పార్వతీ తనయ

                                                      -మనోజ నంబూరి

 పతి ఏ సమయాన్నైనా రావచ్చును. హిమపర్వత శ్రేణీ శీతల పవనాలకు చెదురుతున్న ముంగురులను ముడివేసుకుంటూ పార్వతి స్నానానికి అన్నీ సిద్ధపర్చుకుంది.
ద్వారపాలకులూ , పరిచారకులంతా కలిసి యూనియన్ ఆదేశాలతో తమ కోర్కెల సాధనకై  “మాస్. సి.యల్” ( మూకుమ్మడి సెలవు )పెట్టారు.
ఆ స్నానాలగది తలుపు చూద్దునా గడియ సరిలేదు..ఏనాటిదో కదా…ఏ ఘడియలో ఎవరొస్తారో…ఎలా ?? అని ఆలోచించింది పార్వతి తన చెవుల అలంకారాలను ఒలుచుకుంటూ.

సరే తనకిన్ని శక్తులుండగా  కావలికి ఒక ప్రాణిని సృష్టించగాలేనా అనుకుని, చేతిలోని నలుగుపిండితో ఓ  చక్కని బాలుని తయారుచేసి ఊపిరూదింది పార్వతి. స్నానం సంగతి మరిచి  ముద్దు లొలికుతున్న తన  బిడ్డను ముద్దులాడుతూ చాలాసేపు గడిపింది.అపుడే పుట్టిన లేగదూడ గెంతులువేసినట్టూ, బాలుడు తల్లి తో ఊసులాడాడు.
ముల్లోకాల గోలలు నెత్తికెక్కించుకుని  అలసి ఇంటికొచ్చేసరికి సర్వాలంకార భూషితయై లేకపోతే పతి తన వర్క్ టెన్షనంతా తనపై చూపిస్తాడు అనుకుంటూ , మానవుడు చాలా కాలం తర్వాత కనిపెట్టబోతున్న చరవాణిని తీసి  ప్రయత్నించింది. ఈయన ఏమైనట్టూ అని తలుస్తూ..

శివుని యంత్రం నుండి “ఔటాఫ్ కవరేజ్ లోకం ” అని వచ్చింది. జి.పి.యస్ ద్వారా పతి  గజాసురుని పొట్టలో బందీయైనట్టూ గ్రహించింది పార్వతి .వెంటనే సర్వలోక దర్శిని లో శివుని సెర్చ్ చేయగా “సదరు భక్తుడు పెట్టిన ‘వరం ‘ మెలిక వల్ల అతని గర్భాన ముక్కు మూసుకు ముడుచుకు కూర్చొని ఉన్నట్టూ…ముల్లోకాలు శివుని కోసం అల్లాడుతున్నట్టూ గ్రహించింది తెలివైన ఆ జగన్మాత.

“భక్తులు కోరే అతి తెలివి వరాలకు తలొగ్గకు నాధా యని  చెప్పి, చెప్పీ, అలసిపోయింది పార్వతి. తాను కాలు కదిపితే పసిబాలుడి సంగతి మరీ..అనుకుంటూ, ఆకాశవాణి లో బ్రహ్మ, విష్ణువు లకు విషయం వివరించి పతిని విడిపించుకు రమ్మని పురమాయించింది జగన్మాత.

ఆపై  తన బుల్లి బిడ్డడికి ఓ అస్త్రం ఇచ్చి డ్యూటీ రూల్స్ మాత్రం చెప్పి , శూలం ఇంకా నాగరాజునూ ధరించిన మీ నాన్నారొస్తారు సుమీ అని చెప్పటం మరిచి, తలుపు మూయబోయింది పార్వతి.

