రమణీయం

మనకోసమే!

-సి.రమణ 

ట్రాఫిక్ నిబంధనలున్నది మనకోసమే. ఐతే, అవి మనకోసం అని, మనకు తెలియదు. అందుకనే మనం వాటిని అసలు పట్టించుకోము. కూడళ్ళ వద్ద వుండే ఎరుపు, ఆకుపచ్చ దీపాలను, చాలసార్లు గమనించకుండా, గుడ్డెద్దులాగా ప్రవర్తిస్తాము. కూడళ్ళ వద్ద రంగుల దీపాలతో పాటు, పోలీస్ వుంటేనే, మనం బాధ్యతకల పౌరులవలె ప్రవర్తిస్తాము. సెల్‌ఫోన్ మాట్లాడుతూ, వాహనం నడపటం, మత్తు పదార్థాలు సేవించి వాహనం నడపడం, పాదచారులు కూడా సెల్‌ఫోన్ లో మాట్లాడుతూ రోడ్ దాటడం వంటివి చేస్తూ  ప్రమాదాలకు గురవుతున్నారు; తోటి ప్రయాణీకుల, ప్రమాదాలకు కారణమవుతున్నారు. 

మనం, ద్విచక్ర వాహం నడుపుతుంటే, పాదచారులను, కార్లు, బస్ లు  నడిపేవారిని తిట్టుకుంటాము, బొత్తిగా ట్రాఫిక్ సెన్స్ లేదని. అదే, మనం కారు నడుపుతుంటే, ద్విచక్ర వాహనదారులను, బస్, లారీలను నడిపే వారిని తిట్టుకుంటాము. అంటే, మనం సక్రమమైన వాళ్ళమని, ఎదుటివారు మాత్రమే తప్పుచేస్తుంటారనే దురభిప్రాయంలో వుంటాము.

ఎప్పుడూ, ఎవరో ఒకరు, మనకు, సరైన వేగంతో వెళ్ళండి, సరైన దిశలో ప్రయాణించండి, సరైన పద్ధతిలో వాహనం నడపండి, అని సూచనలిస్తూ వుండాలా? చిన్నప్పటినుండి, రహదారులు, నిబంధనలు, ప్రయాణాలు అన్నీ చూస్తూనే వున్నాముగా! బాల్యంలో పాఠశాలకు, పెద్దవాళ్ళమయ్యాక కళాశాలలకు నడుస్తూనో, వాహనం మీదనో, ప్రయాణిస్తూనే వున్నాముగా. ఐనా సరే, నేర్చుకోము. ఇంకెప్పుడు నేర్చుకుంటాము? ఎవరూ మనలను గమనించకపోతే, నిబంధనలను ప్రక్కకు నెట్టి, కళ్ళెం లేని గుర్రం లాగా పరుగులు తీస్తాము. 

ఒక్కోసారి మనం వెళ్ళవలసిన దారి తెలుకోవలసి వుంటుంది. అప్పుడు సరిగ్గా రహదారి మధ్య ఆగి, దారిన పోయేవారిని ఆపి, వివరాలు చెప్పి, ఎలా వెళ్ళాలో అడుగుతాము. నడిచేవాళ్ళం ఐనా, వాహనం నడుపుతున్నా ఇదే పద్ధతి అందరిది. ఒక పక్కగా నిలబడికాని, ప్రయాణిస్తున్న వాహనం, ప్రక్కగా ఆపి, దిగి అడిగి తెలుసుకోవచ్చుకదా! ఇదేం మర్యాద? మనం వాహనం దిగం. ఇతరులను ఆపి ఇబ్బంది పెడతాం. మన వెనక నుంచి వస్తున్న ఇతర వాహనాల హారన్లు మన చెవిన పడవు. పడినా, వారే ఆగుతారులే, నా పని ముఖ్యం అని అనుకుంటాము. అయినా మనం దారిన పోయేవారిని కాకుండా (వారు కూడా మనలాంటి ప్రయాణీకులే కావచ్చు) పక్కనవున్న దుకాణదారులను అడగటం వలన మన పని సులువవుతుంది. 

