్యం లో  – నే చదివిన స్త్రీలు

దూరపు కొండలు (ఉమ అద్దేపల్లి కథ) 

-ఆర్.దమయంతి

శీర్షిక గురించి నాలుగు మాటలు :

కథా సాహిత్యం లో  నే చదివిన స్త్రీలు ఎందుకు రాయాలనిపించిందంటే ..

ఏ కథ చదివినా, ఎవరి కథ విన్నా అందులో స్త్రీ  పాత్ర ఏమిటా అని శ్రధ్ధ గా ఆలకిస్తూ, ఆ కారెక్టరైజేషన్ ని పరిశీలిస్తుంటాను.  ఈ గమనిక వల్ల, స్టడీ వల్ల, నాకు తెలీని ఎందరో స్త్రీలను దర్శించడం జరిగింది. మునుపెన్నడూ  ఎరుగని స్త్రీలు, వారి స్వభావాలు కథల ద్వారా పరిచయమయి, నాతో సంభాషించడం, అలా సజీవంగా గుర్తుండిపోవడం కూడా ఒక వేశేషం గా చెప్పాలి.   మరి కొన్ని స్త్రీ పాత్రలు నన్ను కలవరపెట్టి పోతుంటాయి. కల లో సైతం మరవని విధం గా మనసులో నిలిచిపోతుంటాయి. ఎందుకంటే, కథ కేవలం కల్పితం మాత్రమే కాదు,  నిజం తో కూడిన కల్పితం కాబట్టి, ఆ కారెక్టర్స్ కి స్ఫూర్తినిస్తూ ఒక నిజ స్వరూపం తప్పకుండా వుంటుంది. ఆ సత్య మైన స్త్రీ స్వరూపం రచయిత కి మాత్రమే కనిపిస్తుంది. ఆ కెమెరా కన్ను – అంత సూక్ష్మమైనదన్నమాట!   సమాజంలో జరుగుతున్న పెను మార్పు కానీ, స్త్రీ అంతరంగంలో విరుచుకుపడే సునామీ వంటి అలజడులు కానీ – మనకు పట్టిచ్చే గొప్ప సూచనా యంత్రం, ఎప్పటికీ ఆధునిక పరికరం ఏమిటయ్యా అంటే అది ఖచ్చితం గా _ కథా సాహిత్యం తప్ప మరొకటి కాదని ఘంటాపథం గా చెప్పొచ్చు.

ఒక కథ ని –  రచయిత రాసినా  రచయిత్రి రాసినా,  అందులో తప్పని సరిగా స్త్రీ పాత్ర చోటు చేసుకునుంటుంది. ఆ పాత్ర ఎంత చిన్నదైనా, దాని ప్రాముఖ్యత ఏమిటీ, ఏ కాలానికి చెందినది, ఆ స్త్రీ ఏ దిశ గా ఆలోచిస్తోంది అనే దే నాకు ముఖ్యం ఆ ఇదే అంశాలని  ప్రముఖం గా ఈ శీర్షికలో ప్రస్తావిస్తాను. 

నిజానికి నాకు కలిగిన ఈ ఆలోచనని సంపాదకురాలితో పంచుకున్నప్పుడు వెంటనే ఆమె తమ సమ్మతిని తెలియచేస్తూ, నన్ను ప్రోత్సహించారు .   ‘నెచ్చెలి ‘ ని వేదిక గా చేసుకుని మీ ఈ శీర్షికని మీ కందచేస్తూ, మీ తో మాట్లాడుకునే నాకీ అవకాశాన్ని కల్పించిన శ్రీమతి కె. గీత గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

   ప్రతి నెల ఒక కథ తో, ఆ కథలోని స్త్రీ పాత్రలను పరిచయం చేస్తూ, వారి  చిత్ర విచిత్రమైన భావాలను, ఉన్నత స్వభావాలను పొందు పరుస్తూ మీ ముందుకు వస్తాను. 

డియర్ రీడర్స్!

ఈ శీర్షికని తప్పక చదివి,   మీ ఆత్మీయ స్పందనలను అందచేస్తూ,  ఎంతో మీ మనోభిప్రాయలను, సద్విమర్శలను  తెలియచేస్తారని ఆశిస్తున్నాను. 

అందరకీ వందనములు.

ప్రేమతో

మీ

దమయంతి.

*****

‘దూరపు కొండలు’ అసలు  కథేమిటంటే :

ఆమని తన చిన్న నాటి స్నేహితురాలు సుస్మితని కలవడం కోసం  కాలిఫోర్నియా కి వస్తుంది . ఆమని కి చాలా ఆనందమేస్తుంది ఫ్రెండ్ ని కలుసుకున్నందుకు. కానీ, స్నేహితురాలు  బాయ్ ఫ్రెండ్ జేంస్ తో సహజీవనం గడుపు తోందని తెలిసి కాసింత బాధ పడుతుంది . అతన్నే పెళ్ళి చేసుకుని పిల్లల్ని కంటే అక్కడితో  స్త్రీ జీవితానికి సంపూర్ణత చేకూరుతుంది. పైగా, పరిపూర్ణమైన భద్రత దొరుకుతుంది. – అని పెళ్ళిచేసుకోమని సలహా ఇస్తుంది. అందుకు సుస్మిత జవాబు – ఏమిటన్నదే  ఈ కథ ప్రత్యేకత. 

ఒక విభిన్నమైన స్త్రీ స్వరం వింటాం. ఆమె నమ్మిన జీవన సిద్ధాంతం ఆమె మాటల్లో  మీరే చదివి తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన విషయం.

 కథ లో   స్త్రీ పాత్రలు – స్వభావాలు :

 కథ ఉత్తమ పురుష  లో నడుస్తుంది. అమల ‘నేను ‘అంటూ కథ చెబుతుంది. ఆమె, సుస్మిత చిన్న నాటి స్నేహితులు. సుస్మిత చదువులో ఫస్ట్.  గోల్డ్ మెడలిస్ట్. అమెరికాలో సెటిలౌతుంది. 

అమల అదే వయస్కురాలైనా, పెళ్లి చేసుకుని, ఇల్లూ సంసారం ఇద్దరు పిల్లలతో జీవితాన్ని గడుపుతుంటుంది. కూతురికి అమెరికా సంబంధం చేస్తుంది. అల్లుడు ఆహ్వానంతో అమెరికా చేరి,   స్నేహితురాలిని కలవడం కోసం ప్రత్యేకం గా కాలిఫోర్నియా కి వస్తుంది అమల. ఎయిర్ పోర్ట్ కి వచ్చి రిసీవ్ చేసుకుంటున్న సుస్మితని వర్ణించడం తో ఆమె రూపు రేఖలు మనకు కనిపిస్తాయి. సుస్మిత మాటల్లో అమల రూపమూ అగుపిస్తుంది.  ఇంటికొచ్చిన అమల, తనకి కేటాయించిన గది లో గోడకి వేలాడుతున్న ఫోటో లోని వ్యక్తినీ, ఆ ఇద్దరి దగ్గరతనాన్నీ చూసి, ‘ఎవరతను?’ అని అడుగుతుంది. అలా అడగడం స్త్రీ ల సహజ లక్షణం కదా! 

అందుకు సుస్మిత  ఒక మాట అంటుంది. ‘బాయ్ ఫ్రెండ్..అవును పెళ్ళైతే మొగుడు, కాకపోతే బాయ్ ఫ్రెండ్ అంతె ‘ అని నవ్వేస్తుంది. అంటే, అంత ఈజీగా ప్రకటిస్తుంది.

ఆ జవాబు కి అమల విస్తుపోతుంది. 

 ఇక్కడ మనం స్త్రీల స్వభావాల గురించి విశ్లేషిస్తే – ఒకే తరానికి చెందిన ఈ ఇద్దరి స్త్రీల జీవన గమనం లో ని తేడాలు, ఆలోచనా విధానం లో ని తారతమ్యాలను   ఇట్టే గమనించవచ్చు. జీవితంలో జరిగే ఒకే సంఘటనని ఒకే తరానికి చెందిన ఇద్దరు స్త్రీలు ఎలా రియ్యాక్ట్ అవుతున్నారన్న అంశాన్ని గనక మనం పరిశీలనలోకి తీసుకుంటే,  – అమల, సుస్మిత ఇద్దరూ రెండు విభిన్న ధోరణుల్ని వ్యక్తపరచడం జరుగుతుంది. 

అయినా, ఇద్దరూ మంచి స్నేహితులు.  ఇద్దరి వ్యక్తుల మధ్య స్నేహం వేరు, వ్యక్తిత్వం వేరు. ఒకర్నొకరు గౌరవించుకోవడం అర్ధం చేసుకోవడం తో బాటు ప్రశ్నించే చనువు,  సలహా ఇచ్చే స్నేహ తత్వం, ఆ సలహాని ఆలకించి స్వీకరించే సుగుణం ఇద్దరి లోనూ వుండాలి అని – ఈ ఇరువురి పాత్రలూ చెబుతాయి. 