“అమ్మా! అమ్మా!  ఇపుడే పుట్టాను కదా…ముందు నాకు స్నానం చేయించి తరువాత నీవు చేయి తల్లీ… అని బాలుడు కోరాడు.
             పార్వతి మురిపెంగా బాలుని చెంత మోకాళ్ల మీద కూర్చుని  వాని ముఖాన్ని తన అరచేతులలోనికి తీసుకుని “బంగారూ ! ఈ లోపు నీ ఒళ్లు ఆరనీ..నాన్నగారు తమ శరీర అలంకరణలకు శ్రద్ధ చూపకున్ననూ తానొచ్చుసరికి నేను శుచినై  లేకపోతే చాలా బాధపడతారు. నాకునూ వారిని లక్ష్మీ పతిమాదిరి పట్టు పీతాంబర, కిరీట కర్ణాభరణాలతో , నున్నగా దువ్విన తలకట్టుతో, సుగంధబంధురముగా చూడవలెనని కోరిక యున్ననూ, వెల్లడించ గలదాననా? చెప్పుము నాయనా! వారి వైరాగ్యమూ వారిష్టం అని వదిలివేస్తిని కాదూ!
ఇంతకు ముందు సృష్టి పనులు చాలా ఉండేవి..కానీ నేడు మానవులే అన్నీ సృష్టించేసుకుంటున్నారు గనుక పని తగ్గిపోయింది.
దాంతో  ఆయన ” రేయింబవళ్ళు రేఖామాత్రపు పనియైన లేదుకదా…మరి తొందరగా తెమలవేమీ??!” అంటున్నారు …అందువల్ల ముందు నా స్నానాదులు ముగించి నీ సంగతి చూస్తాను నాయనా.! సమయానికి జాన్స్ న్ అండ్ జాన్ సన్ వారి బేబీ ఆయిలూ, సోపూ తెచ్చే ‘దేవతే’  లేక పోయాడు చూడూ ” అని నొచ్చుకుంది పార్వతి.
       “అమ్మగారూ! మీ శక్తితో వాటిని ఇట్టే సృష్టించవచ్చుననే విషయాన్నే మర్చిపోయారే ! “అంటూ అందంగా నవ్వాడు బాలుడు.
“నా బంగారూ ! నా బుల్లి మేధావీ ! ..అని  తనివితీరా ముద్దులాడి, …ఔను నాయనా నువు నాన్నారిని చూడనేలేదు కదూ! ఆ ఛాయాదర్శినిలో  గల  గ్యాలరీ యందు చూచినచో ఆయనా,నేనూ తాండవం చేసినప్పటి చిత్రాలు దొరుకుతాయి…వారికి ప్రణమిల్లుట మరువకూ”.. అంటూ కూనిరాగం తీస్తూ పార్వతి స్నానానికెళ్ళిపోయింది.

బాలుడు  తల్లి చెప్పినట్టు చూద్దామనుకునేంతలోనే శివుడు లోనికి రాబోవటం, ఇతడు అటకాయించటం జరిగేపోయాయి.
బాలుడూ, శివుడూ  “హూ ఆర్యూ ?! అంటే హూ ఆర్యూ?!” అని ఆర్గ్యూ చేసుకున్నారు.
“దిస్ ఈజ్ మై హోమ్ అంటే …మై హోమ్ “అని హుంకరించుకున్నారు.
      ముల్లోక  ప్రయాణ ఆయాసాన , పైగా గజాసురుని పొట్టలో ఉండి రావటానా,  తానూ వెంటనే స్నానాతృతతో ఉండి  అసలీ బాలుడెవడూ..ఏమిటీ… అంటూ  దివ్య దృష్టిని  వాడటానికి బద్దకించిన శివుడు “దిసీజ్ టూమచ్ ! అడ్డు తొలగు” అని  కోపంగా అరిచాడు.
“యస్ దిసీజ్ త్రీ మచ్ టూ!  వెనుకకు మలుగు”. పసివాడూ గట్టిగా అరిచాడు ఎక్కడా తగ్గేదిలేదన్నట్టూ !
“అయ్యో..బాలకా లోపలున్నది నా దిల్దార్..దారివిడు..అసలే గజాసుర గర్భవాసా(స )న చిర్రెత్తి ఉన్నాను. ఆట్టే విసిగించకు ..వర్ణా..పచ్తావొగే”..శివునికి సహనం చివరికొచ్చి హిందీలో హెచ్చరించాడు.
“దిల్దారైనాసరే దారి విడువలేను. పైగా ఖబడ్దార్ !” అని ఎదురు నిలిచాడు బాలుడు.
ఇంత గొడవ జరుగుతున్నా గంగాళంలో పడుతున్న నీటి  రొద వల్ల పార్వతి ప్రశాంతంగా స్నానం చేసేవచ్చి  చూసేసరికి శివుడు ఆ బాలుని తల నరికి నించోనున్నాడు రొప్పుతూ!.
సమయానికి అందిపుచ్చుకునే నారదుడూ పక్కనే నుంచోనున్నాడు ఇకమీదటి రసవత్తర కథను చూద్దును కాదూ అన్నట్టూ..

