రమణీయం

బుద్ధుని జీవితం-ధర్మం-1

-సి.రమణ 

గౌతమ బుద్ధుని జీవితం గురించి పాఠశాల రోజులలో చదువుకున్నాం.  ఊరు, పేరు, తల్లిదండ్రులు, జననం  మరియు జ్యోతిష్య పండితుల ఉవాచ వలన, తండ్రి శుద్ధోధనుడు, చిన్ననాటి నుండి, జాగరూకతతో పెంచడం మనకు తెలిసినదే. తండ్రి ఎంత రాజభోగాలు మధ్య పెంచినా, రాచరికపు యుద్ధవిద్యలు అన్నీ నేర్పించాడు. ఆ విద్యలలో సిద్ధార్థుడు అసమాన ప్రతిభ చూపే వాడు. అయితే  మనసు మాత్రం కరుణ, దయ వంటి మానవీయ గుణాలతో నిండి ఉండేదని, దేవదత్తుని కథ వలన తెలుస్తుంది. చిన్నతనం లో ఒక రోజు దేవదత్తుడు బాణం వేయగా,  నేలకొరిగిన హంసను రక్షించి, పరిచర్యలు చేసి, బ్రతికిస్తాడు.

ప్రపంచానికి జ్ఞానబోధ  చేసిన బుద్ధుడు, కని పెంచిన తల్లిదండ్రులను, భార్యను, కన్నబిడ్డను, రాజ్యాన్ని, రాజభోగాలను వదిలి, ఎవరికీ చెప్పకుండా, అర్ధరాత్రి పరివ్రాజకుడై వెళ్ళిపోయాడు.  బుద్ధుడిని ప్రేమించేవారికి, బుద్ధుడి మీద గౌరవం ఉన్న వారికి, ఇలా జరిగిందంటే, నమ్మబుద్ధి అయ్యేది కాదు . హఠాత్తుగా ఒక శవాన్ని చూసో, లేక ఒక రోగిని, ఒక ముసలి వాడిని చూసో కలత చెంది కృంగిపోయేటంత, సర్వం త్యజించి వెళ్ళిపోయేటంత,  మానసిక బలహీనుడు కాదు సిద్ధార్థుడు. 

పదహారవ యేట, దగ్గర బంధువు అయిన యశోధరను వివాహమాడి, ఆనందమయ జీవితం గడుపుతున్నా, రాజభోగాలను అనుభవిస్తున్నా, అతని మనస్సు, కష్టాలు, వేదనలతో ఉన్నవారిని, జబ్బులతో బాధపడుతున్న వారిని, జవసత్వాలు ఉడిగిన వృద్ధులను చూసి అలజడి చెందేది. వీరి కష్టాలు, బాధలు ఏ విధంగా తీరుతాయి? వీరి దుఃఖాలకు, మూల కారణాలు ఏమిటి? ఎక్కడ అవి పుడుతున్నాయి, ఎలా  నశిస్తాయి? వ్యధలు, కన్నీళ్లు లేని శాంతిమయ జీవితం ప్రజలు ఎలా పొందగలరో, తెలుసుకోవాలి అనే ఆలోచనలతో,  మధనపడుతూ ఉండేవాడు. తన ప్రశ్నల పరిష్కారమార్గ అన్వేషణలో సర్వసంగ పరిత్యాగం చేస్తాడు. తల్లితండ్రులు వలదని వారిస్తారు, దుఃఖ పడతారు. భార్య యశోధర మౌనంగా ఉంటుంది. ఒక రోజు పగటిపూట, రాజభవనం వదిలి, అశ్వసారధితో బయలుదేరి, కొంత దూరం వచ్చి, తన ఆభరణాలు, వస్త్రాలు అతనికిచ్చి వెనక్కు పంపుతాడు. సిద్ధార్ధుడు సన్యాసి వస్త్రాలు ధరించి, కాలి నడకన తన అన్వేషణ ప్రారంభిస్తాడు.

