పునాది రాళ్ళు-4

డా|| గోగు శ్యామల 

కోదురుపాక గ్రామంలో పోరాటాలు సాగుతున్నాయి. వాటికీ ఆ గ్రామ ప్రజలే నాయకత్వం వహిస్తున్నారు. ఎం ఎల్ పార్టీ పరోక్షంగా  సలహాలు ఇస్తూ రాజకీయ మద్దతు ఇచ్చినప్పటికిని పోరాటంలో ముందు భాగాన గ్రామస్తులే ఉన్నారు. ఆలా ఉన్నవారిలో చిట్యాల చినరాజవ్వ ఒకరు. ఈమెతో పాటు ఇతర దళిత మహిళలు పురుషులూ ఉన్నారు. వారే మాదిగ  బానవ్వా , మాదిగ కనకవ్వ, కుడుకల దుర్గయ్య తదితరులున్నారు.

 1970 నుండి 1980వరకు గల దశాబ్దంలో ఉదృతంగా, వైవిధ్యంగా నడిచిన ఈ  పోరాటాలను కుదురుపాక ఉద్యమాలని అంటారు. ఇదే తరహాలో ఆయా ఊర్లలో, తాలూకా కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లోనూ  నడిచిన పోరాటాలను ఆయా ప్రాంత పేర్లతో ప్రత్యేక పోరాటాలుగా ప్రసిద్ధి చెందినాయి. నాటి ఉద్యమాల గూర్చి రాసిన పుస్తకాల్లో, పాటల్లో కవితల్లో వాటిని  పేర్కొనడం కనిపిస్తుంది. సిరిసిల్లాలో జరిగిన పోరాటాలని “సిరిసిల్ల చీమల దండు” అనీ, “జగిత్యాల జైత్ర యాత్ర “అనీ , “కరీంనగర్ కత్తుల వంతెన” అని పేర్కొనడాన్ని గమనించాలి. ఈ ప్రాంతంలో నడిచిన భూస్వామ్య వ్యతిరేక పోరాటాలకు మరియూ ఇదే దశాబ్దంలో దేశంలోని  ఇతర రాష్ట్రాల్లో, పట్టణ కేంద్రాల్లో జరిగిన దళిత , స్త్రీవాద పోరాటాలకు కుల పితృస్వామ్యాదిపత్య వ్యతిరేక నిరసన అనే పోలిక, సారూప్యత అంతర్లీనంగా ఉన్నదనే చెప్పాలి.

అంతే కాక ఈ దేశంలో ఈ దశాబ్దానికి  ఒక ప్రత్యేకత లేకపోలేదు. మరచిపోలేని ఎమర్జేన్సీ ఒకటైతే,  విశాలాంధ్ర పాలనను నిరసిస్తూ 1969సం,,లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంకై  నడిచిన తొలిదశ పోరాటం ఇంకోటి. 1972 సం,,లో మధుర అనే యుక్త వయసు ఆదివాసీ యువతి ఫై జరిగిన కస్టోడియల్ రేప్ కు   నిరసనగా దేశవ్యాపితంగా స్త్రీల హక్కుల పోరాటాలు ముందుకు రావడం మరొకటి. ఈ అన్ని పోరాటాల్లో భాగంగానే ఉత్తర తెలంగాణలో నడిచిన భూస్వామ్య వ్యతిరేక నక్సల్బరీ ఉద్యమం నడిచింది. దీనిని  గోదావరిలోయ రైతాంగ పోరాటంగా పేర్కొంటారు. ముందు చెప్పినట్లుగా ఈ పోరాటాన్ని ఎం ఎల్ పార్టీ నడిపింది. ఈ అనుబంధ సంఘాల్లోనే రైతుకూలీ సంఘం ఒకటి ఏర్పాటు చేయబడింది. దాని నాయకురాలే కుదురుపాక రాజవ్వ.

     మన్వాడ  మాదిగ వాడా, సిరిసిల్లా తాలూకా , కరీంనగర్ జిల్లా, ప్రస్తుతం రాజన్నసిరిసిల్ల జిల్లాలో  ఎల్లమ్మ లింగయ్య దంపతులకు రాజవ్వ జన్మించింది. 80వ దశకం నాటికీ ఈమెకు 49 లేదా 50 సం. లు కావచ్చు. ఈమెకు రాజయ్య నర్సయ్య అనే ఇద్దరు అన్నలు  పోచయ్య అనే తమ్ముడు ఒక అక్క ఉన్నారు. పదేళ్ళ ప్రాయంలో మేన భావ పదిహేను సంవత్సరాల చిట్యాల చిన్నమల్లయ్యతో వివాహాం జరిగింది. మల్లయ్య కూడా మాదిగ కమ్మూనిటీ మరియు భూమి లేని వ్యవసాయ కూలి కుటుంభంలో జన్మించాడు.  తల్లిగారి ఊరు మన్వాడకు అత్తగారి ఊరు కుదురుపాక మూడు కిలోమీటర్లు నడ్సుకుంట పోయేది, నడ్సుకుంట వచ్చేది.