ఓ మైగాడ్ !  ఐ మీన్…శివ్ శివా! ఎంత పని చేసారు.’                   ‘ త్రి ‘నేత్రుడవయ్యీ చిన్న కిడ్ అని కూడా చూడలేదే ! బాలకుని ఒళ్ళారలేదనీ తనివితీరా ముద్దాడనైననూ లేదు నేను . ఏం మనిషివీ…అదే …. ఏం దేవుడవీ..మీ ఆజ్ఞ లేనిదే చీమైనా కరవదని మరిచితివా?!  లేకుంటే బాలుడు మీతో ఏల యుద్ధ మాడగలడు??! “అని పార్వతి తీవ్రంగా ఏడుస్తూ ముక్కు పుటాలు ఎర్రబారగా
“ఐ వాంట్ మై బోయ్ బ్యాక్ ఇమ్మిడియట్లీ అంతే !   అభీ…ఇసీ వక్త్..ముఝె  వాపస్ చాహియే…హా.”.అంది శివుడిని కోపంతో చూస్తూ.

శివుడు తన మతిమరపుకు ప్రతిగా తల కొట్టుకోబోయి అమ్మో ‘స్త్రీలు’!  అని ఆగి ఆ దెబ్బ చిన్నగా మెడలో మొద్దులా పడుకున్న  నాగరాజుకి వేసి, “నువ్వయినా గుర్తుచేయవు. పేరుకే పి.ఏ.వి….ఇపుడు చూడు నా తిప్పలు” అంటూ తన ప్రమధగణాలలోని కొందరు  అనుచరులను పిలిచి ఉత్తర దిక్కు శయనించి ఉన్న  ప్రాణి ఏదైననూ ఆ తలను ఖండించి తెమ్మని పురమాయించాడు.

అన్నదే తడవుగా ఉత్తర దిక్కుకు ముందుగా నారదుడు ఉరికాడు.వెనుక గణాలు వస్తున్నారా లేదా చూడకుడానే.
పార్వతి ఆ మాటలకు ఉలికిపడి… ఆపై అడ్డుపడి, ప్రమదగణాలను ఆగమని సంజ్ఞ చేసి శివునితో  “చాల్లెండిక…ఇక్కడి మారణహోమం చాలకనా మరొక ఖండన…సృష్టించిన దాన్ని , వాడి ముద్దు మోమును నేను సరిచేసుకోలేనా..మీరు నిర్ణయాలు ప్రకటించేముందు ఇంటి ఇల్లాలితో చర్చించుట మరిచిపోతారేం..ఇంద ఈ సున్నిపిండి డబ్బా మూత బిగిసింది. కాస్త తీయండి చాలును “అంది.