అమల – అత్త గారి స్టేజ్ కి వచ్చేసింది. సుస్మిత ? అవివాహిత గా ఒంటరిదైంది.  పెళ్ళి ప్రసక్తి లేకుండా, అప్పటికే పెళ్లయి, పిల్లలున్న డైవోర్సీ – జే ంస్ తో కలిసి కాపురం చేస్తోంది.  అప్పటికి పదిహేనేళ్ళు గా.

అమల పాతకాల భావాల మనిషి కాదు. తను అనుసరించకున్నా, సాంప్రదాయాలకు  కట్టుబడి వున్నా, సమాజం లో చోటుచేసుకుంటున్న మార్పులు గమనిస్తూనే వుంది.  స్నేహితురాలి గురించి తెలుసుకున్న వెంటనే విస్తు పోయినా, ఆ వెంటనే మాటల్లో అంటుంది. ఇలాటి రిలేషన్స్  ఇండియాలోనూ వున్నాయిలే అని అంటుంది. అంటే తనకేం కొత్త కాదనీ, ఇది షాకింగ్ న్యూస్ కాదని చెప్పడం రైటర్ ముఖ్యోద్దేశం. నిజమే.   ఇదేదో మనకు పూర్తి గా తెలీని వెస్టర్న్ కల్చర్ మాత్రమే అనుకుంటే పొరబాటు. మన దేశం లో మాత్రం తక్కువేమిటీ అనే నిజం ఇక్కడి స్త్రీలకి బా తెలుసు.  

అయితే కథలో ఆమని బాధ ఏమిటంటే, సుస్మిత ఇంతచదువూ చదివి,ఇంత  హోదా పరురాలై వుండీ కూడా, – పెళ్లై, టీనేజ్ పిల్లలున్న ఆ బట్టతల వానితో కలిసి బ్రతుకుతున్న ఈ బంధం ఎన్నాళ్ళుంటుందో, ఏమో! ఒకవేళ విడిపోతే?    ఈ అమాయకురాలి పరిస్థితి ఏమిటి? శేష జీవితం ఎలా గడుస్తుంది? అనేదే దిగులుతో కూడిన ప్రశ్న.

నిజమే కదా.

అగ్ని సాక్షిగా, ఘనంగా, ఐదు వందలమంది తక్కు వ కాని  అతిథులమధ్య, భూదేవంత కళ్యాణ మంటపాలలో జరుగుతున్న పెళ్ళిళ్ళు నెల తిరక్కుండానే  పెటాకులౌతున్నాయి. ఒక్కళ్ళు గానీ ముందుకొచ్చి, ఆ వివాహం విచ్చిన్నం కాకుండా అడ్డుకోలేకపోతున్నారు. అలాటిది, ఏ గారంటీ కార్డ్ లేకుండా, ఒక స్త్రీ పరాయి పురుషుడితో ఒక కప్పు కింద బతికే బతుక్కి స్థిరత్వం, భద్రత ఏముంటుంది?

అందుకే అమల అంటుంది. నీకేం తక్కువె, మంచి సంబంధం చూసి  వేరే పెళ్ళి చేసుకో అని.

ఆమె మాటలకి సుస్మిత ఫక్కున నవ్వుతుంది. ‘మంచి ‘ అనే పద ప్రయోగానికి కావొచ్చు.  ఆ తర్వాత ఇద్దరి మధ్య ఆసక్తి కరమైన సంభాషణ కొనసాగుతుంది. 

సుస్మిత తన  వాదన ని, తాను నమ్మిన ఇజాన్ని  వినిపించి, ఆమని ని స్థిమిత పరిచానని అనుకుంటుంది.

 కానీ, వింటున్న ఆమని మాత్రం  ఎడ తెగని ఆలోచనల్లోకి జారిపొతుంది. 

 పాఠకులని పూర్తిగా రచనలో ముంచి తేల్చే సంభాషణా, అంతా ఆసాంతం ఆసక్తి కరం గా వుంటుంది.  

* లివ్ ఇన్ రిలేషన్ షిప్ వైపుకి సుస్మిత ఎందుకు ఆకర్షితురాలైంది? : 

సుస్మిత ఆ మార్గాన్ని ఎంచుకోడానికి గల  కారణాలను రచయిత్రి వివరించడం జరిగింది. ఉన్నత  చదువు – ఉన్నత హోదా గల వుద్యోగం – తో బాటు ఆమె తన కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలవాల్సిన అవసరం వల్లా, సరైన వయసులో వివాహం చేసుకోని కుటుంబ బాధ్యతలు అడ్డు రావడం  వల్ల అని చెబుతుంది అమల తో చెప్పిస్తారు రైటర్. 

వ్యక్తిగతం గా సుస్మితని చూసాక, చదివాక  మనకేమనిపిస్తుందంటే – కేవలం ఆ కారణాలు మాత్రమే కాకుండా మరో ముఖ్య కారణం కూడా  ప్రస్ఫుటమౌతుంది. బహుశా సుస్మిత కి కూడా తెలుసు ఆ నిజం కాబోలు..ఆమె మాటల్లో కూడా అదే అర్ధం ధ్వనిస్తుంది. అదేమిటంటే  – స్వేచ్ఛ. తను ఎవరికీ జవాబు దారీ కాదు అనే ధైర్యం తో బాటు, ఎవరి మీదా ఆధారపడి లేని తనకి ఆర్ధిక స్వేచ్ఛా స్వాతంత్రాలు పుష్కలం గా వుంటం వల్ల  ఆమె ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం గా కనిపిస్తుంది. సుస్మిత మాటల్లో అంటుంది. తన విషయం తన కుటుంబీకులకు తెలిసినా పెద్ద నొచ్చుకునే పని లేదని. 

నడి వయసు దాటేస్తున్న స్త్రీ, లోకాన్నీ, జీవితాన్ని చదివిన అనుభవం  ఇచ్చిన ధైర్యం ఆమె మాటల్లో స్పష్టం గా వినిపిస్తుంది. 

ఆ తర్వాత సంభాషణలో అమల  – పోనీ జేంస్ నే పెళ్ళి చేసుకో మని సూచించినప్పుడు సుస్మిత చెప్పిన జవాబు లో కూడా ఆమెకి పెళ్ళి పట్ల నమ్మకం, ఆసక్తి లేదన్న సంగతి మనకు అర్ధమౌతుంది.  అంతే కాదు, ఆమె లోని మరో పార్శ్వం కూడా కనిపిస్తుంది. ఎప్పుడంటే, జేంస్ ‘పెళ్లి చేసుకుందాం..’ అని అంటున్నా వద్దంటోందీ తనే అని నవ్వినప్పుడు సుస్మిత స్వభావం, ఈ కాలం ఆధునిక స్త్రీ ఆలోచనా ధోరణి కి ఎంతో దగ్గరగా  కనిపిస్తుంది. -అద్దంపట్టినంత సుస్పష్టం గా!

సుస్మిత  – చాలా విలువైన జీవితాన్ని పోగొట్టుకుంది కదూ? పాపం అని జాలి పడితే ఆ పొరబాటు జాలిపడున్న వారిదేనేమో?  

ఈ సందేహం మనకే కాదు, ఆమని కీ కలిగిందేమో..అందుకే రైటర్ ఈ పాయింట్ ని కూడా క్లియర్ చేస్తారు. 

సుస్మిత విషాదం గా గానీ,  జీవితాన్ని పోగొట్టుకున్న దానిలా   ఏడ్పు ముఖం తో కనిపించదు . పెళ్లి చేసుకున్న ఇల్లలి  కంటే కూడా తానెంతో సంతోషం గా వున్నానని చెప్పే సుస్మిత లాటి స్త్రీల నుంచి ఈ తరం యువతులు ఏం గ్రహించాలీ అంటే – తాము తీసుకున్న నిర్ణయాన్ని తాము గౌరవించడం, తమని తాము కాపాడుకోవడం  తో బాటు – పర్యవసానాలు ఎలా వున్నా అందుకు తామే బాధ్యత వహించాల్సి వుంటుందన్న నిజాన్ని గ్రహించాలి. సుస్మిత పాత్ర ని ఎంతో హుందాగా తీర్చి దిద్దారు – రచయిత్రి. 

 స్నేహితురాలినీ, ఆమె జీవన సరళినీ,  జీవితానికి ఆమె ఇచ్చుకున్న నిర్వచనాన్ని…వివాహం పట్ల అమెకున్న విముఖత వెనక దాగిన సత్యాలనీ, నిగూఢ రహస్యాలని –  అన్నీ ఆకళింపు చేసుకుంటూనే, 

మరో చెంత – మన హిందూ వివాహ వ్యవస్థ పట్ల,  అందులో దాగిన లోటుపాట్లు, వైఫల్యాల వెనక దాగిన మూల కారణాల పట్ల  – ఇలా అన్నీ టి మీదా అక్షరబాణాలను ఎక్కుపెట్టి సంధించారు. 

