యాత్రాగీతం

నా కళ్లతో అమెరికా

అలాస్కా

-డా||కె.గీత

భాగం-2

అర్థరాత్రి సూర్యోదయం

మా ప్రయాణం మొదలయ్యే రోజు వారం రోజుల్లోకి రానే వచ్చింది. మిగతా అన్ని విషయాలూ ఆన్ లైనులో, అక్కడా ఇక్కడా తెలిసినా మేం వెళ్లిన జూలై చివరి వారంలో వాతావరణం ఎలా ఉంటుందనేది సరిగా అంచనా వెయ్యడం కష్టమైంది. అందుకు కారణం మేమున్న కాలిఫోర్నియా బే ఏరియాలో వేసవిలోనూ గట్టిగా ఎండ కాసే రోజులు అతితక్కువగా ఉంటాయి. ఒక రోజున్నట్టు మరొక రోజుండదు. ఒకోసారి పగలు వేడిమున్నా రాత్రుళ్లు పూర్తిగా  చల్లబడి పోవడం కద్దు. అలాస్కా ఇదే విధంగా ఉంటుందో లేదో తెలియదు. ఉత్తరార్థగోళంలో కెనడాకు సమాంతరంగా ఉండే దేశం, శీతాకాలంలో మంచుతో కప్పబడిఉండే దేశం కాబట్టి మరికాస్త చల్లగా ఉంటుందో తెలియదు. ఒకవేళ వేడిగా ఉన్నా పూర్తిగా దక్షిణార్థగోళంలో ఉండే వేడిమి అంత మాత్రం ఖచ్చితంగా ఉండదని అంచనా వేసుకున్నాం. 

ఇక బట్టలు సర్దుకునేటప్పుడు వేసవి దుస్తులతో బాటూ ఒక్కో లైట్ జాకెట్ కూడా పెట్టుకున్నాం ఎందుకైనా మంచిదని. ఇక గ్లేసియర్లు చూడడం, ఒక గ్లేసియరు మీదికి వెళ్లి దిగే టూరు మా టూరుల్లో భాగంగా ఎంచుకున్నాం కాబట్టి తలా ఒక మంచు కోటు (జాకెట్టు) , గ్లోవ్స్, మంచుటోపీలు కూడా సర్దుకున్నాం. బాగా చల్లగా ఉంటే మంచులో వేసుకోవలసిన లోదుస్తులు ఇక అక్కడే కొనుక్కోవాలని అనుకున్నాం. అమెరికాలో అంతటా దేశీయ విమాన ప్రయాణంలో హ్యాండ్ లగేజీ లాంటి చిన్న సూటుకేసులు మాత్రమే ఉచితంగా తీసుకెళ్లవచ్చు. కేబిన్ లో వేసే పెద్ద లగేజీలు, సూట్ కేసులకి ఒక్కోదానికి $25 డాలర్ల పైబడి రుసుము చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా మేం తలా ఒక చిన్నసూట్కేసు సర్దుకుంటాం. కానీ అందువల్ల లగేజీ ఎక్కువ పట్టుకెళ్లడానికి అవకాశం ఉండదు. మరి పరిమితమైన దుస్తులతో వారానికి పైబడి ఉండాల్సి వస్తే ఎలా అంటే, మధ్యలో ఒకరోజు హోటల్లోనే బట్టలు వాషింగ్ మెషిన్లలో వేసుకుంటాం. ఇందులో నేను కనిపెట్టిన కొన్ని కిటుకులు ఏవిటంటే కోట్లు వంటివి విమాన ప్రయాణంలో ఒంటి మీదో, భుజానో వేసుకోవాలి. ఇక వేసుకునే బట్టల్ని గుండ్రంగా, దగ్గిరగా మడతలు పెట్టి సర్దుకోవాలి. లోదుస్తుల వంటివి బ్యాగుల ప్యాకెట్లలో సర్దాలి. ఎక్స్ ట్రా చెప్పులు, బూట్లు వంటివి పట్టుకెళ్ళడం కుదరదు కాబట్టి ఏబట్టలు వేసుకున్నా అమరే అరబూట్ల వంటివి వేసుకోవాలి. ఇక ప్రతీ ప్రయాణంలో లాగే గబుక్కున జ్వరమో జలుబో వస్తే వేసుకోవడానికి ముఖ్యమైన మందులు దగ్గర పెట్టుకున్నాం. పిల్లల్తో ప్రయాణం చేసేటప్పుడు ఎప్పుడు ఆకలంటారో తెలియదు అందుకని ఒకట్రెండు స్నాక్ బార్ల వంటివీ పర్సులో వేసుకున్నాను. తక్కువ లగేజీలో అత్యవసరమైన అన్నీ సర్దేసరికి వారం ఇట్టే అయిపోయింది.