మహాభినిష్క్రమణం తరువాత, సిద్ధార్థుడు ప్రసిద్ద గురువులను కలిసి వారి బోధనలను, సాధన పద్ధతులను అనుసరించాడు. తన అన్వేషణకు సమాధానం దొరకలేదు. ఇంద్రియాలను అదుపు చేస్తూ ,భావోద్వేగాలను అణచివేసి,  శరీరాన్ని కృశింపజేసి, దుఃఖ విముక్తి మార్గాన్ని కనుగొనవచ్చని, ఆరు సంవత్సరాలు కఠోర సాధన చేశాడు. అయినా సంతృప్తికరమైన సమాధానం పొందలేకపోయాడు. బయట ప్రపంచంలో తన ప్రశ్నలకు జవాబు దొరకదు అని గ్రహించి,  అంతఃశోధన పై మనసు లగ్నం చేసి, హేతుబద్ధంగా సత్యాన్వేషణ చేయనారంభించాడు. ఇప్పుడు బుద్ధ గయ అని పిలువబడే ప్రాంతంలో  నిరంజా నది ఒడ్డున ధ్యానం చేస్తుండగా,  ఒకనాటి రాత్రి సమయంలో,  బోధి (జ్ఞానం)  పొందాడు. ప్రజలను దుఃఖమయం చేస్తున్న కారణాలను కనుగొన్నాడు. హేతుబద్ధమైన సత్యాన్వేషణలో, జ్ఞానోదయం పొందిన సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు. 

తరువాత, గౌతమ బుద్ధుడు తన సహచరులైన  పంచ బిక్షువులకు సారనాథ్ లో మొదటి సందేశాన్ని బోధించాడు. ఆ తదుపరి 60 మంది బిక్షువులతో సంఘం ఏర్పరిచి, ధర్మాన్ని బోధించటం ప్రారంభించాడు.. బోధి  పొంది, బుద్ధుడయిన సిద్ధార్థుడు, బోధి (జ్ఞానం) పొందినవారు  ఎవరైనా  బుద్ధులు అవుతారని, తనకు ముందు బుద్ధులు ఉన్నారని, తన తర్వాత కూడా బుద్ధులు ఉంటారని స్వయంగా చెప్పాడు 

అలాగే ఇది పవిత్ర గ్రంథాలలో చెప్పబడిందని, సాంప్రదాయంగా  వస్తున్నదని, సమర్ధుడైన వ్యక్తి  చెప్పాడు అని, గురువు చెప్పాడని, ఏ విషయం, సత్యంగా  స్వీకరించవద్దు. కుశలమయినవి, సరి అయినవి అని మీకు మీరు స్వయంగా పరిశోధించి, స్వయం అనుభూతి, అనుభవాలతో  నిర్ధారణ చేసుకొన్న విషయాలను అంగీకరించండి. అకుశలమయినవి, అసత్యమైనవి నిరాకరించండి. తథాగతుడు, తనను సైతం పరిశీలించి చూడాలని బిక్షువులకు బోధించాడు. 

సిద్ధార్థుడు తన 35వ ఏట  బోధి పొందినప్పటినుండి , 80వ ఏట  కుశినార అనే గ్రామం లో పరినిర్వాణం పొందే వరకు, 45 సంవత్సరాలు, కాలినడకన దేశ పర్యటన చేస్తూ, ధర్మప్రచారం చేశాడు. రాజులకు, బ్రాహ్మణులకు, వ్యాపారులకు, బిచ్చగాళ్లకు, పండిత  పామరులకు, స్త్రీ, పురుషులు అనే భేదం లేకుండా, అందరికీ ధర్మ బోధన చేసాడు. వారి సందేహాలను నివృత్తి చేసే వాడు. ఏ విధమైన కుల, మత, వర్గ వంటి సామాజిక భేదాలు పాటించలేదు. ఎంతో మంది బిక్షువులను చేర్చుకుంటూ, సంఘాలను ఏర్పరుస్తూ, విహారాలు నిర్మించుకుంటూ, బౌద్ధం సర్వత్రా వ్యాపించింది. 

