చిత్రలిపి

-ఆర్టిస్ట్ అన్వర్ 

ఎవరు ఎవర్ని చంపారు? ఎంత వాతావరణ కాలుష్యం నింపారు? మనకున్న మూడు వందల అరవై ఐదు రోజులకు మూడు వందల అరవై అయిదు పండగలు వచ్చినా  ఈ దరిద్రం ఎప్పటికీ వదిలేది కాదు కాని వినండి.

నాకు తెలిసి దీపావళి పిల్లల పండగ. నేనూ  ఒకప్పుడు పిల్లాడిగా ఉన్నా కదా! నాకు తెలీదా ఏం మా పిల్లల సంగతి ? తిక్క స్వామి ఉరుసుకోసం, రంగులు చల్లుకునే ఉగాది కోసం, హసన్ హుసన్ ల పేగులు మెళ్ళో వేసుకునే మోహర్రం కోసం,  రివాల్వర్ ఓపన్ చేసి రీలు చుట్టి వజ్రాలు దొచుకు పోయే దొంగలని వెంటాడటానికి డిషామ్ డిషామ్ పేల్చుడు తుపాకి కోసం దీపావళి పండగ దిగి రావడానికి గుమ్మం దగ్గర అర చేతుల్లో గడ్డం ఉంచుకుని మరీ వేచి చూసేవాణ్ణి. ఒక్క తుపాకీతో తప్ప మరే బాణాసంచాతోనయినా నాకు  పేచీయే!

 మాది ఉమ్మడి కుటుంబం.  మా చిన్నాయన అందరి కోసం సంచులు సంచులుగా టపాసులు తెచ్చేవాడు. మా ఇంటి చిన్నా పెద్దా మొత్తం తెగ కాల్చేవాళ్ళు.  ఇంటి ముందుకు వచ్చిన పిల్లలందరికి మా జేజి తలా ఇన్ని పంచి పెట్టేది. మా కడమ చిన్నాయన అయితే వంకాయ బాంబులు, లచ్మి బాంబులు జేబుల్లో నింపుకుని సిటీబస్ ఎక్కి  తాగుతున్న సిగరెట్ తో వత్తి చివర కాలేదాక ఆగి ఆ స్ప్లిట్ సెకండ్లో బాంబు బయట పడేసేవాడు. ఆయన పూర్తిగా మగతనం టైప్. .

 ఇంట్లో పిల్లల ఖాళీ పాలడబ్బాల కింద బాబు పెట్టి వెలిగించడం గొప్ప సరదా. డబ్బా డమాలున ఎగిరి దాని బతుకు నిజంగా డబ్బా అయ్యేది. నేను మహా భయరిని! చేతులు ఎప్పుడు చెవులకు కరిపించి పెట్టుకునేవాన్ని. దీపావళి రాత్రి గడిచాకా ఉదయమే లేచి ఇంటి ముందు తుస్సు బోయిన బాంబులన్ని ఏరుకుని వాటిని లొత్తల కింద పిసికి  ఆ కారిన మందును ఒక కాగితంలో నింపి కాగితం చివర మంట అంటించి తదుపరి ఏఁ జరుగుతుందో అని నా క్యూరియాసిటి అంతా కాగితం పై తలవాల్చింది. మందు రవ్వ చుర చుర లాడుతూ సరసర పాకింది ముందు పొగ ఆ తరువాత పొట్టేలు తలకాయ నిప్పుల మీద కాలుతున్నపుడు వచ్చే కమ్మటి కమురు వాసన. ఎంత బావుందో! ఆ తరువాత నా కళ్ళు బుగ్గలు చర చర మండాయి. కాలింది పొట్టేలుది కాదు , నా తలకాయ్.  ముందు కనుబొమలు కాలిపోయాయ్ ఆ పై నుదుటిపై జుట్టు అంతా కాలిపోయి ఆ చివర్లు ఆఫ్రికన్ వాడికి మాదిరి రింగులు. ఏల ఇదంతా అంటే బాంబులు కాల్చడం అంటే భయం కొద్ది.

మరి ఇలాంటి  ఢమాల్ బాల్యం  కృష్ణుడికి మిస్ అయి పోయిందేనని నాకు ఎప్పుడు బెంగ గా  ఉంటుంది. ఎప్పుడు దీపావళి వచ్చినా ఇది చిన్ని కృష్ణుడికి పాత్రం లేని పండగ అయిపోయిందే  అని జాలి . అందుకే తననూ, దీపావళిని పాత్రలు చేసి కార్టూన్ వేస్తాను. నా చిన్నప్పుడు నా కోసం మా మేనత్తలు, మా పిన్ని గార్లు  టపాకాయలు కాల్చినట్లు . కృష్ణుడు మాత్రం నా కన్నా ఏమాత్రం ధైర్యవంతుడు అయి ఉంటాడు? వాళ్ళ అమ్మ మాత్రం కిష్ణుడి కోసం విల్లు ఎక్కు బెట్టి స్టాండర్డ్ కంపెనీ వారి రాకెట్ వదిలి ఉండదా? ఇదంతా ఊహా, అందమైన ఇమాజినేషన్, చక్కని చిత్రకళ. మీ అందరి తరపున కన్నయ్యకు దీవాలి విషెస్ అండ్ లవ్స్ – అన్వర్.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.