ముగింపులో 

దూరం గా కనిపిస్తున్న అందమైన కొండలను చూస్తూ..  ఆలోచిస్తూ..ఆగిపోతుంది అమల.

కథని అంత వరకే చెబుతారు రచయిత్రి. ఇది తప్పా ఒప్పా అని కానీ, ఇదే సరైన మార్గం, అనుసరణీయమని కానీ, లేదూ –  కాదు అనే సందేశాత్మక బోధనలేవీ చేయరు. 

 ఆకట్టుకునే ఒక ప్రత్యేక పాత్ర లో ప్రభాస్:  రెస్టారెంట్ లో వెయిటర్ గా పార్ట్ టైం జాబ్ చేస్తున్న పి జీ స్టూడెంట్ ప్రభాస్ పట్ల సుస్మిత చూపిన ఔదార్యం – స్త్రీ సహజమైన కరుణా హృదయానికి అద్దం పడుతుంది. 

ఇలాటి దయ గల  స్త్రీలు అమెరికాలో వుంటే, మాతృ దేశాన్ని విడిచి వచ్చిన విద్యార్ధులకి కొండంత అండ గా వుంటుంది.  అవసరం లో వున్న విద్యార్ధులకి చిన్న మొత్తంలో నే ఐనా, తమ వంతు సాయం అందించే సుస్మిత వంటి స్త్రీలు ఎందరో స్ఫూర్తి గా నిలుస్తుందనడంలో సందేహం లేదు.   

ఇదీ  కథ. వీళ్ళే –  కథలో మనకు కనిపించే స్త్రీలు. 

కథా రచయిత్రి ఉమ అద్దేపల్లి గారికి అభినందనలు తెలియచేసుకుంటున్నాను.. 

కథ చదివి, మీ స్పందన తెలియచేయవలసిందిగా కోరుతున్నాను.

ధన్యవాదాలతో..

ఆర్.దమయంతి.

*****

దూరపు కొండలు

– ఉమ అద్దేపల్లి

ఉదయం నుండి శాన్ఫ్రాన్సిస్కో నగరం లో ఎగుడు దిగుడు రోడ్లు చుట్టబెట్టేసరికి కాళ్ళు రోళ్ళయిపోయి మరి కదలలేక వచ్చి కారులో కూలబడ్డాను ..

”ఒక్క పూట కే ఇంత అలసిపోయావేమిటే! చూడవలసిన వాటిల్లో ఇంకా నాలుగవ వంతు పూర్తికాలేదు..” స్టీరింగ్ వైపు కూర్చుంటూ అంది సుస్మిత..

”అయినా ఇదేమి రోడ్లే తల్లి ! గుంజీలు తీసినట్టు పైకి ఎక్కడం ,కిందికి దిగడం..నా వల్ల కాదు ఇంక..నువ్వయితే  రోజు కారులో తుర్రు మంటూ వెళ్తుంటావు…..””చేత్తో ముణుకులమీద రాసుకుంటూ అన్నాను..

”వచ్చిన కొత్తలో యీ గుంజీలు ప్రతిరోజు తీసేదాన్ని..యీదేశం వచ్చిన ప్రతివారు కొత్తల్లోఇలాటి అనుభవాలతో రాటు తేలుతారు బాగా స్థిర పడేవరకు,అందుకే ఎవరో మహాను భావుడు చెప్పినట్టు ‘కాలి నడక ,కారు వురక మాకు కరతలా మలకం . .”కారు బెల్ట్ తగిలించుకుంటూ ఆమె అన్న మాటలకి ఆశ్చర్యం అనిపించింది.

”ఇన్నేళ్ళయినా స్వచ్చమయిన తెలుగు ,సాహిత్యం మరచిపోలేదే నువ్వు ..”

”నీకు తెలియదేమో .తెలుగు భాష ,భారతీయ సంస్కృతీ ఇండియా నుండి పారిపోయి వచ్చి అమెరికాలో తలదాచుకున్నాయట.అందుకే ఇక్కడ అమెరికాలో వున్న మా అందరికీ మాతృ భాష లో మాధుర్యం మధుమేహం లా పట్టేసింది.”

అని చిన్నగా నవ్వేసి కారు స్టార్ట్ చేసింది..పార్కింగ్ లాట్ నుండి హై వే కివచ్చింది కారు.కార్లు తప్ప నరసంచారం లేని రోడ్లు..విద్యుత్ దీపాలతో అందంగా ,ఎంతో పరిశుభ్రంగా , నిశ్శబ్దం గా వున్ననగర శోభ స్వర్గధామం లా అనిపించింది నాకు ..మెత్తని రోడ్ పై సుతారంగా డ్రైవ్ చేస్తోంది సుస్మిత ఎంతో అనుభవజ్ఞురాలిలాగా…ఆమె దృష్టి రోడ్ మీద ,సిగ్నల్ లైట్స్ మీద కేంద్రీకరించింది..సిటీ లో నడిపినపుడు మాటాడదు..

రెండుమూడు ఎగ్జిట్ లు దాటిన తర్వాత మా మధ్య నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ ,

”డిన్నర్ ఎక్కడ చేద్దాము ..? ఏదయినా వెస్ట్రన్ రెస్టారెంట్ కి వెళ్దామా ! లేక సౌతిండియన్ రెస్టారెంట్ కా !.” రోడ్ మీదనుండి దృష్టి మరల్చకుండానే అడిగింది .

”ఏమీ వద్దు .ముందు ఇంటికి పోయి వేడిగా ఒక గ్లాసుడు పాలు తాగి పడుకుంటాను ”

”అసలే కాళ్ళు నొప్పి ,ఒళ్ళు నొప్పి అంటున్నావు ..పొద్దుట నుండి ఏమీ సరిగా తినలేదు..కడుపు ఖాళీగా వుంటే నొప్పులు ఇంకా రెట్టింపు అవుతాయి .మనం ఇల్లు చేరేటప్పటికి ట్రాఫిక్ లేకపోతె గంటన్నర పైనే పడుతుంది ..కనుక శుభ్రంగా ఏదోఒకటి తినేస్తే ఇంటికెళ్ళి బ్లాంకెట్ కప్పుకొని హాయిగా పడుకోవచ్చు ..”

”అయితే సౌత్ ఇండియన్ రెస్టారెంట్ కే వెళ్దాం .”

ఉదయం ఇంట్లో ఆదరా బాదరా బ్రెడ్డు ,సీరియల్ తిని బయలు దేరాము..దారిలోకి ఏవో ఎనర్జీ బార్స్ ,ఫ్రూట్స్ .నట్స్ ,ఏవేవో డ్రింక్స్ పట్టుకుంది సుస్మిత..దారిపొడుగునా అవి సేవిస్తూ సిటీలో నడక సాగించాము..ఫెర్రీ మీద పసిఫిక్ సముద్రంలో గంటన్నర పైన నౌకాయానం గోల్డెన్ గేటు బ్రిడ్జ్ వరకూ…..మధ్యలో కేఫెటేరియాలో ఫ్రెంచ్ ఫ్రైస్ తిని,స్టార్ బక్స్ కాఫీ తాగాము..నోరంతా చప్పబడిపోయింది..ఇంటికి వెళ్లి ఆవకాయ నంజుకొని పెరుగన్నం తిన్నా అమృతం లా వుంటుంది అనిపించింది..అయినా పాపం గంటన్నర డ్రైవ్ చెయ్యాలి తను..నేను ఉత్సవ విగ్రహంలాగా కుర్చోడమే కదా ..దానికే అలసి పోయాను .ఇంత దూరం డ్రైవ్ చేసి ,నాతొ పాటు అన్నీ తిరిగినా సుస్మిత ముఖం లో అలసట కనిపించలేదు..ఆమె అంతే .లోపల

ఏముందోకనపడనీయదు. అందుకే రెస్టారెంట్ కి వెళ్ళడమే మంచిది అనుకున్నా .

”ఓకే…అయితే ఛలో మెన్లో పార్క్ ..”అంది హుషారుగా .

