కెంజాయ కుసుమం

-వసుధారాణి రూపెనగుంట్ల

కన్నడ మూలం : నా. డిసౌజా

తెలుగు అనువాదం: ఉమాదేవి,ఎన్ 

స్వాతి మాసపత్రికకు అనుబంధంగా ఫిబ్రవరి 1987 లో వచ్చిన 107 పేజీల బుజ్జి నవల.

నా.డిసౌజా:  నలభై పైగా నవలలు రచించారు. నాటికలు, కథాసంకలనాలు కలిపి తొంభై పైగా ప్రచురించారు. “ముళుగడెయ ఊరిగె బందవరు” అనే పిల్లల నవలకి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.

ద్వీప, కాడినబెంకి అనే నవలలు చలనచిత్రాలుగా రూపొంది, రాష్ట్రీయ బహుమతులు పొందాయి.
కాడినబెంకి నవలను జ్వాల అనే పేరుతో ఉమాదేవి తెలుగులోకి అనువదించగా  2000
సంవత్సరం లో విజేత పత్రిక లో డెయిలీ సీరియల్ గా వచ్చింది.

డిసోజా గారికి అనేక సాహిత్య పురస్కారాలతోబాటు, కువెంపు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ను సమర్పించింది.

డిసోజా గారు ప్రకృతి ప్రేమికుడు. ఏభై సంవత్సరాల సాహిత్య సేవలో… ఆయన రచనలలో, నైసర్గిక సౌందర్యం, పర్యావరణ ప్రాముఖ్యత… జనపద జీవనం… గిరిజన జీవితం… వారి సమస్యలు, క్రైస్తవ సమాజంలోని లోతుపాతులు…లోటుపాట్లు… ఇంకా ఎన్నో సున్నితమైన విషయాలను స్పృశిచారు. గొప్ప కన్నడ సాహిత్య కారుడు!

శ్రీ నా. డిసోజా గారు కర్ణాటక , పడమటి కనుమల ప్రాంతపు ‘సాగర ‘అనే ఓ చిన్న పట్నవాస్తవ్యులు. కొండలు, జలపాతాల నడుమ సహజ ప్రకృతిలో జీవించారు. ఆ అనుభవాలు వారి రచనల్లో ప్రతిబింబిస్తూనే ఉంటాయి.

డిసోజా గారివి అనేక కథలు తెలుగులోకి  శర్వాణి గారు కొన్ని ,ఉమాదేవి గారు కొన్ని  అనువదించగా విపులలో ప్రచురింపబడ్డాయి.
జ్వాల,  విజేత ‘మహిళ’ విభాగం లో ఏప్రిల్ 2000 లో ప్రచురింపబడింది.

ఇక్కడ అనువాదకురాలు ఉమాదేవి గారి గురించి కొంత చెప్పుకోవలసి ఆవశ్యకత ఉంది.రాజమహేంద్రవరం అచ్చతెలుగు నేల పై పుట్టి , భర్త ఉద్యోగ రీత్యా  బెంగుళూరులో  నివసించటం వల్ల   కన్నడ భాషను నేర్చుకున్నారు.రాజమహేంద్రవరంలో జరిగే ఎన్నో సాహితీ సభలకు హాజరు అయ్యేవారు , సాహితీపరిచయాలు, పఠనాశక్తి కలిగి ఉన్నారు.వివాహానికి ముందే కొంత కవిత్వ రచన కూడా చేశారు. అనువాదకురాలు శర్వాణి గారికి ఈమె కోడలు.

కెంజాయ కుసుమం వీరి మొదటి అనువాద నవల.సరాసరి నవలేమో అన్నంత సరళమైన అనువాదం చేశారు.చాలా వరకూ సుమధుర తెలుగు పదాలు వాడారు.నవల ప్రకృతి ప్రధాన ఇతివృత్తంగా ఉండటం వలన తెలుగు భాషలోని అందమైన పదాలని గుప్పించటానికి అనువుగా వీరికి  అవకాశం దొరికింది.కెంజాయకుసుమం మాటేమో కానీ అడవి మల్లెల పరిమళంతో నవల గుప్పుమంది.