ఏమైనా..పార్వతి బుర్ర అమోఘం! శిర గణ్యతా వరం ఒహటి నెత్తికేసుకొచ్చాను కదా …ఉత్తరాన పడున్న గజాసుర  శిరస్సు తగిలిస్తే రెండు కార్యాలూ చక్కబడేవని నేను తలిస్తే , పార్వతి రేపు లోకం ఏం తలుస్తుందోననీ ఆలోచించింది కదా..ఇంకానయం గజాసురుని తల నమర్చి తర్క వాదుల నోట నానానుగాదుస్మీ!  అర్థభాగానికి అర్థం గాకుండా ముందుకెళిపోకూడదు అని తలచి  హాయిగా ఊపిరితీసి,
“సరే, నువు బాలుని తలనమర్చి ప్రాణప్రతిష్ఠ చేసుకో..నేనలా బయటకు పోయి బాలునికి వలసిన బొమ్మలు, బట్టలు, తిను బండారాలూ తెస్తాను. నన్నో మంచి తండ్రిగా నీవే వానికి నూరి పోయాలి మరి ” అన్నాడు శివుడు.
            “భూలోక, ఊర్థ్వలోకాలను మానవుడు అభివృద్ధి పేరిట కలుషితం చేయడంతో మనకు మన శక్తుల పట్ల మతిమరుపు బయలుదేరింది… బాలుని అవసరాలన్నీ కూర్చుని సృష్టించుకోగలములే గానీ,  అచటగల ఫారెక్స్ ను వెండిగిన్నెలో కలిపి సిద్ధం చేయండి..బిడ్డ లేవగానే తినిపించుదాం. ఔర్.హా..బిడ్డడికి మీ పులితోలుతో కాక చక్కని వస్త్రములు సృష్టించి ఉంచండి “అంటూ  బాలుని వైపు కదిలింది  పార్వతి.   

చిటికెలో సున్నపిండితో బాలునికి సర్జరీ చేసిన పార్వతిలో ఓ మంచి తల్లి, భర్తకు అపవాదురానీయని గొప్ప భార్య, తొట్రుపాటు కు గురవకుండా సులువుగా,తెలివిగా కార్యసాధన గావించే నాయకి….వంటి ఎన్నో ఉత్తమ పాత్రలను ఏక కాలంలో దర్శించి, చిరు చెమటలతో వన్నె పెరిగి కాంతులీనుతున్న పార్వతి ని ఆరాధనగా, గర్వంగా చూస్తూ శివుడు ఆమె  వెనుకకు వెళ్లి
“నీకు ఋణపడి ఉంటా పార్వతీ..పెద్ద గొడవ తప్పించావుస్మీ! ” అని అభినందించబోయి,
అమ్మో!ఆడువారిని పొగిడామా…గంగకు తోడు ఇంకో బరువు..అని తల తడుముకుంటూ,  స్వగతంలో మాత్రమే మురుసుకుని, పైకిమాత్రం
పార్వతీ చాలా అలసియున్నావు…రమ్ము, నీకూ, బాబుకూ  స్నానానికి గంగనొదులుతాను. హాయిగా శుచియై..మనం ముగ్గురం దోబూచులాడుకుందము” అంటూ మార్చుకుందుకు మరో  పులితోలును అందుకున్నాడు.       ఇంతలో                                   
“క్షంతవ్యుడను తండ్రీ…మీరని తెలియకా”…..అంటూ బాలుడు పార్వతితో వచ్చి తండ్రికి చేతులు చాచి,
” మీరిక ఆ నాగరాజుని దించి నన్నే మోయాలి…ఎత్తుకుని ఆడించాలి… ఆ..” అంటూ మురిపాలు ఒలకబోసాడు.
శివుని ఛాతీ పుత్రోత్సాహం తో మరింతైంది.ఆప్యాయంగా ఎత్తుకుని తలలోని నెల వంకను ఆడుకుందుకు ఇచ్చాడు.
ఈలోగా
ముందుగా పోయన నారదుడు  ఉత్తర దిక్కున కొన ఊపిరితోయున్న గజాసురుని చూసి ఆ  కొన ఊపిరిలోనూ తన తలకు గణ్యత నిమ్మని శివుని గజాసురుడు వరం  కోరాడని గ్రహించి …జరుగబోయేది ఆ మాత్రం ఊహించలేనా అనే నమ్మకంతో ఇక్కడ జరిగిన, జరగబోతుందనుకున్న  పార్టంతా పాట రూపంలో  ఊహా ‘గానం’ చేస్తూ భూలోకం మీదుగా ప్రయాణం చేసాడు. గంధర్వ గానం వినగల అర్హులైన భూలోక ఋషులు ఇది విని పులకితులై తమ ఘంటాలకు పనిచెప్పారు. ఇంతమంది సీనియర్ దేవుళ్ళ మధ్యలో ఓ బాల దేవుడు రాబోతున్నాడన్న సంబరాన!
  ఆ సమయాన గాలి హోరునవీస్తోంది..ఆకాశం సన్నని తుంపరను వెండి రజను చల్లుతున్నట్టూ రాల్చుతోంది.


