కృషితో ఋషి

-ఆదూరి హైమావతి

  నాగవరం  ఒక మారుమూల గ్రామం. ఆగ్రామంలోని శివాలయం చాలా ప్రసిధ్ధిచెందినది . దూర ప్రాంతాల నుంచీ భక్తులు  ఆ ఆలయంలోని శివుడు దర్శించి వెళ్లను వస్తుంటారు. పూజారి  అర్చనచేసి హారతిస్తూ భక్తులకు ” భక్తులారా! ఈ శివాలయం చాలా ప్రసిధ్ధిచెందినది. పూర్వం దేవతలు. సైతం వచ్చి,ఈ భవనాశి పుష్కరిణి లో  స్నానం చేసి  ఈ స్వామి వారిని దర్శించేవారని చెప్తారు.మా తాతముత్తాతలనుండీ మేము ఈ శివాలయ అర్చకులం ,  ఏదో ఒక మహాత్యం వుందనీ ఒకనాడు బయల్పడు తుందనీ మా ముత్తాతల నుంచీ చెప్తూ వచ్చారు. ఆ మహత్యం ఏంటో ఎలా,ఎప్పుడు బయల్పడు తుందో  ఎవ్వరికీ తెలీదు.”అని చెప్పేవాడు.

   పక్కనే వున్న గ్రామంనుంచీ ఒక   సుమారు పన్నెండేళ్ళ పసువులకాపరి పరమేశం అనే బాలుడు  అక్కడే వున్న చిన్న అడవి పక్క మైదానంలో పసువులను మేపి ,ఆలయం ఎదుట వున్న  వటవృక్షం క్రింద అవి విశ్రాంతి తీసుకుంటుండగా ,వాడు ఆలయం ముందున్న మంటపంలో కూర్చుని తెచ్చుకున్న అన్నం తిని విశ్రాతి తీసుకునేవాడు. పొద్దు వాలడం  మొదలవ గానే ఆ భవనాశిలో నీళ్ళు త్రాగించి పశువులను  ఇంటికి తోలు కెళ్ళేవాడు. ఒకరోజున సూర్యుని ఎండ వేడి ఎక్కువగా  వుండటాన పశువులకు మిట్టమధ్యాహ్నానికి ముందే  దాహంగా వుండటాన్ని గమనించాడు పరమేశం . వడతగలకుండా వెంటనే వాటిని ఆలయం పక్కనున్న పుష్కరిణి లో నీరుత్రాగించను తోలుకెళ్లాడు.

     మడుగులోకి చూసిన పరమేశానికి భయమేసింది.నిశ్చలంగా వున్న మడుగు నీటిలో ఏవేవో పెద్ద అక్షరాలు కనిపించాయి. మడుగు అడుగున ఏదైనా  వ్రాసి వున్న రాతిపలక వుందేమోని జాగ్రత్తగా పరికించి చూసాడు. కానీ ,లోపల రాతిపలక ఏమీ కనిపించ లేదు.సూర్యుని ఎండ పడే చోటు నిశితంగా చూసాడు .తాను రోజూకూర్చునే మంటపం పైన వున్న శిలాశాసనం  మీద పడ్ద ఎండ పొడకు ఆరాతిమీది  అక్షరాలు నీటిలో ,అద్దంలో ప్రతి బింబంలా కనిపించాయని గమనించాడు.  పసువులకు నీరు త్రాగించి  అవి  విశ్రాంతి తీసుకుంటుండగా , తాను భోజనం ముగించి మెల్లిగా మంటపం పైకెక్కాడు. అక్కడ ఒక పెద్ద శిలాఫలకం వుండటం చూసాడు. పరమేశానికి చదువురాదు. ఐనా వానికి ఆరాతి మీద ఏమి వ్రాసి వుందో తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది. వాడు మరునాడు  , తాను బడికి పోక పశువుల కాపరి కానుముందు ,అయ్య కొనిచ్చిన  పలక,బలపం అమ్మ చూరులో దాచిందని గుర్తొచ్చి దాన్ని తెచ్చుకున్నాడు.

