ఇట్లు మీ వసుధారాణి.

 అన్నింటిలోనూ పెద్ద-3

-వసుధారాణి 

కిన్నెరసాని అందాలను అలా వెన్నెలలో చూసిన చల్లని మనసులతో భద్రాచలం చేరాము.అదే మొదటి సారి నేను భద్రాచలం చూడటం.ఉదయాన్నే లేవగానే మేము ఉన్న చిన్న కొండమీద కాటేజీ కిటికీ నుంచి చూస్తే గోదావరి.”అదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి” కీర్తన గుర్తుకు వచ్చింది.సూర్యోదయం ,గోదావరి, గుడిగంటలు ఏదో తెలియని భక్తిభావం ఇంకా రామయ్యని చూడకుండానే.మా బావగారూ వాళ్ళు బద్దకంగా మేము కొంచెం నిదానంగా వస్తాము మీరు తయారయి గుడికి వెళ్ళండి అన్నారు.నేనూ అక్కయ్యా చక చక తయారయ్యి కాటేజీ పక్కవైపు ఉన్న మెట్లు దిగి గుడికి వెళ్లిపోయాం .

ఆ శ్రీరామచంద్రుని దివ్య మంగళ రూపం దర్శనం చేసుకుని పక్కన ఉన్నమండపంలో కూర్చున్నాం.అమ్మవారి కుంకుమ నా నుదుటిన పెడుతూ ఏమి కోరుకున్నావే?  అని అడిగింది అక్కయ్య నన్ను. నేను చిన్నగా నవ్వి సీతమ్మవారిని చూడటమే సరిపోయింది ఏమి కోరుకోవాలో తెలియలేదు ,ఐనా నేను ఎప్పుడూ ఏమీ కోరుకోను దేవుడిని అన్నాను పెద్ద ఆరిందాలా.

అక్కయ్య నా తలని పక్కకి తిప్పి నా జడలో పూజారి ఇచ్చిన పూలమాల తురిమి చిన్న మొట్టికాయ వేసి నేను కోరుకున్నానులే నీ బదులు అంటూ తమాషాగా నవ్వింది.నాకు కొంచెం అర్ధం అయ్యింది కానీ కానట్టు మొఖం పెట్టుకుని కూర్చున్నాను దేవాలయగోపురం చూస్తూ.బావగారు వాళ్ళు వచ్చాక కల్యాణం టికెట్టు కొనుక్కుని కల్యాణం చేయించుకున్నాం . అందరిలోకి పెద్ద పూజారి చేత అక్కయ్య నాకు కల్యాణ తలంబ్రాలు అక్షింతల్లా వేయించింది.భద్రాచలం నుంచి హైద్రాబాద్ చేరుకున్నాం .నన్ను లక్ష్మీ అక్కయ్యా వాళ్ళింట్లో దింపి పెద్దక్కయ్య నిర్మల్ వెళ్ళిపోయింది.అక్కడి నుంచి నేను నరసరావుపేట వచ్చేసాను .

వచ్చేసరికే తెలిసిన వాళ్ల ద్వారా పెళ్ళి సంబంధం రావటం, నా పెళ్ళి కుదరటం ,జరగటం అన్నీ వరుసగా జరిగిపోయాయి.పెళ్ళి అయిన తరువాత నిద్రలకి నాతో మా అత్తగారింటికి వచ్చిన మా పెద్దక్కయ్య నేను ఓ మంచి ఇంటికి కోడలిగా ,మంచి అతనికి భార్యగా అయ్యానని చాలా సంతోష పడింది.వెళ్ళేటప్పుడు నన్ను దగ్గరికి తీసుకుని చిన్న మొట్టికాయ వేసి శ్రీనివాస్ చాలా మంచివాడు కోతి వేషాలు వేయకుండా బుద్ధిగా ఉండు అని చెప్పి చెమర్చిన కళ్ళతో కారెక్కి వెళ్లిన పెద్దక్కయ్య అలా ఆ ఫ్రేమ్ లో గుర్తుండి పోయింది నాకు.

నేను మొదటి  పురుడు పోసుకోవటానికి అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు ఓ రోజు అర్ధరాత్రి హఠాత్తుగా తలుపులు కొట్టిన చప్పుడు తెరిచి చూస్తే ,పెద్దక్కయ్యా,బావగారు ఏంటి ఇలా చెప్పాపెట్టకుండా అర్ధరాత్రి అంటే.నీకు ఎక్కడ డెలివరీ అయిపోతుందో కడుపుతో ఉన్నపిల్లని చూడకుండానే అని ,బావగారిని గోలపెట్టి పొద్దున్నే కార్లో నిర్మల్ లో బయలుదేరి ఇప్పుడు వచ్చాం అంది. తను ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ లో, అందరికీ దూరంగా ఉన్నానన్న బెంగతో మేము ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు,మమ్మల్ని ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వచ్చేస్తూ ఉండేది.