            ***     


కొన్ని తరాలు దాటిన ఓ  శుక్లపక్ష, చతుర్థి తిథినాడు. .చేతిలోగల భూలోకదర్శినిని  చూపుతూ “ఇది చూసారా ప్రభూ…ఈ మానవులు మన కుమారునికి ఇచ్చిన రూపము ! .పైగా.భక్తి శ్రద్ధలతో ఆబాలగోపాలమూ  వినాయకుని విఘ్న నాయకునిగా పూజించుచున్నది” అంది పార్వతి, చింతిందునా, ఆనందింతునా అన్నట్టు చూస్తూ.
.చుట్టూ ఉన్న మంచుపర్వత శ్రేణి , భూతాపకారణాన కరుగుటను గమనిస్తూ తలపైకెత్తి ఓ జోన్ పొరకు కుట్లు వేద్దామా అని ఆలోచిస్తున్న పతిదేవుని భుజం పట్టి గట్టిగా కుదుపుతూ మిమ్మల్నే స్వామీ! అంది గట్టిగా.
ఆమె చేతిలో గల భూలోక దర్శినీ యంత్రం నందు శివుడు దృష్టి సారించి ఆశ్చర్యం తో మూడు కళ్ళూ అల్లల్లాడించాడు.ఆ వరుస దృశ్యాలను చూసి.
            బాలునికి శరీరాన్ని మించి ఉన్న ఏనుగు తల, పగిలిన పొట్టను కట్టిన పామూకట్టూ, చేటంత చెవులూ,  నవరాత్రులూ, చందాలూ..దందాలూ..పందిళ్ళూ, , పూజలూ,  ఆపై  సందు సందునా అంతస్తు,కుల , వయసుల వారీగా విడివడిగా, వేలం వెర్రిగా ఎత్తులు పెంచేసిన విగ్రహాలూ, లడ్డూలూ , వేలం పాటలూ,
పూజలూ,  జిల్ జిల్ జిగేలు రాజా, గున్నగున్న మామిడీ వంటి రక్తి గీతాలూ, డాన్సులు, డప్పులూ, పోలీసు బందోబస్తులూ  , నిమజ్జనాలూ, మందిలో మనుషులు నలిగి పో’వటాలూ, నీట విగ్రహాలతోపాటుగా జారి’పోవటాలూ, ..అబ్బో…నాగరాజైతే శివుని చెంపకు వేడి సోకేలా   తన భాషలో ‘ బుస్ ‘అని నిట్టూర్చాడు.
ఎంత కథా!ఎంత కథా!..అనుకుంటూ..
దేవ దేవా? ముఖం వాడియున్నదే..అన్నాడు నాగు పలుకులేని యజమానిని పలకరిస్తూ.
    “హు.ఏం చెప్పను నాగూ….ఓహో గరళాకంఠ! నీ మాటంటే ఒళ్ళుమంట!.దొంగ శివ!భంగ శివ! అంటూ ఓ పాటకూడా రాసుకొని ….భక్తులు దాన్ని పందిళ్ళలో వేసి ఆనందిస్తున్నారు నాయనా….అదీ నా కొడుకు పందిరిలో ! అందులో నన్ను తిట్టరాని తిట్లన్నీ తిట్టిపోసారు నాయనా..వినలేక కర్ణములే కొంకరిల్లినవంటే నమ్మూ! నీవూ విన్నావుగా!? .వీళ్ళు తెలిసి చేస్తారా, తెలీక చేస్తారా నాగూ ” అని వాపోయాడు శివయ్య.
“నాకు తెలిసినంతవరకూ తెలిసీ తెలియక చేస్తారవ్వొచ్చు దేవరా! ఇంకా చెప్పాలంటే  ఒకరిని చూసి మరొకరు పిసరెక్కువ చేస్తారు.
మీకు మరో విషయం విన్నవించమందురా..ఈ భక్తులు కష్టాలతో ప్రస్టేటైనపుడు  “రా దిగిరా దివినుంచి భువికి దిగిరా”…అంటూ ధమ్కీ ఇచ్చినట్లూ,
” రారా క్రిష్ణయ్యా “.అంటూ మర్యాద లేకుండా పిలిచినట్లూ..
” ఉన్నావా అసలున్నావా..ఉంటే కళ్లు మూసుకున్నావా” అని కసిరినట్టూ.. నిన్నగాక మొన్న దశరధ పుత్రుని పట్టుకుని “ఎవడబ్బ సొమ్మని కలుకుతూ తిరిగేవూ”..అంటూ దులపరించినట్లూ మన దేవుళ్ళంతా కలిసి నపుడు  కలబోసుకుని తల కొట్టుకొను చున్నారు స్వామీ” అన్నాడు నాగు.

