అనుసృజన

నిర్మల

(భాగం-2)

ఆర్. శాంతసుందరి 

(హిందీ లో దాదాపు మొట్టమొదటి స్త్రీవాద నవల ప్రేమ్ చంద్ రాసిన “నిర్మల”. ఈ నవలకు ఆర్. శాంతసుందరి గారు అందజేస్తున్న సంక్షిప్త అనుసృజన నెచ్చెలి పాఠకుల కోసం నెలనెలా -)

పెళ్ళింట్లో శోకాలూ, ఏడుపులూ గురించి వివరంగా చెప్పి చదివేవాళ్ళ మనసులని బాధపెట్టటం నాకిష్టం లేదు.మనసులు గాయపడ్డవాళ్ళు ఏడుస్తారు,విలపిస్తారు,గుండెలు బాదుకుంటూ మూర్ఛ పోతారు.ఇది కొత్త విషయమేమీ కాదు.కల్యాణి మానసిక స్థితి ఎంత ఘోరంగా ఉండి ఉంటుందో మీరే ఊహించుకోగలరు.ప్రాణంతో సమానమైన తన భర్తని తానే చంపిందన్న అపరాధభావం ఆమెని నిలవనివ్వటం లేదు.కోపావేశంలో తన నోటివెంట అదుపు తప్పి వచ్చాయి అలాంటి అనకూడని మాటలు,అవే ఇప్పుడు ఆమె హృదయాన్ని బాణాలలా చీల్చి చెండాడుతున్నాయి.

 

దుఃఖావేశం కాస్త నెమ్మదించాక ఆమెకి నిర్మల పెళ్ళి సమస్య గుర్తొచ్చింది.కొందరు ఏడాదికి పెళ్ళి చెయ్యద్దనీ, వాయిదా వెయ్యమనీ సలహా ఇచ్చారు.”ఇన్ని ఏర్పాట్లూ చేశాక పెళ్ళి వాయిదా వేస్తే చేసినదంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. పైయేడు మళ్ళీ ఏర్పాట్లన్నీ చేసి తీరాలి.అది సాధ్యమయే ఆశ నాకు లేదు కనక యేడాదే చేసెయ్యటం మంచిది.కట్నం ఎలాగూ లేదు పెళ్ళివాళ్ళ మర్యాదలకి అవసరమైన హంగులన్నీ సిద్ధంగా ఉన్నాయి.ఆలస్యం చేస్తే నష్టమే తప్ప లాభమేమీ ఉండదు,” అంది కల్యాణి.

వియ్యంకుడు భాలచంద్ర కి శోక సమాచారం తో బాటు పెళ్ళి యేడాదే చెయ్యటం గురించి కూడా ఉత్తరం రాసింది. ఉత్తరంలో,” అనాథ స్త్రీ మీద దయ చూపించి నావ మునిగిపోకుండా కాపాడండి.మావారి మనసులో పెద్ద పెద్ద ఆశలుండేవి,కానీ భగవంతుడు మరోలా తలిచాడు.నా మానం మర్యాదా ఇప్పుడు మీ చేతుల్లోనే ఉన్నాయి.అమ్మాయి ఎప్పుడో మీకు సొంతం అయిపోయింది.మీకు వియ్యంకుల మర్యాదలన్నీ దగ్గరుండి చేయించటం నా అదృష్టంగా భావిస్తాను.అయినా ఎక్కడైనా లోటుపాట్లు జరిగితే నా పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మన్నించగలరు.నేను అవమానం పాలవకుండా చూస్తారని నాకు నమ్మకం ఉంది…” అంటూ రాసింది.

ఉత్తరాన్ని కల్యాణి పోస్టు చెయ్యకుండా పురోహితుడి చేతికిచ్చి, ” మీకు శ్రమ కలిగిస్తున్నాను , కానీ మీరు స్వయంగా వెళ్ళి దీన్ని వాళ్ళకిస్తేనే బావుంటుంది.నా తరపున ఇంకొక మాట కూడా చెప్పండి, వాళ్ళ వైపునుంచి ఎంత తక్కువమంది వస్తే అంత మంచిదని వినయంగా కోరుతున్నాని చెప్పండి.ఇక్కడ కొత్తగా ఏర్పాట్లు చేసేందుకు ఎవరూ లేరు కదా !”

