రమణీయం

విపశ్యన -1

-సి.రమణ 

ఈ సంచికలో, నెచ్చెలి పాఠకులకు, “విపశ్యన” గురించి పరిచయం చెయ్యాలనుకుంటున్నాను. విపశ్యన  గురించి కొన్ని సంవత్సరల క్రితమే తెలుసు. అప్పుడు విపాసన అని అన్నట్లుగా విన్నాను. ఉపాసన అనే పదం విని వున్నాను కాబట్టి ఇది కూడ అటువంటిదే అని అనుకున్నాను. కాని దానిగురించి కొంచం తెలుసుకున్నాక, వింతగా, ఆశ్చర్యంగా అనిపించింది. పది రోజులు ఎవరితోను మాట్లాడకూడదు, అడవులలోకి వెళ్ళాలి, అన్నిటికీ దూరంగా, అందరికీ దూరంగా.  మన వద్ద విలువైన వస్తువులు, డబ్బు వంటివి వుండకూడదు. కలం, కాగితం, చేతి గడియారం, సెల్ఫోన్ కూడా వుండకూడదు. ఇటువంటివే మరికొన్ని నియమాలు విన్నాక, అబ్బో, ఇది చాల కష్టం, మనవల్లకాదులే అని అనుకుని, పెద్దగా పట్టించుకోలేదు. కాని ఈ మధ్యే ఎందుకో మళ్ళీ గుర్తుకొచ్చింది. అయ్యో ఎందుకు పట్టించుకోలేదు, చేసివుంటే బాగుండేది. ఇప్పుడు వివరాలు ఎవరిని అడగాలి, ఎలా తెలుసుకోవాలి అని మధనపడుతుండగా, హఠాత్తుగా ఒక రోజు నా స్నేహితురాలు రాజ్యలక్ష్మి ఫోన్ చేసి, తను “విపశ్యన” చేసానని, నాకు ఇటువంటి కార్యక్రమాలు ఇష్టం కాబట్టి, నన్ను కూడా చెయ్యమని, చాలా మేలు కలుగుతుందని, మరీ, మరీ చెప్పింది. నేను తలచుకుంటున్నదే తను చెప్పడం ఎంత యాదృచ్ఛికం? ఇదేనేమో సిక్స్త్ సెన్స్ అంటే.

విపశ్యన అంటే ఏమిటి? అక్కడ ఏమి చేస్తారు? ఎందుకు చేస్తారు? ఏమి తెలుసుకుంటారు? ఏమి నేర్చుకుంటారు? ఈ విషయాలను గురించి ముందుగా తెలుసుకుందాం. “విపశ్యన” అనేది ఒక ధ్యాన పద్ధతి. విపశ్యన అంటే, సూక్ష్మంగా చెప్పాలంటే, ఉన్నది ఉన్నట్లుగా, చూడటం. వివరంగా, విశేషంగా చూడటం. మనలోకి మనం ప్రయాణించడం. ఇది ఒక ప్రాచీన జీవన కళ. నేటి సమాజానికి అత్యంత ఆవశ్యకమైన విద్య ఇది. మనము ఈ విద్యను నేర్చుకుని సాధన చేస్తుంటే తెలుస్తుంది, ఎంతటి అద్వితీయమైన ధ్యాన విధానమో. విపశ్యన ధ్యాన పద్ధతి ప్రతి ఒక్కరూ నేర్చుకొని ఆచరించవలసిన జీవన విధానం. ఇప్పుడిప్పుడు మన వాళ్ళు చేస్తున్న, అయ్యప్ప దీక్షలు, భవాని దీక్షలు మరోటి, మరోటి దీక్షలు చేయడం వలన ఎంతమందికి ముక్తి లభిస్తుందో నాకు తెలియదు కాని, విపశ్యన సాధన వలన చాల, చాల మందికి విముక్తి లభిస్తుంది, అనేక బాధలు, దుఃఖాలు మరియు వేదనలనుండి. నేడు మన కళ్ళ ముందు జరుగుతున్న అనేక అనర్ధాలకు, అన్యాయాలకు కళ్ళెం పడి, తగ్గుముఖం పడతాయి. 