నవలకు ముందు నా.డిసౌజా మాటలు”అత్యాధునిక పరికరాలు,పరిశోధనలు మన జీవితాన్ని నాజూకుగా,సుఖమయంగా రూపొందిస్తున్న ఈ కాలంలో వెనుకటి వాళ్ళు రూపొందించుకున్న కొన్ని విలువల్ని మనం మర్చిపోయాం.వాటిని పోగొట్టుకుని వంచితులమయ్యాము ముఖ్యంగా ప్రకృతి ప్రేమ , జీవితం మీద శ్రద్దాసక్తులు- ఇలాంటివి మనం పోగొట్టుకున్నాం.ఎందుకిలా అయింది?మనం పోగొట్టుకున్నది ఏమిటి? ప్రజల జీవనపోరాటం ఎలాంటిది?ఎందుకు? అనే వెతుకులాటని ఈ కృతిలో రూపొందించాను.”

పై వాక్యాలతో నవలలో ఏమి ఉండబోతోందో అర్ధం అవుతుంది.రెండు తరాల ప్రకృతి ప్రేమికులు,యాత్రికులు ఒకే ప్రాంతానికి తరం అంతరంలో ప్రయాణిస్తే మారిన పరిస్థితులు, మారని పరిస్థితులు ,ప్రకృతిలో వచ్చిన మార్పులు.  ఈ బేధాన్ని సమాంతరంగా నడిపిన కథ.కర్ణాటక,కేరళ సరిహద్దులో గల కెంజాలలోయకు  మనమూ ప్రయాణం కట్టినట్లు,మైదాన ప్రాంతం దాటి అడవులు ,కొండలు గుండా ప్రయాణించి నట్లు సహానుభూతి పొందుతాం.

కథ లోకి వస్తే 1960 లకే వేగమంతమైన జీవన విధానం అందుకున్న మహానగరం బాంబే.15 ఏళ్లుగా ఒకే రకమైన దినచర్య గల అనంత్  ఓ పేరు అవసరం లేని ప్రయివేటు ఆఫీసులో పని చేస్తుంటాడు.అయిదు వందల రూపాయల జీతంతో మొదలైన అతని ఉద్యోగం రెండు వేల రూపాయలకు పెరగటం,ఓ కారు అదనంగా చేరటం తప్పితే ఎటువంటి మార్పూ లేని యాంత్రిక జీవనం.

భార్య,ఇద్దరు ఆడపిల్లలు, తమ స్వగ్రామంలో తల్లి అతని కుటుంబం.కారు  అతడి పై అధికారి తన అవసరానికి అడిగి తీసుకోవటం వల్ల అనంత్ ఆఫీసుకు బస్సులో తర్వాత లోకల్ ట్రైన్ లో చేసే ప్రయాణం మనమే ఆ ప్రయాణం చేసినట్లు అలిసిపోతాం.

ఆఫీసులో యాంత్రికమైన పలకరింపులు ,పెదవుల చివర్లన తెచ్చిపెట్టుకున్న నవ్వులు రోజూ మనం చూసే జీవితనాటకమే ఇందులో ఎవర్నీ తప్పు పట్టలేము.ఎందుకంటే మనమూ అలాగే అయిపోయాం అన్న స్పృహ కలిగిస్తారు రచయిత.

అయితే ఎడారిలో ఒయాసిస్సులా సర్వోత్తముడు అనే మిత్రుడు . ఇతని పేరే డిసౌజా గారు కావాలని పెట్టినట్లు ఉంది. సర్వోత్తముడు చాలా రోజుల సెలవు అనంతరం ఆఫీసుకు వస్తాడు.అతనిలో తిరిగి ప్రాణం పోసుకున్న జీవనాసక్తిని గుర్తించిన అనంత్ అతన్ని “ఇంత ఉత్సాహం గా ఎలా అయ్యావు? ” అని అడుగుతాడు. మా సొంత ఊరు వెళ్లి హాయిగా ప్రకృతిలో,అమ్మ దగ్గర ఈ యాంత్రికతని అంతా మర్చిపోయి గడిపాను అదే రహస్యం. నువ్వుకూడా వెళ్ళిరా కొన్ని రోజులు అని సర్వోత్తముడు సలహా ఇస్తాడు.