 

మూడో రోజుకల్లా పురోహితుడు మోటేరామ్ లక్నో చేరుకున్నాడు.***

 

భాలచంద్ర పురోహితుణ్ణి చూడగానే కుర్చీ లోంచి లేచి ,” రండి, రండి పంతులు గారూ ! మీ రాకతో మా ఇల్లు పావనమైందిఅరే ఎవర్రా అక్కడ? గురదీన్. భవానీ,రామ్ గులామ్అందరూ ఎక్కద చచ్చారు? ఇంటినిండా నౌకర్లున్నా సమయానికి ఒక్కడూ కనిపించడు కదా! పంతులుగారొచ్చారు, కుర్చీ తెచ్చి వెయ్యండి !” అని లోపలివైపు చూస్తూ అరిచాడు.

 

ఎన్నిసార్లు పిలిచినా ఒక్కడూ రాలేదు.ఒక ఐదు నిమిషాలయాక ఒంటికంటి మనిషి దగ్గుతూ వచ్చి,”అయ్యా, నౌకరీ నావల్ల కాదు.జీతం లేకుండా ఎన్నాళ్ళు పనిచేస్తాను?అప్పుచేసి పొట్టపోసుకోవలసి వస్తొంది!” అన్నాడు.

నోరుముయ్,వెళ్ళి కుర్చీ తీసుకురా.పని చెపితె చాలు ఇదే ఏడుపు !చెప్పండి పంతులుగారూ ,ఏమిటి విశేషం?”

[పంతులు అక్కడి సంగతులు చెప్పి , కుటుంబం లాంటి దీన స్థితిలో ఉందో వివరించాడు.]

ఇంతలో నౌకరు విరిగిపోయిన ఒక చెక్కపెట్టె తెచ్చి అక్కడ పెట్టి,” కుర్చీలూ, బల్లలూ మొయ్యటం నా వల్లకాదు !” 

అన్నాడు.

పంతులు సంకోచిస్తూ తను కూర్చుంటే విరిగిపోతుందేమోనని భయం భయంగా దాని మీద కూర్చున్నాడు.తను తెచ్చిన ఉత్తరం ఆయనకి అందించాడు.

పాపం , ఇంతకన్నా ఘోరం ఏం జరగాలి చెప్పండి . ఆయన నాకు ఎప్పటినుంచో తెలుసు.రత్నం లాంటి మనిషి.నా సొంత అన్నో తమ్ముడో పోయినంత బాధగా ఉందంటే నమ్మండి !”అన్నాడు భాలచంద్ర.

[తరవాత ఇద్దరూ చాలాసేపు ఉదయభాను లాల్ గుణగణాలు తలుచుకుంటూ బాధపడ్డారు. కట్నం తీసుకోవటం ఎంత నీచమో చెపుతూ ఆవేశపడిపోయాడు భాలచంద్ర .]

మీది ఎంత దొడ్డ మనసో నాకు తెలీదా?పెళ్ళి ఏర్పాట్లన్నీ ముందే అయిపోయాయి కాబట్టి అనుకున్న ముహూర్తానికే చేసేద్దామని అనుకుంటున్నారు ఆడపెళ్ళివాళ్ళు.మీ వియ్యపురాలు అన్నీ ఉత్తరంలో వివరంగా రాశారు.మీ తరపున ఎంతమంది వచ్చినా ఘనంగా సత్కరించాలనే అనుకున్నారావిడ.కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.మీ వియ్యంకుడికి చెడ్డపేరు రాకుండా దయచేసి మీరే ఆదుకోవాలి,” అన్నాడు పంతులు.

[కొంతసేపు భాలచంద్ర ఏమీ మాట్లాడకుండా కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. తరవాత పెళ్ళి జరగటం సాధ్య కాదన్న సంగతి మాయ మాటలు చెప్పి తప్పించేందుకు ప్రయత్నించాడు.పంతులు ఎంత బతిమాలినా, నిర్మల భవిష్యత్తు గురించి కాస్త ఆలోచించమని చెప్పినా, సంబంధం కుదుర్చుకున్నాక పిల్ల మీకే సొంతమని వాదించినా ఏమీ లాభం లేకపోయింది.]