కొందరు వేగంగా వాహనం నడుపుతూ, అదే పనిగా హారన్ మోగిస్తూ, అందరిని తప్పుకోమని హెచ్చరిస్తున్నట్లు హడావుడి చేస్తుంటారు. అటువంటి హెచ్చరిక చేస్తూ అందరిని అటూ, ఇటూ పంపించే హక్కు, సాధారణ పౌరులకు లేదు. అంబులెన్స్ కూ మరియు అగ్నిమాపక వాహనానికి మాత్రమే అటువంటి హక్కు వుంటుంది. ఇక మోటార్ సైకిల్ తో, వివిధ రకాల విన్యాసాలు చేస్తుంటారు మరికొందరు, సర్కస్ వారిని మించిపోయి. అది ఎంత అపాయకరమో చూసేవారికి తెలుస్తుంటుంది.  సర్కస్ విన్యాసాలతో, తోటివారిని ఆకర్షించాలనా లేదా అలా చేయటం హీరోయిజం అని భ్రమిస్తున్నారా? కాని, రహదారిపై, వింత వింత చేష్టలు చేస్తూ, ఇతరులకు ఇబ్బంది కలిగించటం, ఎంతవరకు సబబు? నాకైతే, అటువంటి వారు, సర్కస్ లోని బఫూన్ లా కనపడతారు.         

మనం వాహనం లో ప్రయాణం చేసేటప్పుడు రోడ్ దాటేవారికి ముఖ్యంగా పిల్లలకు, వృద్ధులకు, స్త్రీలకు ప్రాముఖ్యత ఇవ్వాలి. జంతువులు రోడ్ దాటుతుంటే తప్పనిసరిగా ఆగుతాం; తొందరపడితే మనకే ప్రమాదం కనుక. అదే మనుషులు దాటుతుంటే మనం తొందరపడతాం; ప్రమాదం వారికి కనుక. అంతే కాకుండా జీబ్రాగీతలు వున్నచోట పోలీస్ పర్యవేక్షణ లేనప్పుడు, మన వాహనం ఒక క్షణం ఆపి, అటూ, ఇటూ చూసి  ముందుకు కదలాలి.

ఇక సందు మలుపులలో నిలబడి బాతాఖాని కొట్టేవాళ్ళు, సెల్ ఫోన్ మాట్లాడే వాళ్ళ సంగతి సరే, సరి. కాస్త తప్పుకోండిరా బాబు అని మనం హారన్ ఇస్తే, వారి సంభాషణలకు అంతరాయం కలిగించామని మన వంక కోపంతో, గుర్రుగా చూస్తారు. అపసవ్య దిశ లో వచ్చే వాహనాల గురించి, వాటి వేగం గురించి మాట్లాడాలంటే…….. అపసవ్య దిశలో వచ్చే వాహనాలు వేగంగా వస్తాయి. ఎందుకంటే, గబుక్కున వాటి గమ్యం చేరితే, ఇతరులకు ఇబ్బంది కాదు అని వారి భావనై వుంటుంది. అంటే, అలా రావటం తప్పు అని వారికి తెలుసు. ఐనా, కొద్దిదూరమే కదా అని వచ్చేస్తారు. కాని, అదే, అత్యంత ప్రమాదకరమైన విషయం. అసలే అపసవ్య దిశ, ఇంకా అతివేగం. దీనివల్ల రోజూ, ఎన్నో ప్రమాదాలు చూస్తున్నాము, వింటున్నాము. అపసవ్య దిశ లో రావటం పూర్తిగా నిరోధించుకోవాలి, మనకు మనమే.  ఇంట్లో ఆలస్యంగా బయలుదేరి, రోడ్ మీదకు రాగానే, వేగంగా గమ్యం చేరాలనే, మన అర్థం లేని ఆరాటం ఎప్పుడు మారేను?    

ఎక్కడికైనా ఆలస్యంగా వెళ్ళినప్పుడు, ఏవిటి ఇంత ఆలస్యం అని అడిగితే ఎవరైనా సర్వదా సిద్ధంగా ఉన్న సమాధానం ట్రాఫిక్ జాం. ప్రతి ఒక్క ప్రయాణీకుడు దీనికి బాధ్యుడే. ఎవరికి వారు ముందుగా వెళ్ళాలనే వింత మనస్తత్వం మనకే వుంటుంది. అందుకే, తరచూ ట్రాఫిక్ జాం అవటం. మన జనాభా సంఖ్య ఎక్కువ. సరే!! మన రహదారులు గుంటలమయం. ఐతే? అడ్డదిడ్డంగా, ఇష్టానుసారం వాహనాలు నడిపి నడిరోడ్డు మీద అరాచకం సృష్టించాలా? కాస్త నిదానంగా ఆలోచించి చూస్తే, మనకే అర్థమవుతుంది; తప్పెవరిదో. 

