మా కథ 

రచన: దొమితిలా చుంగారా 

అనువాదం: ఎన్. వేణుగోపాల్ 

దొమితిలా జీవితం- సైగ్లో – 20

గృహిణుల సంఘం

ఇంతలో మాకు రేడియోద్వారా ఒక సమాచారం తెలిసింది. క్షతగాత్రుల్ని తీసుకుపోతున్న ట్రక్కు సరిగా ఎక్కడుందో గుర్తించగలిగాం. కాని సైన్యం ఎవరినీ, చివరికి అంబులెన్సును కూడా ట్రక్కు దగ్గరికి వెళ్ళనివ్వడం లేదు.

“అక్కడి కెలాగైనా వెళ్ళాలి. తప్పకుండా వాళ్ళదగ్గరికెళ్ళాలి” అని జనం కోరడం మొదలెట్టారు. కాని మాకు వాహనాలేమీ లేవు. కనుక స్త్రీలందరూ బయల్దేరి లాలాగువా ప్రజల సంఘీభావం సాధించడానికి ప్రచారం చేశాం. లాలాగువా జనం మాకెంతగానో తోడ్పడ్డారు. మేం పంపిన ప్రతినిధులు ఆహారం, మందులు, డబ్బు సేకరించుకొని తిరిగొచ్చారు. అప్పుడు మేమొక వాహనాన్ని అద్దెకు తీసుకోగలిగాం. ఆ వాహనంలో పది హేడుగురు స్త్రీలం కిక్కిరిసి కూచున్నాం. డ్రైవర్ అయిష్టంగానే మమ్మల్ని తీసుకెళ్లడానికి ఒప్పుకున్నాడు. ఐనా ఆ సంఘటన జరిగిన స్థలానికి తీసుకెళ్లనన్నాడు. మమ్మల్ని ఆయన హువానునిలోనే వదిలేశాడు. అదైనా మాబాగే అనుకుని మేమిక దిగిపోయాం . నేను బయల్దేరేటప్పుడే సైగ్లో-20లో ఇంకో స్త్రీకి నా తాత్కాలిక ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించాను. మేం హువానుని చేరేసరికి పరిస్థితి చాల మారిపోయి ఉంది. సైగ్లో-20 నుంచి వచ్చిన వాళ్ళెవరూ అక్కడ లేనేలేరు. అంతకు ముందు రాత్రే వాళ్ళు సైన్యం అచ్చెరువొందేటట్లు పురోగమించారు. మేం వెళ్ళే సరికి హువానునికి దూరంగా సొరా-సొరా మైదానంలో పోరాటం జరుగుతోంది. డైనమైట్ తప్ప మరే ఆయుధమూ చేతిలో లేకుండా కార్మికులు ఈ అద్భుతం సాధించారు.