ఉదయం వస్తున్నపుడు నేను హుషార్ గానే వున్నాను .కారు విండో నుండి దారికిరువైపులా కనిపించే ప్రక్రుతి సోయగం చూస్తూ బాగా ఎంజాయ్ చేసాను ..కాశ్మీర్ లోయ లాగ కాలీఫోర్నియా లోని బే ఏరియా కొండ కొనల నడుమ సహజ ప్రక్రుతి సౌందర్యం తో అలరారుతూ కన్నుల విందుగా కనిపిస్తుంది..సుదూరాన ఆకుపచ్చ వలువను ధరించినట్టున్న కనుమలు పై పలుచని మేలి ముసుగులాటి పొగమంచు తెరలు ,దారికిరు వైపులా ఒత్తయిన చిక్కని,చక్కని చెట్లతో అటవీ సంపద .మనసులు దోచే హరిత బంగారు శోభ చూసితీరాలే కానీ వర్ణించనలవి కాదు నా బోటివారికి అనిపించింది..

ఇప్పుడంతా చీకటి అలుముకొని అక్కడక్కడ వెలుగుతున్న విద్యుత్ దీపాలు,వాహనాల హెడ్ లైట్స్ వెలుగులో అస్పష్టంగా కనిపిస్తోంది ..వేసవి అయితే రాత్రి పది అయినా వెలుగురేఖలు తొలగిపోవట..చలికాలం ప్రారంభం కావడంతో ఎనిమిది గంటలకే చిమ్మ చీకటి ఆవరించింది..

వన్ వే ట్రాఫిక్ లో అటునుండి వస్తున్నకార్ల హెడ్ లైట్స్ తెల్లని కాంతి ,వెళుతున్న కార్ల బాక్ సిగ్నల్ లైట్స్ ఎర్రని కాంతి చూస్తుంటే ,నల్లని కొలనులో బారులు తీర్చి వదిలిన వేలాది ఎర్రని ,తెల్లని దీపతోరణాలు అనిపించాయి.. ట్రాఫిక్ రూల్స్ కట్టుదిట్టంగా వుండడం వలన ఘాట్ రోడ్ అయినా ఆడపిల్లలు కూడా అవలీలగా అర్ధరాత్రి కూడా డ్రైవ్ చెయ్యడం చూస్తుంటే ,ఇండియా యీ స్థాయికి ఎప్పటికి ఎదుగుతుందో ,ఎప్పుడు మహాత్మా గాంధీ చెప్పిన జోస్యం ఫలిస్తుందో అనిపిస్తుంది నాకు..రాత్రి మాట దేముడెరుగు ,పగలయినా ఇలాటి నిర్మానుష్య మార్గాలలో ఆడవారు కాలి నడకని కాకపోయినా ,కారులో అయినా సురక్షితంగా ప్రయాణం చెయ్యగలరా !

ఏవో ఆలోచిస్తూ సీటుపై వెనక్కి వాలి ,ఓరగా సుస్మిత వైపు చూసాను..ఆమె దృష్టి పూర్తిగా రోడ్ పై కేంద్రీకృతమై వుంది.ఆమెని గుర్చిన ఆలోచనలు ఒక్కసారి ముసురు కున్నాయి.

సుస్మిత మాకు కొంచం దూరపు బంధువే అయినా మా ఇద్దరి మధ్య బంధుత్వం కన్నా స్నేహ భావమే ఎక్కువ .నాకన్నా ఒక ఏడాది మాత్రమె పెద్దది సుస్మిత. మా ఇంటి ఎదురుగా వుండేవారు.ఒకే స్కూల్ లో,ఒకే కాలేజ్ లో కలిసి చదువు కోవడం వలన మా ఇద్దరి మధ్య ఎంతో సాన్నిహిత్యం పెరిగింది..

సుస్మిత ప్రధమ సంతానం ఆమె తలితండ్రులకి.ఆమె తరువాత ఇద్దరు చెల్లెళ్ళు ,ఇద్దరు తమ్ముళ్ళు.తండ్రి గవర్నమెంట్ చిరుద్యోగి.తక్కువ జీతం ,అధిక సంతానం.ఎన్నో ఇబ్బందులను చిన్నప్పటినుండి ఎదుర్కొన్నాచదువులో అసాధారణమైన తెలివితేటలు ఆమెవి..చదువంతా స్కాలర్ షిప్ తోనే సాగింది.

నేనెప్పుడు చదువులో వెనక బెంచీవే.ఎలాగో డిగ్రీ అయింది అనిపించుకోగానే అనుకోకుండా మంచి సంబంధం రావడంతో పెళ్ళికుదిరిపోయింది.నేను ,తమ్ముడు ఇద్దరే సంతానం మా తలితంద్రులకి.నాన్న గారిది పెద్ద హోదాగల ఉద్యగం ,పైగా తాతగారి ఆస్తులు చాలా వున్నాయి . ”చదువులో నీ ఫ్రెండ్ ని అనిపించుకోలేక పోతున్నాను” ..అన్నానొకసారిసిగ్గుపడుతూ సుస్మితతో ”గోల్డ్ స్పూన్ తో పుట్టావు .నీకెందుకే కస్టాలు.ఏదో కాలక్షేపానికి నువ్వు చదివిన చదువు చాలులే .లక్ష్మి లేదా సరస్వతి ఎవరో ఒకరు తోడుంటే చాలు జీవితానికి . ”అని నవ్వుతూ తేలిగ్గా తీసిపారేసింది .

.స్టేట్ ఫస్ట్ లో పాసయిన సుస్మిత ఐ టి కోర్సు కి డిల్లీ యూనివెర్సిటీ వెళ్ళిపోయింది.పెద్ద సంసారం,ఆర్ధిక ఇబ్బందుల్లో వున్నతన వారికి కొండంత బాసటగా నిలిచింది మొదటినుండి.

డిల్లీ నుండి గవర్నమెంట్ సహకారంతో అమెరికా వెళ్ళే అవకాశం రావడంతో, ఆమె అమెరికా వెళ్ళడం ,పెళ్ళయ్యి నేను ఇద్దరు పిల్లలికి తల్లినై జీవితంలో స్థిర పడడం తో చిన్నప్పుడు ఒక్క ప్రాణంగా మసలిన మేము ఎవరికీ వారే యమునా తీరే అన్నట్టు అయిపొయాము..ఎప్పుడో చాలా కాలం కిందట సుస్మిత గురించి అమ్మని అడిగితే ,అమెరికాలో ఆమె బాగా సెటిల్ అయి,మంచి హోదాలో వుందని,రెండుచేతులా డాలర్స్ సంపాదిస్తోందనివిన్నానని అమ్మ చెప్పగా విని ,ఆమె పడిన కష్టానికి ప్రతిఫలం దొరికిందని అని ఎంతో సంతోషించాను.

పాతికేళ్ళ తర్వాత, మా అమ్మాయి శ్రేయాకి అమెరికా సంబంధం కుదిరి పెళ్లి చేసాక ,అమ్మాయిని దిగబెట్ట దానికి నన్ను రమ్మని అల్లుడు అర్జున్ పట్టుబట్టి ,వీసా ఏర్పాట్లు కూడా చేసేసాడు..అమెరికా బయలుదేరేముందు సుస్మిత చిన్న తమ్ముడు మాధవ ఎదో పనిమీద హైదరాబాద్ రావడం ,అనుకోకుండా కలియడం జరిగింది..నేను కాలీఫోర్నియా వెళ్తున్నానని తెలిసి అక్క సుస్మిత అక్కడే ఉందంటూ ఆమె ఫోన్ నంబర్ ఇచ్చాడు..నా ఆనందానికి అవధులు లేవు .

తొలిసారి అమెరికా ప్రయాణం అనేకన్నా,దశాబ్దాల తర్వాత నా ప్రాణ స్నేహితురాల్ని కలియబోతున్నాననే ఉత్సాహం నాలో ఉరకలు వేసింది .అమెరికా రాగానే ఫోన్ చేస్తే సుస్మిత విస్మయానికి ,ఆనందానికి అంతులేదు ..ఉన్న పాళంగా వచ్చెయ్యమని గొడవ ..

అల్లుడు అర్జున్ లాస్ ఏంజెలెస్ మంచి పేరెన్నిక గల ఐటి కంపెనీలో ఉద్యోగం..డుప్లెక్స్ హౌస్, చక్కని పర్నీచర్ ,మేము వచ్చేసరికే అన్నీ అమరి వున్నాయి .ఒక వారం రోజులు అమెరికా వాతావరణానికి ఎడ్జస్ట్ అవ్వడానికి ,హాలీవుడ్ లాటి కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు చూడడానికి సరిపోయింది .ఈ లోపలే వందసార్లు ఫోన్లు సుస్మిత ఎప్పుడు బయలు దేరుతున్నావు .? అని .

నవంబర్ లాంగ్ వీకెండ్ లో అర్జున్ వేరే చోటికి ప్లాన్ చేస్తుంటే ,కొత్త జంట.కనీసం నాలుగు రోజులు ఏకాంతంగా గడుపుతారని ,పైగా నాకు సుస్మితని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆరాటం .అందుకే అర్జున్ని ఒప్పించి బయలుదేరాను .

