క”వన” కోకిలలు  :  ఆండాళ్ / గోదాదేవ

                 ( 9 వ శతాబ్దం )                          

-నాగరాజు రామస్వామి 

 

     ” నన్ను నా ప్రభువు చెంతకు చేర్చండి. ఆయన చరణ సన్నిధిలో కంపిత వీణా   తంత్రినై మిగిలి పోతాను.” 

     ” నా అంగాంగ రహస్యాక్షరాలను నా స్వామి అనువదించు గాక.”

      ” కృష్ణ సాన్నిధ్యంలో ఒక పాటగా ఆయనలో లీనమవడమే నా పరమావిధి.”

                                 – ఆండాళ్

ఆండాళ్ ( గోదా దేవి)  9 వ శతాబ్దపు మార్మిక ( Mystic ) కవయిత్రి. పన్నిద్దరాల్వార్లలో (పన్నెండుగురు) ఏకైక మహిళ. ఆమె పెంపుడు తండ్రి విష్ణు చిత్తుడు (ప్రియాళ్వార్) కూడా ఆల్వార్లలో ఒకరు. శైవ సాంప్రదాయంలో నయనార్లు ఎలాగో, శ్రీవైష్ణవ సాంప్రదాయంలో ఆళ్వార్లు అలాంటి వాళ్ళు. శ్రీమన్నారాయణ భక్తి ప్రపన్నులు. ఆళ్వార్లు ” దైవ ప్రేమ / భక్తి లోతులు ముట్టి ఆసాంతం మునిగిపోయిన వాళ్ళు”. తొలినాళ్లలో తమిళ “సంగం” కవిత్వ ఒరవడిలో పెరిగి, తుదకు మధురభక్తిని పుణికి పుచ్చుకున్న కవయిత్రి గోదా దేవి. ఆమె జన్మించిన కొన్ని శతాబ్దాలకు గాని ఆమెకు దైవత్వస్థాయి అబ్బలేదు.

        ఆండాళ్ దేవి దివ్య ప్రణయిని. ఆమెది అమేయమైన మధుర భక్తి. అనుపమాన కృష్ణానురక్తి. సాక్షాత్తు కృష్ణ భగవానునినే సశరీరంగా పరిణయమాడగోరిన దివ్యప్రపన్న.  ఆమె రచించిన ఆధ్యాత్మిక గ్రంథాలు రెండు. ఒకటి “తిరుప్పావై” ( నారాయణుని సాయుజ్యమునకు చేర్చు ” కృష్ణ పథము) ; భక్తి ప్రపత్తుల అపూర్వ రాగమాలిక. రెండవది “నాచ్చియార్ తిరుమొళి “( పరమాత్ముని పవిత్ర పాశురాలు ). ఆళ్వారుల తత్వచింతనల సమాహారంగా సంపుటీకరించబడిన 4000 పాశురముల ( పాటల) తమిళవేదం ” నాలాయిర దివ్య ప్రబంధం”లో గోదాదేవి రెండు గ్రంథాలు చేర్చబడినవి.          

          ఆమెది క్రీ. పూ 400 – క్రీ.శ 200  కాలపు సంగం కవిత్వ సాంప్రదాయానికి చెందిన పరోక్ష ప్రస్తావనల మార్మిక కవిత్వం. సంగం కవుల కవనం పైమెరుపుల వ్యామోహ శృంగారం నుండి ప్రణయజ్వరం( Lovesickness ) దాకా విశృఖలంగా విస్తరించింది. ఆ ఛాయలే ముఖ్యంగా ” నాచ్చియార్ తిరుమొళి ” లో ప్రతిఫలించాయి. ఆమెకు దేహం అంటే దేవాలయం. ఆమె కవితాభివ్యక్తి జయదేవుని “గీతా గోవిందం”ను పోలిఉంటుందని ప్రతీతి. అనిర్వచనీయమైన ఆమె ఆధాత్మిక చింతనాత్మక వేదన ఎల్లలుదాటిన పచ్చి శృంగారఅగ్నిపర్వతమై నాల్కలు చాస్తుంది. 

