తూర్పుగాలి: డా.భార్గవీరావు

-సి.బి.రావు 

 

బహుముఖ  ప్రజ్ఞాశీలి డా.భార్గవీరావు తెలుగులో ప్రసిద్ధి చెందిన రచయిత్రి, అనువాదకురాలు. ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పదవీ విరమణ చేసారు.  తరువాత పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో గౌరవ ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. గిరీష్ కర్నాడ్ గారి నాటకాలను తెలుగులో అనువాదం చేసి కేంద్ర, రాష్ట్ర సాహిత్య అకాడెమి పురస్కాలను అందుకున్నారు. కథలు, కవితలు,నాటకాలు, నవలలు, పెక్కు అనువాదాలు చేసి అన్ని సాహిత్య ప్రక్రియలలో కృషి చేసారు. ‘మ్యూజ్‌ ఇండియా’ పత్రికకు వ్యవస్థాపక సంపాదకురాలిగా పనిచేశారు. నూరేళ్ళ పంట – 20 వ శతాబ్ది తెలుగు రచయిత్రుల 100 రచనల సంకలనం, ఇంకానా! ఇకపై సాగదు (దళిత కథల సంకలనం), ముద్ర (కవయిత్రుల కవితా సంకలనం) మొదలగు సంపుటాలకు సంపాదకురాలు. పలు రచనలను తెలుగు నుండి కన్నడకు, కన్నడ నుండి తెలుగులోనికి, తెలుగు నుండి ఇంగ్లీషులోనికి అనువాదం చేశారు. భార్గవిగారి మాతృభాష కన్నడం. 2008 లో, డా.భార్గవీరావు మరణించారు.

ప్రస్తుతం పరిచయం చేస్తున్న నవల తూర్పుగాలి. భారత దేశపు యువతీ, యువకులకు అమెరికా ఒక కలల దేశం. ఎప్పటికైనా అక్కడికి వెళ్ళి, నాలుగు డాలర్లు సంపాదించి, భారతదేశానికి తిరిగి రావాలన్నది వారి ప్రగాఢమైన అభిలాష. ఐతే, వెళ్ళినవాళ్ళలో, ఎదో కొద్దిమంది, తిరిగిరావటంలో కృతకృత్యులైతే, ఎక్కువమంది పెక్కు కారణాలవలన అక్కడే ఉండిపోతున్నారు. తల్లితండ్రులు భారత్ రావటానికి మొగ్గు చూపినా అక్కడ పుట్టిన పిల్లలు, అక్కడి విద్యావిధానం, సంస్కృతి, వాతావరణానికి అలవాటుపడి, భారత్ కు సెలవులలో వచ్చినా, ఇక్కడి అశుభ్రత, వేడి వాతావరణం, దోమలు, లంచగొండితనం వగైరాలను చూసి బెంబేలెత్తి సెలవు పూర్తిగాకుండా మధ్యలోనే తిరిగి వెళ్తున్నారు.   

ఈ నేపధ్యంలో ఈ నవల మొదలవుతుంది. రచయిత్రి మాటలలో ఇందులోని కథ టూకీగా “ఐదేళ్ళలొ తిరిగి వచ్చేద్దామని అమెరికా వెళ్ళిన సుధాకర్, పద్మిని – అక్కడ ఇద్దరూ నిలదొక్కుకునేప్పటికే ఇద్దరు పిల్లలు – అనఘ, అనన్య. పిల్లల పెంపకం, సమాజంతో సర్దుబాట్లు, ఉద్యోగంలో సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులను తట్టుకోవడంలోనే కాలం గడిచిపోతుంది. మనదేశం తిరిగిరావాలన్న కోరిక సన్నగిల్లుతుంది. అనన్య తనతోటి డాక్టర్ ఇటాలియన్‌ను పెళ్ళి చేసుకుంటుంది. అనఘకు అమెరికా వచ్చిన తెలుగమ్మాయి ప్రీతి నచ్చుతుంది. పెళ్ళిచేసుకుని భారతదేశం వెళ్ళిపోదామంటే – ఒక్క ఐదేళ్ళుండి వెళ్ళిపోదాం అంటుంది. అమెరికన్ fastfood లాగా, ఇంగ్లీష్ ను నంజుకుని పరుగులు పెట్తూ నడిచే నవల. అమెరికాలోని భారతీయుల కథ – ఈ తూర్పుగాలి”. 

 మనలను చాల వేగంగా చదివింపచేస్తుందీ నవల. అమెరికా వెళ్ళివచ్చినవారికి సుపరిచితమైన ఎన్నో సంఘటనలు, అక్కడి సంస్కృతి, భాష, వాతావరణం, ఒకేలా అనిపించే పెక్కు నగరాలు, కొడుకు ఎక్కడ ఏ అబ్బాయిని తమకు కోడలుగా తీసుకు వస్తాడో అని భయపడే తల్లి తండ్రులు మనకు కనిపిస్తారు తూర్పుగాలిలో. ప్రపంచీకరణ, న్యూ యార్క్ నగరంలోని జంట శిఖరాలపై బిన్ లాడెన్ దాడి, తానా సభలు, India Abroad పత్రిక విశేషాలు, మన భారతీయ స్వాముల శిష్యగణం ఇంకా అక్కడి ఆధ్యాత్మిక వాతావరణం అన్నీ గోచరమవుతాయీ నవలలో. దూరపు కొండలు నునుపు. అక్కడి అబ్బాయిలు డాలర్లలో సంపాదిస్తారనే మోజులో పడి, సరైన విచారణ లేకుండా, జరిపించే వివాహాలు విఫలమవుతున్నాయిక్కడ. నిరుద్యోగ భయం ఇంకా వెంటాడుతూనే వుంది. అయినా అమెరికా వచ్చేవారు వస్తూనే వున్నారు. ఐదేళ్ళలో తిరిగి వెళ్దామనుకునేవారి కల కలగానే మిగిలిపోతుంది. 