లాస్ ఏంజెలెస్ లో నన్ను ఫ్లైట్ లో కూర్చో పెట్టాడు అర్జున్..శాన్ఫ్రాన్సిస్కోలో దిగగానే సుస్మిత వచ్చింది రిసీవ్ చేసుకుందికి..

చూడగానే సుస్మిత నన్ను గుర్తు పట్టింది కానీ ఆమెని నేను గుర్తుపట్టలేకపోయను…తెల్లగా.సన్నగా ,పొడుగ్గా ,నాజుకుగా ,పొడవాటి వాల్జెడ, పొందికయినా చీర కట్టు .నడచి వచ్చిన బాపు బొమ్మ అన్నట్టు కనిపించే ఆ రూపమే నేటికీ కళ్ళల్లో, మనసులో నిండివుంది.కానీ….

సన్నగా ,పొడుగ్గా ,అమెరికా చల్లదనం వలన కాబోలు పింక్ కలర్ లో మారిన ముఖం , జీన్ ఫాంట్, పొట్టిగా ,బిగుతుగా వున్న నలుపు ,తెలుపు జీరలున్న షర్ట్, బుజాలు కూడా తాకని క్రాఫింగ్ లాటి హెయిర్ కట్ .నల్ల కళ్ళద్దాలు, ఒక్కసారి అమాంతగా

”అమ్మూ ..” అంటూ వచ్చి వాటేసుకున్న యీ శాల్తీ ఎవరా ! అని హడలి చచ్చేదాన్ని ఆ గొంతు ,పలకరింపు ఎవరిదో గుర్తించక పొతే..

*”ఎన్నాళ్ళకే..” అని గాగుల్స్ తీసి అభిమానంగా నా చేతిలో సూట్ కేసు అందుకుంది నవ్వుతూ.

చక చకా సూట్ కేసు లాక్కుతూ నడుస్తున్న ఆమెని ‘కలయో వైష్ణవ మాయయో’..అన్నట్టు చూస్తూ , ఇంకా అయోమయంనుండి తెరుకోకుండా మరబోమ్మలా అనుసరిస్తున్న నన్ను చూసి,

”నువ్వు పెద్దగా మారలేదే.గుమ్మిడి గింజవి కాస్త గుమ్మిడికాయ అయ్యావు .అంతే..”అంది అదే నవ్వుతో కారులో కూర్చుంటూ .

”నువ్వు మాత్రం చాలా మారిపోయావే..నాజుకుగా బాపూ బొమ్మలా వుండే నువ్వు ..”ఆమె పక్కని కారులో కూర్చొని కార్ బెల్ట్ తగిలించుకుంటూ అంటున్న నా మాటని సగంలో తుంచేస్తూ ,

”ఇప్పుడు పికాసో పెయింటింగ్ లా పిచ్చి పిచ్చిగా వున్నానంటావా! ”అంటూ నవ్వింది .

ఒక్క కుదుపుతో కారు ఆగడంతో ఆలోచనలనుండి వాస్తవ ప్రపంచంలోకి వచ్చాను.

”నిద్రపోయినట్టున్నావు ” కార్ పార్క్ చేస్తూ అడిగింది .

”లేదులే.ఏదో గతం లోకి వెళ్లాను.”

”సరే .దిగు .రెస్టారెంట్ కి వెళ్దాము ..”.

రెస్టారెంట్ వీకెండ్ కావడం వలన రద్దీగానే వుంది .అందరూ భారతీయులే.అక్కడక్కడ తెల్లవాళ్ళ ముఖాలు కూడా కనిపించాయి..సందడిగా గోల గోలగా వుంది రెస్టారెంట్.అందరూ ఒకేరకం మాడ్రన్ దుస్తులు.అమెరికన్ ఇంగ్లీషు.కనిపిస్తున్న భారతీయుల్లో ఎవరేభాషవారోకనిపెట్టడం కష్టం .టోకెన్ తీసుకొని చోటుకోసం కాచుకోవాలి .కొంతసేపటికి మా పేరు వచ్చింది.ఒకవార రెండే అటు ఇటు కుర్చీలున్న చిన్న టేబిల్ దొరికింది .

”హమ్మయ్యా !’ అని చతికిల పడ్డాము.పదినిముషాల తర్వాత వెయిటర్ వచ్చాడు .సుస్మితని చూస్తూనే ,

” నమస్తే ఆంటీ ! బాగున్నారా ! చాలా రోజులకి ”అంటూ స్వచ్చమైన తెలుగులో పలుకరించాడు.

అన్ని రోజుల తర్వాత బయట వ్యక్తీ నోటంట తెలుగు మాట వినగానే ప్రాణం లేచోచ్చినట్టయింది.

”హలో ప్రభాస్..ఇంకా ఇక్కడే వున్నావా ! నీ ఎం ఎస్ ఎప్పుడో అయిపొయింది అనుకుంటా ..ఎలా వున్నావు .? ”

సుస్మిత మాటలకి ఆశ్చర్యం అనిపించింది .ఎం ఎస్ పాసయిన కుర్రాడు ,అదీ అమెరికాలో చదివిన వాడు వెయిటర్ గా ఉద్యోగమా! నమ్మ శక్యం కాలేదు.

”బాగున్నాను ఆంటీ . జాబ్ యీ ఊళ్ళోనే దొరికింది ..” పెన్సిల్ ,చీట్ పాడ్ తీసుకొని టేబిల్ పైకి వంగి మాటాడుతున్నాడు.

”అవునా ! కంగ్రాట్స్ ..మరి ఇక్కడ ..?”

”ఉదయం ఎనిమిది నుండి సాయంత్రం నాలుగు వరకు ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో చేస్తున్నాను .సాయంత్రం ఆరునుండి రాత్రి పదకొండు వరకు ఇక్కడ చేస్తాను .”

”మరీ ఎక్కువ స్ట్రెస్ కదా ఇలా రెండుచోట్ల …”

”కొన్నాళ్ళు స్ట్రెస్ తప్పదు ఆంటీ ! కంపెనీ లో వచ్చే జీతం ఇంటికి పంపాలి.ఇక్కడ దగ్గరలో పన్నెండు మంది ఇండియన్ అబ్బాయిలం రెండు గదులున్న ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకున్నాము .అద్దె ,పగలు ఫుడ్డు ,నా పర్సనల్ ఖర్చులకోసం ఇక్కడ చేస్తున్నాను ..పైగా రాత్రి డిన్నర్ ఇక్కడే అయిపోతుంది ..”అని మరింత గొంతు తగ్గించి ,

”ఓనర్ ఇటే వస్తున్నాడుఆంటీ !” అనగానే ,సుస్మిత మెనూ పరిశీలిస్తున్నట్టు నటిస్తూ ఏవో నాలుగయిదు ఐటమ్స్ఆర్డర్ చేసింది..

”ఇంత చదువు చదివి ఆ అబ్బాయి ..”ఏదో అనబోతుంటే ,చేత్తో సంజ్ఞ చేసింది తరువాత మాటాడదాము అన్నట్టు .

టిఫిన్ చెయ్యడం ముగించి వీసా కార్డ్ ఇస్తూ ,పాతిక డాలర్స్ రహస్యంగా టిప్ ఇచ్చింది .”ధాంక్స్”చెప్పి సంతోషంగా వెళ్ళాడు ఆ అబ్బాయి .

”ఏభై డాలర్స్ బిల్లుకి పాతిక డాలర్స్ టిప్పా! ఇక్కడ టిప్పుల తోనే టిప్పు సుల్తాన్స్ అవ్వోచ్చులా వుంది ..అందుకే ఆ సాఫ్ట్ వేర్ కి హోటల్ వదలబుద్ధి కాలేదేమో .” కారులో కూర్చున్నాక అన్నాను .

”అదేమీ లేదు.అందరూ టిప్స్ ఇవ్వరు .తెలిసిన అబ్బాయి కనుక ఇచ్చాను.ఆ అబ్బాయి పడుతున్న కష్టానికి నాలాటి వారు యీ రూపంలో అందించే సహకారం .అంతే ..”అంటూ ఆ అబ్బాయి గురించి చెప్పింది.

ప్రభాస్ కి తండ్రి లేడు, ఆ అబ్బాయి చిన్న పిల్లాడుగా ఉన్నపుడే డ్యూటీ లో వుండగా పోయాడు .రైల్వే ఉద్యోగి.అందుకే అతని భార్యకి రైల్వే వుద్యోగం వచ్చింది .ప్రభాస్ కి ఒక చెల్లి వుంది . తల్లి కస్టపడి పిల్లలిద్దర్నీ పెద్ద చదువులు చదివించింది. ప్రభాస్ కంప్యుటర్ కోర్స్ ముగిసాక ,అమెరికాలో ఎం ఎస్ కి సీటు అప్లై చేస్తే కాలీఫోర్నియా యూనివర్సిటీలో దొరికింది. తల్లి ముప్పై ఐదు లక్షలు ఖర్చు చేసి అమెరికా పంపింది .ఆమె కష్టానికి తగిన విధంగా తాను కష్టపడి చదివి ,కష్టపడుతూనే అప్పు తీరుస్తున్నాడు .

