మా కథ 

రచన: దొమితిలా చుంగారా 

అనువాదం: ఎన్. వేణుగోపాల్ 

దొమితిలా జీవితం- సైగ్లో – 20

గృహిణుల సంఘం

నా భర్త అక్కడ ఉన్నాడా? అని అడుగగానే ఆయన నా కోసం బయటికి వచ్చాడు. ఆయన రాత్రంతా కాపలా కాస్తూ అక్కడ నిలబడి ఉన్నాడట. నన్ను చూడగానే ఆయన చాలా సంతోషంగా “చూశావా, వాళ్ళు మన నాయకులను లోపాజ్లో ఖైదీలుగా పెట్టారు. మనం విదేశీయులను ఇక్కడ పట్టుకున్నాం. స్త్రీలు, మేమూ కలిసి కాపలా కాస్తున్నాం” అన్నాడు. ఎంతో ఉద్వేగంతో ఆయన తాము ఏం చేశారో చెప్పాడు. చెప్పి “అక్కడ చూడు ఆ మహిళ పాపం ఎంత వృద్దురాలో’ అన్నాడు.

నేను ఆమె వైపు చూశాను. ఆమె చాలా ముసలి. ఆమె తలంతా నెరిసిపోయింది. కిటికీ దగ్గర కూర్చొని కాపలా కాస్తున్నది. “నువ్వేమో హాయిగా రాత్రంతా నిద్రపోతూ సంతోషంగా ఉండి ఉంటావ్” అన్నాడు. దానికి నేనెంతో బాధపడ్డాను. కాని ఈ మాట ఎక్కడి నుంచో విన్న నార్ బెర్టా వెంటనే “అట్లా ఏమీ అనుకోకు – ఆమె రాత్రంతా హాయిగా సుఖంగా ఉందని నేననుకోను. బహుశా ఆమె మన గురించే ఆలోచిస్తూ రాత్రంతా కాసేపు కూడా కునుకు తీసి ఉండదు” అంది. నా కోసం ఆమె అట్లా మాట్లాడడం నాకెంతో సంతోషమయింది. నేను రాత్రంతా వాళ్ళందరి గురించీ ఆలోచిస్తూ నిద్రపోకుండా ఉండి ఉంటానని ఆవిడ అనుకుంటోంది. కాని నేను ఆయనకోసం మాత్రమే ఎదురు చూసాను.

“దొమితిలా ఇప్పటి దాకా ఏమీ పనిచేయలేదంటే ఆమెకు పనిచేసే అవకాశం రాలేదన్నమాట. కాని ఇప్పట్నుంచి  ఆమె ఎంత బాగా పనిచేస్తుందో? నేను పందెం కాస్తాను” అని నార్బెర్టా నా భర్తతో అంది. వెంటనే నా భర్త అందుకొని “ఏమిటీ ఈ మొద్దా? దీనికి తన పిల్లలనే సరిగ్గా చూసుకోవడం చేతకాదు” అన్నాడు.

“లేదు-లేదు ఆమెకింత వరకూ పని ఇవ్వకపోవడం వల్లనే ఆమె పనిచేయలేదు” అని నా వైపు తిరిగి “చూడమ్మా మనమిక్కడ కాపలా కాస్తున్నాం.  ఈ ఖైదీల్లో ఏ ఒక్కడూ తప్పించుకు పోకుండా మనం చూడాలి. ఇది మనకు కొంచెం కష్టసాధ్యమైన పనే. అందుకే ఈ పని చేయడానికి చాల మంది కావాలి. కనుకనే నువ్వు కూడా వచ్చి కాపలా కాస్తే ఎంతో బాగుంటుంది” అంది. నేనొచ్చి నిలబడుతానని నార్బెల్టాకు చెప్పాను.

