కొన్ని సమయాలలో కొందరు మనుషులు& గంగ ఎక్కడికెళుతోంది ?

-వసుధారాణి

తమిళమూలం: జయకాంతన్

  1.   కొన్ని సమయాలలో కొందరు మనుషులు.
  1.   గంగ ఎక్కడికెళుతోంది ?

తెలుగు అనువాదం :

  1. కొన్ని సమయాలలో కొందరు మనుషులు.

        – మాలతీ చందూర్.

  1. గంగ ఎక్కడికెళుతోంది? 

         – జిల్లేళ్ళ బాలాజీ.

 

 ‘కొన్ని సమయాలలో కొందరు మనుషులు’ నవల తమిళంలో ఈ నవల 1975 లో వచ్చింది .మాలతీ చందూర్ 1981 తెలుగులోకి అనువాదం చేశారు.ఈ నవలకు సీక్వెల్ గా ‘గంగ ఎక్కడికెళుతోంది?’ నవల 1978 లో వచ్చింది.జిల్లెళ్ల బాలాజీ తెలుగు అనువాదం 2017 లో విశాలాంధ్ర డైలీ సీరియల్ గా వచ్చి 2019 లో పుస్తక రూపంలో వచ్చింది.

 

‘కొన్ని సమయాలలో కొందరు మనుషులు ‘నిజానికి కథ చెప్పాల్సిన అవసరం లేనంత పాపులర్ నవల. చలనచిత్రంగా కూడా వచ్చింది.మనుషుల మనసులు, వారి ప్రవర్తనలు అన్నివేళలా ఒకేలా ఉండవు అని చెప్పటమే ఈ నవల యొక్క ముఖ్యోద్దేశ్యం కావటం వలన అనుకుంటా నవల  కొంచెం సంక్లిష్టంగా ఉంటుంది.నవలలోని పాత్రలు తమ పరిధిలో రకరకాల సమయాల్లో రకరకాల మానసిక స్ధితులను కలిగి ఉంటాయి.మానవ సహజమైన మార్పు అన్న విషయాన్ని ఓ వర్షపుసాయంత్రం జరిగిన ఓ బలాత్కార సంఘటనకు ముడి పెట్టి తెరలు తెరలుగా,పొరలు పొరలుగా కథ విచ్చుకోవటం చదువుతుంటే జయకాంతన్ సాంఘిక అధ్యయనం ఎంత లోతుగా ఉంది అని అనిపిస్తుంది.రచయిత నవలలోని ప్రతి మనిషి యొక్క అతి చిన్న అంతరంగ మధనాన్ని,కదలికని అద్భుతంగా చూపించారు.

 

డాక్టర్ వాడ్రేవు వీరలక్ష్మీదేవిగారు తమ భారతీయ నవలాదర్శనంలో ఈ’ కొన్ని సమయాలలో కొందరు మనుషులు’నవలపై వ్యాసాన్ని రెండు భాగాలు చేసుకుని రాశారు. మొదటి వ్యాసంలో కథ ,రెండవ వ్యాసంలో కథా నాయిక గంగ అంతరంగ ఆవిష్కారం .దీనిని బట్టే నవల సంక్లిష్టత ,గొప్పతనం అర్ధం అవుతుంది.అయితే ‘గంగ ఎక్కడికెళుతోంది?’ కూడా చదివిన తరువాత నాకు ఈ రెండు వరుస నవలలను కలిపి రాయాలనిపించింది.

 

గంగానదిపై రెండు ముఖ్యమైన వ్యాఖ్యలు ప్రాచీనంగా ఉన్నాయి.ఒకటి గంగలా దిగజారద్దు.రెండవది ఎటువంటి మలినాన్ని అయినా గంగ శుద్ధి పరుస్తుంది అని.జయకాంతన్ తన నాయిక గంగకు ఏది ఆపాదించాలనుకున్నారో మొదటి నవలలో చెప్పలేదు కానీ రెండవ నవలలో ఆయన గంగ యొక్క ప్రయాణానికి ఓ దిశానిర్దేశం చేసి చూపారు.అయితే మొదటి నవలలో గంగను హిమాలయోన్నత శిఖరం మీద చూపి కొద్ది కొద్దిగా ఆమెను దిగజార్చారు.రెండవ భాగంలో ఏకంగా గంగను గంగ పాలు చేశారు.