ఈ మధ్య కాలంలో టీనేజ్ పిల్లలవల్ల జరుగుతున్న ప్రమాదాలు పెరుగుతున్నాయి. కొన్నిసార్లు వాళ్ళు ప్రాణాలు కోల్పోవటం మరికొన్ని సార్లు ఇతరులను ప్రాణాపాయం లో పడేయటం. చూస్తుంటే, ఎటుపోతున్నారు మన యువతరం అనిపిస్తుంది. మత్తుపదార్ధాలు సేవించి బళ్ళు అతివేగంగా నడపటం, రోడ్ మీద రేసింగ్, ట్రాఫిక్  సిగ్నల్ పాటించకపోవటం, ఘోర ప్రమాదాలకు దారితీస్తున్నాయి. మొన్నామధ్య, మా వీధిలో, నలుగురు చిన్నపిల్లలు ఇద్దరు స్త్రీలు పుట్టినరోజు పండుగకు, వీధి చివరనున్న ఇంటికి వెళ్ళి తిరిగివస్తున్నారు. వీధిలో మధ్యనున్న ఇంటి గేట్ నుండి, సర్రున దూసుకొచ్చింది, వీరిమీదకొక కారు. ఒక పాప, కారు చక్రాల కింద పడి నలిగి పోయి, ప్రాణం విడిచింది, కన్నతల్లి కళ్ళ ముందే. అప్పటి దాకా పుట్టినరోజు పండగ గురించిన విశేషాలు, గల గలా మాట్లాడుకుంటూ తుళ్ళుతూ, గెంతుతూ, వస్తున్న ఆ పిల్లల కేరింతలు అకస్మాతుగా ఆక్రందనలుగా మారాయి. భయాందోళనలతో చెల్లా చెదురయ్యారు. కారు నడిపిన బాబు 16 ఏళ్ళ వాడు. డ్రైవింగ్ లైసెన్స్ లేదు. ఏం చెయ్యాలి? ఎవరిని నిందించాలి? తప్పు ఎవరిది? శిక్ష ఎవరికి? పాపను పోగొట్టుకున్న తల్లితండ్రుల క్షోభ ఎవరికి అర్థమవుతుంది? ఊపిరి వున్నంత కాలం,  ఆ బాధ గుండెల్లో గూడు కట్టుకునే వుంటుంది కదా. ఆ పాప చేసిన నేరం ఏవిటి? ఎంత మంచి జీవితం వుందో ముందు ముందు. జీవితం లో ఏమీ చూడకుండానే, ఏ ఆనందాలు పొందకుండానే,తమ ప్రమేయం లేకుండా అర్ధాంతరంగా అలా ఎందరో చిన్నారుల జీవితాలు చితికిపోతున్నాయి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. పిల్లలకు వాహనాలు ఇవ్వకండి, నిర్ణీత వయసు వచ్చేవరకు. లైసెన్స్ లేకుండా అసలు వాహనం ఇవ్వకూడదు; పిల్లలు ఎంత గోల చేసినా, బెదిరించినా. తల్లి తండ్రులారా, మన పిల్లలు చేసే తప్పిదాలకు మనమే బాధ్యులం.

మన స్నేహితులకు, కుటుంబ సభ్యులకు, తెలిసినవారికి, ఎవరికో ఒకరికి, ఎప్పుడో ఒకప్పుడు, రోడ్ ప్రమాదాలు జరగటం మనకు సహజ విషయంగా మారింది. కాని, మనలో విదేశాలకు వెళ్ళి వచ్చిన వారికి తెలుస్తుంది. ఇతర దేశాలలో ఎంత బాగా అనుసరిస్తారో ట్రాఫిక్ నియమాలను. అర్థరాత్రి అయినా సరే, అడవిలో అయినా సరే, రూల్ అంటే రూలే. చిన్నప్పటినుంచి ఆ క్రమశిక్షణ జీర్ణించుకుంటారు. మరి మనం? ఒక నిబంధన వుంటే, దానిని అనుసరించే, యోచన చెయ్యం.  కాని ఎన్ని విధాలుగా, అతిక్రమించవచ్చో ఆలొచిస్తాం. మన వ్యవస్థలో వున్న ఏ చిన్న లొసుగుని వదలకుండా, వినియోగించుకునే, తెలివితేటలు మనవి. అంతగా కలుషితమయ్యింది మన ఆలోచనా విధానం. 

