మల్లు స్వరాజ్యం గారి ఆత్మ కథ – నా గొంతే తుపాకి తూట

-పి.జ్యోతి

నా గొంతే తుపాకి తూటమల్లు స్వరాజ్యం గారి ఆత్మకథ. తాము నమ్ముకున్న దారిలో సమాజం పట్ల తమ కర్తవ్యాన్ని నిర్వర్తించే ఇటువంటి వ్యక్తుల జీవితాలను నిజంగా చదవాలి. చిన్న పని తలపెట్టాలన్నా నాకిందులో లాభం ఏంటీ?  అని ఆలోచించే చాలా మంది తమ ఆలోచనా సరళిని లౌక్యం అని తెలివి అని చెప్పుకుంటూ గర్వపడడం చూస్తూ ఉంటాను. అలాంటప్పుడు ఎదో ఒక రూపంలో ఇలాంటి అపురూప వ్యక్తుల గురించి విన్నప్పుడు తెలుసుకున్నప్పుడు సుఖపడుతున్నాం అని వ్యక్తులుగా చస్తూ బ్రతుకున్న వారిని చూసి వారి అజ్ఞానానికి  జాలి వేస్తుంది. ఒక భూస్వామ్య కుటుంబంలో పుట్టిన ఒక స్త్రీ అతి సామాన్యురాలిగా జీవితాన్ని ప్రజల మధ్య గడపడం ఎంత గొప్ప విషయమో ప్రస్తుత రాజకీయ నాయకుల వారసులను గమనిస్తే అర్ధం చేసుకోవచ్చు. తమ కుటుంబాలలో స్త్రీలకు ఘోషా లేదని దానికి కారణం జమిందారి నిర్వహించడం కోసం పురుషులు లేని సమయంలో తమ ఆస్తులు కాపాడుకోవడానికి స్త్రీలకు కూడా తర్ఫీదు ఇచ్చేవారని అందువల్ల అప్పటి మిగతా స్త్రీలలా కాకుండా మంచి స్వాతంత్రాన్ని అనుభవిస్తూ పెరిగానని ఆమె ఎంతో నిజాయితీతో  చెప్పుకున్నారు. అప్పటి రాజకీయ పరిణామాల దృష్టా అన్న బీ.ఎన్.రెడ్డి గారి ప్రోద్బలంతో అతి చిన్న వయసులో బాలల సంఘం పెట్టి సామాజిక కార్యక్రమాలలో పాలు పంచుకున్నాననీ చెప్పుకున్నారు. విజయవాడలోని రాజకీయ పాఠశాలకు శిక్షణ కొరకు వెళ్ళడం, సాహిత్యాన్ని చదవడం చెప్పుకుంటూ అప్పడు గోర్కీ అమ్మ ఎందరిని ప్రభావితం చేసిందో చెప్తూ అందులోని పాత్రల ప్రభావానిలోనయ్యి వీరి అన్నగారిని  మాతృమూర్తి సాషా అని పిలిచేవారని చెప్తారు.

కూలీల కూలి పెంపు కోసం ఉద్యమంలో పని చేయడం వారి జీవితంలో పెద్ద మలుపు. చాకలి ఐలమ్మ కు అండగా పనిచేయడం ఆమె ప్రభావం కూడా తనపై ఉన్నదని ఆవిడ ప్రస్తావిస్తారు. కూలీలను పరిశిలీంచి వారి పాటల బాణిలలో సామాజిక అంశాలతో పాటలను కట్టి సిద్దాంతాన్ని ప్రచారం చేయడం ఆవిడకు అప్పుడే అబ్బింది. స్త్రీ ఆస్తి హక్కు కోసం వీరి అక్కగారు చేసిన కొట్లాట వెనుక ఉన్న అప్పటి పోరాట ఉత్సాహం గురించి కూడా చెప్పుకువచ్చారు. తాము నమ్మిన సిద్దాంతాల కోసం ఇంటా బైటా కూడా పోరాడడానికి వెనుకాడని దైర్యవంతులైన స్త్రీ మధ్య విశిష్ట వ్యక్తిగా ఆవిడ ఎదిగిన క్రమం నిజంగా చదవవలసినదే.ఆయితే అప్పట్లో తమ కూటుంబాలలో తాము పొందిని స్వేచ్చ కూడా స్వార్ధంతో కూడుకున్నదనికుటుంబాల ఆస్తులను నిలబెట్టుకునే అవసరం కొరకు ఆడపిల్లలకు కొంత స్వేచ్చ నివ్వడం మొదలయ్యిందనిచెప్తారు. స్త్రీల సమస్యలపై ఇప్పటి కన్నా అప్పట్లోనే నిజమైన అవగాహనతో పని చేశామని అంటూ బెజవాడలో పార్టి శిక్షణాకేంద్రం నడిపినప్పుడు స్త్రీలకు ప్రత్యేకంగా శిక్షణా కేంద్రం నడిపీంచిన రోజుల్ని గుర్తుచేసుకున్నారు. బాల్యవివాహాలను అరికట్టడానికి తాము ఎంత తీవ్రంగా పని చేశారో కొన్ని ఉదాహరణలతో చెప్పుకొస్తారు.