 

టూకీగా కథలోకి వస్తే పదిహేడు సంవత్సరాల వయసులో గంగ అనే బాలిక ఓ వర్షంకురిసిన సాయంత్రం ఓ విలాసపురుషుడి కారు అయిష్టంగానే ఎక్కి సహజంగా తెలిసీ తెలియని వయసు ఉద్వేగానికి ఉత్సుకతకూ లోనువుతూ ఆ కారులోనే అతని చేత బలాత్కరింపబడుతుంది.తల్లి కనకమ్మ అమాయకపు విధవరాలు కూతురిని కడుపులో దాచుకోకుండా నానా యాగీ చేస్తుంది.అన్న గణేష్ చెల్లిని,తల్లిని బయటికి తోసి తలుపులు వేస్తాడు.అక్కడి నుంచి దూరంగా వేలువిడిచిన మేనమామ ఇంటికి తల్లి కూతురు చేరతారు.మేనమామ పెద్దమనిషి,లాయరు,ధర్మాచారపరాయణుడు, లౌక్యుడు కూడా దీనితో పాటు అవసరానికి ఇంట చేరిన మేనకోడలు గంగపై  తాత వయసు కల అతడు చాపల్యాన్ని చూపుతాడు.అతని భార్య వట్టి అమాయకురాలు.ఆమె సలహాపై గంగ అతనితో తెలివిగా మసలుకుంటూ చదువులో మొదటగా వస్తూ మంచి ఉద్యోగాన్ని సంపాదించుకుని తల్లితో కలిసి దూరంగా వచ్చేసి ఓ నిర్లిప్త జీవితానికి అలవాటు పడిపోతుంది.

 

అన్న గణేష్ వదిన మాటలు విని అప్పుడప్పుడూ చెల్లిని తిట్టి వెళుతుంటాడు. మేనమామ కూడా ఇంటికి వచ్చి తను ఇచ్చిన ఆశ్రయం తాలూకూ హక్కు చూపుతుంటాడు.RKV అనే రచయిత అచ్చం తన కథలాంటి కథనే రాయగా అది చూసిన గంగ ఆశ్చర్యానికి , ఆ కథలో తన తల్లిలాగా కాకుండా నాయిక తల్లి బిడ్డను కాపాడుకునే తీరున తన తల్లి ప్రవర్తించ లేదని ఆ పుస్తకాన్ని తెచ్చి తల్లి మీద గిరవాటు వేస్తుంది.

 

నిజంగానే కూతురి పరువు తనే వీధిపాలు చేసుకున్నాను అని బాధ పడుతున్న ఆవిడకు మేనమామ వచ్చి ధర్మ సూత్రాలు చెప్పి. చెడిపోయింది నువ్వు దాచిపెట్టినా చెడిపోయిందే ఇంకొకరికి ఈ విషయం దాచి పెట్టి కట్టపెట్టటం పాపం.దానికి కోరికలు తీరకపోతే ఎవరికైనా ఉంపుడుగత్తెగా ఉండటం మంచిది.కాదంటే చేతనైతే తనని ఆవిధంగా చేసిన వాడిని కనిపెట్టి కట్టుకోమను అంటాడు.ఈ మాటలు విన్న గంగ నిజంగానే అతన్ని కనిపెట్టాలను కోవటం కథలో గొప్ప మలుపు.

 

