అనుసృజన

నిర్మల

(భాగం-7)

అనుసృజన:ఆర్. శాంతసుందరి 

హిందీ మూలం: ప్రేమ్ చంద్

మన్సారామ్ మంచం మీద పడుకుని దుప్పటి కప్పుకున్నాడు.అయినా చలికి గుండెల్లోంచి వణుకు పుడుతోంది.జ్వర తీవ్రత వల్ల స్పృహ కోల్పోయినట్టు గాఢ నిద్రలోకి జారుకున్నాడు. నిద్రలో అతనికి రకరకాల కలలు రాసాగాయి.మధ్య మధ్యలో ఉలిక్కిపడి లేచి కళ్ళు తెరవటం, మళ్ళీ మూర్ఛ లాంటి నిద్రలో కూరుకుపోవటం.

అలాటి మగతలో అతనికి తండ్రి గొంతు వినిపించి పూర్తి మెలకువ వచ్చేసింది. తడబడే కాళ్ళతో లేచి నిలబడ్డాడు.దుప్పటి జారిపోయింది.అప్పటికప్పుడు తండ్రి ఎదురుగా చచ్చిపోతే బావుండుననిపించింది.నేను చచ్చిపోతే ఈయన సంతోషిస్తాడు.అందుకే వచ్చినట్టున్నాడు,అనుకుంటూ నిలబడలేక తూలి పడబోయాడు.

తోతారామ్ గబుక్కున వచ్చి అతని చెయ్యి పట్టుకున్నాడు.”ఒంట్లోఎలా ఉంది బాబూ ? ఎందుకు లేచావు? పడుకో,”అన్నాడు.

నా ఆరోగ్యం బాగానే ఉంది. అనవసరంగా శ్రమ పడి వచ్చారు.”

తోతారామ్ జవాబు చెప్పలేదు.ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి.బలంగా ఆరోగ్యంగా ఉండే పిల్లాడు చిక్కి శల్యమైపోయాడు.వారం రోజుల్లో ఎవరైనా ఇంతలా చిక్కిపోతారా? అనుకుంటూ అతన్ని పట్టుకుని నెమ్మదిగా మంచం మీద పడుకోబెట్టి దుప్పటి కప్పాడాయన.మరుక్షణం అక్కడున్న స్టూల్ మీద కూలబడి కుళ్ళి కుళ్ళి ఏడవసాగాడు.మన్సారామ్ కూడా దుప్పటి మొహం మీద కప్పుకుని వెక్కటం మొదలెట్టాడు. అయినా మనసులో మూలో కొడుకుని ఇంటికి తీసుకెళ్ళటానికి ఇంకా సంకోచిస్తున్నాడు.డాక్టర్ ఇక్కడే ఉన్నాడు,ఇక్కడే ఉంచి వైద్యం చేయిస్తే పోలా? ఇంటికి తీసుకెళ్తే నిర్మల వీడికి సేవలు చేస్తూ ఇరవై నాలుగ్గంటలూ వీడి దగ్గరే ఉంటుంది.దాన్ని తను భరించలేడు !

ఇంతలో వార్డెన్ వచ్చి,” మీరు ఇతన్ని ఇంటికి తీసుకెళ్ళటం మంచిది.ఇక్కడ అతనికి సరైన సదుపాయాలు కల్పించలేము,” అన్నాడు.

నేను ఉద్దేశం తోనే వచ్చాను, కానీ వీడి పరిస్థితి చూస్తే కదిలించటం మంచిది కాదేమో అనిపిస్తోంది. “

మీరన్నది నిజమే,కానీ ఆరోగ్యం పాడైనప్పుడు ఇంట్లో దొరికే విశ్రాంతి ఇంకెక్కడా దొరకదు.అంతే కాక ఆరోగ్యం పాడైన పిల్లవాణ్ణి హాస్టల్ లో ఉంచుకునేందుకు రూల్స్ ఒప్పుకోవు.”

నేను హెడ్ మాస్టర్ తో మాట్లాడి చూడనా?” అన్నాడు తోతారామ్.