ఇది ఎప్పుడో 50, 60 సంవత్సరాలు దాటిన తరువాత లేక వృద్ధులు అయ్యాక నేర్చుకొనవలసిన విద్య కాదు. ఎంత చిన్న వయసులో నేర్చుకుంటే, అంత మంచి ఫలితాలుంటాయి. విద్యార్థి దశలోనే నేర్చుకుంటే వారి జీవితం లోని అన్ని దశలు వున్నతమైన స్థాయిలో వుంటాయి. విద్యార్థిగా, వ్యక్తిగా వుద్యోగిగా, వ్యాపారిగా అన్ని అంశాలలో, విశాల దృక్పధంతో, వున్నతంగా జీవిస్తారు. తల్లి తండ్రులు, ఉపాధ్యాయులు నేర్పని ఎన్నో విషయాలు, తమంట తామే తెలుసుకుంటారు, నేర్చుకుంటారు. మన జీవితంలో ఎదురయ్యే బాధలు, కష్టాలు , సంతోషాలు, సుఖాలు అన్నింటికి మనం స్పందించే విధానంలో మార్పు జరుగుతోంది. కష్టాలకు కల్లోలం చెందకుండా, సంతోషాలకు పొంగి పడిపోకుండా  అన్నిటిని సమతతో చూస్తూ, సమన్వయం చెయ్యడం నేర్చుకుంటాము. ఇంత మంచి జీవన విధానం వున్నదని మనకు తెలియక పోవడం శోచనీయం. తెలిసిన తరువాత నేర్చుకోకపోవడం మన దౌర్భాగ్యం. ధనవంతులు, బీదవారు, చిన్నవారు, పెద్దవారు, స్త్రీలు, పురుషులు, సమస్త జనులు నేర్చుకుని అనుసరించవలసిన మహత్వపూర్ణమైన విద్య ఇది. ఏ మతస్తులైనా, ఏ దేవుడిని కొలిచే వారైనా, జాతి, మత, కుల, భేదం లేకుండా అందరూ నేర్చుకోదగిన విద్య. ఇంతకుముందే ఇతర ధ్యాన మార్గంలో వున్నవారు, ఏ గురువునైనా అనుసరించేవారుకూడా, వచ్చి నేర్చుకుంటారు. ఇక్కడ ప్రత్యేకమైన గురువులు, బాబాలు, స్వామీజీలు ఎవరూ వుండరు. పది రోజులు మాత్రం ఒక అచార్యుడు మనకి ధ్యాన విధానం నేర్పడానికి, ఆ మార్గం లో సక్రమంగా ప్రయాణించే దారి చూపడానికి వుంటారు; అంతే. 

అసలు విపశ్యన అనే ధ్యానం ఎక్కడినుండి  వచ్చింది? ఎలా వచ్చింది? ఇంత మహత్వపూర్ణమైన ఈ ధ్యాన పద్ధతిని ఎవరు కనుగొన్నారు? ప్రజలలోకి ఎవరు తీసుకు వచ్చారు? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే, మనం బాగా…..  వెనక్కు వెళ్ళాలి. అంటే దాదాపు 26 శతబ్దాల వెనక్కు వెళ్ళాలి.  

క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దం లో, ఒక రాజకుటుంబం లో జన్మించిన సిద్ధార్ధుడు, 25 సంవత్సరముల వరకు ఆనందమయ జీవితం గడిపాడు. అనుకోకుండా తటస్థపడిన కొన్ని సంఘఠనలవలన, ప్రజలు అనుభవిస్తున్న దుఃఖాలను, కష్టాలను చూసి చలించిపోయాడు. ఎందుకు జనులంతా కష్టాలతో, వ్యాధులతో బాధపడుతున్నారు? ఈ బాధలు ఎక్కడ పుడుతున్నాయి? ఎప్పుడు నశిస్తాయి? ఎప్పుడు అందరూ శాంతిగా, సంతోషంగా వుంటారు? ఇటువంటి ప్రశ్నలకు సమాధానం వెదుకుతూ, నిరంతరం జిజ్ఞాసతో వుంటూ, మహారాజు కావలసిన సిద్ధార్ధుడు, తన 27వ ఏట, అందమైన భార్యను, పసివాడైన కొడుకును, రాజ్యాన్ని, రాజభోగాలను పరిత్యజించాడు. సన్యాసి యై, సత్యాన్వేషణలో అనేక సంవత్సరాలు, గురువుల వద్ద శిష్యరికం చేసినా, సంతృప్తికరమైన సమాధానం లభించలేదు. ఇంద్రియాలను అదుపుచేస్తూ, భావోద్వేగాలను అణిచివేసి, నిష్టతో శరీరాన్ని కృశింపచేసి, దుఃఖ విముక్తి మార్గం కనుగొనవచ్చని, ఆరు సంవత్సరాలు కఠోర సాధన చేసినా, సరైన సమాధానం పొందలేకపొయాడు. బయట ప్రపంచంలో తనకు సంతృప్తికరమైన సమాధానం దొరకదని గ్రహించి, అంతఃశోధన పై మనసు లగ్నం చేసి, హేతు బుద్ధితో, సత్యాన్వేషణ చేయడం ప్రారంభించాడు.  

