నవ్వే ప్రేమకు నైవేద్యం  “కేవలం నువ్వే’

              – కొట్నాన సింహాచలం నాయుడు  

 

పోతన భాగవతం చదువుతున్నప్పుడు, తులసీదాసు రామచరిత మానస్ చదువుతున్నప్పుడు,  అన్నమయ్య కీర్తనలు వింటున్నప్పుడు, రామదాసు కీర్తనలు వింటున్నప్పుడు, జయదేవుని అష్ట పదులు వింటున్నప్పుడు,  తుకారాం పాటల్లో లీనమవుతున్నప్పుడు, ఠాగూర్ గీతాంజలి చదువుతున్నప్పుడు కళ్ళు తడవటం గుర్తుంది. అత్యున్నత దశలో అన్ని చదువులు ఒకటే అయినట్టు పరిపక్వత దశలో అపారమైన ప్రేమ భక్తి గా మారి అప్పుడప్పుడు పాత వాసనలతో స్తుతినింద,   కాస్త నిందాస్తుతి గా మారి పోతుంది. ఇప్పుడు మళ్ళీ మనసు అలాంటి ఉద్వేగానికి లోనయ్యింది. అవును కళ్ళు తడిసాయి. అయితే ఇప్పుడు చేతిలో ఉన్నది పైన ఉన్న ఏ ఒక్కటీ కాదు. కేవలం ఒక సాధారణ మహిళ రాసుకున్న, చాల మాములుగా కనిపించే “కేవలం నువ్వే”   అనే ఒక అసాధారణమైన పుస్తకం.   

ప్రేమ ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది.  ఇంటి ముందు తులసిని చూసినప్పుడు, ఇంటి బయట మారేడు చూసినప్పుడు, అతివల చేతిలో గోరింటాకు చూసినప్పుడు, పిల్లలు ఆడుకునే గవ్వలు చూసినప్పుడు, రాలిపడ్డ ముత్యాలు ఏరుతున్నప్పుడు, మట్టిలోంచి గింజను చీల్చుకుంటూ మొలక బయటకు వస్తున్నప్పుడు, మాయను చీల్చుకుంటూ శిశువు బయటకు వచ్చినప్పుడు, గోడ మీద పావురం సజ్జలు తింటున్నప్పుడు, ఎండిన నేలను వర్షం తడుపుతున్నప్పుడు, వేప చెట్టు పూతకు వచ్చినప్పుడు ఇలా ప్రకృతిలో అనుక్షణం, నిరంతరం కొనసాగుతున్న దైవిక మైన ప్రక్రియ ప్రేమ.  

ఇహ లోకపు పైకప్పు మీద కూర్చుని,  అన్నిటికీ అతీతంగా తన మనసుని ఒక అత్యున్నతమైన,  దైవికమైన వేదిక మీద కూర్చో బెట్టి, ప్రేమామృత వర్షం లో తడుస్తూ అక్షరాల నైవేద్యం పెట్టి తనను తాను సమర్పించుకున్న వైనమే ఈ  “కేవలం నువ్వే’ .

ఇందులో చాల ప్రత్యేకతలు ఉన్నాయి. మొదటగా ఈ పుస్తకం రాసిన వసుధారాణి గారు ఆ కుటుంబంలో  అష్టమ సంతానం. చిన్నప్పుడు కష్టాలు పడ్డారో లేదో కానీ తన ముఖం లో ఒక దైవిక శక్తి కనిపిస్తుంది. ఈ కవితల్లో ఆమె ప్రేమ్మతో ఆడిన దోబూచులాట అలనాడు రాధతో దోబూచులాడిన కృష్ణుడిని తలపిస్తుంది. వసుధ రాణి గారు స్త్రీ రూపంలో ఉన్న ఆ కృష్ణుడయినా అయి ఉండాలి లేదంటే అయన మీద ఇలా ప్రేమ పగ సాధించుకోవటానికి అష్టమ సంతానంగా పుట్టిన రాధ అయినా అయి ఉండాలి.  బాల్యం నుండే లలితాసహస్రనామాలు చదివి అనన్యమైన మానసిక పవిత్రతను పొందటం వలన  అపారమైన సరస్వతి కటాక్షమైనా పొంది ఉండాలి. లేదంటే ఒక ఇల్లాలు ఆరుబయట మైదానంలో కుర్చీ వేసుకుని కాలక్షేపం కోసం తన  మనసుకు తట్టిన నాలుగు అక్షరాలు ఇలా ఒక గొప్ప ప్రేమ కావ్యంగా బయటకు రావు.   