అనంత్ ఆఫీసులో రెండు నెలలు సెలవు మంజూరు చేయించుకుని.భార్యా పిల్లలను ఒప్పించి తల్లి దగ్గరకు ఒక్కడే బయలుదేరటంతో మన  ప్రయాణం కూడా మొదలవుతుంది.మొదటి పదిహేను పేజీలూ ఉగ్గబట్టకుండా నడిచిన నవల .అనంత్ తల్లి దగ్గరికి చేరిన దగ్గరి నుంచి హాయిగా, తాపీగా నడుస్తుంది.

డిసౌజా మాటల్లో అనంత్ ఊరి వర్ణన చూడండి
” డిసెంబర్ చలి.దట్టంగా పేరుకున్న మంచు లేలేత కిరణాల వెచ్చదనానికి కరిగే ప్రయత్నంలో ఉంది. ఇంటి ముందు భాగాన కొండ అంచు,వెనుక పోకతోట.దగ్గరగా అడవి.మంచుపరదా కప్పుకున్న చెట్లూ-చేమలు. రకరకాల పక్షుల సవ్వడులు తేలి వస్తున్నాయి.”

ఇలాంటి ఊరిలోని ఇంట్లో కన్నతల్లితో తీరికగా, బద్దకంగా తన యాంత్రిక జీవితం నుంచి కొంచెం ఎడంగా వచ్చేసిన అనంత్ పై మనకి కొంత అసూయ ఏర్పడక పోదు.బొంబాయి లో తమ హాలంత బాత్రూమ్ ఇక్కడ అందులో తమ నీళ్ళ ట్యాంక్ అంత గుండిగలో నీళ్ళు. పక్కనే పొడుగాటి తొట్టి నిండా నింపిన నీరు.పోక పట్టి తగిలిస్తే వాగులోనించి కావాల్సినంత నీరు తొట్లో పడే ఏర్పాటు. వళ్ళు రుద్దుకోవటానికి కుంజాల లోయ నుంచి నాన్న తెచ్చిన పియర్స్ సోప్ లాంటి రాయి.ఆ రాయిని చూడగానే అనంత్ కు తండ్రి ప్రస్తావనలో ఎప్పుడూ వచ్చే కుంజాలలోయ గుర్తుకు వస్తుంది.

కుంజాలలోయ గురించి తల్లిని అడుగుతాడు .మీ నాన్న ఎప్పుడూ చెప్పేవారు.పెళ్లికి ముందే ఆయన వెళ్లి వచ్చారు .ఆయన బయలుదేరింది మొదలు వెనుతిరిగి వచ్చేవరకూ జరిగినది అంతా ఓ పుస్తకం రాసి పెట్టారు,అంటూ కొడుక్కు పుస్తకం ఇస్తుంది.

“కుంజాల లోయకి” అని పెద్ద అక్షరాలతో రాసి పెట్టి ఉన్న పుస్తకం అది.తమ ఊరి నుంచి బయలుదేరి కుంజాలలోయ చేరేవరకూ ఎలా వెళ్ళాలో గీసిన పటం ,మధ్యలో వచ్చే ఊళ్ళు, వాగులు, చెరువులు, దొరువులు,కొండలు,గుట్టలు,పల్లెలు,గ్రామాలు,ఒకపల్లెనుంచి ఒక పల్లెకి వుండే దూరం ఇవన్నీ ఆ పటంలో సూచించి ఉంటాయి.

లెక్క కడితే అప్పటికి సరిగ్గా యాభై ఏళ్ళ క్రితం తండ్రి వెళ్లి ఉంటాడు.ప్రతి పది సంవత్సరాలకి పూసే కెంజాయ కుసుమం డిసెంబర్ నెలలో వికసించి సరిగ్గా పది రోజులు తన పరిమళాలు వెదజల్లుతుంది.

“కుంజాల లోయలో కెంజాయ కుసుమం” తండ్రి మాటల్లో లోయ వర్ణన , రచయిత డిసౌజా, అనువాదకురాలు ఉమ గారు కలిసి మనకు మాటల్లోనే ఆ లోయ ఎలా వుందో దర్శనం చేయిస్తారు.

