షర్మిలాం”తరంగం”

-షర్మిల కోనేరు

“ఆడదిగాపుట్టడం కంటే అడివిలో మానై పుట్టడం మేలు”

అని ఏ ఆడపిల్ల ఎంత నిర్వేదంతో అందో ఏమో!

ఒకప్పుడు ఆ నానుడి నాకు నచ్చేదికాదు

.నిరాశావాదం లాగా అనిపించేది

“నరజాతి సమస్తం పరపీడన పరాయణత్వం”

అన్న మహాకవి మాటని ” నరజాతి సమస్తం స్త్రీపీడన పరాయణత్వం

అని సవరించుకోవాలి ఎన్నెన్ని అవమానాగ్నుల్లో

కాలి బూడిదై , అడుగడుగునా హింసాకాండకి బలై అగ్నిపునీతగా 

నిరూపించుకుంటూ మళ్లీ మళ్లీ కొత్త ఆశలతో చిగురిస్తూనే వుంది.

అణిచెయ్యాలనే సమాజపు వత్తిడిని చిరునవ్వుతో జయిస్తూనే వుంది.

ఒకానొక పౌర్ణమి రోజు అమ్మ వేదన నుంచి

నేను ఆడపిల్లగా పుట్టి కళ్లు తెరిచేసరికి ఒక దయామయి నర్సు మొదటగా నన్ను స్పృశించింది .

ఆ తరవాత మా నాన్న నన్ను అపురూపంగా ఎత్తుకుని గుండెలకు హత్తుకున్నారు .

ఇవన్నీ అమ్మ చెప్పింది.

ఆ తరవాత నాన్నమ్మ అమ్మ పాత్ర తీసుకుంది

.నాకు ఊహ వచ్చింది మొదలు నేను చూసింది మా సామ్మామ్మ ని ఆవిడో బాల వితంతువు మా తాతకి అక్క

11 ఏళ్లకే భర్తను పోగొట్టుకోగా అన్ని సౌభాగ్యాలు ఆమెనుంచి లాక్కున్నారు.

రవిక లేకుండా తెల్ల మల్లు పంచె కట్టుకుని వుండే ఆమె నేను చూసిన మొదటి పీడిత స్త్రీ.

అనుక్షణం భర్త అడుగులకి మడుగులొత్తుతూ ఆయనకి కోపం వచ్చి తిట్టినా ఓ తెల్లబోయిన నవ్వు నవ్వుతూ

సర్దుకునే నాయనమ్మ నేను చూసిన రెండో స్త్రీమూర్తి.

సామ్మామ్మా నువ్వు రంగు చీర కట్టుకోవా అని ఎన్నిసార్లో ఆమెని బతిమాలేదాన్ని అమాయకంగా…

ఇది జరిగి నాలుగు దశాబ్దాలైనా ఇప్పటికీ భర్తని పోగొట్టుకున్న ఆడాళ్ల పట్ల సమాజపు వైఖరి మారినట్టేమీ కనిపించడం లేదు.

ఇప్పటికీ ఈ సమాజపు దుర్మార్గాన్ని ఆచారాన్ని అనుసరిస్తున్నామంటూ సమర్ధించుకుంటూనే వున్నారు.

ఆ నాడు సతీ సహగమనం నుంచి ఎంతో ముందుకు వచ్చేసామని జబ్బలు చరుచుకున్నాం.

కానీ ఇప్పటికీ కొన్ని కుటుంబాలలో భర్తని పోగొట్టుకుని పుట్టెడు దుఖ్ఖంలో వున్న ఆడాళ్లకి జరిగే తంతు

చూసి గుండె రగిలి పోయింది.

ఒక మంచిరోజు చూసి జీలకర్ర నోట్టో వేసుకుని ఆమె మొఖం చూసిన తరువాత బయటకు వచ్చి ఊసేస్తున్నారు.

పైగా ఈ తంతుకి సార్ధ్యం వహించేది ఆడాళ్లే.

ఒక మహత్తరమైన కార్యాన్ని సాధించినట్టు పెట్టే

వాళ్ల మొహాల్లో నాకు మాత్రం సమాజపు పైశాచికత్వం తొంగి చూసింది .

 

చదువుకున్న ఆడాళ్లు సైతం ఈ సిగ్గుమాలిన పనిని సమర్ధిస్తుంటే రక్తం మరిగిపోయింది . 

నేను ఆవేశంతో జీలకర్ర తీసి బయటపారేసాను గానీ వాళ్ల మెదళ్లల్లో బూజు దులపగలనా

*****

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.