 ఊరిలోనే కాదు మొత్తం రాష్ట్రంలో ముక్యంగా తెలంగాణాలో ప్రతి పల్లెలో లాగానే, మల్లయ్య పసి ప్రాయం నుండే  వెట్టిమాదిగ బాల జీతగాడుగా పోలీస్ పటేల్ దగ్గర జీతం ఉన్నడు. తెలంగాణలో చాలామంది మాల మాదిగ పొరలు మీసం కట్టు మొలవక ముందే దొరలదగ్గర జీతాలుండుఁడు ఆనవాయితీగా నడిచేది. సరిగ్గా ఇక్కడి ఈ పిల్లల జీవితాలనుండే ” పల్లెటూరి పిల్లగాడా పసుల గాసే మొనగాడా పాలు మరచి ఎన్నాళ్ళయిందో/ ఓ ….. పాలబుగ్గల జీతగాడా కొలువు కుదిరి ఏన్నాళ్లయిందో ”అనే పాట పుట్టుకొచ్చిందీ. ఈ కోవకు చెందిన వెట్టి బాల బాలికల కధలు, సామెతలు  కోకోల్లలు. వెట్టి అంటే వేతనం ఆశించకుండా నిరంతరం శ్రమ చేయాలి, బతికున్నంత కాలం కూలీ అడిగి తీసుకోకుండా శ్రమ చెయ్యాలి అనేది దాని అర్థం. వెట్టి సంఘటనలను కథల ఉదాహారణలుగా వచ్చే సంచికలో వివరించే ప్రయత్నం చేస్తాను. రాజవ్వ పెనిమిటి మల్లయ్య పోలీస్ పటేల్ దగ్గర ”యాడాదికి మానెడు జొన్నలు” కోసం పాలేరుగా ఉన్నాడు. జీతగాడిగా కొనసాగుతున్నపుడే గ్రామ ఆనవాయితీగా సాగుతున్న బాల్యవివాహాం వీరికి జరిగింది. ఇక రాజవ్వ కూడా దొర గడీల, పొలముల వెట్టికూలీగా చేయడం తప్పని సరి.  వీరికి పుట్టున కొడుకులు బాండెడ్ చైల్డ్ లేబర్ పని చేశారు. చిట్యాలోళ్ళ కుటుంబమే కాదు ఊరులోని ప్రతి కమ్మూనిటీ, ప్రతి కుటుంబం, ప్రతి మనిషి దొర దగ్గర పని చేయాల్సిందే. ఈ రకమైన నిర్బంధపు శ్రమ దోపిడీ కొనసాగడం వల్లనే వారిని పిలిచే విధానం భాషలోకి కూడా వచ్చేసింది. అదే వెట్టి మాదిగోళ్ళు, వెట్టి మాలోళ్లు, వెట్టి కమ్మరోళ్లు, వెట్టి మందలోళ్లు, వెట్టి నాగళ్లు అని. వెట్టి మాలలు అంటే నీరు పారించే తమ నైపుణ్యమ్ తో వందలాదిగా ఉన్నదొరల పొలాలకు నీరు పారించే నిరేటి పనిని ఉచితంగా చేసి పెట్టడం.  వెట్టి కమ్మర్లు తాము తయారు చేసిన నైపుణ్యాత్మక వ్యవసాయపు ఇనుప పనిముట్లను దొరలకు ఉచితంగా ఇవ్వాల్సిందే. గొల్లకుర్మవాళ్ళు తమ గొర్ల మందలను దొరల పొలాల్లో ఎరువు కోసం ఉచితంగా ఆపాల్సిందే. ఈ అంశాన్నే కే. శ్రీనివాసులు తన వ్యాసంలో ” వెట్టి విధానం మాల మాదిగలతోనే కాకుండా చేతి వృత్తి ఉత్పత్తి కళా కమ్యూనిటీల్లోకి కూడా విస్తరింప చేయడం జరిగింది. అది గౌడులు అయితే దొర కుటుంబానికి ఉచితంగా కల్లు సరఫరా చేయాలి. కుమ్మర్లు కుండలను ఇవ్వాలి. మంగళీలు ఉచితంగా సౌరం చేయాల్సిందే” అని పేర్కొన్నాడు మిగితా ఉత్పత్తి కమ్మూనిటీలు అన్ని తమ తమ ఉత్పత్తులను ఉచితంగా ఇవ్వడం డోరా స్వామ్యం జారీచేసిన ఓ ఫర్మాణ.  ఒక్క మాటలో చెప్పాలంటే మానవ సమాజ మనుగడ కోసం గ్రామ కేంద్రంగా తరతరాలుగా నిర్మాణమైన వృత్తి ఉత్పత్తి నాగరిక సంపదను అసాంతం తమ కుల వర్గ ఆధిపత్య గడీలు, పొలాలకు మళ్లించడం ద్వారా తమ అధికారాన్నినిలబెట్టుకున్నారు. ఈ మొత్తం వ్యవస్థకు వ్యతిరేకంగా నిలబడుతున్నాననే విషయం రాజవ్వకు తెలిసినా తెలువకపోయిన తానూ దైర్యంగా నిలబడింది.

      స్వాతంత్య్రానికి ముందు గ్రామాల్లాగానే  1970లలో కూడా తెలంగాణలోని గ్రామాలూ దొరల పాలనలోనే ఉన్నాయి.  ఎవరీ దొరలూ ఏమి ఈ గడీలని చూస్తే, ఆధునికంలో ఆధునిక దొరలు. పైన వివరించినట్లు  అందరిచే వెట్టి విధానాన్ని అమలు చేస్తూనే వేలాది ఎకరాల ప్రజల భూములను కూడా చట్ట విరుద్దంగా కబ్జా చేశారు.  ఈ దొరలంతా వర్ణాశ్రమ నిచ్చెన మెట్ల కులవ్యవస్థలో అగ్రభాగాన ఉన్న కులాలకు చెందినవారే. అవి వెలమ, దేశముఖ్, రెడ్డి కులాలు. వీరిని హిందూ అగ్రకుల భూస్వాములని  అనవచ్చు.  

*****

Please follow and like us:

3 thoughts on “పునాది రాళ్ళు-4”

Leave a Reply

Your email address will not be published.