అప్పట్లో పార్టి లేదా సంగం ప్రభావంలో ఒక కుటుంబం వచ్చిందంటే ఇంటి స్త్రీలందరూ తప్పనిసరిగా పొరాటంలోకి వచ్చేవారట. కొంత మంది కట్టుబాట్లు, బలవంతపు పెళ్ళీళ్ళూ వంటి సాంఘిక సమస్యలనుంచి బయట పడేందుకు ఉద్యమంలోకి ఆకర్షితులయ్యారు. శ్రామీక వర్గంలో పీడనకు గురవుతున్న కులాల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు భూస్వాముల దోపిడి, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఉద్యమంలో సంఘటితమయ్యారు. పార్టి లో పిత్రుస్వామ్య భావజాలం లేదు అనలేం కాని స్త్రీ పట్ల ఆలోచన ఎక్కువగా ఉండేదని చెప్పారు. ఆశ్చర్యపోయే ఆవిడ స్టేట్మెంట్ ఒకటి పుస్తకంలో కనిపించింది. “ఇప్పటితో పోల్చిచూస్తే, రేప్ కేసులు బాగా తక్కువే అప్పట్లో”…..సాంఘిక పోరాటాలు సక్సెస్ కావాల్నంటే రాజకీయ పోరాటానికి ప్రాముఖ్యత ఇవ్వాలి అనే ఆలోచన అందరిలో ఉండేది. పోలీసులు ఊర్లపై పడ్డప్పుడు వారితో పోరాటం స్త్రీలే చేసేవారు. పార్టీ స్వరాజ్యం గారికి అప్పజెప్పిన ముఖ్యమైన పని , పాటలతో ఉపన్యాసాలతో జనాన్ని కూడగట్టడం. అది ఆవిడ చాలా చక్కగా ఎన్నో సంవత్సరాలు నిర్వహించారు. రైతాంగ పోరాటం గురించి చెప్తూదాని ఫలితం ఎట్లా వచ్చింది, జనం మీద దాని ప్రభావం విధంగా పడ్డదిఅన్నది తెలియజెప్పల్సిన భాద్యత మలితరానిదని చెప్తారు.