పనిలో పనిగా శివుడు తమ నట్టింట్లో విషయాన్ని భక్తులు ఏదో కథగా చదువుట చూసి ఆ  వ్రత కల్పంలో ఏమని రాసారోనని దాన్ని కూడా స్కాన్ చేసాడు.
గణపతికి చంద్రునితో తగాదాలూ, నీలాపనింద శాపాలూ,పొట్ట పగలడాలూ, పాముకట్లూ…ఓహ్…మహా మునులారా.అనుకుంటూ  రైటర్ పేరుకోసం చివర్న వెతికాడు.
“ఈ కథను చదివినవారికీ , విన్నవారికే కాకుండా పండగవారం వ్రతకథను అచ్చేసే సాక్షి, , ఆంధ్రజ్యోతి , ఈనాడు పత్రికల వారికీ కూడా పుణ్యఫలం దక్కుతుందనీ, సర్వ పాపాలూ హరిస్తాయనీ, పి.యస్ లో కథ చదివి పూజ పూర్తిచేయాలి తప్ప కథను గురించి లంబోదరుడికి లాంగ్ క్వశ్చన్ లు వేయరాదనీ..ఇట్లు.. గవర్రెడ్డి అండ్ మై సన్స్ పబ్లికేషన్స్ అనీ ఉంది.
ఇది  ఆ ఆది మహర్షి పనే..ఆనాడు ప్రమదగణాన్ని ఆదేశించగానే పరుగున పోయినదాయనే అన్నాడు శివనాగు.
శివుడు నారదుని ఉన్నపళంగా రమ్మని కబురంపేడు.
నారదుడు వచ్చి వినయంగా నిలబడ్డాడు.
“ఏంటిది నారదా..మానవులకు ఏమి కథ చేరవేసావూ. జరిగిందొకటీ,నువు మబ్బుల్లోంచి  జారవిడిచిందొహటీనా.. నన్ను తర్కవాదులకు ఎరవేసితివే ” అన్నాడు శివుడు.
నారదుకు ఒకింత సేపు  సిగ్గుతో ‘అమృతం’ నమిలాడు .
“లేదు శివయ్యా..నా నోటి వర్ణన ఆధారంగా..ఋషిపుంగవులు పుత్రుని కథను రమ్యముగా చిత్రించి రచించారు. ఆనాటి ఈదురుగాలుల వల్ల వారు గాలివాటున విన్నదానికీ కాస్త జోడించి , వ్రత విధానమును అనేక తరు దళముల విశిష్టతను,  తెలిసేలా రూపకల్పన చేసి,   మట్టి ప్రతిమలను తయారుచేసికొని, శ్రద్ధగా పూజించేట్టూ , శ్రద్ధతక్కువ విద్యార్ధులకు కనువిప్పుగా  సూక్ష్మ ధృక్కులకు ఏనుగు కళ్ళనూ, ఎక్కువగా వినుటకు చేటంత చెవులునూ ప్రతీకలుగా గల  విఘ్నాలు కలుగనీయని విఘ్నేశ్వరుడని భక్తితో పూజించు రీతిన మన భూలోక పెద్దలైన మునులు  ప్రజలకో పండుగను బహుకరించారు తండ్రీ..  
  ఈ నారదనామ భక్తుడు కాగలకార్యమునకు సానుకూలమే చేయగలడు..ఇపుడు మీరు గజాసురుని చివరికోర్కె తీర్చినట్టే…అతని శిరస్సు పూజాయోగ్యమై గణుతి కెక్కినది. మీ మాట చెల్లినది. అయిననూ నా తొందరపాటును మన్నించ ప్రార్ధన” అన్నాడు తలవాల్చి నారదుడు.