మరో దైవికమైన ప్రత్యేకత  తాను సరస్వతీ రూపం అయిన శ్రీమతి  వాడ్రేవు వీరలక్ష్మి దేవి గారి వైపు అడుగులు వేయటం. ఆమె సరస్వతీ కొలువున్న ఇంటికి  పెద్ద దిక్కు. ఒక అద్భుతమైన ముందుమాట “దారి వెంట పరిమళించిన పూలు” పేరుతొ ఈ కావ్యాన్ని లాంతరుతో చూపించటం.

అన్నిటికంటే విశేషం ఈ కావ్యం లోని తెలుగు పదాలు. పద కవితలు. తియ్యగా చక్కెర పొంగళిలా, తేనెలా, చెరుకు రసంలా నోరూరిస్తుంటాయి చదువుతుంటే.  ఏదో శక్తి తనతో పలికించిన పలుకులు అని ఈ పదాలే చెపుతాయి. ఎందుకంటే “నేను కవిత రాయాలి” అనుకుంటే ఇలాంటి పదాలు దొరకవు. అమరవు. తనకు ముందు పదాలు తట్టి పద కవితలుగా మారాయి. తెలుగు భాష ఇంత మధురంగా ఉంటుందా అని గొప్ప తెలుగు సాహిత్య కారులకు సైతం అనిపించే పదాలు. ఎందుకంటే ఈ పదాలు పొడివి కాదు. మనకు కనిపించకుండా కేవలం అనిపించే ఏదో ఒక గొప్ప ప్రేమతత్వం వీటిని కలిపింది. మల్లె మాలలో దారంలా.  

ప్రతి పనిపట్లా శ్రద్ధ, అంకితభావం, ఇతరుల పట్లఆదరణ, సేవాభావం, నిజాయితీ, సామాజిక స్పృహ ఇవన్నీఆచరించి చూపి, చెప్పకుండానే నేర్పిన ఒక గొప్ప మధ్యతరగతి కుటుంబం. జీవితుంలో కష్టసఖాలూ, కలిమిలేములు ఇవన్నీ సహజుం అన్న ఎరుక గలిగిన కలిగిన పెంపకం. పచ్చని పొలాలు, స్వచ్ఛమై న గాలీ, నీరూ, అవధులు లేని ఆకాశం కింద చుక్కలు లెక్క పెట్టుకుంటూ  పెరిగిన బాల్యం. ఓ పచ్చని చెట్టు ఉంటే చాలు దాన్ని చూసుకుంటూ గంటలు గంటలు గడిపేయగల మౌనం ఇవన్నీ తన కంటే ముందుగా దేవుడు తనకిచ్చిన వరాలు. ఇదే తన మనసంతా నింపిన సంతోషానికి కారణం. ఈ పదాల పుట్టుకకు దోహదం.

“నేను నీకు ఒక పూలమాలని అర్పించి పొంగి పోయాను.  

నీవు నాకోసం ఒక పూల తోటనే సృష్టించావు

…………………………………………… 

ఇంత ఇచ్చిన నీకు మనసైనా అర్పించనీ 

ఇవ్వటం నీకేనా ? నాకూ తెలుసు”. 

“మొత్తం అక్షరమాల గుణింతాలు అన్నీ మీరే ఉంచుకోండి 

ఒక్క ప్రేమ అన్న పదం మాత్రం నాకుంచండి”

“నువ్వు ఎవరో తేలేక ముందు కూడా నేను సంతోషంగా ఉన్నాను 

నువ్వు తెలిసాక ఇంకొంచం సంతోషంగా..