చాల ఆసక్తికరంగా, వేగంగా నడిచే ఈ నవల అమెరికా జీవనవిధానానికి దర్పణం పడ్తుంది. నవలలోని ఒక పేజీలో అక్కడి consumerism పై వ్యాఖ్య ఇలా వుంది. “ఆఫీస్ నుండి ఇంటికొచ్చి mail ముందు పడేసుకుని కూర్చున్నాడు సుధాకర్. చాలవరకు junkmails ఏవో కొనమని, discount sale అనీ…..ఇంకొన్ని credit cards promotions…. అమెరికన్ ఎకానమీ అంతా credit system లోనే వుంది. 60 instalments, 0% interest అనేటప్పటికి సగం మంది ఏవైనా కొనడానికి తయారౌతారు. Consumerism అంటే ఇదే కాబోలు. మనకి అవసరం ఉందా లేదా అని ఆలోచించకుండా – అప్పుదొరుకుతుందనో, discount దొరుకుతుందనో, ఒకటి కొంటే రెండోది free అనో కొనేస్తుంటారు చాలమంది. కాని అమెరికాలో promote చేసినట్టు, ఇంత పెద్ద ఎత్తున ఖర్చుపెట్టి, glamourise చేసి అమ్మడం ఇంకెక్కడా వుండక పోవచ్చు. ఆ Victoria secrets catalogue ఎంత tempting గా వుంటుందంటే ఆ bra, panties వేసుకున్న ఆకర్షణీయమైన models వున్న pictures ని మగాళ్ళే దాచుకుంటారు. మరేం చేస్తారు -ఆ products వాళ్ళు వాడేది కాదు, అంత ఖరీదు పెట్టి తమ భార్యలకు కొనాలనిపించదు… అలా తిరగేస్తూ   చేతిలో India Abroad తీసుకున్నాడు సుధాకర్.

ఈ నవల లో అమెరికా జీవన విధానంపై కొన్ని jokes కూడా వున్నై. సుధాకర్, పద్మిని వాళ్ళింటికి వారి స్నేహితులు ప్రసాద్, గౌరి వచ్చినప్పుడు జరిగిన సంభాషణ ఇలా సాగుతుంది. గౌరి plateలో  సమోసాలు పెట్టుకుని వచ్చింది. “ఇవి చూడండి. ఎంత బావున్నాయో. Indian Store లో frozen సమోసాలు తీసుకొచ్చి వడియాల్లా వేయించడమే!” ” మీ ఆడవాళ్ళ పని చాల సులువయి పోయింది. నాలుగురోజులకొకసారి వండి పెట్టుకుని, Microwave లో పడేసి మాకు వడ్డించేస్తారు.” Table సర్దేసి, పద్మిని కూడా వచ్చి కూర్చుంది. ” నాలుగు రోజుల వంటలకే బాధపడిపోతున్నారా? ఇక్కడ అమెరికన్లు ఏళ్ళ కేళ్ళు freeze చేసి పెట్టుకుంటారుట – ఇది వినండి సరదాగా – మా hospital లో Dr.Newman చెప్పాడు. అతను ఒకసారి highway లో రాత్రి drive చేస్తుంటే అతని కారు తగిలి రోడ్డు మీద మీద ఒక జింక చనిపోయిందట.  దాని జాగ్రత్తగా కారులో పడేసుకుని, అతనికి తెలిసిన family కి gift గా ఇచ్చాడట. వీళ్ళు వండుకుంటారు కదా జింక మాంసం, venision అనో, ఏదో అంటారు. Newman ను కూడ dinner కి పిలిచి, thanks చెప్పారుట. మళ్ళీ ఓ ఆర్నెల్ల క్రితం వాళ్ళింటికి భోజనానికి వెళ్ళి మాట్లాడుకుంటూ – క్రితంసారి జింక చనిపోయింది, మీకిచ్చాను కదా అంటే – మాకు గుర్తుంది, మేము ఎన్నోరోజులు freeze చేసుకుని తిన్నాము. ఇప్పుడు మీరు తింటున్నది కూడా అదే -అన్నారట! ఈ విషయం ఎంత బాగా చెప్పాడంటే, we were all in splits.”

అమెరికా జీవన విధానం గురించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలతో ఏకబిగిన చదివింపచేస్తుందీ నవల. 2005 లో ప్రచురింపబడిన ఈ నవల ఇప్పుడు కొత్త పుస్తకాల విపణి లో లభించటం కష్టం. మీ సమీప గ్రంధాలయాలలో లేక ఆదివారం అబిడ్స్ మార్కెట్, హైదరాబాదు, విజయవాడ పాత పుస్తకాల దుకాణాలలో  మీకు లభించవచ్చు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.