రచయిత RKV ని కలిసిన గంగ అతను తను చదివిన కాలేజి అటెండర్ గా గుర్తిస్తుంది .అతనికి గంగ తెలియదు కేవలం సంఘటన విని తనదైన శైలిలో కథ రాసుకుంటాడు. అయితే  తరచూ కాలేజీ దగ్గర కారు వేసుకుని తిరిగే అతణ్ణి చూసాను ఇక్కడే ఉంటాడు అని చెపుతాడు.గంగ అతణ్ణి కలుస్తుంది అతని పేరు ప్రభు వివిధరకాల వ్యసనాలకు లోనైన విలాసపురుషుడు.గంగ పై అత్యాచారం జరిపే నాటికే అతను పెళ్లయి, ఓ కూతుర్ని కూడా కలిగి ఉంటాడు.తరువాత ఇద్దరు కొడుకుల్ని కూడా కంటాడు.నాదగ్గరికి వచ్చేవాళ్ళు ఇష్టంతోనే వస్తారు నిన్నొక్కదాన్నే ఇష్టం లేకుండా చేసింది అంటాడు.అతని తండ్రి పెంపకం,మనసును అర్ధం చేసుకోని భార్య,పిల్లలు అతన్ని అలా మార్చాయి. స్వతహాగా అతను మంచివాడే అని గంగ తెలుసుకుని అతనితో ,అతని కూతురు మంజుతో స్నేహంగా ఉండటం చేస్తూ క్రమంగా అతని సాన్నిహిత్యాన్ని కోరుకుంటూ ఉండే స్థాయికి చేరుతుంది.తల్లికి ప్రభు వస్తూవుండటం కూతురు ఇలా మారటం నచ్చదు.నచ్చ చెప్పబోయిన మేనమామను గంగ ఎప్పుడూ లేని విధంగా ఎదిరిస్తుంది. ఆయన బయటకు తీసిన బెల్టును లాక్కుని మరీ ధిక్కరిస్తుంది.గంగలో ఈ మార్పును చూసి ఆయన లౌక్యంగా అక్కడి నుంచి తప్పుకుంటాడు.

 

తల్లి అన్న ఇంటికి వెళ్ళిపోతుంది.గంగ ప్రభు చెలిమిలో హాయిగా ఉంటుంది.రచయిత RKV గంగ మంచితనం చూసి ఆమెకు  ఓ పెళ్లి సంబంధం చూస్తాడు.అన్న గణేష్ ప్రభును కలిసి గంగకు పెళ్లి కావాలంటే ప్రభు చెపితే చేసుకుంటుందని అలా చెప్పేసి ఆమెకు దూరంగా పొమ్మని అడుగుతాడు.ప్రభు గంగను పెళ్లి చేసుకోమమ్మని అడిగినప్పుడు గంగ నాకు నీ తోడు కావాలి అని అడుగుతుంది.ప్రభు అది సాధ్యపడదు అని కనపడకుండా వెళ్ళిపోతాడు.

 

ఒక్కసారిగా గంగ మారి పోతుంది ఎవరు ఏమనుకున్నా సరే తనకు నచ్చినట్లు జీవించాలి అనుకునే స్థితికి చేరుకుని ఆఫీసులో కొలీగ్ ఆంగ్లోఇండియన్ లేడీ తో కలిసి మద్యపానం,ధూమపానం అన్నీ చేస్తూ తనకు నచ్చినట్లు జీవిస్తూ ఉంటుంది.

 

ఇది మొదటి నవల గంగ లో మొదటి నుంచి చివరి దాకా వచ్చిన మార్పు అందుకు దారితీసిన పరిస్థితులు, రచయిత ఎవర్నీ ఏమీ అనకుండానే ఆడ,మగ మధ్య ఉన్న సామాజిక వ్యత్యాసాన్ని కేవలం సమాయానుగుణంగా మారిన మనుషులను ,గంగ జీవితంపై పడిన ప్రభావాలను చాలా పొరల్లో కప్పి ,దాచి ,అణిచి ఉంచి చూపారు.నవలలో బిగువంతా వివిధ సందర్భాలలో గంగ ప్రవర్తన ఆమె తీరు. ఓ సామాన్యమైన బాలిక కథకు అసామాన్యమైన ముగింపు ఇచ్చి గంగ గురించి పాఠకులు ఎన్ని రకాలుగా ఆలోచించవచ్చో అన్ని రకాల ఊహాలకూ ఆస్కారమిస్తూ కొన్ని సమయాలలో కొందరు మనుషులు నవల ముగిస్తారు జయకాంతన్.మాలతీ చందూర్ అనువాదం చాలా సరళంగా ఉంది.

 

గంగ ఎక్కడికెళుతోంది?

 

గంగను గూర్చి పాఠకులలో ఉత్కంఠత రేపుతూ మొదటి నవలకు సీక్వెల్ గా జయకాంతన్ ఈ నవలను 1978 లో వ్రాసారు.జిల్లెళ్ల బాలాజీ వారి అమ్మాయి నుంచి హక్కులు పొంది 2017 లో తెలుగులోకి అనువదించారు.2019 లో పుస్తకంగా వచ్చింది.