               పైకి మహిళా సహజాతమైన కామవాంఛను లౌకిక బాణీలో ప్రకటిస్తూ , లోన ఆధ్యాత్మిక లోతులలో పాదుకున్న ఆమె గుప్త  కవితలను అనువదించడం కత్తిమీది సాము. అందుకే, నిగూఢ తాత్వికత జోలికి పోకుండా, భౌతిక ప్రణయ కవితా సౌరభాలను లౌకిక ఛాయా పరిమితంగా ఆవిష్కరించే రీతిలో ఉన్న ఆంగ్లాను వాదాలకు  ఇవీ నా తెలుగు సేతలు :                                    

 

1 .     : మేఘదూతికా ! 

             ( Dark Rain Clouds Be My Messengers )                                                 

మేఘదూతికా ! 

వినీల గగనాలను కప్పుకున్న నేల మీద 

ఆణిముత్యాలను, నీటి పూసలను వర్షిస్తున్న 

ఓ కారునల్లని మేఘమా !

నింగి ముంగురులను చెరుపుతున్న 

గిరి తరువుల కొండమీద నెలవై ఉన్న 

వేంకటాచలపతి పంపిన 

ప్రణయ సందేశ మేదైనా కొనితెచ్చావా 

ఓ ఘనాఘనమా ?

కిందికి దూసుకొస్తున్న నీలి నీడలలో 

రేయి ఘనీభవిస్తున్న వేళ

నిదురరాని నేను 

ప్రణయాగ్నిలో రగులుతున్నాను .

నీ మెత్తని దక్షిణ పవనాలు 

వైవశ్య విరహ జ్వాలలను రేపుతున్నవి,

నేను మృత్యు చితిలో దగ్ధమవక ముందే 

వచ్చి రక్షించవా నన్ను 

ఓ ఉదార పయోధరమా !

 

2.     : కో కి లా ! :

                   ( To the Cuckoo ) 

 

చంపక పూల మధువులను గ్రోలుతూ 

మధుర స్వరాలను ఊదుతున్న ఓ మత్త కోకిలా !

ఎలుగెత్తి పిలువు కొండలరాయున్ని ! 

నిత్య నిట్టూర్పులతో కృంగి కృశించి పోతున్న నన్ను 

లెక్కచేయని స్వచ్ఛ మూర్తిని ! 

నా ఎద మీద దండెత్తిన ఆ ధవళ శంఖధారిని ! 

 

నా బొమికలు కరుగుతున్నవి 

నా తూపుల చూపులు కనురెప్పలను మూయకున్నవి, 

బాధల కల్లోల కడలి కెరటాల మీద ఎగిరేయబడుతున్న నాకు 

ఆ దివ్యధాముని తారణ్య నావ కనిపించకున్నది. 

తెలియనిదా నీకు ప్రియతముఁడు దూరమైన విరహ బాధ ? 

పిలువు ఓ పికమా ! 

గరుడ ధ్వజశోభిత  రథారూఢ స్వామిని ! 

 

ఈ దక్షిణ పవనాలు నన్ను చీల్చుతున్నవి, 

ఈ చంద్ర కిరణాలు నన్ను కాల్చుచున్నవి,

నా తోటలోని ఓ కోకిలా !

నీరసించిన నన్ను నీవు సైతం బాధించాలా ఏమి ? 

నీ పాటలకు స్పందించి 

జీవనజలాల మీద పవళించిన నా ప్రభువు 

ఈ రోజు రాకుంటే 

నిన్ను తరిమేయడం ఖాయం సుమా, ఓ పికమా ! 

 

 3.     : నేనో స్వప్నాన్ని కలకన్నాను  :

                 ( I Dreamed a Dream )

 

మిత్రమా !

నేనో స్వప్నాన్ని కలకన్నాను ;

కలలో అది నా పెళ్లి రోజు,

అతడు, 

ఆ సింహతేజ స్వరూపుడు !

ఆ వృషభ బలాఢ్య మాధవుడు !

విచ్చేశాడు సర్వాలంకృతుడై వివాహ మంటపానికి !

 

వేదికను అలంకరించింది వైదిక బృందం ;

దివ్యమేధా దేవుడు ఇంద్రుడు ఆధిదేవుడు !

నన్ను వధువుగా ప్రకటించి నాకు మధుపర్కాలు తొడిగారు, 

వరమాల నలంకరించి౦ది అంతరాత్మ దేవత. 