హువానుని గృహిణుల సంఘం ప్రధాన కార్యదర్శి నాకు ఎదురొచ్చింది. ఆమె అప్పటికి ఏడు నెలల గర్భిణి. నేను నాలుగు నెలల గర్భంతో ఉన్నాను. నేనెళ్ళే సరికే అంబులెన్స్ బయల్దేరుతోంది. “మనవాళ్ళక్కడ గాయపడుతున్నారు. సైన్యం వాళ్ళని తీసుకురానివ్వడం లేదు. అక్కడికెళ్ళి ఏం చేయాలో ఆలోచిద్దాం. ముందైతే ఎక్కు” అని ఆవిడ అంది. త్వరలోనే మేం కాల్పులు జరుగుతున్న చోటుకు చేరుకున్నాం. అక్కడి వాళ్లు మమ్మల్నాపేసి ముందుకెళ్లడానికి వీల్లేదన్నారు. హువానుని కార్యదర్శి స్ట్రెచర్ మోసే వాళ్ళని పిలిచి గాయపడిన వాళ్ళని తీసుకురమ్మని కోరింది. వాళ్ళందుకొప్పుకోలేదు. వెంటనే ఆమె వాళ్ళనడిగి వాళ్ళ కోట్లు తీసుకొని తానొకటి వేసుకుని మరొకటి నాకిచ్చి వేసుకొమ్మంది. నావైపు తిరిగి “నువు కూడా భయపడుతున్నావా ఏం?” అని అడిగింది. నిజానికి నేనప్పుడు భయపడుతూనే ఉన్నాను. కళ్ళ ముందర అంత దారుణ దృశ్యం చూడడం నాకదే మొదటిసారి. కాని తేరుకొని “ఫరవాలేదు, వెళదాం పద” మన్నాను. చెరొక కోటూ వేసుకొని అంబులెన్స్ లోంచి దిగాం. “మనం స్త్రీలమన్న సంగతి వాళ్ళు గుర్తించేట్టు చూడు. జుత్తువిరబోసుకో” అని ఆమె చెప్పింది. అప్పుడామె ఒక కర్రా, ఒక తెల్ల గుడ్డా తీసుకుని జండా తయారు చేసింది. మేమిద్దరమూ ఆ జెండా పట్టుకొని మైదానంలోకి నడక సాగించాం. మా పక్కనుంచే ఒక గుండు దూసుకుపోయింది. నా చెవులు చిల్లులు పడిపోయాయి. “భయపడుతున్నట్లు ఏ మాత్రమూ కనిపించకు పనిచేస్తూనే పో” అని ఆమె చెప్పింది.

వాళ్ళు మమ్మల్ని బైనాక్యులర్స్లో చూస్తున్న సంగతి మాకు తెలుస్తూనే ఉంది. ఐనా మేం ముందుకే నడిచాం ఇక వాళ్ళు మమ్మల్నేమీ అనలేదు.

మేం జాగ్రత్తగా రక్తం మరకల వెంటనే నడిచి గాయపడి పడిపోయిన వాళ్ళను ఎత్తుకొని తీసుకురావడం మొదలెట్టాం. కాని మేమిద్దరమే పనిచేస్తుండటంతో చాలా కష్టమైంది. మేమిద్దరమూ కూడా గర్బిణులమే. ఆ స్థితిలో మరో మనిషిని పూర్తిగా ఎత్తుకొని మరో చోటికి తీసుకెళ్ళడం ఎంత కష్టమో ఆలోచించండి. ఇక అక్కడి నుంచి మేం క్షతగాత్రులను అంబులెన్స్ వాళ్ళకు అప్పజెప్పాం. ఆ రోజంతా పనిచేస్తూనే ఉండడంతో మేం పూర్తిగా అలసిపోయాం. చివరి దశలో మాకు స్టెచర్ మోసేవాళ్ళు సాయపడ్డారు. అప్పుడు మేం ఒక పురుషుడు, ఒక స్త్రీ కలసి ఒక దళంగా చేసి పనిచేశాం. ఇక సైన్యం అప్పుడు మమ్మల్నేమీ అనలేదు.

మేం తిరిగి వెళ్ళేసరికి అక్కడి స్త్రీలు వంటలు వండి, సైగ్లో-20 ప్రజలకి పెట్టకుండా ఒక్క హువానుని ప్రజలకే పెడుతుండడం గమనించాం. సైగ్లో-20 జనమేమో పోరు మధ్యలో ఎక్కడో కొండలమీద ఉన్నారు. మేం మళ్లీ సొరాసారాకు తిరిగి వెళ్లి అక్కడ మేం వెళ్లగలిగినంత ముందుకు వెళ్లాం. అక్కడ కొండలమీద సైన్యం రాకని కని పెట్టేందుకు కొందరు కాపలా కాస్తున్నారు. పూర్తిగా సొక్కిపోయి మేం కొండదిగి హువానుని చేరాం. కొండమీది కాట్రేడ్స్ తమ దగ్గరి డైనమైట్ అయిపోవచ్చిందనీ, మరికొంత డైనమైట్ ను, మరికొందరు మనుషులనూ సాయం పంపమని కోరారు. ఐతే హువానునిలో మా మాట ఖాతరు చేసేవాళ్లే కరువయ్యారు. చివరికి, ఆత్మరక్షణ కూడా చేసుకోలేని దశలో కొండల మీది వాళ్ళు నిరాశతో వెనక్కి మళ్లి హువానుని చేరారు.