 “ఏ షిఫ్ట్ లో పనిచేస్తావ్” “ఎన్ని షిఫ్ట్లున్నాయి? “మూడు” “సరే మూడిట్లోను పనిచేస్తాను”. నేను పిల్లల్ని తీసుకు రావడానికి ఇంటికివెళ్ళి యూనియన్ కు తిరిగి వచ్చాను.

నార్ బెల్టా చాలా ఉత్సాహంగా పనిచేసే స్త్రీ. ఆమె భర్త జబ్బుతో ఉండటం వల్ల ఆమె కమిటీకి సెలవు పెట్టింది కాని ఆమె తన సమయాన్ని ఆస్పత్రిలో భర్తను చూసుకోవడానికీ, కాపలాకాసే వాళ్ళకి సాయపడడానికీ ఉపయోగించింది. సరిగ్గా ఆ సమయంలోనే ఆమె భర్తకు ఆపరేషన్ జరిగి ఆయన చనిపోయాడు. ఈ సంఘటన నన్ను బాగా కదిలించింది. ఓ వైపు భర్త జబ్బుతో ఉండగా మరోవైపు ఖైదీల బాధ్యత తీసుకోవడమంటే ఆమె సాహసాన్ని ఊహించుకోండి. ప్రజలకు ఆమె అంకితమైపోయిన తీరు అందరికీ ఆదర్శం కావాలి. ఒక్కసారైనా ఆమె ఏడవగా నేను చూడలేదు.

నార్ బెరాతో పాటు కమిటీ తాత్కాలిక కార్యదర్శి జెరోమా డి బొమెరో కూడా ఉండేది. నార్బెల్టా భర్తను చూసుకోవడానికి ఆస్పత్రికి వెళ్ళిన సమయంలో జెరోమా బాధ్యత నిర్వహించింది. అక్కడే నాకు పిమెంటెల్ భార్యతో పరిచయం కలిగింది. ఎస్కోబార్ భార్యను, తల్లిని, పిల్లలను మరింత ఎక్కువగా తెలుసుకునే అవకాశం కలిగింది.

యూనియన్ కేంద్ర కార్యాలయంలో జీవితం ఒక ప్రత్యేక జీవితం. అక్షరాలా ప్రతి పనీ మేం పంచుకొని చేశాం. ఎవరైనా ఏ ఒక్కళ్ళకో తిండితెస్తే అదీ మేమందరమూ పంచుకుని తినేవాళ్ళం. మా పిల్లలందరూ అక్కడే ఓ పెద్ద హాల్లో ఉండేవారు. నడవాలో కొందరు కాపలా కాస్తుండే వాళ్లు. ఏ ఒక్కడూ తప్పించుకుపోకుండా ప్రతి వాళ్ళు జాగ్రత్తగా ఉండేవాళ్ళు. కొందరు ఖైదీల మీద నిఘా వేసి ఉండగా మరికొందరు నాయకులతో సంబంధాలు పెట్టుకొని ఆలోచనలు చేస్తుండేవారు.

ప్రతిపనీ అక్కడ సమర్థవంతంగా నిర్వహించబడింది. ఏ విషయమైనా నార్బెల్టాకు ఎప్పటికప్పుడు సమాచారం అందేది. కాపలాకాయడం మాత్రమే మా బాధ్యత. నాయకత్వంలో ఉన్న స్త్రీలు అప్పుడప్పుడు వచ్చి చూసిపోతుండేవాళ్ళు. ఇంటర్వ్యూలు చేస్తూండే వాళ్ళు. అయితే క్రమశిక్షణ సరిగ్గా పాటించే వాళ్ళం గనుక లోపలి హాల్లో ఏం జరుగుతోందో మాకు తెలిసేదికాదు. ఏ సమాచారమైనా యూనియన్ రేడియోలో ప్రకటించినప్పుడే మాకు తెలిసేది.

ఓ సారి తలుపుదగ్గర నేను కాపలా కాస్తున్నప్పుడు ఒక కార్మికుడు తలుపు తట్టాడు. అప్పుడు రాత్రి పదకొండు అయిందనుకుంటాను. ఆయన గని కార్మికుడే గనుక నేను నిస్సంకోచంగా తలుపు తెరిచాను. ఆయన కొంచెం తాగి ఉన్నట్టు నాకనిపించింది.

