షర్మిలాం”తరంగం”

-షర్మిల కోనేరు 

మనం మారాల్సిందే మా లక్ష్మి చెప్పిన విషయం విని నిజంగా ఆశ్చర్యపోయాను . ఏంటి ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం ఇద్దరు ఆడపిల్లలు వుండగా రెండు లక్షలు పెట్టి ఒక మగ పిల్లడ్ని కొనుక్కుని పెంచుకుంటున్నారా !

అదీ అప్పు చేసి ఆ మొత్తాన్ని వాళ్లకి ఇచ్చి తెచ్చుకున్నారంట .

రోజూ కరెంటు పనులకి వెళ్లి ఓ ఆరేడు వందలు తెచ్చుకుని తమకు పుట్టిన ఇద్దరు ఆడపిల్లల్ని చదివించుకుంటున్నారు .

ఒక పిల్ల గవర్నమెంట్ హాస్టల్ లో వుండి అయిదో తరగతి చదువుతోంది .

మేముండగా వీడు ఎందుకు , రేపు పెద్దయ్యాకా ఏ తాగుబోతో అయ్యి మిమ్మల్ని తంతే మేమే కదా మిమ్మల్ని చూడాలి అని ఆ పిల్ల అందంట.

ఆ పిల్లకి తాముండగా ఇంకో పిల్లాడి అవసరమేంటని అనిపించిందో ఏమో !

ఇంత తాపత్రయం ఎందుకయ్యా అంటే తలకొరివి పెట్టడానికి , ఇంటి పేరు నిలబెట్టడానికంట.

 

వాళ్ల అమ్మా నాన్న కి తనొక్కడే కొడుకు కాబట్టి రేపు కూతుళ్లు పెళ్లిల్లు చేసుకుని వెళ్లిపోతే ఇంటి పేరు కొన సాగించడానికంట.

మా అత్తగారింటో పని చేసే ఆవిడ కూతురికి ఆడపిల్ల పుట్టిందని మొగుడు అత్తమామలు చూట్టానికి రాలేదంట.

పాపం ఆ అమ్మాయి ఏడుపు.

అంతెందుకు! చదువుకున్న వాళ్లు కూడా ఆడపిల్లని కన్నందుకు పెళ్లాన్ని పుట్టింట్లోనే వదిలేసిన ఎన్నో సంఘటనలు . టీవీల్లో ఈ వార్తలు వింటే మనం వెనక్కి వెళ్తున్నామా అని అనుమానం వస్తుంది .

అసలు ఈ వంశాలు వంశ ప్రతిష్టల్లాంటి భావజాలాలు సగం సినిమాల పుణ్యమే .

కొడుకు వస్తే ” పండగలా దిగివచ్చావూ ” అని పాటలెత్తుకుంటారు.

అసలు కధ కధానాయకుడి చుట్టూ తిరిగితే కధానాయకుడి చుట్టూ తిరగడానికి మాత్రం హీరోయిన్లని వాడే దౌర్భాగ్యం మన సినిమాలని వీడి పోవడం లేదు.

సినిమాలకి జీవితాలకి సంబంధం లేదని ఎవరన్నా కొట్టి పారేయొచ్చు.

కానీ ముమ్మాటికీ సినిమాల ప్రభావం సమాజం మీద పడితీరుతుంది.

దీనికి తోడు టీవీ సీరియల్స్ ఫలానా వంశం అంటూ గొప్పలు.

ఈ వంశాల మోజులో పడి మగ పిల్లలు కలగక పోతే ఆత్మన్యూనత కు గురైన వాళ్లని చాలామందిని చూశాను.

మన ఇంటిపేరు లక్షమందికి వుంటుంది.

ఆ వంశం పేరు కొనసాగక పోయినా ప్రపంచం మునిగిపోదు .

ఆడపిల్లలు ఇంటి బాధ్యత తలకెత్తుకుంటే తల్లితండ్రులు కూడా ఏంటోనమ్మా కూతురి మీద ఆధారపడాల్సి వస్తోంది అదే ఒక మొగబిడ్డ వుంటే అని కళ్లొత్తుకుంటారు .

ఇది ఆ ఆడబిడ్డను అవమానించినట్టే.

ఆడపిల్ల సొమ్ము

తినకూడదంట.

మరి మగపిల్లల సొమ్ము తినొచ్చా ?

మనం కన్నది మొగబిడ్డయినా ఆడబిడ్డయినా అపురూపమే.

అబ్బాయి అమ్మా అని పిలిచినా అమ్మాయి అమ్మా అని పిలిచినా అదే బంధం.

ఎవరి ప్రత్యేకత వారిది .

అవకాశాలు సమానంగా ఇస్తే ఇద్దరూ ఇద్దరే.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.