జలపాతం (పాటలు) -1

ఓ కన్నమ్మా

-నందకిషోర్

||నా స్వాస తీసుకోవే ఓ కన్నమ్మా

నా లాలి అందుకోవే||


కోనేటి దారుల్లో కలువా పందిరినీడ

చేపా కన్నూపిల్లా చెంగూన దూకింది

ఉమ్మనీరు ఉబికినాదే నా కన్నమ్మా

నిదురాపో నిదురాపోవే


సంపెంగవాగుల్లో సిలకలాగుట్టకాడా

నెమిలి కన్నూపిల్లా నెమ్మదిగా ఆడింది

అడవంతా తిరిగినాదే నా దేవమ్మా

నిదురాపో నిదురాపోవే


చిట్టి చిట్టి ఓనగాయా చింతకిందికి రమ్మంది

పచ్చ పచ్చ కందిచేను పసుపు రాయామంది

కళ్ళు రెండు తడిసినాయే ఓ చిగురమ్మా

నిదురాపో నిదురాపోవే


పొద్దుతిరిగే తావుల్లో పొన్నపూలు రాలినాయి

ముగ్గులేసే వాకిల్లో చీమలెన్నో చేరినాయి

కాళ్ళు రెండు లాగినాయే ఓ ఉడుతమ్మా

నిదురాపో నిదురాపోవే


పనికెళితే మీ నాన్న పట్టాపగలయ్యింది

తిరిగొస్తే మీ నాన్న సుక్కాపొద్దయ్యింది

నాన్నొచ్చి ఎన్నెలేనే నా మబ్బమ్మా

నిదురాపో నిదురాపోవే


భయమేస్తే మీ నాన్న కథలెన్నో చెపుతాడు

చేయేసి మీ నాన్న జోజో అని కొడతాడు

నానొస్తే నవ్వూలేనే నా చిలకమ్మా

నిదురాపో నిదురాపోవే


వరిసేలా రేగళ్ళో జొన్నాలు మొలిసాయి

పిగిలీ పిట్టలు రెండూ నీపేరు కూసాయి

పాటేదే పరిగలేవే నా నేలమ్మా

నిదురాపో నిదురాపోవే


తగిలితే నీ చేయి తంగేడు పువ్వుల్లు

కదిలితే నీ కాలు చిరుగజ్జె సప్పుళ్ళు

‘ఉయ్యాలో’ ఊగుతావే నా బతుకమ్మా

నిదురాపో నిదురాపోవే


తమ్ముళ్లు చెల్లెల్లు నీ వెనకే వొస్తారు

తాతయ్యా అమ్మమ్మా నీ లాల పోస్తారు

ఉగ్గేసి ఉంగా ఉంగా నా బుజ్జమ్మా

నిదురాపో నిదురాపోవే  

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.