ఇట్లు మీ వసుధారాణి

మా వడ్లపురి

-వసుధారాణి 

గండికోటను ఇండియన్ గ్రాండ్ క్యాన్యన్.పెన్నా నది పలకలు పలకలుగా ఉన్న రాతి నేలని కొంచెం కొంచెంగా ఒరిపిడికి గురిచేసి, అరగదీసి గండి కొట్టింది. మూడు వైపులా పెన్నానది సహజ సిద్ధం గా ఏర్పరచిన గండి రక్షణ కందకంలా చేసుకుని ఆ కొండపై కోట కట్టారు .

గండికోటలో అలనాటి వైభవానికి గుర్తుగా ఎన్ని ఉన్నప్పటికీ, నన్ను అక్కడ ఆకర్షించిన కట్టడం ధాన్యాగారం .ఆరునెలల పాటు నిరవధికంగా యుద్ధం జరిగినా సరే, కోటలోని ప్రజలందరి ఆహార అవసరాలకు  సరిపడా ధాన్యం నిలువ చేసుకోగలిగినంత పెద్ద ధాన్యాగారం. రకరకాల ధాన్యాలను విడి విడిగా ఒక్కో విభాగంలో, ఒక్కో రకం ధాన్యాన్ని నింపుకోవటాని,బయటకు తీసుకోవటానికి వేరు వేరు ద్వారాలు ఏర్పరచిన గొప్ప అమరిక. ఆ ఖాళీ ధాన్యాగారం చూడగానే ఒక్కసారి దాని నిండుగా నింపడిన ధాన్యరాశులు ఊహకు వచ్చాయి.వెనువెంటనే నా చిన్నప్పుడు  మా ఇంట్లో వడ్లతో నిండివుండే మా ధాన్యాగారం మా వడ్లపురి గుర్తుకు వచ్చింది.

పూర్వం ప్రతి రైతు ఇంట్లో సర్వసాధారణంగా వుండే వస్తువు గరిశ లేదా గాదె లేదా గడ్డి వెంట్లతోనో,వెదురు తడికతోనో  నిర్మించి వుండే వడ్లపురి.వారి ఆహార అవసరాలను బట్టి,వారి వ్యవసాయ భూములను బట్టి వీటి కొలత ,సంఖ్య ఉండేవి.సాధారణంగా సంక్రాంతికి రైతు ఇంటికి ధాన్యలక్ష్మి చేరుతుంది. మా పొలాన కాస్త ఆలస్యం అయ్యేది.మేము డిసెంబర్లో వరి కోసి ,ఓదెలన్నింటినీ ఓ చోటికి చేర్చి సంక్రాంతిలోపు వరి కుప్ప చేలోనే వేసేవాళ్ళం.

వరి ధాన్యం ధర ఆ సమయంలో చాలా తక్కువగా ఉండేది.అందుకని మా రైతు ఫిబ్రవరిలో కుప్ప నూర్చేవాడు.ధాన్యం  ఫిబ్రవరి నెల మధ్య ఇల్లు చేరేది.సంక్రాంతి పండుగకు కొత్త బియ్యం కొంచెం నూర్పించి తెచ్చేదాన్ని.వడ్ల కంకుల మీద తొలిహక్కు మా ఇంటి పిచ్చుకలదే.కొన్ని కంకులు గుత్తులు గుత్తులుగా కట్టి చావిట్లో అక్కడక్కడా వెళ్ళాడ తీసేవాళ్ళం. పిచ్చుకలు వాటికి వెళ్లాడుతూ, ఊయలలు ఊగుతూ ధాన్యం తింటుంటే వాటిని గమనించే కొద్దీ  పిచ్చుకల భాష వచ్చేసిందా అన్నంత బాగా వాటి ఊసులు మాకు అర్థం అవుతుండేవి.