ఆ ఇంకొంచంలోనే  ప్రపంచమంతా ఉంది”

“ప్రేమ  నీలో కలిగినప్పుడు 

ఒక నది జన్మిస్తుంది మదిలో 

ఒక్కోసారి తీరైన ప్రవాహం 

మరోసారి కొండను దూకే జలపాతం

 ఏది ఏమయినా ప్రేమ పుట్టాక ఆగని గమనం”

“సముద్రుడు కదా ..

విలువైనవి లోపల దాచుకుని 

గవ్వల పెంకులు బయట పడేస్తాడు 

మహా విలువగా ఏరుకుని దాచుకోమని 

నేను స్త్రీని సముద్రం కన్నా 

లోతైన గాఢమైన దాన్ని 

మనసు అగడ్తలో దాచుకున్న భావనలన్నీ 

నీకు ఒక్కొక్కటిగా బహిర్గతం చేస్తుంటాను ..

రంగు రంగుల గవ్వలకు ఇచ్చిన విలువ 

నువ్వు నా  గువ్వ మనసుకు ఇవ్వనే లేదు”

“నీకు నాకూ మధ్య ఆవిష్కృతం కాని

ఆ అనుబంధం ఏమో నాకు తెలియాలి”  

ఇలా ప్రేమకు ఒక రూపాన్ని ఇచ్చి ఎదుట నిలబెట్టి అక్షరాలే నైవేద్యంగా పెట్టి నిరంతరం మాట్లాడుతున్న వైనమే ఈ ప్రేమాష్టకం.  

ఇక పాఠకులకు మాత్రమే సంబంధించిన విశేషం. ఈ పుస్తకం చదువున్నప్పుడు మనకు మన బాల్యం కనిపిస్తుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచం అందంగా కనిపిస్తుంది. మనసును  ఒక శక్తి ఆవహిస్తుంది. దైవం మనతో దోబూచులాడుతోంది. పవిత్రత పరిమళిస్తుంది. ఈ ప్రపంచం అంతా ఒకవైపు మనం ఒక వైపు ఉండి మాట్లాడుతున్నట్టు ఉంటుంది. మనం ఒక్కరమే ఈ ప్రపంచాన్ని ఆక్రమించుకున్న భావన కలుగుతుంది. ప్రేమ విజేతలమై నవ్వుతున్నట్టు అనిపిస్తుంది.  

ఇక చివరి విశేషం పుంభావ సరస్వతి చిన వీర భద్రుడు గారి ఆశీస్సులతో ఈ పుస్తకం మనల్ని చేరటం. ఇది అన్నీ అమర్చిన బొమ్మకు ప్రాణం పోయటం లాంటిది. నడిచొచ్చే కవితా కాంతకు గంధం పూయటం లాంటిది. పవిత్రంగా జరుగుతున్న  ప్రేమ యజ్ఞంలో మరో నాలుగు నేతి చుక్కలు వేయటం లాంటిది.

మనిషి ఎప్పుడూ ఒంటరి కాడు. దారి పొడవునా  ఎన్నో పూలు కనిపిస్తూనే ఉంటాయి. ఆరు ఋతువులూ వాటి రంగులతో ప్రకృతిని ఉక్కిరి బిక్కిరి చేసినట్టే  మనిషిని కూడా శాసిస్తాయి. అందుకే కొన్ని పూలు ప్రయాణం సాగ నివ్వ కుండా ఆగి పొమ్మంటాయి. నేను కూడా అందుకే ఇక్కడ ఆగ వలసి వచ్చింది. ఈ నాలుగు మాటల కోసం. బాటసారులెవరైనా   పరిమళం లో తేడా లేదు.  నా మాటల్లో వెలితి ఉన్నా అది ఈ పుస్తకం లో లోటు కాదు.  

*****

Please follow and like us:

One thought on “నవ్వే ప్రేమకు నైవేద్యం “కేవలం నువ్వే””

  1. మల్లెల మాలగూర్చి నట్లు చాలా అందంగా పదాలను అల్లి ప్రేమమూర్తులు రాధకృష్ణులతో పోల్చి చాలా బాగా రాశారండి.!! అభినందనలు మీకు!

Leave a Reply

Your email address will not be published.