ఒకనాటి రాత్రి సమయంలో గాఢమైన ధ్యానం చేస్తూ , సిద్ధార్ధుడు,  ప్రపంచాన్ని దుఃఖమయం చేస్తున్న కారణాలను కనుగొన్నాడు. అన్ని బాధలకు మూల కారణాలు తెలుసుకున్నాడు.  తదుపరి, వాటి వినాశన మార్గం కూడా ఆవిష్కృతమయినది. హేతుబద్ధమైన సత్యాన్వేషణలో, జ్ఞానోదయం పొంది సిద్ధార్ధుడు బుద్ధుడయినాడు. బుద్ధుడు ఆచరించి, బోధించిన ధ్యాన పద్ధతియే, నేటికీ రూపు మారకుండా, పరిరక్షింపబడిన, విపశ్యన ధ్యానం. బుద్ధుడు ఎప్పుడూ వ్యక్తి అరాధనను, విగ్రహారాధననూ విశ్వసించలేదు, ప్రోత్సహించలేదు. దేవుని వునికినే ప్రశ్నించిన బుద్ధుడిని, తరువాత తరాలలో భగవంతుడిగా మార్చారు, దశావతారాలలో చేర్చారు. బుద్ధుడు బోధించిన పంచశీలాలు మాయమై, అనవసరమైన ఆరాధనలు, వైభవోపేతమైన ఉత్సవాలు, అక్కడక్కడా అమంగళకరమైన పూజలతో, మొత్తం మానవాళి, తిరోగమనంలో ప్రయాణిస్తుంది. సత్యమార్గం, ధర్మమార్గం మరియు హేతుమార్గం కనుమరుగైపోయాయి. 

మనదేశం నుండి బౌద్ధమతం తరలిపోవడంతో, బుద్ధుని బోధలు, ఆయన చూపించిన జ్ఞానమార్గం, మన భారతీయులకు దూరమయ్యాయి. కాని పొరుగున ఉన్న బర్మా దేశంలో, గురుశిష్య పరంపర లో కొనసాగుతూ, ఈ ధ్యాన పద్ధతి, పరిశుద్ధ రూపంలో, రక్షింపబడుతూ వచ్చింది. భారతీయ సంతతికి చెందిన శ్రీ సత్యనారాయణ గోయంకా అనే ఆచార్యులు, పుట్టి పెరిగిన బర్మా దేశాన్ని వదిలి, తాను నేర్చుకున్న విపశ్యన ధ్యానాన్ని, 40 సంవత్సరాలపాటు, ప్రపంచం నలుమూలలా తిరుగుతూ, లక్షలాది ప్రజలకు పరిచయం చేశారు. 1969వ సంవత్సరం లో, మన దేశానికి వచ్చిన తరువాత, పెక్కు విపశ్యనా ధ్యాన కేంద్రాలు నెలకొల్పారు. మన తెలుగు రాష్ట్రాల లో కూడా, ఆరు కేంద్రాలు, విపశ్యన ధ్యానాన్ని బోధిస్తున్నాయి.             

కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, దుఃఖాలు, పరుగులు, వత్తిళ్ళు లేని శాంతిమయ జీవితం అందరం కోరుకుంటాము. దానికోసం ఏమి చేయాలో, తెలియని అయోమయంలో, తాత్కాలిక మార్గాలు వెతుక్కొంటాము. ఎవరికి తోచినట్లు, నచ్చినట్లు గా, వారు స్త్రీలయితే పూజలు, వ్రతాలు చేస్తూ, పురుషులయితే సినిమాలు, సిగరెట్లు ఇంకా షికార్లతో, సుఖశాంతులను పొందాలనుకుంటారు. విపశ్యన ధ్యానంతో, మనసులోని మాలిన్యాలను, తొలగించుకోవచ్చు. (ఇక్కడ మాలిన్యాలు అంటే స్వార్థం మరియు అరిషడ్వర్గాలు.) మనకు, ఎన్నో సంవత్సరాలుగా వున్న, చాల ప్రశ్నలకు, సమాధానాలు దొరుకుతాయి, కొన్ని చిక్కుముడులు విడిపోతాయి, ఈ ధ్యాన సాధనలో. అందుకే, అన్నింటికీ దూరంగా, 10 రోజులు, ధ్యానకేంద్రంలో  వుండటం. ఆ పది రోజులలో, మనము నేర్చుకునే విషయాలు, జీవితాంతం తోడుగా, సహయకరంగా వుంటాయి. విపశ్యన ధ్యానం చెయ్యడం వలన అన్ని రకాల దుఃఖ కారకాలు తొలగిపోయి, కాంతివంతమైన, సత్యవంతమైన, ధర్మవంతమైన జీవనం మొదలవుతుంది. విపశ్యన ధ్యానకేంద్రం లోని విశేషాలతో, వచ్చే సంచికలో, కలుసుకుందాము.  

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.