      ఆరాతిమీద వున్న అక్షరాలను అలాగే మెల్లిగా బొమ్మలేసు కున్నట్లు వ్రాసుకున్నాడు .మరునాటి రాత్రి ఆఊరి పాఠశాల పంతులుగారు ఉమేశ్వరావు వద్దకెళ్ళి “సారూ! నేను బడికిరాక సదువు నేర్చక పోతిని.మా బావొ కడు ఈ అచ్చరాలు ఏంటో సెప్పమన్నడండీ! ఇవేంటి సారూ!సెప్పకపోతే ఎక్కిరిత్తడు” అని అడిగాడు. 

“ఒరే ఇదంతా ఏదో నిన్ను ఎగరాళి పట్టించను మీవాడు వ్రాసిన మాటలు, అంతే వానికీ వ్రాత సరిగా రాదు.ఏదోగా వ్రాసాడు.  నీడ, నంది ,గోపురం, ద్వారం,రాతి గోడ ,వెనుక, ముందు సరస్సు,పెట్టె,తాళం చెవి, ఇవన్నీ నిన్ను వెక్కిరించను మీ బావ వ్రాసిన మాటలు అంతే. ఒరే పరమేశా !ఇప్పటికైనా రోజూ రాత్రులు వచ్చి చదువు కోరా నేర్పుతాను.”అన్నారు పంతులుగారు. 

   పరమేశానికి రాతి ఫలక మీది వ్రాతలేంటో తెల్సుకోవాలని  చాలా ఆశ మొదలైంది .పరమేశం రోజూ రాత్రులు  వచ్చిపంతులుదగ్గర చదవడం నేర్వసాగాడు.  పరమేశం ఆసక్తి సూచి పంతులు గారు వానికి పదాలతో చదువు నేర్పారు.  రోజూ తాను నేర్చిన పదాలు ఆ శిలాఫలకం మీద వున్నాయేమోని   చూసేవాడు. అలా మూడు నాలుగు నెలలకు పరమే శానికి కాస్తంత పదాలు గుర్తుపట్టి చదవడం వచ్చింది.ఇంకా తనకు రాని ఆశిలా ఫలకం మీద పదాలను పలక మీద వ్రాసి పంతులు గారిని అడిగి తెల్సుకున్నాడు.  పరమేశం  శ్రధ్ధకుపంతులు గారికి సంతోషమేసి అన్నీ ఓపిగ్గా చెప్పేవాడు. 

   అన్నీ మనసుకు తెచ్చుకున్న పరమేశం  ఒకరోజున తనకు అర్ధమైన దాన్నిపట్టి ఆలయం వెనుకనున్న ఆలయపు  రాతి గోడ లోని ఒక ఫలక మీద పెద్ద ఆరుమీటరల లోతు తూమువంటి రంధ్రము లోకి తన ఆవులను మళ్ళించే కొంకికర్ర పోనిచ్చాడు.దానికి ఒక పెద్ద తాళముచెవి  తగులుకుని వచ్చింది. అది వాని చేతంత వుంది.పరమేశం సంతోషానికి  హద్దేలేదు.  

   రెండో సూచన ప్రకారం పరమేశం  ఆలయం ముందున్న నంది చూసే వేపు గమనించి చూశాడు అక్కడ ఆలయం ముఖద్వారం పైన గోడలో ఒక రంధ్రం వుంది. అదిచిన్నదే.ఐనా ఎలాగో గోడ పైకి ఎక్కి తన కొంకికర్ర పోనిచ్చి లాగాడు.అక్కడ ఒక చిన్న తాళంచెవి  తగులుకొని వచ్చింది .  పరమేశం ఎగిరిగంతేశాడు.  ఆరాత్రి తన పంతులు గారిని పూజారి వద్దకు తీసు కెళ్ళాడు.   విషయం అంతా చెప్పాడు .