నేటి మన సమాజంలో, కొంతమందికి ఉన్న అపోహ ఏమిటంటే, బౌద్ధం అంటే నిరాశావాదం, శూన్య  వాదమని; సర్వం పరిత్యజించిన బిక్షువుల కోసమని. నిజానికి, ఆ కాలంలో బిక్షువులే కాదు, గృహస్తాశ్రమం లో ఉన్నవారు కూడా, బౌద్ధ ధర్మాలను పాటించేవారు. బౌద్ధం అంటే మతం కాదు. మతాలలో ఉండే కర్మకాండలు, మూఢనమ్మకాలు, దురాచారాలు, కట్టు కథలు ఏమీ ఉండవు. ధర్మబద్ధమైన, హేతుబద్ధమైన, సత్యబద్ధమైన, చైతన్యవంతమైన జీవన విధానమే బౌద్ధం.

బుద్ధుని మహానిర్వాణం తర్వాత, ఆయన శిష్యులు, బుద్ధుని బోధనలను త్రిపిటకలు అనబడే మూడు సంకలనాలుగా నిక్షిప్తం చేశారు; రాబోయే తరాల వారి ప్రయోజనం కోసం. పలు ధేరవాద (హీనయాన) పెద్దలు, బిక్షువులతో, త్రిపిటకముల, నిరంతర మౌఖిక పఠనం, కొన్ని తరాల పాటు నిరాటంకంగా సాగించారు. బిక్షువులు అందరూ సామూహికంగా సాగించే ఈ మౌఖిక పఠనం లో, ఒక ప్రత్యేకత ఉండేది. సమూహంలో ఒకరు, ఏదైనా మర్చిపోతే, ఇతరులు గుర్తు చేస్తారు. ఎవరైనా ఒక పదం చేర్చడం గాని, తీసి వేయడం కానీ చేస్తే మరొకరు దానిని  సరిదిద్దుతారు. నిరంతర మౌఖిక  పఠన సాంప్రదాయం ద్వారా, బుద్ధుని బోధనలు శుద్ధ రూపంలో మనకు అందించగలిగారు. క్రీస్తుపూర్వం ఒకటవ శతాబ్దం లో వాటిని అక్షరబద్ధం చేశారు.

ప్రాచీన సాంప్రదాయ బౌద్ధాన్ని థేరవాదం అంటారు. తదుపరి కాలంలో అనేక శాఖలుగా విస్తరించిన వాటిలో ముఖ్యమైనది మహాయానం. థేరవాదానికి మహాయానానికి మధ్య ఆచారాలు, నమ్మకాలలో భిన్నత్వం ఉంది. కానీ, బుద్ధిని బోధనల విషయంలో ఏకాభిప్రాయం ఉంది. అత్యున్నతమైన బుద్ధుని ఆలోచనా సరళి, ఆయన బోధించిన  బోధనలు, నిర్వచించిన ధర్మాలు, శుద్ధ రూపంలో, మనకు అందడం వరంగా భావించాలి. 

ప్రాచీన బౌద్ధ గ్రంథాలు అనబడే త్రిపిటకలు పాళీ భాష లోనూ, బౌద్ధ ఆగమాలు సంస్కృత భాషలోనూ ఉన్నాయి. ఆ రెండు భాషలు ఉత్తర భారతంలో నాటి ప్రాచుర్య భాషలు. బౌద్ధ  భిక్షువులు వర్షా కాలం మాత్రమే విహారాలలో ఉండి, మిగిలిన అన్ని ఋతువులలో ధర్మ ప్రచారాలలో, ప్రబోధనలలో పాల్గొనేవారు. బహుజన హితం, బహుజన సుఖం కావున, దుఃఖ పూరితమైన లోకం పట్ల సహ అనుభూతితో, ఆది మధ్య అంతాలందు, ఉన్నతమైన ధర్మాన్ని బోధించండి అన్న బుద్ధుని వాక్కును, ఎల్లవేళలూ పాటించేవారు.

మానవుని దుఃఖ విముక్తుడిని చేయడానికే, బుద్ధుని  ప్రబోధాలు కేంద్రీకరించ బడ్డాయి. గౌతమ బుద్ధుని బోధనలైన, నాలుగు ఆర్య సత్యాలు, పంచశీలాలు, అష్టాంగ మార్గములు, దశపారమితులు గ్రంధస్థం చేశారు. అయితే వాటిలో ఏమి చెప్పారో, అర్థమయ్యే రీతిలో, ప్రజలందరికీ అవి చేరాలి. పంచశీలాలు, అష్టాంగ మార్గము, దశపారమితులు పాటించిన, పాటించడానికి ప్రయత్నం చేసినా, చెడు తగ్గించుకుని మంచిని పెంచుకునే ప్రయత్నమే అది. ఆచరణ, సాధన, మానవుడిని పరిపూర్ణమైన వ్యక్తిత్వంతో తీర్చిదిద్దుతాయి. అప్పుడు బుద్ధుడు కోరుకున్న దుఃఖరహిత, శాంతిమయ, ఆనందకర జీవితం అందరూ పొందుతారు.