స్త్రీలకు ఆయిధ శిక్షణ ఇవ్వడం గురించి చెప్తూజైపాల్సింగ్ అనే ఒక రిటైర్డు ఆఫీసరూ ఉత్తరాది ఏరియా నుండి వచ్చి ఆయిధ శిక్షణ స్త్రీలకు ఇచ్చారని అలా ఆయిధాలను పట్టి పోరాటం చేసిన స్త్రీలలో ముందు వరసలో తాను ఉన్నానని చెప్తారు. పార్టీ లోని స్త్రీలమనోనిబ్బరాన్ని గురించి చెప్తూ రాములమ్మ అనే స్త్రీ భర్తతో 1946లో పార్టీలో చేరిందని కాని తరువాత ఆమె భర్త పార్టీని వీడినా అమె వెనక్కు పోక నైజాం వ్యతిరేక ప్రోరటంలో పాల్గొన్నదని చెప్తారు. అప్పుడు స్వరాజ్యం గారు రాజక్క పేరుతో దళం నడిపారట. చాలా మంది పిల్లలను కని వారిని ఎవరికో ఇచ్చి ఉద్యమంలో కొనసాగారట. ప్రజలు వీరిని కాపాడుకున్న విధం చదివితే ఒళ్ళు గగ్గొర్పొడుస్తుంది. రాజమ్మ అనే స్త్రీ పోలీసుల ముందే దళం లోని వ్యక్తులను తెలివిగా ప్రాణాలకు తెగించి కాపాడడం, బతుకమ్మ ఆడడానికి అన్ని కులాల స్త్రీలు ఒక్కటవ్వడం, దొర ఇంటికి వెళ్ళడం మానుకోవడం, ముండ కడియాలు (వితంతువులు వేసుకునేవి) తనవి స్వరాజ్యానికి వేసి ఒక స్త్రీ ఆమెను ఊరు దాటించడం, ఎన్నో దెబ్బలు తిని కూడా ఉద్యమకారులకు తిండి పెట్టిన లంబాడి తండాలు, తన రోజుల బిడ్డను స్వరాజ్యం చేతికిచ్చి పారిపోమ్మని చెప్పిన తల్లి బిడ్ద పాలు లేక చనిపోతే అది ఉద్యమకారులను బ్రతికించుకోవడానికి చేసిన త్యాగం గా అనుకుని ఉద్యమకారుల్ని కాపాడిన పల్లేటురి తల్లి గురించి చదివితే నిజంగా మనసు మొద్దుబారిపోయింది. ఉద్యమాలలో పిల్లలు, వారి తల్లులు పడ్డ బాధ గురించి చెప్తూ,ఎక్కడొ ఎవ్వరి దగ్గర ఉన్నారొ కూడా తెలీకుండా పిలల్లని వదిలి ఉద్యమంలో పనిచేసీన తల్లుల ను తన చేతిలో చనిపోయిన తన వదిన బిడ్దను ఆవిడ గుర్తుచేస్తుకున్నారు. 1954 లోవీరి వివాహం పార్టి కార్యకర్త వి.ఎన్. తో జరిగితే ఇంటిపట్టునుండి సంసారం చేసుకోవడం తప్ప ప్రజలకు ఏమీ చేయలేనే అని వీరు బాధపడడం గురించి చదివితే వీరి జీవన విధానానికి ఆశ్చర్యం వేస్తుంది.

పరిస్థితులలో పెళ్ళి తరువాత వీ.ఎన్. గారు లా చెస్తానంటె స్వరాజ్యం గారు వద్దని చదువు తర్వాత డబ్బు, తరువాత మంచి జీవితం అని ప్రజల గురించి ఆలోచించడం మర్చిపోతావని అడ్డుపడ్డారట. పిల్లలు పుట్టిన తరువాత కూడా వారిని తన చుట్టాలకిచ్చి ఉద్యమంలోకి మళ్ళీ వెళ్ళాలని ఆవిడ అనుకున్నారట. తనకూ తన భర్తకు మధ్య ఉన్న తేడా గురించి చెప్తూనేను ఫీల్డ్ మెన్ ను. పని అవసరమైతే, పని చేసిన. ఆయనేమో ఆలోచనల మనిషి,మేధావి. ఆయనేమో పరిష్కారాల కోసం చూస్తాడుఅని చెప్పారు. పార్టికి సంబంధించినదేది స్వంతానికి వాడుకోకుండా చివరకు ప్రజలిచ్చే చేపలు కూరగాయలు కూడా పస్తులుండే రోజుల్లో తీసుకోకుండా పని చెసిన నిబద్దత వీ.ఎన్. గారిది. ఆ పరిస్థితులలో తమ పిల్లలకు పెట్టుకునే తిండిని స్వరాజ్యం గారి కుటుంబానికి పెట్టి తమ సహకారం చూపిన రాజక్క లాంటి ఎందరో అండగా నిలిచారట. గుడిసెలోనే ఉంటూ రాజకీయాలలో పోటి చేసారు స్వరాజ్యం గారు. అప్పుడు కూడా ఒక జత బట్టలు వంటి పై, మరొకటి సంచిలో ఇది వీరి భర్తగారి పరిస్థితి.