”పాపం .చాలా కష్ట పడుతున్నాడు .”జాలిగా అన్నాను .

” ఆ అబ్బాయి ఒక్కడే కాదు ఇక్కడ వీధికి వందమంది ప్రభాసులు మనకి కనిపిస్తారు. పిజ్జా హాట్స్ లో ,కేఫెటేరియాల్లో,రెస్టారెంట్స్ లో ,గాస్ స్టేషన్స్ లో,ఇంకా అనేక షాపుల్లో నే కాదు ,ఇళ్ళల్లో బేబీ సిట్టర్స్ గా కూడా పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ చదువు సాగిస్తుంటారు. ఒక చిన్న ఇల్లు తీసుకొని పది ,పన్నెండు మంది మన ఇండియన్ అబ్బాయిలు,అమ్మాయిలు క్రిక్కిరిసి వుంటారు పాకెట్ మనీ కోసం కష్టపడక తప్పదు . చాలా మంది అమెరికా రాగానే కొత్తగా రెక్కలొచ్చిన పక్షులయిపోతారు. ఏవేవో సరదాలు ,వినోదాలు,నేటి కుర్రాళ్ళకి చదువుతో పాటు విదేశీ నాగరికత కూడా ఒంటపట్టించుకోవాలనే తపన.అందుకే కొత్తగా వచ్చిన వారికి పూర్తిగా నిలదొక్కుకొనే వరకు ఇలాటి కస్టాలు తప్పనితద్దినాలు .” నవ్వింది.నేను నవ్వలేకపోయాను.

”అందుకే చాలామంది మన భారతీయుల ముఖాలు చూస్తుంటే ఏవో కష్టాలకావిడీ మోస్తున్నట్టు కనిపిస్తుంది .”

”అవును .ఇండియా నుండి తెచ్చుకున్న కష్టాలను ఇక్కడ కావిళ్ళతో మోస్తాము కదా ..!” అంటూ మళ్ళీ నవ్వింది .ప్రతి దానికీ నవ్వుతుంది ఆమె ..చిన్నప్పటి నుండి అంతే .సార్ధక నామదేయురాలు .

”అయినా ఇండియాలో వున్నవాళ్ళ వాళ్లకి ఇక్కడ వీళ్ళు ఎలా బతుకుతున్నారో తెలియదేమో . ”

” తెలిస్తే మాత్రం చేసేదేముంది ..?ఇక్కడ ఇలాటి భవభవ సాగరాలు ఈదక తప్పదు . .అమెరికన్స్ అయితే పదిహేడు సంవత్సరాలు రాకుండానే బయటకి తోలేస్తారు ,నీ తంటాలు నువ్వు పడు అని .ఇక్కడ ఎవరు ఏ పని చేస్తున్నారన్నది ముఖ్యం కాదు ,ఎంత సిన్సియర్ గా చేస్తున్నారన్నదే ముఖ్యం ..ప్రెసిడెంట్ పదవి అయినా ,వెయిటర్ ఉద్యోగమయినాచేసే పనికి మాత్రం గౌరవం ఒకటే. అందుకే యీ దేశం అభివృద్ధి సాదిస్తోంది.కష్టపడే వయసులో ఒళ్ళు దాచుకోరు.రిటైర్మెంట్ తర్వాత సుఖంగా వుంటారు .మనదంతా రివర్స్ .వయసులో జీవితం ఆడుతూ పాడుతూ గడిపేసి ,చచ్చేవరకు బరువులు మోస్తారు .”

”నిజమే ” అనిపించింది .

ఇంటికి వచ్చి దుస్తులు మార్చుకొని మంచం మీద కూర్చున్నాను .ఒక గ్లాస్ తో వేడి పాలు తీసుకొచ్చి పక్కన టేబిల్ మీద పెట్టి ,

”వేడి పాలు తాగి ,వెచ్చగా బ్లాంకెట్ కప్పుకొని పడుక్కో .పొద్దున్నకల్లా నొప్పులు ,గిప్పులు అన్నీ ఎగిరిపోతాయి .గుడ్ నైట్ .” అని వెళ్లి పోయింది .

గ్లాస్ చేతిలోకి తీసుకొని వేడి పాలు సిప్ చేస్తుంటే తెగిన ఆలోచనల దారాల అల్లిక మళ్ళీ ప్రారంభం అయింది.మళ్ళీ నా ఆలోచనలు సుస్మిత చుట్టూ అల్లుకోసాగాయి .

సుస్మిత చిన్నప్పటి నుండి కాస్త డేరింగ్ గానే వుండేది.చదువులో ఎంత చురుకో మాటల్లో అంత కరుకు..హై స్కూల్ ల్లో డేర్ డెవిల్ అనేవారు..కానీ సాంప్రదాయాలకు ,సంస్కృతికి, భారతీయతకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉపన్యాసాలు దంచేది..అటువంటి సుస్మితని దశాబ్దాల తర్వాత అమెరికాలో చూసిన నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది .కట్టు ,బొట్టు ప్రాంతాలకు,వాతావరణానికి సరిపడా మార్పు సరే ,కానీ భావాలలో,జీవిత విధానంలో మార్పు వింతగా తోచింది.

ఆ రోజు ఎయిర్ పోర్ట్ నుండి ఇంటికి రాగానే ముచ్చటయిన ఆమె ఇల్లు ,చుట్టూ చిన్న ఫెన్స్..పచ్చని లాన్ .విరబూసిన రంగురంగుల సీజన్ ఫ్లవర్స్, చక్కని పర్నీచర్,పొందికైన గృహాలంకరణ చూసి అబ్బుర పడ్డాను ఆమె అభిరుచికి దర్పణం పడుతున్నాయి అన్నీ అనిపించింది .కానీ నాకై కేటాయించిన గదిలో అడుగు పెడుతూనే ఒక్కసారి దిగ్భ్రాంతి చెందాను..

ఒక అమెరికన్ ,యౌవన పొలిమేరలు దాటినట్టు కనిపిస్తున్నది అతని ముర్తిమంతం.బట్టతల ,భారీగా ,అందంగా వున్నాడు.అతని చేతులు పూర్తిగా సుస్మితని చుట్టివున్నాయి..హాయిగా నవ్వుతూ,అతనిలో ఒదిగొదిగి పోతూ ఆమె. ఆ పెద్ద ఫోటో చూస్తూ కొన్ని నిముషాలు స్థాణువులా నిలబడ్డాను.

గదిలోకి వచ్చిన సుస్మిత నన్ను చూసి ,

”ఎలావుందే గది ..? ..”ఇంకా ఎదో అడగబోతుంటే ,

”ఆ ఫోటో లో వ్యక్తీ ..?..”అర్దిక్తిలో ఆపి చూసాను .

”అతనా ! అతను జేమ్స్..ఈ గది జేమ్స్ దే.నువ్వొస్తున్నావని,మొహమాటం లేకుండా వున్ననాలుగురోజులు ఫ్రీగా నాతో గడపాలని నిన్ననే సీటెల్ లో వున్న అతని అక్కయ్య దగ్గరకు వెళ్ళాడు.”

”అది సరే .ఇంతకీ ఎవరతను..?”

”పదిహేను సంవత్సరాలనుండి నాతో జీవితాన్ని,యీ ఇంటిని పంచుకుంటున్న నా బోయ్ ఫ్రెండ్ ”

”బోయ్ ఫ్రెండ్ ..? పదిహేను సంవత్సరాలనుండి ఒకే ఇంట్లో వుంటూ,జీవితాన్ని పంచుకుంటున్న వ్యక్తీ బోయ్ ఫ్రెండ్ ఏమిటి..?”విస్తుపోతూ చూసాను .

”పెళ్ళయితే హస్బెండు ,లేకపోతే బోయ్ ఫ్రెండు….”అని నవ్వేసి బయటకి వెళ్ళింది నా సూట్ కేసు తేవడం కోసం .

ఆ రాత్రి పడుకొనే ముందు తీరుబాటుగా యీ విషయం ఏమిటో పూర్తిగా వింటేనే కానీ నాకు నిద్రపట్టలేదు .

”పదిహేను సంవత్సరాలనుండి ఒకే ఇంట్లో జీవితాన్ని కూడా పంచుకుంటూ ఉంటున్నారుమీరిద్దరూ అన్నావు.పెళ్లి చేసుకోవచ్చుగా..”

”లీగల్ గా అదొక తలనొప్పి ఈ దేశంలో.అయినా ఆ లైసెన్సు లేకుండానే బండి బాగానే సాగిపోతొందిలే ..”