మోర్గాన్ హిల్ లోని మా ఇంటి నుంచి ఊబర్ తీసుకుని శానోజేలోని చిన్న విమానాశ్రయానికి పదిగంటల కల్లా చేరుకున్నాం. ఏడున్నర గంటల విమాన ప్రయాణంలో మధ్యలో సియాటిల్ లో ఒక గంట మధ్య ఆగుతూ వెళ్లినా అలాస్కా చేరుకునేసరికి రాత్రి భోజన సమయం అయిపోతుంది. విమానంలో కొనుక్కోవడానికి చల్లని సాండ్ విచెస్ వంటివి తప్ప ఇంకేం దొరకవుకాబట్టి మధ్యాహ్న భోజనానికి శానోజే ఎయిర్పోర్టులో దొరికే వేడి బర్గర్ల  వంటివేవో కొనుక్కుని బయలుదేరేం. సియాటిల్ లో ఒక  విమానంలోంచి  దిగి, బాత్రూములకెళ్ళొచ్చి , మళ్లీ ఇంకొక విమానం ఎక్కేసరికి  గంట  లే ఓవర్  ఇట్టే  అయిపోయింది.  అక్కణ్ణించి  ఏకబిగిన మూడున్నర గంటల ప్రయాణం చేసి రాత్రి తొమ్మిది గంటలకి ఏంకరేజ్ విమానాశ్రయానికి చేరుకున్నాం. అప్పటికే రాత్రి భోజన సమయం కావడం వల్ల అక్కడే భోజన కార్యక్రమం ముగించాం.

విమానాశ్రయం బయటికి ఎయిర్ పోర్టు  టాక్సీ కోసం వేచి చూసే ప్రాంతంలోకి రాగానే  వెచ్చని గాలి చుట్టుముట్టింది. “మన శానోజే లోనే చల్లగా ఉంది కదా మమ్మీ ఇక్కడికంటే” అంది వరు.  ఒంటి మీద వేసుకున్న కోట్లన్నీ అర్జెంటుగా విప్పి నవ్వుకుంటూ నడుములకి కట్టుకున్నాం. హోటల్ ఎయిర్ పోర్టు టాక్సీలోనే వెళ్ళేం.  

ఇంతకీ ఈ టూరులో విమానం టిక్కెట్లు తప్ప మిగతా టూర్లు, హోటళ్ల తో సహా అలాస్కా టూరిజం ప్యాకేజీ  లోనే  భాగంగా ఉండేటట్టు బుక్  చేసుకున్నాం. అందువల్ల ఎయిర్ పోర్టు, రైలు, బస్సు స్టేషన్ల నుండి రవాణా కూడా వాళ్లే ఏర్పాటు చేసేరు. మొత్తం వారం రోజుల ప్రయాణంలో హోటలు బస, ఉదయపు అల్పాహారం, పగటిపూట భోజనాదులు, చూడవలసిన ప్రదేశాల టిక్కెట్లు కూడా అందులో భాగమే. మనిషికి రెండు వేల డాలర్లు ఖరీదైన ప్యాకేజీ అది. మేం హైఎండ్ హోటల్స్, గ్లేసియర్ హెలికాఫ్టర్ టూర్ల వంటి వాటితో అప్ గ్రేడ్ చేసుకునేసరికి మనిషికి మూడువేల పైచిలుకు అయ్యింది. రానూపోనూ విమానం టిక్కెట్లు, అక్కడ కొనుక్కునే వస్తువులు, రాత్రి భోజనం ఇలా అన్నీ కలిపి మనిషికి మరో వెయ్యి డాలర్ల వరకూ పడ్డాయి. అలాస్కా ప్రయాణం ఎందుకు బక్కెట్ లిస్టులో చేర్చాల్సిన గొప్ప ప్రయాణమో అప్పుడర్థం అయ్యింది. 

ఇక మా వంతు ఎయిర్ పోర్టు  టాక్సీ కోసం వేచి చూసి దాదాపు కొండమీదున్నట్టున్న డౌన్ టౌన్ లోని హోటలుకి చేరుకునే సరికి రాత్రి పదిన్నర అయ్యింది. అయినా సాయంత్రం ఆరుగంటల వేళలా వెలుతురుగా ఉంది. ఇక రాత్రి పన్నెండయ్యినా సాయంత్రపు మసక వెలుతురుగానే ఉండడం ఒకపక్క సరదాగా ఉన్నా నిద్రపట్టకపోవడం పెద్ద సమస్యగా మారింది. కిటికీలకు అత్యంత దట్టమైన తెరలు ఉన్నాయక్కడ. అయినా మూలమూల్నించి కళ్లలోకి వెలుతురు ప్రసరిస్తూనే ఉంది. ఇక మా చిన్నమ్మాయి సిరి అయితే చీకటయ్యేకే పడుకుంటానని భీష్మించుక్కూర్చుంది. మొత్తానికి ఒంటిగంట ప్రాంతంలో చీకటి అయ్యి మళ్లీ నాలుగింటికే వెలుతురు వచ్చేసింది. అలా అర్థరాత్రి సూర్యోదయం సరదా మొదటి రోజునే తీరిపోయింది మాకు. 

*****

(ఇంకా ఉంది) 

ఫోటోస్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.