నూజిళ్ల గీతాలు-3(ఆడియో)

తెలియనే లేదు…

-నూజిళ్ల శ్రీనివాస్

పల్లవి:

తెలియనే లేదు…

అసలు తెలియనే లేదు ..

తెలియనే లేదు…

నాకు తెలియనే లేదు ..

ఎలా గడిచేనో కాలం తెలియనే లేదు…

ఇలా ఎప్పుడేదిగానో తెలియనే లేదు…

నిన్నదాక నే పొందిన అనుభవాలన్నీ

జ్ఞాపకాలుగా మారుట తెలియనే లేదు..!

 

చరణం-1:

పల్లె లోన అమ్మ నాన్న తోన ఆట

లాడుకున్న రోజు మరవనే లేదు

ఇంతలోనే మనుమలొచ్చి నన్ను తాత

అంటుంటే అర్థం కావటం లేదు

పలక పట్టుకొని బడిలోకి పోయిన

గుర్తులు ఇంకా మాయనే లేదు

పదవీ విరమణ ఎప్పుడు జరిగేనో

నాకు అసలు అర్థం కాదు!

 

చరణం-2:

అర్ధనా, కానీలతో కొన్న తీర్థాల

అప్పచ్చి తీపిని మరవనే లేదు

తీపి వద్దనేటి మాయ మధుమేహం

ఎప్పుడంటుకొందో అర్థమే కాదు

కోతి కొమ్మచ్చిలో చెట్టు పుట్టలెక్క

తగిలిన దెబ్బలు తగ్గనే లేదు

అడుగు వేయలేని మోకీళ్ళ బాధలు

ఎప్పుడు వాలేనో అర్థం కాదు!

 

చరణం-3:

పెళ్ళైన చావైన పిల్లలందరూ కూడి

సందడి చేయుట మరవనెలేదు

అన్నింటికీ నేను పెద్దగా మారిన

మార్పెప్పుడొచ్చేనో అర్థం కాదు

పగలు రాత్రి అమ్మ ఒడిలో అనందంగా

నిద్దుర పోయింది మరవనే లేదు

నిద్దుర పట్టని బాధలిట్లా నన్ను

చుట్టూ ముట్టిందెపుడో అర్థమే కాదు!

 

చరణం-4:

అన్న దమ్ములతొ, అక్క చెల్లెళ్ళతో

పంచుకున్న ప్రేమ మరువనే లేదు

ఆస్తి పాస్తుల్లోనా పొలము పుట్రా లోన

వాటాలు పంచుట అర్థమే కాదు

పండగ రోజుల్లో అమ్మ తలంటిన

జుట్టు తడి ఇంకా ఆరానే లేదు

పండగ సందడి మాయం చేసేసిన

ఒంటరి బతుకసలర్థం కాదు..!

 

చరణం-5:

ఉంగరాల జుట్టు నూనూగు మీసాల

గర్వము నేనింకా మరవనే లేదు

ముగ్గు బుట్టైనట్టి జుట్టు రాలి పోయి

ముదుసలి నైనది అర్థం కాదు

అందమైన బతుకు నిమ్మని దేముడికి

చేసిన ప్రార్థన మరవనే లేదు

అంతలోనే ఈ ఆఖరి గడియలు

ప్రాప్తించుటన్నది అర్థమే కాదు…!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.