భగవంతుడికే పెళ్ళి జరగటం ఇష్టం ఉన్నట్టు లేదు పంతులు గారూ,లేకపోతే ఇలాటి ఘోరం జరిగేనా? ఉదయభాను గారిని తల్చుకుంటేనే నాకు కన్నీళ్ళు ఆగటం లేదు.ఇక రోజూ పిల్లని చూస్తూ ఆయన్ని గుర్తు చేసుకుంటూ బతగ్గలనా? లేదు పంతులు గారూ,నేనా బాధ భరించలేను!” అన్నాడు భాలచంద్ర .

పంతులుకి తినేందుకు మిఠాయిలు తెమ్మని నౌకరుకి పురమాయించి,ఇప్పుడే వస్తానని ఉత్తరం పట్టుకుని లోపలికి వెళ్ళాడాయన.

ఆడపెళ్ళివాళ్ళు ఉత్తరం పంపారు.వాళ్ళ పురోహితుడు పట్టుకొచ్చాడు,” అన్నాడాయన భార్య రంగీలీబాయి కి ఉత్తరం ఇస్తూ.

మనకీ పెళ్ళి ఇష్టం లేదని చెప్పలేదా మీరు?” అందావిడ 

అలా మొహం మీద కొట్తినట్టు చెప్పలేక మొసలి కన్నీళ్ళు కార్చాల్సి వచ్చింది!”

అరే, స్పష్టంగా చెప్పేందుకు అంత భయం దేనికండీ?అది మనిష్టం, వద్దంటే తలకొట్టి మొలేస్తారా?మరో చోట పది వేలు వస్తూంటే దాన్ని వదులుకుంటామా? లాయర్ గారు బతికుంటే పది పదిహేను వేలైనా ముట్టజెప్పేవారే? పిల్లా పోనీ అమ్త బంగారు బొమ్మేం కాదు.ఇప్పుడు ఏం చూసి సంబంధం చేసుకుంటాం?”

ఒక సారి మాటిచ్చాక ఇప్పుడు ఎలా కాదనటం? నలుగురూ మొహం మీద ఉమ్మెయ్యరూ? నువ్వు ఇలా మొండికేస్తున్నావని తప్పటం లేదు కానీ…”

 

రంగీలీ బాయి ఉత్తరం చదవటం మొదలుపెట్టింది. మొదటి వాక్యం చదవగానే ఆమె కళ్ళు చెమర్చాయి చివరికి వచ్చేసరికి కన్నీళ్ళు ధారలు కట్టాయి.గద్గద స్వరంతో,”పంతులు గారు ఇంకా ఇక్కడే ఉన్నారా?” అంది.

ఉత్తరం ఆమెకివ్వటం తప్పయిపోయిందా అనుకుంటూ, ” ఉన్నట్టున్నాడు,నేను వెళ్ళమని చెప్పాను మరి,”అన్నాడు భాలచంద్ర. ఆయన భార్య కిటికీ లోంచి చూసింది.పంతులు అక్కడే బజారుకేసి చూస్తూ కూర్చుని ఉన్నాడు.

ఉత్తరం చదివాక కూడా పెళ్ళి జరగదని అంత కర్కోటకంగా ఎలా చెప్పగలమండీ?”అంది రంగీలీబాయి కన్నీళ్ళు తుడుచుకుంటూ.

నువ్వు ఒక్కోసారి చిన్నపిల్లల్లా మాట్లాడతావు.ఇప్పుడే పెళ్ళి జరగదని ఆయనకి చెప్పి వచ్చాను.ఇప్పుడు మాట మార్చితే ఏమనుకుంటాడు? నా మాటకి విలువేముంటుంది?”

సరే, మీరేం మాట్లాడకండి.ఆయన్ని నా దగ్గరకి పంపించండి.మీ మాటకి భంగం రాకుండా ఆయనకి అర్థమయేట్టు చెపుతాను.”