బుద్ధుని మహా నిర్వాణం తరువాత, కొన్ని శతాబ్దాలపాటు పరిఢవిల్లిన బౌద్ధాన్ని, కాలక్రమేణా హిందూత్వ రాజులు, బ్రాహ్మణ రాజులు,  వైదిక  బ్రాహ్మణులు, క్రూరంగా బిక్షువులను హింసించి, బౌద్ధాన్ని అణచి వేశారు. బిక్షువులు, ప్రతిఘటనలు, హింసలు భరించారు కానీ, ప్రతి హింస చేయలేదు. తప్పించుకున్న బౌద్ధ బిక్షువులు, విదేశాలకు తరలి వెళ్లారు.  అక్కడ ఇంకా బౌద్ధాన్ని ఆదరిస్తూ ఉండటం వలన, బిక్షువులు బౌద్ధాన్ని అచరిస్తూ, బోధిస్తూ, కొనసాగించారు.

ప్రపంచవ్యాప్తంగా బౌద్ధం పట్ల ఆసక్తి కలుగుతుంది. అనుసరించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. అనేక దేశాలలో, 50 కోట్లకు పైగా ప్రజలు, బౌద్ధ తత్వాన్ని ఆచరిస్తున్నారు. పెక్కు అధ్యయన కేంద్రాలు నెలకొల్పబడుతున్నాయి. బౌద్ధ బిక్షువులు విహారాలకు, పాళీ గ్రంథాలకు పరిమితం కాకుండా, విదేశీ భాషలు, ఆధునిక శాస్త్రాలు నేర్చుకుని, సమాజ సేవ కోసం బయటకు వస్తున్నారు. దుఃఖ నిర్మూలనకు, నూతనోత్సాహంతో పని చేస్తున్నారు. బౌద్ధ సాహిత్యం, పలు ప్రపంచ భాషలులోకి అనువదించబడింది. అక్కడక్కడ, అనువాదకులు భాషను తప్పుగా అర్థం చేసుకుని, వక్రీకరించిన వ్యాఖ్యానాలు చేయడం వలన, పాఠకులు తప్పు దోవ పడటం జరుగుతుంది. ప్రాచీన బౌద్ధ భాష అయిన పాళీ భాషను అర్థం చేసుకోవడం, ఆనాటి సామాజిక నియమాలు, నైతిక విలువలు, భావజాల సంస్కారాలు, భావవ్యక్తీకరణ అర్థం కావడం ఆధునిక అనువాదకులకు కష్టమే. ఆనాటి కొన్ని పదాలకు నేటి అర్థాలు, అర్థం చేసుకునే విధానంలో, స్పష్టమైన తేడా ఉంది, మనకు తెలిసిన, మన సమాజంలో వాడుకలో ఉన్న పదాల అర్థాలకు మించి తెలియనివి, 

తెలుసుకోవలసినవి అనేకం ఉన్నాయి. 

ఆర్య సత్యాలు మానవులు అనుభవిస్తున్న దుఃఖం గురించి, అష్టాంగమార్గం దుఃఖ విమోచన కోసం ఆచరించవలసిన మార్గాల గురించి చెప్తాయి. దశపారమితులు మానవునికి ఉండవలసిన సత్ గుణాల గురించి తెలియచేస్తాయి. వాటి గురించి మరోసారి మాట్లాడుకుందాం.   


*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

One thought on “రమణీయం-బుద్ధుని జీవితం-ధర్మం-1”

  1. Ramana garu I used to like Sanjiv Dev on Buddism, yours is equally good and you have explained Buddist thought very clearly. You can competently write some more articles on the subject

Leave a Reply

Your email address will not be published.