”అంటే ,సహజీవనం అన్నమాట….”

”సహజీవనమో,సహగమనమో,మొత్తానికి ఇప్పటి వరకు ఇద్దరూ కలిసే జీవిస్తున్నాము.”

”ఇంతకీ ఇలా పెళ్లి చేసుకోకుండా ఉండాలన్ననిర్ణయం నీదా !అతనిదా !”

”నాదే.జేమ్స్ కొన్ని వేల సార్లు అన్నాడు పెళ్లి చేసుకుందాము అని .ఇప్పటికీ అంటూనే ఉంటాడు తరుచు..నేనే వద్దన్నాను..ఇప్పుడు వచ్చిన లోటేమిటనిఅడిగాను.నా ఉద్యోగం,నా డబ్బు,రిటైర్ అయ్యాక నా వ్యక్తిగత స్వతంత్రం నాది ..అతనిది అతనిస్టం..”

”అదికాదే ..పెళ్ళయితే పిల్లలు, సంసారం,ఆ ఆనందం ,జీవితం వేరుకదా!”

”అవన్నీ నీలాటి వారికి.పుట్టుకతోనే తడిపి మోపెడు భాద్యతలతో ఈ లోకంలోకి వచ్చిన నా లాటి వారికి కాదు ..”

”కాస్త అర్ధమయ్యేలా చెప్పొచ్చుగా….”

”నీకు తెలియనిది ఏముంది అమలా !..”

మొదటిసారి నన్ను పూర్తీ పేరుతొ సంభోదించడం ఆశ్చర్యం కలిగించింది..ఆమె వంక చూసాను.అదేమీ గమనించకుండా చెప్పుకుపోయింది.

”అందరిలాగా అమెరికాలో అందమైన జీవితాన్ని గురించి కలలుకంటూ నేనిక్కడికిరాలేదు .నడి సంద్రంలో నావలాటి నా పుట్టింటి వారి శ్రేయస్సుకోసం వచ్చాను.వారి అదృష్టమో,నా అదృష్టమో సహకరించి మెరిట్ తో రాగలిగాను.గొర్రెతోక బెత్తెడు లాటి మనదేశం జీతాలతో,సాంప్రదాయాలు,సంస్కృతీ అనే ఉక్కు చట్రాల మద్య బతుకుతూ వుంటే ,నా బతుకు నాకే భారమయివుండేది…ఇక్కడ నేను సంపాదించిన డాలర్స్ మా కుటుంబానికి సుఖాన్ని ,శాంతిని ఇచ్చి ,మంచి జీవితాన్ని అందించాయి..అక్కడ వాళ్ళు ,ఇక్కడ నేను హాయిగానే ఉన్నాము..”

”అది కాదె .ఇప్పుడు భాద్యతలన్నీ తీరిపోయాయిగా..ఇప్పుడు ఏమిటి మించిపోయింది పెళ్లి కి …”మాటని మధ్యలో తుంచేస్తూ అడిగాను.

”ఏమీలేదు.మించిపోయింది ఒకటే.అది వయసు..”అని నవ్వింది.

”అమెరికాలో ఎనభై ఏళ్ళు దాటాక కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అని విన్నాను .”

” లోకోభిన్న రుచి ..”

”అది కాదె …సహజీవనం తప్పు అని నేననడం లేదు .మనదేశం లో కూడా యీ మధ్య యీ పేరు తరుచు వినబడుతోంది .నిన్ను పదేపదే పెళ్లి చేసుకోమని జేమ్స్ అడిగాడంటే నీకు లేకపోయినా అతనికి పిల్లలు ,సంసారం కావాలని కోరిక ఉందేమో..”

”అంత లేదులే..మా ఇద్దరికీ పరిచయమయిన నాటికే అతనికి టీనేజ్ కొడుకు ,కూతురు వున్నారు.డైవోర్సీ..ఇప్పుడు అతనికి ఇద్దరు మనుమలు కూడా…”

”అవునా !” ఆశ్చర్యంగా ఆమెవంక చూసాను .

”అయినా ఇద్దరు టీనేజ్ పిల్లల తండ్రి ,జీవితంలో అన్నీ చవిచూసిన వాడు..మరి ఇంత చదువు,హోదా,మంచి జీవితం వున్ననువ్వు తలుచుకుంటే అమెరికాలో మంచి సంబంధాలే కరువయ్యాయా !”

”మంచి అనే పదానికి యీ రోజుల్లో సరయిన నిర్వచనం లేదు అమ్ము! సంబంధాలన్నీ ఆర్దికమే కానీ హార్దికాలు కాదు.జేమ్స్ భార్య వలన చాలా దెబ్బతిన్నాడు.అతని సర్వస్వాన్ని హరించి ,అతన్ని బయటకి తోలేసింది విడాకులిచ్చి..పిల్లల భాద్యత కూడా అతనే తీసుకోవలసి వచ్చింది.చాలా డిప్రెషన్ లో ఉండేవాడు .అప్పుడు పరిచయమయ్యాడు.మేమిద్దరం ఒకే ఆఫీస్ లో పని చేసేవాళ్ళం.అయినా బిల్డింగ్స్ వేరు..అనుకోకుండాకలిసాము .అతని మృదు భాషణ ,మంచితనం నన్ను ఆకట్టుకున్నాయి.నేను అతనికి నచ్చాను.ఇద్దరం కల్మషం లేకుండానే ప్రేమించుకున్నాము. ఆ ప్రేమకి పెళ్ళిఅనే లైసెన్సు బిళ్ళ తగిలిస్తే అది చట్టపరం అవుతుంది.అభిమానాలు,అనురాగాలు చట్టానికి అతీతం అని నా భావం…అప్పటికే జీవితంలో ఎంతో అలసి వున్ననాకు కూడా కొంత ఉపశమనం కావాలనిపించింది..అది నాకు ఇప్పటివరకు జేమ్స్ ద్వారా కావలసిన దానికన్నా ఎక్కువే దొరుకుతోంది.. అప్పుడప్పుడుఅతని పిల్లలు ,మనుమలు వస్తుంటారు .చాలా సన్నిహితంగా వుంటారు ..వాళ్ళనే నా పిల్లలు ,మనుమలుగా అనుకుంటూ వుంటాను ,ఇది చాలు లెద్దూ…..”

”మరి మీ విషయం ఇంట్లో వాళ్లకి చెప్పావా !”..కొన్ని నిముషాలు ఆగి అడిగాను.

”చెప్పాల్సిన అవసరం వుందని నేను అనుకోలేదు.వాళ్లకి నా జీతం కావాలి ,నాకు నా జీవితం కావాలి..”

”చాలా మారిపోయావు సుశీ..!” చిన్నగా నిట్టుర్చాను.

”ఒకవేళ నువ్వు చెప్పకపోయినా అమ్మకి నీ విషయంతెలిస్తే ..!”

”తెలిసే అవకాసం వుంటే ఎప్పుడో తెలిసేది.ఇప్పుడు నీకు తెలిసింది కనుక నువ్వు చెప్పినా అభ్యంతరం లేదు..”

”.ఛా..అదేం మాటలు సుశీ..! నీకు ఇష్టం లేకుండా ,నీ అనుమతి లేకుండా ఎందుకు చెప్తాను ..అయినా రక్త సంభందాలను కేవలం డబ్బుకి పరిమితం అన్నట్టు నువ్వు మాటాడడం ఎందుకో బాధగా వుంది.”

”చెప్పానుకదా అమ్ము! నీ జీవితం వడ్డించిన విస్తరి.కానీ నేను అన్నీ నాకుగా అమర్చుకోవలసి వచ్చింది.నాన్న పోయాక అమ్మ పెద్ద తమ్ముడు దగ్గర వుంది..వాడిని చదివించి ప్రయోజకుణ్ణిచేసాను.దానికోసం కృతజ్ఞత చూపించమనలేదు .కానీ యీ వయసులో అమ్మకి పట్టెడన్నం పెట్టడానికి ఏడుస్తున్నాడు.ఒక్క నెల నేను డబ్బు పంపడం ఆలస్యమయితే అమ్మ నిష్టురాలు.పదిహేనేళ్ళ క్రితం వరకూ పనికి మాలిన సంబంధాలు సాంప్రదాయం ,చట్టు బండలు అని చూసింది.తిరస్కరించానని కోపం..ఎలా వున్నావు అని కూడా అడగదు.లక్షలు ఖర్చు పెట్టి చెల్లెళ్లకి పెళ్ళి చేసాను .తమ్ముళ్ళు చదువుకొని ఉద్యగాల్లో స్థిర పడేవరకూ భాద్యత తీసుకున్నాను .అయినా ఇప్పటికీ చెల్లెళ్ళ బాధలు ,తమ్ముళ్ళ ఇబ్బందులు ,తన అనారోగ్యం ,ఇవే అమ్మ నాతో చెప్పుకోనేవి…ఇప్పుడు చెప్పు.ఈ పరిస్తితిలో నా జీవితం గురించి చెప్తే హర్షిస్తుందా ! తెల్లవాడిని ఉంచుకున్నాను అంటూ తనదైన భావంలో భాష్యం చెప్పుకొని అసహ్యించుకుంటుందా..!”