ఈయన నన్ను హెడ్ మాస్టర్ పేరు చెప్పి నన్ను బెదిరిస్తున్నాడా, అనుకుంటూ, ” ఆయన కూడా రూల్స్ కి విరుద్ధంగా ఏమీ చెయ్యలేరండీ !” అన్నాడు వార్డెన్.

చేసేది లేక తోతారామ్ తన వెంట వచ్చిన నౌకర్లని కేకేశాడు. వాళ్ళు వచ్చి మన్సారామ్ ని మమ్చమ్ మీంచి ఎత్తుతూ ఉండగా అతనికి కొద్దిగా స్పృహ వచ్చి,” ఏమిటి? ఎవరు వీళ్ళు?” అంటూ నీరసంగా, గాభరాగా అడిగాడు.

ఏం లేదు బాబూ, నిన్ను ఇంటికి తీసుకెళ్తున్నాం,” అన్నాడు తోతారామ్.

నేను రాను…”

ఇక్కడ ఉండనివ్వర్రా…”

అయినా సరే.ఇంకెక్కడికైనా తీసుకెళ్ళండిఇంటికి మాత్రం కాదు చెట్టుకిందో,పూరి పాకలోనో…”

సార్, మీరతని మాటలు పట్టించుకోకండి.మగతలో ఏదేదో మాట్లాడుతున్నాడు,” అన్నాడు వార్డెన్.

మగత ఎవరికి సార్? నేను తెలిసే మాట్లాడుతున్నాను.ఎవరినైనా తిడుతున్నానా? కలవరిస్తున్నానా? పళ్ళు కొరుకుతున్నానా ? నన్నిక్కడే పడి ఉండనివ్వండి.లేకపోతే ఆస్పత్రిలో చేర్చండి.బతుకుతానో,చస్తానో మీకనవసరం ! ఇంటికి మాత్రం చస్తే వెళ్ళను,అంతే!”అన్నాడు మన్సారామ్.

పదకొండో భాగం

ఎందుకిలా మొండికేస్తున్నావురా? ఇంటికెళ్ళేందుకు అంత అభ్యంతరమేమిటి చెప్పుఅక్కడ మేమందరం ఉన్నాం చూసుకునేందుకు.నీకు రోగం నయం కావద్దా?” అన్నాడు తోతారామ్.

పైకి అలా అన్నాడే కాని లోలోపల కొడుకు ఇంటికి వస్తానంటాడేమో అని భయం ఉండనే ఉంది.కొడుకు స్వయంగా ఇంటికి రానంటే ఆస్పత్రికి తీసుకుపోవచ్చు.అప్పుడు తన తప్పేమీ ఉండదని ఆయన ఆలోచన.పైగా వార్డెన్ సాక్ష్యం కూడా ఉన్నాడు!

లేదులక్షసార్లు మీరడిగినా నా జవాబు అదే.ఇంటికి రాను గాక రాను.నేరుగా ఆస్పత్రికి తీసుకెళ్ళండి.అక్కడికి కూడా ఇంట్లో వాళ్ళెవరూ నన్ను చూసేందుకు రావద్దు.నాకేం కాలేదు. రోగమూ లేదు.చూడండి కావాలంటేసాయం లేకుండా ఎల్లా నడుస్తానో !”అన్నాడు విసురుగా.

మన్సారామ్ లేచి పిచ్చివాడిలా తలుపువైపు అడుగులు వేశాడు,కానీ తూలాడు.తండ్రి గబుక్కున పట్టుకోకపోతే కింద పడిపోయేవాడే.ఇద్దరు నౌకర్ల సాయంతో అతన్ని గుర్రబ్బండిలోకి ఎక్కించాడు తోతారామ్.

కొడుకుని ఇంటికి కాక ఆస్పత్రికి తీసుకెళ్తున్నందుకు అంత బాధలోనూ తోతారామ్ కి మనసు తేలికైనట్టు అనిపించింది.కానీ మళ్ళీ అపరాధభావం తలెత్తింది. ‘అంత పెద్ద ఇంట్లో కన్న కొడుక్కి చోటు లేనట్టు ఆస్పత్రిలో పడేస్తున్నాను.త్రాణ లేనట్టు తోటకూర కాడలా వడిలిపోయాడు.జబ్బు నయమైనా ఇంట్లో వాళ్ళ సంరక్షణ ఉంటే అది వేరు.అసలు వీడు ఇంటికి రానని అంత పట్టుదలాగా ఎందుకున్నాడు? అసలు విషయం తెలిసిపోయి ఉంటుందా? అయ్యో అలా జరిగితే ఇంకేమైనా ఉందా?’