వీళ్ళీ కంకులు కట్టారుగాబట్టి సరిపోయింది వదినా! లేకపోతే పిల్లలకి తిండికోసం అక్కడిదాకా పోయిరావాల్సి వచ్చేది అని ఓ పిచ్చుక అంటే.మా వాడు ఊగటమే సరిపోతోంది వెధవ కంకులు కట్టారు.తిండి తింటే కదా అని ఓ పిచ్చుక విసుక్కుంటే.ఇలా అనుకుని నవ్వుకునే వాళ్ళం.

ఇక సంక్రాంతి అయ్యాక పాత పురిలో ఉండే కొద్దోగొప్పో వడ్లు తీసి బస్తాల్లో నింపేసి కొత్త పురి సన్నాహాలు మొదలు పెట్టేవాళ్ళం.మా రూపెనగుంట్లలో చలమయ్య వడ్లపురి కట్టటంలో నేర్పరి. సంక్రాంతికి నెల ముందునుంచి అతనికి తెగ డిమాండు.పేటకి వచ్చి మా ఇంట్లో పనిచేసి సినిమాకి వెళ్లటం సరదా కనుక, నేను ఎప్పుడు రూపెనగుంట్లలో కనపడ్డా  రాణెమ్మా పని ఏమన్నా ఉందా ?

ఇంటి కాడ అని అడిగే వాడు.అతను ఇంటికి వచ్చినప్పుడు అతనికి భోజనం పెట్టటం నాకు సరదాగా ఉండేది , ఎంత వడ్డించినా వద్దు అనకుండా తినేవాడు. అతని తరువాత అలా పని చేసేవారిని,అలా ఆహారం తినగలినిన వారిని నేను మళ్ళీ చూడలేదు.

  చలమయ్య ఉదయాన్నే వచ్చి చద్దన్నం పెడితే తినేసి పని మొదలు పెట్టేవాడు .మొదట కింద ఇసుక పోసి, దానిపై మాచర్ల బండలు పరిచి, ఓ వరుస ఎండుగడ్డి పల్చగా పేర్చి , గోతం పట్ట(ఇప్పటిలా ప్లాస్టిక్ గోతాలు కావు నార గోతాలు) గడ్డిపైన తివాచీలా పరిచేవాడు.మొత్తం ఈ కింద ఏర్పరచిన గద్దె లాంటి ప్రాంతం అంతా గుండ్రంగా ఉండేలా చూసుకునే వాడు చిన్న కొయ్యముక్కల్ని పాతి  పురికొస వాటికి కట్టి గుండ్రటి ఆకారం సరిగ్గా వచ్చేలా పెట్టుకునే వాడు.అందరూ పురి బయట కట్టుకుంటే మేము మాత్రం మా చావిడి పెద్దది గా ఉంటుంది కనుక ఇంట్లోనే ఓ పక్క వేయించుకునే వాళ్ళం.

ఇలా గద్దె తయారు అయ్యాక. ఎండు గడ్డివాము నుండి గడ్డి లాగి, కొంచెం కొంచెం గడ్డిని చేర్చుకుంటూ రెండు చేతులతో పట్టుకునేంత లావు గడ్డి ఎంట్లు అల్లేవాడు.మధ్య మధ్య అది నిలవడం కోసం గడ్డి తోనే కట్లు వేసేవాడు.పది పది అడుగుల పొడవైన వెంట్లు అల్లి అలా పేరిస్తే కొత్త గడ్డి అవ్వటం వలన అవి పసుపుపచ్చని కొండచిలువల్లా ఉండేవి.

లావుపాటి గడ్డి ఎంట్లను గద్దెపై గుండ్రంగా చుట్టుకుంటూ గడ్డి పరకలతో వరసలను కలిపి కట్టుకుంటూ మా చలమయ్య ఏమి సేతురా? లింగా !

 అంటూ సుద్దులు కూడా  పాడుతుండే వాడు.

