జ్ఞాపకాలసందడి -3

-డి.కామేశ్వరి 

నాకు  మా వారి వల్ల వచ్చినఒక మంచి అలవాటు ఇంటిఖర్చుల పద్దురాయటం. ఇపుడు మంచి అలవాటు అని వప్పుకుంటున్నాగాని  ఆయన వున్నపుడు చచ్చినా రాయలేదు. ఆయనకి, నాకు ఎప్పుడు ఒక గొడవ ఉండేది. నాకు ఇంటిఖర్చుకింద డబ్బు ఇవ్వాలి, అదెలా ఖర్చు పెడతానో నా ఇష్టం. మీకు మూడుపూటలా తిండిపెట్టడం నా వంతు. ఇచ్చిందాంట్లో మిగిలిందో, దీనికెంత దానికెంత అని అడగొద్దు అనేదాన్ని.

ఆయనగారి గవర్నమెంట్ ఆఫీస్ బుద్ధి  నా దగ్గరచూపిస్తూ ముందు నేను నోట్ ఫుట్ అప్ చేస్తే ఆయనగారు ఎప్రూవ్ చేసి శాంక్షన్ చేసేవారు. అంటే పాలకింత, కూరలు, పనిమనిషి, సరుకులు, చాకలి, పేపర్, చిల్లరఖర్చు అంటూ లెక్కరాసి ఇస్తే అందులో కటింగ్లు  పోగా శాంక్షన్ చేసి రిలీజ్ చేయడం. నాకయితే తిక్క రేగి, అసలు నాకెందుకు డబ్బీయడం అన్నీ   మీరే చూసుకుని సామానులు, కూరలు తెచ్చి పడేస్తే వండుతా అనేసా.

అబ్బే, మళ్లీ  అలాచేస్తే నౌకర్లూ, చాకర్లు ఊరువాడా చాటరా!

“అంత ప్లానింగ్ ప్రకారం ఉండకపోతే మనకొచ్చే జీతాల్లో ఏం బతకగలం? బంగళాలు, బంట్రోతులు, గార్డెన్లు , జీపులు వగైరా అట్టహాసం తప్ప జీతాలు తక్కువే” అంటూ ఏదో చెప్పి మొదటినించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తనదగ్గరే  పెట్టుకుని , ఆడదానిచేతిలో డబ్బు మగాడి చేతిలో బిడ్డ పెరగరట అని ఓ సామెత చెప్పి, ఈ డబ్బు గోల నాకెందుకు సుఖంగా నిశ్పూచీగా బతకకుండా అని అనుకునేట్టు చేసారు.

అంతటితో వదిలారా ఇచ్చిందానికి మళ్లీ అకౌంట్ రాయాలంటే వంటికి కారం రాసుకున్నట్టు ఏ పెళ్ళానికి ఉండదు. ఇంతోటి డబ్బుకి అణా పచ్చిమిర్చి, అర్ధనా కరివేపాకు అంటూ  ఎకౌంట్ ఒకటా! నా మొహం చూసి కాస్త తగ్గి, “పద్దు ఎందుకు రాయాలంటే ఏది ఎంత పెట్టి కొన్నాం. ఇప్పుడెంత, గ్రైండర్ ఎప్పుడు బాగుచేయించామ్, గ్యాస్ ఎప్పుడొచ్చింది, బియ్యం కిందటేడాదికి ఇప్పటికి ఎంతపెరిగింది. పండగకి బట్టలకి కిందటేడాది కంటే బడ్జెట్. ఎంతపెరిగింది కూలర్పంపు ఎపుడు మార్చాము, పనిమనిషి జీతం ఎంత ఎపుడు పెంచాం, వంటింట్లో సింక్ ఎప్పుడు బాగుచేయించామ్. మూడేళ్ళక్రితం  సున్నాలు వేయించినప్పటికంటే ఇప్పుడెంత పెరిగింది… అన్నీ  కాగితాలు వెనక్కి తిప్పి చూస్తే. తెలియాలంటే లెక్క రాయాలిట.

నన్ను కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా వంటయింటి ఖర్చు తప్ప నేనేం పట్టించుకోలేదు. ఆయన పోయాక ఖర్చంతా నేనే చూసుకోవాలి కదా అప్పటి నించి నెలనెలా లెక్కలు రాస్తున్నా. ఇపుడు నిజం చెప్పాలంటే ఇలా రాయడం వల్ల మూడేళ్ళక్రితం hospital ఖర్చు చూసా ఇంటికి రాగానే, అలాగే కూలర్ పంప్ ఎప్పుడేయించా, పిల్లల కి ఎప్పుడెప్పుడు ఏమిఇచ్చా, మెడికల్ ఇన్సూరెన్ ఎంతపెరిగింది…ఇలా నా లాటి మతిమరుపు మనుషులు రాసి పెట్టుకోడం లెక్కలు మైంటైన్ చేయడం అవసరమే అని అర్ధం అయింది. అపుడు తిట్టుకున్నా. ఆయన అంత ప్లాన్ గా  అన్ని చూసుకోబట్టి గదా ఈ రోజు ఇంత నిశ్చిన్తగా సుఖంగా బతుకుతున్నా.

ఆయన ఒక మాట అనేవారు, “మనం ఎప్పుడు ఇదే లెవెల్ మెంటైన్ చెయ్యాలంటే ప్లానింగ్ ఉండాలి. ఉన్ననాడు తగలేస్తే, లేనినాడు ఎవరు ఇవ్వరు అనేవారు.”

ఏమిటో  పాపం మొగుళ్ళు మంచి వారే మనమే సరిగా అర్ధం చేసికోమ్.  “పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు”. ఉండగా చెడు అర్ధమయినంత తొందరగా మంచి అర్ధంకాదు గదా!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.