 

పవిత్రమైన దర్భలు పరచారు, 

ఋత్విజులు వేదమంత్రాలు పఠించారు, 

అతను, 

యుద్ధపుటేనుఁగు లాంటి అతను

శ్రావ్యవాయిద్యాలు, శంఖారావాలు మ్రోగుతున్న 

ముత్యాల పందిరి కిందికి వేంచేసి 

పాణిగ్రహణం చేశాడు, నా ప్రియుడు ! 

రాక్షస మధును సంహరించిన నా ప్రభువు ! 

సూర్య సంపన్నమైన అగ్ని శిఖల చుట్టూ  

మేము సప్తపదుల ప్రదక్షిణం చేశా౦. 

 

మిత్రమా !

నేనో స్వప్నాన్ని కలకన్నాను ! 

 

4 .   : మేఘ గీతికలు :

                  ( The Song to Rain Clouds )

విశాల ఆకాశంలో 

నీలిమేఘాలు వలువల్లా పరచుకున్నవి. 

ఓ అందాల ప్రభూ ! 

చెంగలించే ఈ చలువ స్రవంతులు 

ఎచటి నుండి వస్తున్నవి నీతో 

ఓ వేంకటగిరీశా ! 

జలపాతాల్లా చిందుతున్నవి నా కన్నీళ్ళు

నా వక్షాల మధ్య ;

నా స్త్రీత్వాన్ని వికలము చేసిన నీకు 

ఖ్యాతి ఎలా దక్కుతుంది నా స్వామీ ?

 

మించు అంచులను పొదుగుకున్న

ఓ మొయిలు రేఖా !

చెప్పు

ఎద మీద సిరిని పెట్టుకున్న వెంకటేశునికి 

నా సుతిమెత్తని వక్షద్వయం 

ఆతని తేజోమయ మేని స్పర్శకై తపిస్తున్నదని. 

 

నింగి శృంగాలను తాకుతున్న 

ఓ ఘనమేఘమా !

నీ అతివృష్టితో చెదరగొట్టు 

అద్రి మీది మధుభరిత పుష్ప మంజరులను,

చెప్పు హిరణ్యకశివున్ని చీల్చిన ఉగ్రసింహునికి  

నా కరిదంత కంకణాలను ఇచ్చేయమని.  

 

నా ముంజేతి గాజులు, 

నా ముఖ కాంతులు,

నా ఆలోచనలు, నా సుఖ నిద్రలు 

అన్నీ హరించబడినవి ;

గోవిందుని నామ సంకీర్తనంతో

ఎన్నాళ్లిలా సంరక్షించుకోవాలి జీవితాన్ని ?

ఓ దయామయ వలాహకమా !

 

ఓ శీతల ఘన నీరదమా !

కురిపించు పెనునీటి ధారలను వేంకటాద్రి మీద.

చెప్పు, 

మహాబలిని చంపిన నారాయణునికి; 

వెలగ పండును తొలిచే కీటకంలా 

తాను నాలోకి ప్రవేశించి, నన్ను తినేసి, 

నా శ్రేయస్సును అపహరించాడని 

నన్ను భయంకర వ్యాధిగ్రస్థను చేశాడని. 

 

మబ్బులారా! 

శంఖాన్ని పూరించి సంద్రాన్ని చిలికిన 

పద్మనయనుని చరణాల చెంత 

నివేదించండి ఈ సేవిక విన్నపాన్ని.

వేడుకొనండి నా కోసం 

ఒకే ఒక్క రోజైనా నాలో ప్రవేశించమని ;

నా వక్షోజాలకు అంటిన సిందూరాన్ని 

తుడిచేసి పొమ్మని;

నేను మరణించకుండా ఉండేందుకు. 

 

అదుగో! 

వర్షార్ద్ర మేఘాలు వల్లిస్తున్నవి 

కదన కౌశలుడైన నారాయణ నామాన్ని, 

అభ్రమా చెప్పు వెంకటనాథునికి ;

వర్షం తాకిడికి నేల రాలిన హరిత పత్రాల్లా 

ఏళ్లకు ఏళ్ళు గడచిపోతున్నవి వృధాగా 

ఎప్పుడు ప్రభువు నుండి 

అంతిమ పిలుపు వస్తుందోనని ఎదిరి చూస్తూ .

దివ్య ప్రణయిని  గోదాదేవి ! 

 Andal, the Poetess & the Goddess of Love !

 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.