  మరునాడు మధ్యాహ్నం ఇద్దరికీ నిశ్చల జలంలో వారికి ఆఅక్షరాలు సరస్సులో చూపాడు. అన్నీ వివరించాడు.  మంచిరోజు చూసి పూజారిగారు చెప్పిన రోజున వారిద్దరి సమక్షంలో  నడి మధ్యాహ్నం పక్కనే వున్నచెట్టునుంచీ బాల కృష్ణుడు కాళీయమర్ధ నానికిదూకినట్లు మడుగుమధ్యలోకి దూకడు. పరమేశం మంచి ఈతగాడు. నేరుగా అడుక్కెళ్ళి అక్కడున్న రాతినితన వెంట తీసుకెళ్ళిన చిన్నగునపం తో తొలగించాడు.  అక్కడ ఒక పెద్ద బోషాణపు  ఇనుప పెట్టె కనిపించింది.   

  విషయం అర్ధమైన పూజారి ఊరివారందరినీ  పిలిచి అందరిసమక్షంలో ఆపెద్ద పెట్టెను సుమారుగా ఇరవై మంది బలశాలుల సహకారంతో బయటకు లాగారు.  దాన్ని మంటపంలోకి చేర్చి  పరమేశం సంపాదించిన తాళం చెవులతో తీయనుయత్నించారు. ఎంత ప్రయత్నించినా రాలేదు. పరమేశం తన పలక మీద వ్రాసుకున్న పదాలను గుణించుకుని నందితోక క్రింద వున్న మరో రంధ్రం లోకి తన కొంకి కర్రదోపి  లాగగానే ఇంకోచిన్న తాళం చెవి బయటికి వచ్చింది  . ముగ్గురు బలశాలులు ఒకేమారు మూడుతాళం చెవులను తాళాలలోకి దూర్చి తిప్పాక అది తెరుచుకుంది. ఆలయంలోని పెద్ద పెద్ద గంటలు తమంతట తామే గణగణా  మ్రోగాయి. మూత పైకెత్తగానే అందరి కళ్ళూ ఆకాంతికి మూసుకుపోయాయి. 

  మెల్లిగా కళ్ళు తెరిచి చూసిన వారికి మతిభ్రమించినట్లైంది  . దానినిండా వజ్ర వైఢూర్యాలతో  మెరిసే బంగారు నగలు .అవిచూసి చాలామంది తమకళ్లనే నమ్మలేక పోయారు.  అడుగున బంగారు నాణాలు బస్తాల్లో వున్నాయి.ఏరాజో శతృవులబారినపడకుండా వాటిని కోనెట్లో దాచి వుంచారని పూజారికీ, పెద్దలకూ ర్ధమైంది.అంతా అదే ఆఆలయ మహత్యమని భావించారు.

 అంతా పరమేశం  శ్రమను ఆశిలాఫలకం చదవను చదువు నేర్చుకున్న విధానాన్నీ ,నిశిత పరిశీలనా శక్తినీ, ఆసక్తినీ కొనియాడారు. ఆలయం పూర్తిగా ఆధునీకరించి.  భక్తులకు ఉచితవసతి గృహాలనూ,  ఉచిత భోజనాలనూ ఏర్పరచారు. ఆనగలలో శివునికి అలంకరించిన నాగపడగతో వున్న ఒక నగ మహత్యం ఏమో కానీ శివునికి అభిషేకించిన జలం త్రాగితే రోగాలన్నీ నయమైపోసాగాయి. ఆ నాగాహారంలోని నీలమేఘ మణిని  చూడగానే కంటి దోషాలన్నీ పోయేవి.  అది థళథళా మెరుస్తూ ఉండేది.అలా  ఆ ఆలయం   మహత్వం దేశమంతా పాకింది.

 పరమేశం ఇంత తక్కువ చదువు నేర్చుకుంటేనే ఇంత గొప్పమహత్యం జరిగింది, ఇంక బాగాచదవితే ఎన్ని తెల్సుకోవచ్చో అనే పట్టుదలతో చదివి పెద్ద అధికారై ఆ ఊరి ఆ ఆలయానికే ఆఫీసురుగా వచ్చాడు. 

   ఏపని చేస్తున్నా తగిన పరిశీలనాశక్తిని కలిగి వుండాలి.ఆసక్తి పెంచుకోవాలి.  పశువులకాపరే ఆ ఆలయ రహస్యాన్ని ఛేదించి ఊరికి,ఆలయానికీ కీర్తి తెచ్చాడు.   

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.