ఇలా అనుకోగానే తోతారామ్ ఒళ్ళు జలదరించింది.గుండె వేగంగా కొట్టుకోసాగింది.’వీడి జ్వరానికి అదే కారణమైతే ఇక దేవుడే వీణ్ణి కాపాడాలి.చలి కాచుకునేందుకు మంట వేసుకుంటే అది నా ఇంటినే భస్మం చేసేసిందా?’పశ్చాత్తాపం, దుఃఖం, అనుమానం అన్నీ కలగలిసి ఆయన్ని స్థిరంగా ఉండనివ్వటం లేదు.పాలిపోయిన తన కొడుకు మొహాన్ని ఒకసారి వాత్సల్యంగా చూశాడు.అతన్ని గుండెలకి అదుముకుని తనివితీరా ఏడ్చాడు.

కొడుకుని ఆస్పత్రిలో చేర్పించి తోతారామ్ కోర్టుకెళ్ళాడు.ఇల్లు చేరేసరికి సాయంకాలమైంది.ఇంట్లో అడుగు పెట్టగానే,” అతన్ని చూశారా? ఎలా ఉన్నాడు?”అంది.ఆమె మొహంలో విచారం గాని, ఆందోళన గాని లేశమాత్రమైనా కనిపించలేదాయనకి.పైగా చక్కగా సింగారించుకుంది.

ఆయన మొహం పక్కకి తిప్పుకుని,” ఎలా ఉంటాడు? ఆరోగ్యం బాగా దెబ్బ తింది.” అన్నాడు.

మీరు అతన్ని ఇంటికి తీసుకొస్తానన్నారు కదూ?”

వాడు రానంటే ఏం చెయ్యను? బలవంతాన ఎత్తుకుని తీసుకొచ్చేందుకు పసివాడా ఏమన్నానా? ఇక్కడే చావనన్నా చస్తాను గాని ఇంటికి మాత్రం రానని భీష్మించుకున్నాడు.చేసేదేం లేక ఆస్పత్రిలో చేర్చి వచ్చాను.”

***

మర్నాడు ఉదయమే తోతారామ్ ఆస్పత్రికి చేరుకున్నాడు.గబగబా మన్సారామ్ ఉన్న గదికి పరిగెత్తాడు.అప్పటికే డాక్టర్ వచ్చి రోగిని చూస్తూ నిలబడి ఉన్నాడు.ఆయన మొహంలో విచారం కొట్టొచ్చినట్టు కనిపించింది.తోతారామ్ కి కాళ్ళూ చేతులూ ఆడలేదు.నోరు పెగల్లేదు.కష్టం మీద ఏడుపు గొంతుతో,” ఎలా ఉన్నాడు డాక్టర్ గారూ?” అనగానే ఏడుపు ఆగలేదు.డాక్టర్ వెంటనే జవాబు చెప్పకపోయేసరికి ఆయన పై ప్రాణాలు పైనే పోయాయి.మంచం మీద కూర్చుని పిల్లవాడి తల ఒళ్ళోకి తీసుకున్నాడు.మరుక్షణం పసిపిల్లాడిలా ఎక్కెక్కి ఏడవటం మొదలెట్టాడు.మన్సారామ్ ఒళ్ళు పెనంలా కాలిపోతోంది.ఒక్క క్షణం కళ్ళు తెరిచి కుర్రాడు తండ్రి కళ్ళలోకి దీనంగా చూశాడు. తోతారామ్ మళ్ళీ డాక్టర్ ని,” ఏం మాట్లాడరేం డాక్టర్? ఎలా ఉంది వీడికి?”అని అడిగాడు.