“మీరు విదేశీయుల పక్షమే ఉన్నారు. మీరు వాళ్ళనిక్కడ రాజుల్లా మేపుతున్నారు. వాళ్ళమీద ఈగైనా వాలకుండా చూసుకుంటున్నారు. అక్కడ మన నాయకులు రాజకీయ ఖైదీలకొట్లలో ఎట్లా మగ్గిపోతున్నారో మీకేమైనా తెలుసా? అక్కడ సాన్ రొమాన్ మన నాయకుల్ని చంపేస్తుంటే మీరు వీదేశీయులతో కలిసిపోతున్నారు. నన్ను లోపలికి రానీ!” అన్నాడు.

నేనాయనతో ముందే నిర్ణయించుకున్న ప్రకారం “వీల్లేదు – ఇక్కడికెవరు రావడానికి వీల్లేదన్నా! ఇంటికెళ్ళిపో. రేపు నువు మామూలుగా ఉన్నప్పుడు మనమీ సంగతి మాట్లాడుకుందాం. అప్పుడైతే పరిస్థితి నీకు అర్థమవుతుంది. ఖైదీల్ని మనం బాగా చూసుకుంటున్న మాట నిజమే. కానీ మన నాయకుల్ని కూడా వాళ్ళక్కడ మరీ ఘోరంగా ఏమీ చూడ్డంలేదు.”

నేను శాయశక్తులా ప్రయత్నించి ఆయనను శాంతపరుద్దామనుకున్నాను. కాని ఆయన ఎంతకూ అర్థంచేసుకోక నేను విదేశీయులకు అమ్ముడు పోయాననీ, తనకు మమ్మల్నందర్నీ చంపేయాలనుందనీ అన్నాడు.  అలా తిడుతూనే ఆయన డైనమైట్ తీసి చూపించాడు. నాకెంతో భయమేసింది. “డైనమైట్, డైనమైట్! మనందరం పేలిపోబోతున్నాం! మనందరం పేలిపోబోతున్నాం’ అని అరుస్తూ లోపలికి పరిగెత్తాను. నిజానికి డైనమైట్ పేలగా నేనెన్నడూ చూడలేదు. ఐతే అది చాలా శక్తివంతమైనదనీ, కొండల్ని పిండి చేస్తుందనీ తెలుసు. నా అరుపులు విని నార్బెల్టా బయటికొచ్చింది. “వాళ్ళు డైనమైట్ తెచ్చారు” అని ఆవిడతో చెప్పాను. నార్బెర్టా మెట్లు దిగి కిందికి పరిగెత్తేసరికే డైనమైట్ తాడు ముట్టించి ఉంది. చాలా నిశ్శబ్దంగా ఆ డైనమైట్ పట్టుకొని బయటికి వెళ్ళిపోయింది. ఆమె ఆ డైనమైట్ ను బయట పారేసిందో లేదో అది పేలిపోయింది. మేమందరమూ ప్రమాదం నుంచి బయటపడ్డాం. భవనం కొంచెం ఊగింది గాని ఎవరికీ దెబ్బలేమీ తగలలేదు. ఈ సంఘటనతో ఆవిడ ఒక సాహసి అని నాకు అర్థమైపోయింది. ఇక ఆమె నాకు ఆదర్శమయింది. ఆ రోజుల్లోనే ఇంకొక ముఖ్యమైన సంఘటన జరిగింది. పాజ్ స్టెన్ సోరో తొత్తులు రైతాంగాన్ని మాకు వ్యతిరేకంగా రెచ్చగొట్టి యూనియన్ కేంద్ర కార్యాలయల మీద దాడిచేసేందుకు ఒక సైన్యాన్ని తయారు చేశారు.