 

జయకాంతన్ ఓ పడవలో పాత్రలన్నింటినీ కూర్చో బెట్టుకుని ఒక్కో పాత్రని వాళ్ళు చేరాల్సిన  తీరం రాగానే వారిని అక్కడ చేర్చుతూ ,చివరకు ప్రభును,గంగను గంగదాకా తీసుకు వెళ్లి గంగను గంగలో కలిపేశారు.మొదటి నవలలో ప్రతి పాత్రా తనదైన బిగువుతో ముగుస్తుంది.ఏ పాత్రా ఏమీ చెప్పకుండా సమయానుగుణంగా ప్రవర్తిస్తూ పోవటం చాలా సహజంగా చూపించారు అందులో.గంగ ఎక్కడికెళుతోంది ? కేవలం వీరందరినీ ఓ దరి చేర్చటం కోసమే మళ్లీ రాశారు.

కనపడకుండా పోయిన మామయ్య కాశీలో తేలి గంగకు ఉత్తరం రాస్తాడు.గంగ,తల్లి,అత్తయ్యా వెళ్లి ఆయన్ని కలవటం ఆయన పశ్చాత్తాపం, ఆస్తి మొత్తం గంగ పేర రాసి ఆయన చనిపోవడం.గంగ అన్న గణేష్ జబ్బు పడటం అతని కుటుంబం గంగ ఇంట చేరటం ,గంగను అస్తమానం అసహ్యించుకున్న వదిన గారు అమె ఇంటనే చేరి చాకిరీ చేయటం.ప్రభు భార్య పద్మిని మంజు పెళ్లి కోసం ప్రభుని ఇంటికి తీసుకు రమ్మని గంగను కోరటం ఇవన్నీ మొదట నవల చదివిన పాఠకులు జీర్ణించుకోలేని విధంగా ఉంటాయి.మేనమామను గంగ క్షమించటం బాగానే ఉంటుంది ఎటువంటి దుర్మార్గుడిని ఐనా క్షమించవచ్చు .ఐతే అసలేమీ జరగనట్టుగా చాలా మామూలుగా ఉండటం గంగకే సాధ్యం.ప్రభు అలా వ్యసనపరుడు అవటానికి చూపిన కారణాలు కూడా బలంగా లేవు.మంజు పెళ్లి చేసి పంపిన తరువాత తన అన్న కుటుంబాన్ని కూడా ఓ కొలిక్కి తెచ్చినాక,  ఉద్యోగం నుంచి రిటైర్ అయిన గంగ ప్రభును తనతో రావలసిందిగా కోరుతుంది.అలా ప్రభుతో కలిసి ప్రయాణించిన గంగ కాశీలో గంగలో కలిసి తన జీవితం ముగుస్తుంది.

 

జీవితకాలం తను చేయని తప్పుకు తల వంచుకుని శిక్ష అనుభవించిన గంగ,పురుష స్పర్శ అంటేనే అసహ్యం పెంచుకున్న గంగ ,ప్రభు చేసిన అత్యాచారం కంటే మామయ్య మాటలకు,చేష్టలకు అనుక్షణం ముడుచుకుని పోయిన గంగ  ప్రభుని అర్ధం చేసుకుని క్షమించటం,ముఖ్యంగా మేనమామను క్షమించటం తను చేయని తప్పుకు ఈ ప్రపంచానికి తలవంచటం అనిపిస్తుంది పాఠకునికి .ఒకవేళ రచయిత ఉదేశ్యం కూడా ఇదే అయితే కొన్ని సమయాల్లో కొందరు మనుషుల్లో  గంగ గొప్ప మహిళ నా దృష్టిలో.

 

జయకాంతన్ ఓ సంక్లిష్ట సమాజ మానవసంబంధాలను మూడవ మనిషిగా బయట నుంచి జరిగిన  తీరును యధాతధంగా అందించారు అనుకోవాలి.ఐతే గంగకు జరిగిన అన్యాయం, బలి ఐన ఆవిడ అమాయకపు యవ్వనకాలం సామాజిక విలువల మధ్య విలువలేనివిగా పరిగణించ బడటం మాత్రం పాఠకుల మదిని గాయం చేసి తీరుతుంది.నిజానికి విశ్లేషణకి అందని నవలలు రెండూనూ.జిల్లెళ్ల బాలాజీ గారికి అభినందనలు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.