అన్నీ ప్రకృతి సిద్ధమైనవి మరియు తీసివేశాక మళ్ళీ ప్రకృతికి ఎటువంటి హానీచేయకుండా ప్రకృతిలో కలిసిపోయేవి అయిన వస్తువులతో చేసే ఆ గడ్డి ఎంట్ల వడ్లపురి నా దృష్టిలో ఓ అద్భుతం.

అలా సహజసిద్ధమైన వనరులతో తయారైన వడ్లపురి నిండా మాకు ,మా సావిత్రి అక్కయ్య వాళ్లకు కావాల్సిన వడ్లు పోసి నింపే వాళ్ళం.ఇంట్లోనే ఉండేది కనుక , వర్షానికి తడవదు కనుక ఇక దాని పైన గడ్డి కప్పు వేయకుండా , రెండు వరుసలుగా కుట్టిన గోతాల పట్టని కప్పి ఉంచే వాళ్ళం.అవసరం అయినప్పుడు పట్టను తొలగించి పురిలోకి దిగి వడ్లు గోతాల్లోకి తోడటం ఓ గొప్ప అనుభూతి.పొలంలో పంట పండించటం ఒక ఎత్తయితే, పురిలో ధాన్యం తోడటం మరో ఎత్తు.బంగారు గనిని తవ్వుకుంటున్నట్లు,నిధి ఏదో మన ఇంట్లోనే ఉన్నట్లు అనిపించేది.

డబ్బు వినియోగం ఉన్నా, ఇంకా వస్తుమార్పిడి పోని రోజులు అవి చిలకడదుంపల బండి ఇంటి దగ్గరికి వస్తే వడ్లు పోసి చిలకడదుంపలు కొనుక్కోవటం,ఉల్లిపాయలు ముఖ్యంగా తాటిముంజెల అమ్మి ఒకామె వడ్లకు మాత్రమే ముంజెలు ఇచ్చేది అదేంటో డబ్బులకు అమ్మేది కాదు.అలాంటప్పుడు మా వడ్లపురి బ్యాంకులా అనిపించేది.

ఇక ఇంట్లో ఏ వస్తువు కనపడక పోయినా పురిమీద చూడు అన్నది తప్పని సరి మాట.స్కూల్ బ్యాగులు,పరీక్ష అట్టలు, ఇంట్లో వాళ్ళకి కనపడకుండా దాచాల్సిన నా పని ముట్లు ( క్యాట్ బాల్,సైకిల్ చైన్ ఇత్యాది వస్తువులు ) అన్నీ ఆ పురిని అలంకరించేవి.పిల్లికూనలు చలికాలంలో వెచ్చగా పురి ఎక్కి ముడుక్కుని పడుకుని ఉండేవి.

అష్టఐశ్వరాల సంగతి ఏమో కానీ ఇంటికైనా,దేశానికైనా ధాన్యలక్ష్మి నిండుగా ఉండటం ఓ అదృష్టం ,గొప్ప ధైర్యం.ఇనుపపెట్టె నిండా డబ్బున్నా, ప్లాస్టిక్ మనీ ఎన్ని కార్డులు వున్నా, ఆ నట్టింట వడ్లపురి ఇచ్చినంత తృప్తి మరే సంపదా ఇవ్వదు అనిపిస్తుంది నాకు ఈ నాటికీ.

నెచ్చెలి ఆవిర్భావ ప్రత్యేక సంచికలో మరో కథతో కలుద్దాము.అందాకా ఇట్లు మీ వసుధారాణి.

*****

Please follow and like us:

One thought on “ఇట్లు  మీ వసుధా రాణి- మా వడ్లపురి”

  1. కథాత్మక శైలిలో,ఆసక్తికర కథనంతో మీ వచనం బాగుంటుంది.
    రేడియోలో యశోదారెడ్డి ముచ్చట్లు ఇలాగే వుండేవి.
    పాతరోజుల జ్ఞాపకాల లో మా ఇంట్ల ‘కాగు’ గుర్తు కొచ్చింది.
    అభినందనలు.

Leave a Reply

Your email address will not be published.