డాక్టర్ సందేహిస్తూ,” ఏం చెప్పను? మీరే చూస్తున్నారుగా? నూటారు డిగ్రీలుంది జ్వరం.మందులకి లొంగటం లేదు సరి కదా పెరుగుతోంది.మీరు ఇతన్ని ఇక్కడ చేర్చి వెళ్ళినప్పట్నుంచీ నేనిక్కణ్ణించి కదిలితే ఒట్టు.భోజనం కూడా చెయ్యలేదు.నేను చెయ్యగలిగిందమ్తా చేశాను. జ్వరం పెద్ద మహమ్మారిలా తగ్గటమే లేదు. క్షణం లో ఏం జరుగుతుందో చెప్పలేం సార్.ఒకటే పలవరింతలు.ఇంట్లో ఎవరైనా ఇతన్ని ఏమైనా అన్నారా? మనసు బాగా దెబ్బ తిన్నట్టు అనిపిస్తోంది. మాటి మాటికీ ,అమ్మాఅమ్మాఎక్కడున్నావమ్మాఅంటూ పలవరిస్తున్నాడు.”

డాక్టర్ మాటలంటూ ఉండగానే మన్సారామ్ హఠాత్తుగా లేచి కూర్చున్నాడు.అంత నీరసంలోనూ అతనికి పిచ్చి బలం ఎక్కణ్ణించి వచ్చిందో, తండ్రిని ఒక్క తోపు తోసి కింద పడేశాడు.ఎందుకలా గదమాయిస్తున్నారు? చంపెయ్యండి నన్నుఏదీ కత్తెక్కడుంది? పోనీ ఉరితాడు తెచ్చి నా మెడకి బిగించరాదూ? అమ్మాఅమ్మాఎక్కడమ్మా నువ్వు…?”అంటూ మళ్ళీ స్పృహ తప్పి పడిపోయాడు.

కాసేపు మన్సారామ్ వైపు కన్నార్పకుండా చూసి కన్నీళ్ళు పెట్టుకుంటూ, డాక్టర్ చేతులు పట్టుకుని ,” డాక్టర్,ఎలాగైనా వీణ్ణి కాపాడండి డాక్టర్.దయచేసి బతికించండి.లేకపోతే నేను సర్వనాశనమైపోతాను.నేను అంత ధనవంతుణ్ణి కాకపోయినా మీరు ఎంత కోరితే అంత సమర్పించుకుంటాను.ఇంకా పెద్ద డాక్టర్లనెవరినైనా పిలిపించండి.వీడి బాధ ఇక చూడలేను. నా దగ్గరున్నదంతా ఖర్చు చేసేందుకు నేను సిద్ధం…”అన్నాడు తోతారామ్ దీనంగా.

అయ్యా, నేను చెయ్యగలిగినదంతా చేశాను. మీరు కోరితే ముగ్గురు నలుగురు డాక్టర్లని పిలిపిస్తాను,కానీ మీకు ఆశలు కల్పించటమ్ నాకిష్టం లేదు.ఇతని పరిస్థితి చెయ్యి దాటిపోయింది.”

అలా అనకండి డాక్టర్, నేను వినలేను.దేవుడు అంత నిర్దయుడు కాడు.జీవితాంతం మీకు ఊడిగమ్ చేస్తాను.వీడికి స్పృహ వచ్చేందుకు ఏదైనా మందివ్వరా? వాడికి వచ్చిన కష్టమేమిటో వాడి నోటే వినాలనుంది 

డాక్టర్…” తోతారామ్ పిచ్చివాడిలా ఏదేదో మాట్లాడసాగాడు.

కాస్త మనసు దిట్టం చేసుకోండి సార్.పెద్దవారు నేను మీకు చెప్పేదేముంది.ఇలా ఆవేశపడితే ఏం లాభం చెప్పండి.మీరే ఇలా బెంబేలు పడితే మా పని ఇంకా కష్టమౌతుంది. పట్నం నుంచి డాక్టర్లని పిలిపిస్తాను.వాళ్ళేమంటారో చూద్దాం.అంతవరకూ దయచేసి శాంతంగా ఉండండి,” అన్నాడు డాక్టర్.

*****

(ఇంకాఉంది) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.