ఇక  కెంజాయ కుసుమం వికసించిన తీరు చదివితే ఆ లోయకు మనమూ ప్రయాణం కట్టాలనిపిస్తుంది .చూడండి ఈ వర్ణన ” రెండూ రెండున్నర అడుగుల ఎత్తున్న చిన్న పొదలా అంతే వెడల్పున విస్తరించింది.చిత్రమేమిటంటే ఒక్క ఆకు కూడా లేదు ఉట్టి పువ్వులు, చెట్టునిండా పువ్వులే. సంపెంగపువ్వు ఆకారంలో ఉన్న పువ్వులు సన్నగా పొడుగ్గా రేకులు.ఈ దళాలు మృదువుగా,కోమలంగా పట్టులా మెరుస్తున్నాయి.మొక్క వెయ్యి రెమ్మలుగా చీలింది. ప్రతి రెమ్మకీ కాడల చివర లేతపచ్చని పుష్పపీఠం.పచ్చని పీఠంలో అణుకువగా కూర్చున్న మృదువైన రేకులు .

మొక్కలో ఎక్కడా పచ్చటి ఆకులు లేకపోవటంతో మొత్తము పొద ఎరుపెరుపుగా నిప్పుకణికలు రాసిపోసినట్టుగా కనిపించింది.సన్నగా గాలి వీస్తే పొద కంపించి ,అగ్ని సాచిన నాలుకలు అటూఇటూ కంపించినట్లుగా దృశ్యం మనోహరంగా.ప్రతికాడ చివరగా ఒక్కొక్క పువ్వు విడిగా ఉన్నట్లు కాక రెండు అడుగుల ఎత్తు,వైశాల్యం ఉన్న ఆ పొదే పే…..ద్ద కెంపు కుసుమంలా, లక్ష ఎర్రటి పూల నొక్క చోట రాశి పోసినట్లు దర్శనం ఇవ్వటం అసలు వింత.”

తండ్రి రామారావు పుస్తకం పట్టుకుని ఆ దారుల వెంట ప్రయాణించిన అనంత్ పొందిన అనుభవాలూ,మారిన పరిస్థితులు, తండ్రి రాసినట్లుగానే ఇంకా మారకుండా ఉన్న చక్కటి కుటుంబాలు .అడవి ,మైదానం,చివరికి లోయను చేరటం , ప్రకృతిలో సాగిన ఓ సాహస పూరితమైన ఆహ్లాద యాత్ర.

అయితే నశించి పోయిన ఎన్నో జీవజాతుల్లా,పుష్ప జాతుల్లా కెంజాయ కుసుమం పూయక పోవటం తీవ్రమైన నిరాశను కలిగిస్తుంది .ప్రకృతి హెచ్చరికనూ సూచిస్తుంది.

లోయలోకి సాగిన ఈ ప్రయాణం ఒక తరం అంతరంలో జరిగిన ప్రకృతి వినాశనం ఎంత మేర జరిగిందో తెలుపుతుంది.ప్రయాణంలో తండ్రి గత అనుభవం, కొడుకు వర్తమానం చూపుతూ రచయిత చేసిన ప్రయోగం .మన రెండు అరచేతుల్లో అడవిని పెట్టి అప్పుడు- ఇప్పుడు అని చూపినట్లు చూపారు.

కొద్దిగా భారమైన మనస్సుతో,ప్రకృతిలోకి ఓ చక్కటి ప్రయాణంతో ఈ నవలని ముగిస్తాం.మొదటి అనువాదం అనటానికి వీలులేని విధంగా ఉమాదేవి గారు రచయిత  డిసౌజా గారి నాడిని పట్టి చూపారు.ఎప్పుడో చేసిన అనువాద నవలే అయినా ఉమాదేవి గారిని ఇప్పుడు అభినందించక తప్పదు. 

*****

Please follow and like us:

2 thoughts on “కెంజాయ కుసుమం”

  1. అద్భుతం గాఉంది ఆ అందమైన లోయలోకి ఇప్పుడే వెళ్ళిపోవాలన్నంతగా నీ సమీక్ష కూడా ఆ పువ్వంత పరిమళభరితంగా ఉంది రాణెమ్మా

  2. నవల వెంటనే చదవాలనిపించేలా ఉంది సమీక్ష…పేరే అద్భుతం గా ఉంది..

Leave a Reply

Your email address will not be published.