అప్పట్లో కులవ్యవస్థను ఒక పద్దతిలో కొనసాగించేందుకు మహిళలు కూదా యజమానులుగానే ప్రవర్తించేవారు. అటువంటి స్థితిలో స్త్రీలను సంస్కరించడానికి ఎన్నో ప్రయత్నాలు స్వయంగా చెశారు. ఎన్.టి.రామారావు అధికారంలో ఉన్నప్పుడూ ఒక పది డిమాండ్లను పెట్టి ఉద్యమాలు జరిపితే వాటిలో ఆరింటిని ఒప్పుకుని ఖచ్చితంగా అమలు జరిగేలా చూసారు ఆయన అని గుర్తుచేసుకున్నారు. అప్పట్లో స్త్రీల పట్ల అత్యాచారాల సమస్యపైన పెద్ద ఎత్తున కదిలించి, ఉద్యమరూపం ఇవ్వడమన్నది దేశంలో ఫస్టున మన దగ్గరే జరిగిందట. రాజకీయాలలోకి వచ్చిన తరువాత అసెంబ్లీలో చేరాక తాను చాలా తెలుసుకోవడానికి కష్టపడ్డానని, ఒక కర్తవ్యంగా పని చేశానని రాసుకున్నారు. కనీసం ఇస్త్రీ చీర కూడా లేకుండా అతి మామూలుగా అసెంబ్లీకి వచ్చిన ఆమెను చూసినువ్వెట్ల గెలిచినవ్. నువ్వు గెల్చేడేందిః అని వాచ్మెన్ చేత అనిపించుకున్న తాను తరువాత తన సూటీగా ప్రశ్నించే గుణంతో ఎంత మందిని ఇబ్బంది పెట్టీంది చెప్పుకున్నారు. ఎమ్.ఎల్. గా కూడా ప్రజలతో కలిసి ధర్నాలు చేయడం వారి సమస్యలపై పోరాడడం మానలేదు ఆవిడ. స్వయంగా వ్యవసాయం చేసినావిడ కనుక రైతుల సమస్యలకు ఆవిడ స్పందన ఇతరులకు భిన్నంగా ఉండేది.

పోరాటం అంటే పురుషులకు వ్యతిరేకంగా మాత్రమే పోరాటం చేయడం కాదని తాను అనుకుంటున్నట్లు స్పష్టంగా చెప్తారు వీరు. “మనం కేవలం మనం చెప్పిన పని చేసేందుకే జనాన్ని కూడగట్టకూడదని, అది ఒంటెత్తుపోకడ అవుతుందని, వారి సంసిద్దతను బట్టి వీలయిన కార్యక్రమాన్ని ఎంచుకుని ఉద్యమం చేయాలని అప్పుడే అది సక్సెస్ అవుతుందని తన అనుభవసారాన్ని జోడించి చెప్తారు. ఎం.ఏల్. చేసి ఉన్న డబ్బు పోగొట్టుకున్నానని దాని వల తమ అర్ధిక స్థితి ఇంకా చితికిపోయిందని భర్త ఆరోగ్యాన్ని కూడా పట్టించుకునే తీరిక లేకుండా పని చేశానని. అరోగ్యం సరిగ్గాలేని భర్తను వదిలి డీల్లీలో ప్రీడం ఫైటర్ల ధర్నా కోసం తాను వెళ్ళీనప్పుడే భర్తను హాస్పిటల్ కు తీసికెళ్ళే వాళ్ళు లేక జబ్బు ముదిరిపోయి ఆమె తిరిగివచ్చినాక పరిస్థితి చేయిదాటి ఆయన మరణించడం గురించి చదివితే ఇంత త్యాగాన్ని ఏమని అనాలో అర్ధం కాదు.

ప్రస్తుతం నియంతృత్వ ధోరణులనుండి ప్రజలను సమాజాన్నికాపాడుకోవలసిన అవసరం ఉందని చెప్తారు స్వరాజ్యం గారు. మహా విప్లవం ఒకటి వస్తుందని వచ్చే విప్లవం గెలుస్తుందని తనకు ఉన్న ఆశను మన ముందుంచుతూ తన కథనాన్ని ముగిస్తారు ధైర్యశాలి, స్వాప్నికురాలు. గొప్ప ప్రేరణ కలిగించే ఆత్మ కథలా దీన్ని పరిగణీంచవచ్చు. ఇందులో జీవితాలు ఉన్నాయి. చరిత్ర ఉంది. చాలా మందికి తెలీని కొన్ని నిజాలున్నాయి. ముఖ్యంగా ప్రజా జీవితం పట్ల ఒక ఉక్కు మహిళ దృక్పథం కనిపిస్తుంది. నేను చదివిన ఆత్మకథలలో మర్చిపోలేని పుస్తకమిది. 

*****

Please follow and like us:

One thought on “నా గొంతే తుపాకీ తూటా (మల్లు స్వరాజ్యం గారి ఆత్మకథ పై సమీక్ష )”

  1. It is indeed a great source of inspiration to not only women but also all people who want to do something to end all sorts of exploitation, all pervasive misogyny and to create a better society for the future generations
    Congratulations Jyothi garu for providing great analysis on a great book written by a great woman

Leave a Reply

Your email address will not be published.