మేము ప్రొద్దుటూరు వెళ్లిన తరువాత  అక్కడ బంగారం చాలా బాగుంటుందని పెద్దక్కయ్య వచ్చినప్పుడు కొన్ని నగలు చేయించుకుంది.నీకు బోలెడు బంగారం వుందికదా మళ్లీ ఇంత ఎందుకు అక్కయ్యా అంటే ముగ్గురు కొడుకులకు రాబోయే ముగ్గురు భార్యలకు, అని చాలా ముందు ఆలోచనతో చేయించి పెట్టుకుంది.ప్రొద్దుటూరు చుట్టుపక్కల ఉన్న గుళ్లు గోపురాలు తిప్పి చూపించాను.నా జీవితంలో నెలకొన్న ఆనందం చూసి చాలా సంతోష పడింది.

మా బాబు అక్షరాభ్యాసం బాసర లో చేశాము .వీడికి బాగా చదువు వస్తుందే పెద్ద చెవులు వీడివి పొడవుగా ఉన్నాయి అని చెప్పింది.ఎందుకో ఆసారి నిర్మల్ ట్రిప్ లో నాకు ఒకలాంటి దిగులు కలిగింది.  అక్కయ్య అంత ఆరోగ్యంగా కనపడలేదు.మందులు ఎక్కువగా వాడుతోంది,చక్కగా కళకళ లాడే ముఖంలో కళ తగ్గిపోయింది.అలాంటి సమయంలో కూడా ప్రతి చిన్నదాని పట్ల తన సరదా,జీవితాన్ని తీసుకునే తీరు ఆ ట్రిప్ లో తన దగ్గర నేను నేర్చుకున్న అతి పెద్ద పాఠం .

ఎక్కువ మందులు వేసుకోవాల్సి వచ్చేసరికి ఆమందుల స్ట్రిప్పులు పారేయకుండా వాటిపై ఫాయిల్ ని ఓ డబ్బాలో వేసి పెట్టి. వాడిన మందుల పైన అట్టలతో రెండు స్టీలు గిన్నెలు కొన్నానే, అని నవ్వుతూ చూపటం ఒక్క మా పెద్దక్కయ్యకే సాధ్యం అనిపించింది.జీవితంలో మనం మార్చలేని స్థితి గతులు వచ్చినప్పుడు వాటిని ఎంత సులభంగా తీసుకోవాలో ,ఎగసే అలముందు ఎలా తలవంచి నిలబడాలో మా పెద్దక్కయ్య ఆ రెండు స్టీల్ గిన్నెలతో చూపించింది.

తర్వాత కొద్ది నెలలకే మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ తో మా ఇంటి పెద్ద ,నిజంగానే అన్నింటిలోనూ పెద్ద మా పెద్దక్కయ్య తన 47 వ ఏట గణేష్ నిమజ్జనం రోజున హైదరాబాదు నిమ్స్ హాస్పటల్ ల్లో కన్నుమూసింది.

కోడళ్ళ కోసం బంగారు నగలు కొని పెట్టిన అక్కయ్య కొడుకులకు పెళ్ళి ఈడు రాకుండానే వాళ్ళని తల్లిలేని పిల్లలను చేసి వెళ్ళిపోయింది.మా పెద్దక్కయ్య రెండో కొడుకు శాంతిబాబు పెళ్ళి లో మా బావగారు నన్ను పిలిచి రాణీ అమ్మాయి మెడలో ఈ నగ నువ్వు వేయి అని అత్తగారి హోదాలో నా చేత కోడలు మెడలో పచ్చల హారం వేయించారు.అది పొద్దుటూరులో నేను, మా పెద్దక్కయ్యా  షాపు వాడికి డిజైన్ చెప్పి మరీ చేయించిన హారం.అక్కయ్య గుర్తొచ్చి ఏడుపొచ్చినా కన్నీళ్ళు బిగపట్టి హారం అమ్మాయి మెడలో వేసి పక్కకు వచ్చి మా పద్మక్కని పట్టుకుని ఎంత ఏడ్చానో. ఇంత ముందు ప్లాను , ఎంతో ఆస్తి పాస్తులు ,అంత బంగారం ఏవీ పెద్దక్కయ్యను బతికించ లేదు. కానీ తను మాకు నేర్పిన జీవిత పాఠాల వలన ఇప్పటికీ ఏ పని చేసుకున్నా పెద్దక్కయ్య అయితేనా అనుకుని నవ్వుకుంటాం,ఏడ్చుకుంటాం అలా మాతోనే మాలోనే తనూ సజీవంగా ఉంది.

వచ్చే నెచ్చెలి లో మరో సరికొత్త కథతో మీ ముందు ఉంటాను అప్పటిదాకా ఇట్లు మీ వసుధారాణి.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.