ప్రభుత్వం ఎన్ని నిబంధనలు ప్రకటించినా, ఎంతగా శిక్షలు విధించినా మనలో కదా మార్పు రావాలి. ట్రాఫిక్ నిబంధనలు అనేవి మనకోసమే అనే అవగాహన మనకుండాలి. మన తోటి ప్రయాణీకులని ఏమాత్రం పట్టించుకోని, మర్యాద ఇవ్వలేని దౌర్భాగ్య స్థితి లోకి జారిపోతున్నాము.  నిబంధనల ఉల్లంఘన చేస్తూ దొరికిపోతే, పోలీస్ చేతిలో వందో, రెండు వందలో పెట్టి తప్పించుకుంటూ, దిగజారిపోతుంది మన యువత. పోనీలే, ఒక్కసారికేలే అని అపసవ్యదిశలో ప్రయాణించవద్దు. ఎవరూ లేరు కదా అని సిగ్నల్ వద్ద ముందుకు దూకవద్దు. ఒకసారి తప్పు చేస్తే, మనసు మళ్ళీ, మళ్ళీ చేయిస్తుంది  ఆ తప్పు మనతో. మనకో అంతరాత్మ వుంది కదా! దాని మాట విందాం. అది ఎప్పుడూ తప్పును ప్రోత్సాహించదు. ఇదంతా మనమీదేనర్రోయ్ అని అనిపిస్తుంది కదూ.  

భక్తులయితే అయ్యప్ప దీక్ష, భవాని మాత దీక్ష మరోటి, మరోటి, విద్యార్ధులయితే ఐ.ఐ.టి., ఐ.ఐ.ఎం. దీక్ష తీసుకున్నట్లు , మనమందరం ట్రాఫిక్ దీక్ష తీసుకుని మన ఆలోచనలను ప్రక్షాళన చేసి, మనకి మనం అన్ని నియమాలను, నిబద్ధతతో 100 రోజులు పాటిస్తే, నెమ్మదిగా రోడ్ ప్రమాదాలు తగ్గు ముఖం పడతాయి. మన వల్ల పది మంది బాగుంటే సంతోషమే కదా!  

అన్నీ మనమే చెయ్యాలా? ప్రభుత్వం ఏమీ చెయ్యదా?  అంటే ప్రభుత్వ పరంగా జరగవలసినవి వున్నాయి కొన్ని. పెరుగుతున్న ప్రజలకు, వారి అవసరానికి తగినట్లు , కొత్త రహదార్లు, ఫ్లైఓవర్లు విశాలంగా నిర్మించాలి. రహదారులపై పడుతున్న గుంటలు ఎప్పటి కప్పుడు పూడ్చాలి. తరచూ విదేశ విహారాలు చేసే, మన నాయకులు, అక్కడి సాంకేతికతను అనుసరించి, ఇక్కడకూడా పటిష్ఠమైన రహదారులు నిర్మిస్తే, మాటి మాటికి బాగుచేయవలసిన అవసరం వుండదు కదా. అసలు ట్రాఫిక్ పోలీస్ అవసరమే లేని, సిగ్నలింగ్ విధానం తీసుకు రావచ్చు; మన దేశంలో కూడా. అప్పుడిక పోలీసులు వుండరు, లంచాలు వుండవు, ట్రాఫిక్ జాం లు వుండవు, ప్రమాదాలు కనిష్ట స్థాయికి పడిపోతాయి. అద్భుతంగా వుంటుంది కదూ! అటువంటి రోజు వస్తుందని ఆశిద్దాం.

*****

(ట్రాఫిక్ చిత్రం రెడ్ పూల్ వారి సౌజన్యంతో-)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.