“నెచ్చెలి”మాట 

“స్వేచ్ఛ”

-డా|| కె.గీత 

“స్వేచ్ఛ” అంటే ఏవిటి?

“స్వేచ్ఛ ఒకరు ఇచ్చేది కాదు. మనకు మనమే సంపాదించుకునేది”  

లాంటి గంభీరమైన నిర్వచనం కాకుండా మామూలు భాషలో చెప్పగలరా?

అదేనండీ 

ఇళ్లలో ఇన్నేసి వారాలు కాళ్లు కట్టిపడేసినట్లు ఉన్న మనందరికీ లాక్ డౌన్ ఎత్తెయ్యంగానే  కలిగిన అద్వితీయమైన ఆనందాన్ని నిర్వచించుకునే మాటలన్నమాట-

అబ్బా మళ్లీ భాషా గంభీరత!

ఓకే- 

సింపుల్ మాటల్లోకి వద్దాం- 

జనరల్ రైలు కంపార్టుమెంటులో ఒకళ్ల మీద ఒకళ్లు నిలబడడం –

కిక్కిరిసిన సిటీబస్సులో ఒంటి కాలు మీద వేళ్ళాడడం – 

సంతలో మనుషుల్ని తొక్కుకుంటూ తోసుకుంటూ కూరగాయల కోసం ఎగబడడం-

“అదేవిటి? ఇవన్నీ ఇబ్బందులు కదా” 

అదే మరి! 

“ఇబ్బందులు” అనేది పాతమాట!

“తీపిజ్ఞాపకాలు” అనేది కొత్తమాట!!

“స్వేచ్ఛ” అంటే గుర్తుకొచ్చింది 

ఇటీవల “స్వేచ్ఛ” కి కొత్త నిర్వచనాలు ఏవిటంటే 

స్నేహితులో, చుట్టాలో ఇంటికొస్తే గేటు దగ్గిరికే ఎదురు పరుగెత్తుకెళ్లి చుట్టుకోవడం-

పెళ్ళిళ్లని, పేరంటాలని గుంపులు గుంపులుగా  ఒక్కచోట చేరి కబుర్లాడుకోవడం-

రద్దీ క్యూల్లో తోసుకుంటూనైనా టికెట్ సంపాదించి మొదటి రోజే  హాల్లో సినిమా చూడ్డం- 

వంటివి కాకపోయినా

కనీసం ఆరడుగుల దూరాల్ని అడుగుకి కుదించడం-

వీథి చివరి వరకూ  మాస్కు లేకుండా నడవ గలగడం-

గుర్తొచ్చినా చేతులు కడక్కుండా అన్నీ హాయిగా ముట్టుకోవడం- 

అసలు 

ఎవరింటికైనా, ఎప్పుడైనా వెళ్లి తలుపు కొట్టడం-

పనున్నా  లేకపోయినా పక్కింటికెళ్లి  బాతాఖానీ వెయ్యడం-

పొద్దస్తమానూ స్నేహితులిళ్లకే  అతుక్కుపోవడం…..

అబ్బ! ఇంత స్వేచ్ఛ ఉంటే ఎంత బాగుణ్ణో కదా!

మొత్తానికి 

కరోనా పుణ్యమా అని “స్వేచ్ఛ” ఎంత విలువైందో  నాకు బాగా బోధపడింది! 

మరి మీకు?


*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.