ఓ రోజు మా దగ్గరికో ఇద్దరు మనుషులొచ్చి “ఉకురేనా రైతులు ఓ పల్లెటూరి మీద దాడిచేశారు. పొలాలు తగలబెట్టారు, పశువుల్ని ఎత్తుకుపోయారు, స్త్రీలను చెరిచారు. మీకేమన్నా వార్తలు అందుతున్నాయా? మీరు అక్కడి జనానికి సాయపడాలి. మీరు సంఘటితమై ఉన్నారు గదా! మీకో రేడియో స్టేషన్ కూడా ఉందిగదా! మీరు ఈ దాడికి నిరసన తెలపాలి ప్రచారం చేయాలి” అన్నారు.

ఇది సరైనదనే మేం భావించాం “ది మైనర్స్ వాయిస్” అని పిలవబడే మా రేడియో స్టేషన్ నుంచి ఈ విషయం ప్రసారం చేశాం.

ఇంతకూ ఆ తర్వాత తెలిసిందేమిటంటే మా దగ్గరికొచ్చి ఈ సంగతి చెప్పిపోయిన వ్యక్తులే ఉకురేనా వెళ్ళి రైతుల్ని రెచ్చగొట్టారు. “గని కార్మికులు మిమ్మల్ని అవమానాలపాలు జేస్తున్నారు. మీరు వాళ్ళమీద విరుచుకుపడాలి” అని వాళ్ళకు ఉద్బోధించారు. గని కార్మికులకు వ్యతిరేకంగా రైతాంగాన్ని, రైతాంగానికి వ్యతిరేకంగా గని కార్మికుల్ని రెచ్చగొట్టి తమ పబ్బంగడుపుకునే కుటిల ప్రయత్నం ఇది. కొద్ది కాలానికే మేం ఈ సంగతి అర్థం చేసుకోగలిగాం. మా మధ్య ద్వేషబీజాల్ని నాటి మాలో మేమే పోట్లాడుకునేట్టు చేయగల శత్రువు కుయుక్తిని మేం తెలుసుకోగలిగాం.  ఉకురేనా ప్రాంతంలో రైతాంగం కమెండోలుగా సంఘటితపడి ఎంఎన్ఆర్ ప్రభుత్వాన్ని సమర్థించారు. ఆ గ్రామంలోనే వ్యవసాయ సంస్కరణల చట్టంమీద సంతకాలు జరిగాయి. మేం వాళ్ళను అవమానించామని వినగానే వాళ్ళు ప్రతీకారం తీర్చుకొనేందుకు విదేశీయుల్ని విడిపిస్తామని సైగ్లో-20కి రావడానికి నిశ్చయించుకున్నారు.

ఉకురేనా జనం మాపై దాడి చేయడానికి వస్తున్నారని మాకు ఓ రోజు తెలిసింది. హెలికాప్టర్లు కూడా వస్తున్నాయని, వాట్లలోంచి పారాచూట్ల మనుషులు దిగి విదేశీయుల్ని విడిపించుకుపోతారని కూడా మాకు తెలిసింది. అంటే మా మీద భూమి మీద నుంచీ ఆకాశంలోనుంచీ ఒకేసారి దాడి జరగబోతుందని రేడియోలో వాళ్ళు తాము టామ్ మార్టిన్ కు, అతని అనుచరులకు శుభాకాంక్షలు తెలపదల్చుకున్నామని ప్రకటించారు. వాళ్ళు ఇంగ్లీషులో మాట్లాడారు. వేకువ జామున కమెండోలు వచ్చి సాయపడే సమయాన్ని సరిగా వినియోగించుకోవలసిందని వాళ్ళు ఖైదీలకి చెప్పారు. మాలో ఒకావిడ కొడుకుకు కొంచెం ఇంగ్లీషు వచ్చు. అతను వాళ్ళు మాట్లాడింది అర్థం చేసుకొని మాకు చెప్పాడు. సైన్యం సాయంతో రైతులు యూనియన్ కేంద్ర కార్యాలయం మీదికి దండెత్తి రాబోతున్నారని మాకు తెలిసిపోయింది.