జవాబు లేని ప్రశ్న.. కొన్ని గంటల క్రిందట ప్రభాస్..లక్షలు ఖర్చుపెట్టి అమెరికా చదువులకోసం పిల్లల్ని పంపిన తలితండ్రులు ,తమ పిల్లలు ఏ ఏసీ రూమ్స్ లోనో కాలుమీద కాలేసుకొని కూర్చొని వందలు వేలు డాలర్స్ సంపాదిస్తున్నారనే భ్రమలో బతుకుతుంటే, తమ కాళ్ళను పూర్తిగా ఆ గడ్డమీద ఆన్చి నిలబడాలనే తపనలో,తమ పోట్టపోసుకుందికి ఎన్ని అవస్థలు పడుతున్నారో చాలామందికి తెలియదు . మా పిల్లలు అమెరికాలో వున్నారు ,వేల డాలర్స్ పంపుతున్నారు అని డబ్బాలు కొట్టడం ,లేదంటే విదేశాలు వెళ్లి అమ్మ నాన్నలని మరచిపోయారు. మమ్మల్ని పెద్ద వయసులో ఒంటరిగా వదిలేసారు అని నిష్టురాలు …

విదేశాల్లో జీవితం అంటే పూలబాట కాదు.దానిలో ముళ్ళు నిక్షిప్తమై ఉంటాయనే జీవిత సత్యం కళ్ళారా చూస్తేనే కానీ అర్ధం కాదు .

ఇక సుస్మిత లాటివారు…ఆడ కావొచ్చు ,మగ కావొచ్చు,కాలికి ,మెడకి చుట్టుకున్న భాద్యతల బంధాలు తొలగించుకొని,అలసి సొలసిన నాడు, అక్కున చేర్చుకొని ఆదరించే ఆలంబన కావాలనుకోవడం సహజం…దేశకాలమాన పరిస్తితులు,జీవన విధానాలు ,ఆచారవ్యవహారాలు,రంగుల బేధాలు ఎన్నున్నా మానవ సంబంధాలు,ప్రేమలు ,స్పందనలకు అతీతం కాదు.అవి ఒక్కటే మనసుకి మనసుకి మధ్య వారధిగా మారి,మానవ సంబంధాలనుకలుపుతాయి.

అవును.కన్నవారు,తోబుట్టువులే ఆత్మీయులా! సాంప్రదాయాలు,చట్టాలు,ఇవి మానవజీవితాలను,మనసులను బంధించగలవా! అదే నిజమయితే సాంప్రదాయాన్ని పాటించేవారి జీవితాలన్నీ ఆనందసాగరంలో మునిగి తెలుతున్నాయా! సుస్మిత చెప్పినట్టు ఆమె తల్లి చూపించిన సాంప్రదాయ సంబంధం ఆమె చేసుకున్నా,చిన్న వయసునుండి తన స్వశక్తితో పైకి వచ్చి ,అచంచల ఆత్మ విశ్వాసంతో ఎంతో గురుతర భాద్యతలను నిర్వర్తించిన ఆమె ఎవడో ముక్కు ముఖం తెలియని వాడిచేత మూడు ముళ్ళు వేయించుకొని ,ఆ పసుపు తాడు అనే పలుపు తాడుకు బందీగా బతకగలదా ! కుటుంబ భాద్యతల్నితన బుజాలమీదికిఎత్తుకున్న ఆమెకి భర్తగా వచ్చిన వాడు సహకరించి వుండేవాడా ! అతని కోసం తన భాద్యతల్నివదిలి వ్యక్తిగత స్వతంత్రాన్ని తాకట్టు పెట్టగలిగేదా,,?

లేదు .ఎంత మాత్రం లేదు.అవసరం లేదు.ఒకర్ని సంతోష పెట్టడానికి,ఒకర్ని ఉద్దరించడానికే కాదు ఆమె జీవితం .తనకు మాలిన ధర్మం పనికి రాదు..తనకి ఎక్కడ ,ఎవరి వల్ల,ఎలా ఆనందం లభిస్తోందో అలా బతికే హక్కు ఆమెకుంది..

నలబైఎనిమిదేళ్ళ వయసులో పదహారేళ్ళ పడుచులా చురుకుగా ,చలాకీగా వున్నా ఆమె ముఖంలో తాజాతనం చూస్తే జేమ్స్ తో ఆమె చాలా ఆనందంగా ఉంటోందని అర్ధం అవుతోంది..ఆమె చెప్పినట్టు కంటేనే పిల్లలా ! కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే పిల్లలూ, పురుళ్ళు ,పుణ్యాలు,ఎత్తిపోతలు,చాకిరీలు లేకుండా రబ్బరు బొమ్మల్లా ఒడిలో కేరింతలు కొట్టే మనుమలు..అది చాలదా !

…….డాలర్స్ సంపాదనలో మునిగిపోయిన వారి దృష్టిలో జీవితపు విలువలు మారిపోవచ్చు,అందరికీ కాకపోయినా కొందరికి. అంతమాత్రం చేత వారెన్నుకున్నమార్గం సరయినది అనుకోవాలా ! జీవితంలో తోడు కావాలనే తపన ప్రారంభం అయినపుడు,వర్ణాంతరమో ,మతాంతరమో ఎవరో ఒకర్ని ఎంచుకొని వివాహం చేసుకొని,పిల్లా పాపలతో తనదైన ఒక చిన్న లోకాన్ని సృష్టించుకోవడం లో ఆనందం లేదా !

ఏమో ..నావి ‘అమ్మమ్మ ‘కాలం నాటి భావాలేమో .సుస్మితలాగా చిన్నవయసులో ,దశాబ్దాల క్రిందట బరువులేత్తుకొని యీ దేశం లో అడుగుపెట్టి వుంటే నేను కూడా ఆమె లాగా ఆలోచించి ,ఆమె లాటి నిర్ణయం తీసుకొనే దాన్నేమో…ఉరుకుల పరుగుల జీవితానికి ఉరట, తన సంపాదనే కానీ తన గురించి పట్టించుకొనే వారు లేరనే వ్యధతో ,సంఘర్షణతో సతమత మయ్యే మనసుకి సాంత్వన ,ఒక ఆలంబన కోరుకున్నపుడు మనసు లతలా ఎదుట కనిపించిన ఆధారానికి అల్లుకు పోవడం సహజం .అది అందమైన పందిరా లేక బ్రహ్మజెముడు ముళ్ళ కంచా అన్నది దానికి అనవసరం..ఈ రెండు ఒకే రకమైన ఆలంబన అవుతాయి ఆ లతకి . చూసేవారి మనసులోఅన్ని రకాల భావాలు సుడులు తిరుగుతాయే కానీ అనుభవించేవారికి తేడాలు తెలియవు… ఏవో….. ఏవో ద్వంద ఆలోచనలు,భావాలు మనసులో సుడులు తిరుగుతుంటే ,

మబ్బు మబ్బుగా ,మసక మసకగా ,ముసుకు పోతున్న కళ్ళముందు సుదూరాన ఆకుపచ్చ వలువను ధరించి,పలుచని పొగమంచు మేలి ముసుగులో ఒక అందమైన ప్రక్రుతి కాంతలా దర్శనమిస్తున్న సుదూర పర్వత శ్రేణులు ..

అవే ..అవే ..దూరపు …కొండలు ……

*****

  

Please follow and like us:

2 thoughts on “కథా మధురం-దూరపు కొండలు (ఉమ అద్దేపల్లి)”

  1. దమయంతి గారూ అద్దేపల్లి ఉమ గారి కథ ను చాలా బాగా పరిచయం చేశారు. కథ చాలా బావుంది. మీకు, ఉ గారికి అభినందనలు

    1. హలోండీ, ఉదయలక్ష్మీ గారు. ఎలా వున్నారు?
      చాలా థాంక్సండి, అద్దేపల్లి ఉమ గారి దూరపుకొండలు కథా పరిచయం మీకు నచ్చినందుకు!
      కథ చదవంగానే నాకు భలే నచ్చేసింది. అందుకే ఇక్కడ నా శీర్షికలో ఎంచుకోవడం జరిగింది.
      మంచి రెస్పాన్స్ వచ్చింది – కథకి.
      అడగంగానే కథ ని అందచేసిన ఉమ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
      కథామృతాలు లో కథలన్నీ చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలను అందచేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను.
      శుభాకాంక్షలతో..

Leave a Reply

Your email address will not be published.