“నెచ్చెలి”మాట 

“దేశసేవ”

-డా|| కె.గీత 

దేశసేవంటే గుర్తుకొచ్చింది!

మీరు “క్లీన్ హాండ్స్” అనే విషయం విన్నారా? 

“క్లీన్ హాండ్సా?”

అంటే “చేతులు శుభ్రంగా ఉంచుకోమనా?”  

లేదా 

“చేతులు శుభ్రం చెయ్యమనా?”

లేదా

రెండూనా?

“ఏవండీ, ఒక పక్క ప్రపంచం కరోనా బాధలో గిలగిలా కొట్టుకుంటూ ఉంటే ఈ క్లీన్ హాండ్స్/ హాండ్స్ క్లీన్  అవసరమా?”

అయినా  దేశసేవ అనే టైటిలేవిటి?  మధ్య ఈ “క్లీన్ హాండ్స్” గోలేవిటి? 

“హయ్యో! అక్కడికే వస్తున్నానండీ!”

అసలు దేశసేవ అంటే-

విదేశీ వస్తు  బహిష్కరణలో ఇంట్లో పనికిరాని వస్తువేదో త్యాగం చెయ్యడం

రంగుల “రాట్నం” ఎక్కి “రాట్నం” వడికినంత  ఫీలయ్యిపోవడం

ఇంచక్కా బడికి బంకు కొట్టి రోడ్లంపట జెండా పుచ్చుకు తిరగడం 

వంటివి కాకుండా –

స్వరాజ్యసమరంలో కత్తి దుయ్యడం…

సత్యాగ్రహంతో  జైలుకెళ్లడం..

స్వాతంత్ర్యం కోసం  ప్రాణాలకు తెగించడం… 

వంటివి కాకపోయినా –

ఏదో ఉడతాభక్తిగా

పొరబాటున దేశనాయకులు జోలె పట్టుకుని మనూరు వచ్చినపుడు ఉంగరమో, వాచీయో మనసా వాచా  కర్మణా డొనేషన్ చెయ్యడం కాదండీ!

అసలిప్పుడు ఈ కరోనా కష్టకాలంలో  దేశసేవంటే-

కాస్తోకూస్తో ఉన్నవారైనా బొత్తిగా లేనివారికి కాసిన్ని ఉప్పులూ, పప్పులూ, సబ్బులూ దానం చెయ్యడం

మీతోబాటూ మీ పొరుగు వారికీ ఆన్లైను లో హ్యాండ్ శానిటైజర్ తయారీ నేర్పించడం

మాస్కులు కుట్టో, చప్పట్లు  కొట్టో డాక్టర్లు , నర్సుల సేవలు హర్షించడం 

లేకపోతే 

ఒక దీపమో, కొవ్వొత్తో, టార్చిలైటో, సెల్ఫోనో  పుచ్చుకుని వాకిట్లో నిలబడ్డం-

కొంపా గూడూ లేక కాలినడకని వందల మైళ్లు వలసపోతున్న వాళ్లకి బతుకుల్లోనే వెలుతుర్లేకపోతే ఈ దీపాల గోలేవిటనుకుంటున్నారా! 

పోనీ ఇవేవీ కాకపోతే 

శుభ్రంగా మీ ఇంట్లో మీరు ఉన్నదేదో వండుకు తిని గడపదాటకుండా కునుకు తీయడం-

ఏవిటి  ఇదీ సేవే?! అనుకుంటున్నారా 

అదేమరి ఇవేళ్టి దేశసేవంటే!

అసలు విషయమేమిటంటే- 

ఒకప్పుడు దేశాల్ని  కాపాడుకోవాలంటే 

రణరంగంలోకి  దూకి యుద్ధాలు  చెయ్యాల్సి వచ్చేది!

కానీ ఇప్పుడు 

వైరస్  ఒకరి నుండి ఒకరికి పాకకుండా  ఎవరింట్లో వాళ్లు బుద్ధిగా కూచుంటే చాలు!!

అదన్న మాట సంగతి!

గంటకి పదిసార్లు  చేతులు శుభ్రంగా కడుక్కుని, ఉన్న చోట కదలకుండా కూచుంటే 

దేశసేవ మాత్రమే కాదు!

ప్రపంచ సేవ!!

మానవ సేవ మాధవ సేవ!!!

 ఇంతకీ  నా మాటేంటంటే-

ప్రాణాలకంటే ఏవీ ముఖ్యం కాదు! 

గోళ్లు గిల్లుక్కూచోవడం పెద్ద కష్టవేవీకాదు!! 

ఏవంటారు? 

 

*****

Please follow and like us:

6 thoughts on “సంపాదకీయం- ఏప్రిల్, 2020”

  1. Manaku manam chesikone seve desaseva , prapancha seva ani needi aina saililo chakkagaa cheppaavu. Abhinandanalu Geethaa.

  2. దేశసేవ కి కొత్త నిర్వచనాలు బాగున్నాయి గీత గారూ!

    1. సంపాదకీయం మీకు నచ్చినందుకు, చదివి అభిప్రాయం తెలిపినందుకు మీకు బోలెడన్ని నెనర్లు వసంతగారూ!

Leave a Reply

Your email address will not be published.