అందరూ మంచివాళ్లే! 

-అనసూయ కన్నెగంటి

       రాజన్న, గోపన్నలు ఇద్దరూ బాల్యం నుండీ  మంచి మిత్రులు. ఇద్దరూ కలసే చదువుకున్నారు. అలాగే ఇద్దరూ చదువైపోయాకా వ్యాపారాలు ప్రారంభించి బాగా సంపాదించారు. కొంతకాలానికి 

         పొరుగున ఉన్న కోసల రాజ్యంలో  వ్యాపార అవకాశాలు బాగా ఉన్నాయని తెలుసుకున్న ఆ ఇద్దరు మిత్రులూ   తమ తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవటానికి ఆ రాజ్యంలో వ్యాపారం చేద్దామని వచ్చారు.

         ఆ కొత్త రాజ్యములోని వ్యాపార పరిస్ధితులను అర్ధం చేసుకున్న రాజన్న, గోపన్నలు రోజూ తమ రాజ్యానికి పోయి వచ్చే కంటే ఇక్కడే ఇల్లు తీసుకుని ఉంటే సమయం కలసి వస్తుందని భావించారు. అయితే, 

   ఎప్పుడైనా కుటుంబ సభ్యులు వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండాలంటే విడి విడి ఇళ్లల్లో ఉంటేనే ఉత్తమం అని భావించి  పక్క పక్కనే ఉండే ఇళ్ళను వెదకటం మొదలు పెట్టారు. 

     వెతగ్గా వెతగ్గా కొంతకాలానికి రెండు ఇళ్ళూ దొరికాయి. కానీ ..మరీ పక్క పక్కనే దొరకలేదు. ఈ రెండిళ్ళ మధ్య ఒక ఇల్లు ఉంది. ఇళ్ళు చూడటానికి వెళ్ళినప్పుడు..ఆ ఇంటి అరుగు మీదే కూర్చుని ఉన్న ఆ ఇంటాయన గంగన్న వీళ్ళిద్దర్నీ ఒకలా చూడటం రాజన్న, గోపన్నలు గమనించారు. అంతే కాదు ఎందుకైనా మంచిదని మర్యాదగా వీళ్లే వెళ్ళి పలకరించి  మీ పక్క ఇంట్లోకి వస్తున్నామని చెప్పారు. అతను ఆలకించి వదిలేసాడు తప్ప వినటానికి పెద్దగా ఆసక్తి చూపలేదు.  

     మిత్రులు ఇద్దరూ అతని ప్రవర్తనకి ముఖాముఖాలు చూసుకుని ఆ విషయాన్ని అప్పటికి వదిలేసారు. అయితే ఈ విషయం తెలిసిన ఇరుగూ పొరుగు వారు..వచ్చి, గంగన్న  ఆ పక్క ఇళ్ళల్లోకి ఎవర్నీ రానీయడని, వచ్చినా వెళ్ళిపోయేలా ఇబ్బందులకు గురి చేస్తాడని ఏవేవో చెప్పారు.

   అయినా పట్టించుకోని మిత్రులిద్దరూ మంచి రోజు చూసి ఇళ్లల్లో ప్రవేశించారు. 

         అలా ఇళ్లల్లో చేరిన కొద్ది రోజులకే పొరుగాయన మనస్తత్వం అర్ధమైపోయింది ఇద్దరికీ. 

          అతని గురించి ఇరుగు పొరుగు వాళ్ల వల్ల  ముందే తెలిసింది కాబట్టి తెలివి తేటల్తో అతన్ని ఎదుర్కోవాలి అనుకున్నారు ఇద్దరూ. 

   ఒకరోజు నిద్ర లేచే సరికి ఇంటి ముందు అంతా చెత్త పడవేసి ఉంది. పట్టించుకోలేదు రాజన్న, గోపన్న. 

మర్నాడు కూడా అలాగే వేసి ఉంది. అది గంగన్న పనే అని అర్ధం అయినా  పట్టించుకోలేదు ఇద్దరూ. 

    “ ఏం చేద్దాం రాజన్నా? రోజూ ఇలాగే వేస్తే మనకి దుర్వాసన కదా? “ అన్నాడు గోపన్న రాజన్నతో.

    “ఏదో ఒక ఉపాయం ఆలోచించి దానిని మంచి పనికి ఉపయోగించి అతనిలో మార్పు వచ్చేలా చేద్దాం గోపన్నా. అతని మీద కొత్వాలుకి పిర్యాదు చేస్తే సమస్య తాత్కాలికంగానే పరిష్కారం అవుతుంది. అదే అతనిలో మార్పు వచ్చేలా చేసామనుకో అందరికీ మంచిది. ఎందుకంటే ఇవ్వాళ ఈ ఇళ్లల్లో మనం ఉన్నాం. రేపు మరెవరైనా ఉండచ్చు. అందుకని  అతన్ని మార్చటం కూడా మన వ్యాపార బాధ్యతగా భావిద్దాం..” అన్నాడు రాజన్న నవ్వుతూ.

