షర్మిలాం “తరంగం”

-షర్మిల కోనేరు 

ఇల్లాళ్లూ వర్ధిల్లండి!

 

” పాపం పొద్దున్నుంచి ఇంటెడు చాకిరీ , అందుకే మా అవిడకి సాయం చేస్తున్నా ‘” అని ఈ మధ్య మగాళ్ల నుంచి ఎక్కువగా వినిపిస్తున్న మాట !
కరోనా తల్లి పుణ్యమా అని ఇండియాలో మగాళ్ళూ కాస్త వంటింటి వైపు చూస్తున్నారు .
మార్పు మంచిదే !
కానీ నన్ను ఎప్పుడూ ఒక ప్రశ్న ఎప్పుడూ వెంటాడుతుంది .
ఆ ఇంటి పని ఆవిడదేనా ? మరి ఇల్లు అందరిదీ కదా ?
కానీ ఆడాళ్లే ఇంటి పని నా బాధ్యత అనుకుని చేస్తారు .
మగాళ్ళు హెల్ప్ మాత్రమే చేస్తారు .
మగాళ్ళకి వాళ్ళకి ఇష్టమైనప్పుడే ఇంటి పని చేసే వెసులుబాటు వుంటుంది .
ఆడాళ్ళు కూడా వాళ్ళకి ఇష్టమైనప్పుడే పని చేస్తే ఏమవుతుంది ?
ఏమవుతుందో వేరే చెప్పాలా ఇల్లు అల్లకల్లోలమవుతుంది .
మా ఆయనకి స్టవ్ వెలిగించడం కూడా రాదండీ అని మొగుళ్ళని పాడు చేసే పతివ్రతలున్నారు .
“ఏ వంట నేనే చెయ్యాలా ? ఇవ్వాళ నువ్వు చెయ్యి “! అని అడిగే దమ్మున్న ఆడపిల్ల ఇంకా పుట్టలేదు.
లేదా నేను చూడలేదో !
కాకపోతే అయ్యగారికి ముచ్చటేసినప్పుడు వంటింట్లో ఇంటర్నేషనల్ షెఫ్ లెవల్లో ఏదో వంటకం చెయ్యడం ఇంటెల్లిపాదీ లొట్టలేసుకుంటూ ” మమ్మీ కి ఇలా చేయడం రాదు ” అని తింటారు .
కాకపోతే చిందర వందరయిన వంటింటి గట్టు ” బాబోయ్ నువ్వు నా వైపు రాకయ్యా బాబూ !” అన్నట్టు వుంటుంది .
కాకపోతే ఇంతకు ముందు తరంతో పోలిస్తే నేటి తరం వాళ్ళు ఇంటి పనులు ఇద్దరూ చేసుకుంటున్నారు .
నా మనవరాలు మూడేళ్ళు ఇంకా నిండలేదు కిచెన్ సెట్ తో గంటలు గంటలు ఆడుతుంది .
ఉత్తుత్తి వంటలు తెగ చేసేస్తుంటుంది .
అదే వయసున్న మనవడు ఏదో కాసేపు ఆడతాడు కానీ దీనంత ఇష్టం గా ఆడడు .
ఆడాళ్ళకు పుట్టుకతో అబ్బిన ఆ లక్షణాన్ని మనం ఎట్లా కాదనగలం ?
ఆఫీసులోనే ఇవ్వాళ రాత్రికి ఏ కూర వండాలి , రేపు పిల్లలికి క్యారేజీ లో ఏం పెట్టాలో ఆలోచించే మగాళ్ళుంటారా?
నిజం చెప్పండి !
ఒక వేళ వుంటే ప్రపంచంలో జరిగే ఎన్నో వింతల్లో ఇదీ ఒక వింతే !
చిన్నప్పుడు మా నాయనమ్మ మమ్మల్ని చూడడానికి వైజాగ్ వస్తే ఆ పల్లెటూళ్ళో మా తాత వండుకునే వారు .
ఊరు ఊరంతా ” పాపం ! ఏం చేస్తాడు చెయ్యి కాల్చుకుంటన్నాడు ” అని జాలి కురిపించే వారు .
మరి ఆ మిగతా 340 రోజులూ వండి వార్చే ఆవిడ మీద ఏ జాలీ వుండదు .
ఎందుకంటే కారణం సింపుల్ !
ఆవిడ ఇల్లాలు .
ఇంటి భారాన్ని అవలీలగా మోసే మహిమగల ఇల్లాళ్ళు లేకపోతే ప్రపంచం ఏమైపోతుంది .
అందుకే భూమి వున్నంతవరకూ ఇంటి పని కష్టమైనా ఇష్టంతో చేసే ఇల్లాళ్ళు వుంటారు …వుంటారు … వుంటారంతే !


*****

Please follow and like us:

One thought on “షర్మిలాం“తరంగం”-13”

Leave a Reply

Your email address will not be published.