  ఇక నా చేతిలో ఏం ఉందీ…నీ నోటి గాథ వల్లే ఇంతమందికి నోట్లో కి నాలుగువేళ్ళూ పోతున్నాయి. ఇంత పండుగ జరుగుతోంది. ఇక నేనేం అనగలను.
అద్భుతాలకి ఆయుష్షూ, ఆకర్షణా ఎక్కువ !  ముందిది ప్రజలు రిలాక్స్ అవటానికీ, సమూహాల సామరస్యతకూ ,అన్నదానాలకూ,, కాలువ పూడిక తీతలకూ దోహదపడగలదు సరే. కానీ కాలగమనంలో  వెర్రితలలు వేసి మనిషికున్న వికారాలతో ఆకారాలు తయారై పర్యావరణం పాడుకు దారితీయుటను భవిష్యవాణి వక్కాణించుచున్నదనే…..అదే నా బాధ అన్నాడు శివయ్య.
ద్వారపాలకుల కొరత ఎంత పని చేసిందీ అని  ఆలోచిస్తూ…
“ప్రాణేశ్వరీ…పార్వతీ..మన పరివార గణములను పిలువుము..వారి వారి కోర్కెలను తెలుసుకొని, కాలానుగుణమగు మార్పులతో  సకల సౌకర్యాలను కల్పిద్దాం. మన కుమారుడిని గణాధిపతిగా నియమిద్దాం. భౌతికాంశములపై నాకు గల వైరాగ్యము అందరికీ ఉండాలనుకొనుట తగదులెమ్మూ.” అన్నాడు.
పార్వతి సంతోషంగా చూసింది.
ప్రాణేశ్వరీ, సమర్ధురాలైన భార్య ఉండగా నా బోటివానికెందుకింక శ్రమ..వారంతా వస్తారు.సంగతి చూడుము…అంతేకాదు
ఇక ఎవరైనా తపస్సులతో, అభిషేకాలతో భోళాశంకరుడినని నన్ను పొగిడి ఏమార్చిననూ,  ఆనందింపచేసిననూ నా  ‘ప్రత్యక్ష ‘ సమయాల్లో మాత్రం నీవునూ పక్కనుండి సదరు ‘వర’పు తిరకాసులను పరిశీలించి   అంగీకరించినంత మాత్రముననే వరాలను విడుదలచేద్దాం..సమ్మతమేనా”?  అంటూ గోముగా అడిగాడు శివయ్య.
‘సగ’ భాగమునకు అర్థం  ఆది పురుషులకు తెలియుటయే మాకు పరమానందం. ఇక ఈ ‘సమానత’ ప్రతి ఇంటా వెల్లివిరియాలి.అదే మా మహిళామణుల ఆకాంక్ష.. అంది పార్వతి .
జగజ్జనని ఒక్క ఆదేశంతో కైలాస కైవారమంతా క్షణంలో ఆనందంగా వాలిపోయారు.
జయమంగళం నిత్య శుభమంగళం..అని పాడుతూ! స్త్రీ, పురుష సమానత్వం ఆవశ్యకతను, స్త్రీ తక్షణ స్పందనాశక్తి, , యుక్తి మున్నగు సుగుణాల గురించి ఉపన్యసించాడు పరమ శివుడు. పురుషులంతా అక్కడున్న మహిళలకు ‘స్వర్గలోక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు’ తెలిపారు.

******

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.