    అంతే కాదు స్నేహితునితో కలసి ఆ చెత్తనంతా ఎత్తి ఒక గుంట తవ్వి ఆ గుంటలో వెయ్య సాగాడు.  

  ఎందుకలా చేస్తున్నారో గంగన్నకి ఎంత ఆలోచించినా అర్ధం కాలేదు. గంగన్న అలా వేస్తూనూ ఉన్నాడు, వీళ్ళిలా  దాన్ని ఎత్తి గుంటలో పోస్తూనూ ఉన్నారు. అదలా జరుగుతూ ఉండగా ఒకనాడు..

    రాజన్న , గోపన్నా ఇంటికి వచ్చే సరికి  గంగన్న తన ఇంటిలోని వాడకం నీరు వీళ్ళ ఇంటి ముందుగా ప్రవహించేటట్టు బోదులు తవ్వాడు.  అది చూసి తెల్లబోయారిద్దరూ. 

    అయినా ఏమీ మాట్లాడకుండా ఆ మర్నాడు వ్యాపారం ముగించుకుని, ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఇద్దరూ చెరో నాలుగు అరటి పిలకలనూ తెచ్చి  ఆ మురికి నీటి బోదుల పక్కగా నాటారు. కొంతకాలానికి అవి పెరిగి పెద్దయ్యాయి. 

   అప్పుడు ఆ గుంటలో వేసిన చెత్తను తట్తలలోకి ఎత్తి అరటి చెట్ల మొదళ్లల్లో పోసేసరికి  అరటి చెట్లు పువ్వులు వేసి అరటి గెలలు వేసాయి. చిత్రంగా ఆ చెత్తలోని బలానికి ఆ రాజ్యంలో ఎప్పుడూ కాయనంత పెద్ద పెద్ద అరటి గెలలు కాసాయి. 

       ఆ దారిన పోయే వారంతా ఆ గెలల వైపు చాల చిత్రంగా చూస్తూ వెళ్లే వారు. అంతేకాదు..అంత పెద్ద గెల వేయటానికి ఎలాంటి ఎరువులు వాడారు అని కూడా అడిగేవారు. 

    ఇదంతా వింటూ చాల అసహనానికి గురయ్యేవాడు  గంగన్న. . అంతే కాదు అసూయతో రగిలిపోయేవాడు కూడా. 

     ఆ నీళ్ళేవో తన వైపే పారేలా చేసుకుని తనే నాలుగు అరటి చెట్లు వేసుకుంటే తనకే లాభం కదా అనుకుని ఒకరోజు వాడకం నీళ్ళు పొరుగు వాళ్ల ఇళ్లవైపు వెళ్ళకుండా తన ఇంటి ముందే పారేలా చేసుకున్నాడు. అంతే కాదు..రోజూ తన ఇంట్లో చెత్తని తన అరటి చెట్లలోనే  వెయ్యటం కూడా మొదలు పెట్టాడు.

    అది చూసి రాజన్న ” చూసావా గోపన్నా..గంగన్నలో మార్పు మొదలైంది. మనం కొత్వాలుకి చెబితే గంగన్న మరింత రెచ్చిపోయేవాడు. అలా కాకుండా అతనేం చేసినా దానికి ఒక ప్రయోజనాన్ని మనం కల్పిస్తే అది తప్పక మార్పు తెస్తుంది అని మనం చేసిన పనికి అతను మారిపోయాడు అనిపిస్తుంది.. “ 

    “ అవును. నువ్వన్నది నిజం.గంగన్న  మారిపోయాడు..” అన్నాడు రాజన్న నవ్వుతూ. 

        చిత్రంగా   ఆ మర్నాడే గంగన్న  వీళ్ల దగ్గరకు వచ్చి..

      “నన్ను మన్నించండి. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. కానీ మీ వల్ల నిరుపయోగంగా ఉన్న వాటి నుండి కూడా ఎలా లాభం పొందవచ్చో నేర్చుకున్నాను. ఇలాంటి ఉపాయాలు మీ దగ్గర ఇంకా చాలా ఉండి ఉండవచ్చు. అందుకే మీతో స్నేహం చేయాలనుకుంటున్నాను “ అన్నాడు.

    “ చూడు గంగన్నా! మురుగు నీరూ, చెత్త లాగే ఏదీ నిరుపయోగం కాదు. స్నేహాలూ అంతే. అందరి పట్లా  స్నేహభావం చూపగలిగితే అంతా మంచే జరుగుతుంది.” అన్నాడు రాజన్న.

      “ అవును. నిజమే. మీరు ఇద్దరూ మా ఇంటికి చెరో పక్కనా ఉండటం నా అదృష్టం “ అన్నాడు గంగన్న.

                  ఆ మాటలకు మిత్రులిద్దరూ సంతోషంగా నవ్వుకుంటూ. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. 

  *****

Please follow and like us:

One thought on “అందరూ మంచివాళ్లే! (బాల నెచ్చెలి-తాయిలం)”

Leave a Reply

Your email address will not be published.