మిగతావాళ్ళందరూ బుద్ధిలేని వాళ్ళూ,నువ్వొక్కతెవే తెలివైనదానివీ అనుకుంటున్నావా? నువ్వే కదా పెళ్ళి వద్దని గోల చేశావు? ఇప్పుడు మాట మారుస్తున్నావెందుకు?”

నిర్మల తల్లి అంత దయనీయమైన స్థితిలో ఉందని నాకేం తెలుసు.వాళ్ళింట్లో డబ్బు మూలుగుతోందని మీరే కదా నాకు చెప్పారు?మంచి చేశాక చెడు చేసేందుకు సిగ్గుపడాలి గాని మనం ముందు వద్దని తరవాత సరేనంటే ఎవరైనా ఏమంటారు? మనమే మంచివాళ్ళమనిపించుకుంటాం.”

[వీళ్ళిద్దరూ ఇలా వాదించుకుంటూ ఉండగా వాళ్ళబ్బాయి భువన్ మోహన్ అక్కడికి వచ్చాడు.అందంగా, హుందాగా మంచి సూటూ బూటూ తొడుక్కుని ఉన్నాడు.చేతిలో హాకీ కర్ర ఉంది. కల్యాణి ఉత్తరం రాసిందని చెప్పి తల్లి దాన్ని అతనికి ఇవ్వబోయింది.]

మీ అత్తగారు రాసింది.నీకు పెళ్ళి చేసుకోవాలని ఉందా లేదా అన్న సంగతి స్పష్టంగా చెప్పు.పంతులు గారికి జవాబు చెప్పాలి.”

పెళ్ళి చేసుకోవాలనే ఉందమ్మా, కానీ పెళ్ళి నేను చేసుకోను.”

ఎందుకురా?”

“బాగా డబ్బులు దొరికే సంబంధమేదైనా ఉంటే చూడండి.కనీసం లక్ష కట్నం ఉండాలి.అక్కడ ఇప్పుడేముంటుంది? ఆయన లేడు, ముసలావిడ ఏమివ్వగలదు?”

ఇలా మాట్లాడేందుకు నీకు సిగ్గుగా లేదా?

ఎందుకు సిగ్గు? డబ్బంటే ఎవరికి చేదు?లక్ష రూపాయలంటే మాటలా,లక్ష జన్మలెత్తినా సంపాదించలేను!నాకొచ్చే అత్తెసరు జీతంతో సుఖంగా ఎలా బతగ్గలను? డబ్బున్న అమ్మాయిని పెళ్ళాడితే జీవితం హాయిగా గడిచిపోతుంది.”

అమ్మాయి ఎలాటిదైనా పరవాలేదన్నమాట,” అంది తల్లి.

డబ్బు అన్ని లోపాలనీ కప్పేస్తుందమ్మా. పిల్ల నన్ను తిట్టినా భరిస్తాను.పాడి ఆవు తన్నిందని బాధపడతారా  ఎవరైనా?”

[రంగీలీబాయి అవాక్కయింది.ఆమె మాట చెల్లలేదు.తండ్రీ కొడుకూ ఏకమై ఆమె నోరు మూయించారు.]

బీదవాళ్ళు బీదవాళ్ళింట్లోనే సంబంధం వెతుక్కోవాలి.తమ తాహతుకి మించి…”

అతని మాట పూర్తవకముందే రంగీలీబాయి ,” నోరుముయ్యరా,పెద్ద చెప్పొచ్చావుతాహతుట తాహతు.నువ్వేం పెద్ద సేటువా .ఇంటికొచ్చినవాళ్ళకి గ్లాసుడు మంచినీళ్ళిచ్చే తాహతు లేదు గాని, మాటలు కోటలు దాటతాయి !” అనేసి అక్కణ్ణించి లేచి వెళ్ళిపోయింది.

భువన్ మోహన్ నవ్వుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు.అతని తండ్రి మీసాలు దువ్వుకుంటూ పంతులుకి తమ నిర్ణయం తెలిపేందుకు ముందుగదిలోకి వెళ్ళాడు.

***

(ఇంకాఉంది) Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.