మేం అప్పుడొక సభ పెట్టుకున్నాం. జెరోమా మాట్లాడింది. మేం తీసుకున్న బాధ్యత చాల గొప్పదని, ఆ బాధ్యతను చనిపోయేదాకా నెరవేర్చగలుగుతున్నందుకు తనకెంతో ఆనందంగా ఉన్నదని చెప్పింది. ఐతే మేం మా పిల్లల్ని ఆ వెధవల చేతులకు చిక్కనీయగూడదనీ, కనుక చనిపోతే పిల్లలతో కలిసే చనిపోవాలని ఆమె చెప్పింది. అప్పుడు మేం ఒక నిర్ణయానికొచ్చాం. మేం పిల్లల్ని, భర్తల్నీ, ఏ ఒక్కళ్ళనీ వదలకుండా తీసుకుని యూనియన్ భవనంలోకి వెళ్ళిపోయి, భవనానికి బాంబ్ అమర్చి, దాడి జరిగితే, అవసరమైతే విదేశీయుల్లోగాని మాలోగాని ఏ ఒక్కరూ మిగలకుండా బాంబ్ పేల్చి భవనం నాశనం చేయాలి. అది మా అంతిమ నిర్ణయం.

మా దగ్గరుండిన ఐదారు డైనమెట్ పెట్టెల్ని మేం పంచుకున్నాం. ఆ డైనమైట్లను టేబుళ్ళకు, తలుపులకు, కిటికీలకు, చివరికి మా శరీరాలకూ, మా పిల్లల శరీరాలకు కూడా కట్టుకున్నాం. దాడి జరిగిన వెన్వెంటనే ముట్టించడానికి ఏర్పాట్లు చేసుకున్నాం.

మా ప్రధాన కార్యదర్శి యూనియన్ భవనం ముఖద్వారం దగ్గర నిలబడి మాట్లాడింది. “వాళ్ళిక ఏ ఆశలు పెట్టుకోకుండా చూడండి.  వాళ్ళు తప్పించుకుపోవడానికి మనం సందివ్వడం లేదు” అని చెప్పింది. అంతేకాదు, రైతుల్ని చూసి ఖైదీల్లోంచి ఏ ఒక్కరైనా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే వెంటనే పేల్చివేత జరగాలని ఆమె చెప్పింది.

మేం తీసుకున్న నిర్ణయం చాల సాహసికమైనది. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే మేమా నిర్ణయాన్ని తప్పనిసరిగా పాటించి ఉండే వాళ్ళమని నేను కచ్చితంగా చెప్పగలను. మాకు అంత ఆత్మవిశ్వాసం ఉంది. మాకై మేం ఏర్పరచుకున్న ఒక ప్రత్యేక లక్ష్యాన్ని మేం తప్పకుండా సాధించగలం. అంతేగాక ఆ ఖైదీలను వదిలేసి పారిపోతే ఆ తర్వాత రైతుల చేతుల్లో మేం ఎన్ని చెప్పరాని బాధలు అనుభవించవలసి వచ్చేది?!

 నా భర్తకూడా అక్కడే ఉన్నాడు. “నువు చనిపోతే నేను చనిపోతాను. పిల్లలూ చనిపోతారు. ఆ వెధవల చేతుల్లో బాధలు పడేందుకు ఏ ఒక్కరూ మిగలరు” అని మేం ఒకళ్ళ కొకళ్ళం చెప్పుకున్నాం. ఐతే మేం ఆ రాత్రంతా కళ్ళలో ఒత్తులు వేసుకుని కాపలా కాసినా ఏమీ జరగనే లేదు.

అప్పుడు గని కార్మిక సమాఖ్య ప్రధాన కార్యదర్శి జువాన్ లెచిన్ మా దగ్గరి కొచ్చాడు. మొదట ఖైదీలతో మాట్లాడి, ఆ తర్వాత మాతో మాట్లాడి మమ్మల్ని ఒప్పించడానికొచ్చాడు. ఈ విదేశీయులు లోపాజ్తో రేడియో సంబంధం పెట్టుకోవాలన్నా కటావి వెళ్ళాల్సి ఉంటుంది కనుక వాళ్ళను కటావి దాక పంపి వెనక్కి తీసుక రావాలని తనను నమ్మమని ఆయన మమ్మల్ని బతిమిలాడాడు. నా తల ఎంత నెరిసి పొయిందో చూడండి. ఎన్ని బాధలు పడ్డాను! ఎంత పనిచేశాను! నన్ను నమ్మండి. ఖైదీల్ని కటావి వెళ్ళనివ్వక తప్పదు. ఐతే వాళ్ళు తప్పకుండా వెనక్కి వస్తారు. నేను కూడా ఎంతో కాలంగా పోరాటం చేస్తున్న వాణ్నేనని మీకు తెలుసు. నేను కూడా ఇప్పుడు జైల్లో ఉన్న నాయకులంత అవిశ్రాంతంగా పోరాడిన వాణ్నే. నేనెన్నెన్ని జయాపజయాలను చవి చూశానో మీకు తెలుసు. మిత్రులారా పరిస్థితి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి”.

మొదట ఆయన మాటలకి నేను చాలా కరిగిపోయాను. ఆయన మాట వినాలనీ, ఆయన చెప్పింది పాటించాలని అనుకున్నాను. ఐతే అప్పుడు జెరోమా డి రొమెరో పరిస్థితి అర్థం చేసుకుని సరైన జవాబు చెప్పింది.

“లెచిన్ గారూ! మాతో మాత్ర మింగించే ముందు దాన్ని పంచదార గుళిక చేయడమెలాగో మీకు బాగా తెలుసు. మీరు విదేశీయుల కేమైనా మేలు చేయదలచుకుంటే మీ ఇష్టం. కావలిస్తే వాళ్ళని బంగారు సింహాసనాల మీద కూచోబెట్టుకోండి. కాని ఏం చేసినా అదంతా యూనియన్ భవనంలోపలే. బయటికి వెళ్ళడానికి వీల్లేదు. మీకు తలనెరసి పోయి ఉండవచ్చు కాని జనం కూడా అలసిపోయి ఉన్నారు. తాము పొందిన అపజయాల తోటీ, జైలు శిక్షలతోటీ, ఎదుర్కోవలసిన పోరాటాలతోటీ విపరీతంగా అలసిపోయి ఉన్నారు. ముసలి వాళ్ళయి పోతున్నారు. మాకో లక్ష్యం ఉందనీ, మా నాయకుల్ని విడుదల చేసి ఇక్కడికి పంపించేదాకా మేం విదేశీయులను వదిలి పెట్టే సమస్యే లేదని మీకు తెలుసు. విదేశీయులను ఇక్కడ బందీలుగా ఉంచితేనే మా నాయకులతో వాళ్ళను మార్చుకోవచ్చు. అది జరిగే వరకూ ఏ పరిస్థితి ఎదురైనా మేం వాళ్ళను వదిలి పెట్టం.  లెచిన్ ఎంతో ఉద్రేకపడిపోయాడు. “పదివేల మంది కార్మికులతో,  పదిమంది ఆడవాళ్ళతో ఒప్పందానికి రావడం నాకెట్లా సాధ్యమవుతుంది? ఇలా సాగితే నేనేం చేయగలను?” అని కోపంగా అరుస్తూ వెళ్ళిపోయాడు.

నా కళ్ళముందు అప్పుడు జరిగిన సంఘటన చాలా ముఖ్యమైనదని నాకు తట్టింది. జెరోమా అంత ధైర్యంగా ప్రవర్తించడం ఒక అపూర్వ సంఘటన అని నాకనిపించింది.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.