ఓ చోటేమైందంటే, ఓ ట్రక్కులో కొందరు మావాళ్ళు సైన్యాన్ని తరుముకుంటూ వెళ్ళిపోయారు. అకస్మాత్తుగా సైన్యం ఆగి వెనక్కి తిరిగింది. అప్పుడు మావాళ్ళు వెనక్కి చూసుకుంటే ఒంటరిగా ఉన్న సంగతి అర్థమైంది. ఒక ట్రక్కు వెనక్కి తిప్పుకొని వచ్చేస్తుంటే తోవలో ఎంతో మంది కార్మికులు తమను కూడా తీసుకుపొమ్మని ప్రాధేయపడ్డారు. ఆ డ్రైవర్ మైదానంలోకి మూడుసార్లు వెళ్ళి మూడు ట్రక్కుల నిండా కార్మికులను హువానుని చేర్చాడు. వాళ్లందరూ దప్పిక గొని ఉన్నారు. ఆకలితో అలమటించి పోతున్నారు. కాని మా దగ్గర కనీసం టీ కూడా లేదు. నీళ్ళయినా లేవు. అప్పుడు సమయం చూద్దామా, అర్థరాత్రి దాటింది. మేమంతా అప్పుడు హువానుని యూనియన్ భవనంలో ఉన్నాం. అప్పుడు వాళ్ళ నాయకుడు మా స్త్రీల నుద్దేశించి మాట్లాడాడు.

“బహుశా రాత్రికి సైన్యం ఇక్కడ కూడా దాడిచేయొచ్చు. ఇక్కడున్న వాళ్లందరినీ పట్టుకు పోవచ్చు. కనుక మీరందరూ ఆస్పత్రి భవనంలోకి వెళ్తే బావుంటుందనుకుంటాను. అక్కడి వాళ్ళనడిగి మీ కోసం కొన్ని మంచాలు కూడా సంపాదించాం. మీరంతా అక్కడికెళ్ళి పడుకోవాలని కోరుతున్నాను. పొద్దుట్నించీ వంచిన నడుమెత్తకుండా పని చేసి అలసిపోయారు. ఇప్పుడు మళ్ళీ కష్టాల్లో ఇరుక్కోకండి” అన్నాడాయన.

మేం అది సరైందనే అనుకున్నాం. పడుకోవడానికి ఆస్పత్రిలోకి వెళ్ళిపోయాం. మర్నాడు ఉదయమే ఆస్పత్రి డైరెక్టర్ సాయంతో ఫలహారం తయారు చేసి హువానునిలో ఉన్న గ్లో -20 కార్మికులందరికీ పెట్టగలిగాం. ఆస్పత్రి వాళ్ళు మాకు టన్నుల కొద్దీ పిండి చే బదులుగా ఇచ్చారు. ఐతే ఆస్పత్రిలో మిగతా ఉద్యోగులు మాత్రం మాకు వస్తువులు బదులివ్వడానికి అనుమానించారనుకోండి. కనుక మేం ముగ్గురు స్త్రీలను వాళ్ళదగ్గరే ఉంచివచ్చాం. వాళ్ళు మాకిచ్చిన వంట పాత్రలన్నీ తిరిగి ఇచ్చిన తరువాతే వాళ్ళని తీసుకుపోదలిచాం. ఆ తర్వాత లాలాగువా ప్రజలు మాకు ఇచ్చిన విరాళాల డబ్బుతో బేకరీకి వెళ్ళి బ్రెడ్ కొన్నాం. వాటిని మా శాలువల్లో మూటకట్టుకున్నాం. కొనగలిగినవన్నీ కొన్నాక తెల తెల వారుతుండగా మా వాళ్లకు తినిపించడానికి బయల్దేరాం. ఆ మాత్రమైనా ఏదో ఒకటి తినగలిగినందుకు వాళ్లు పడ్డ సంతోషం చెప్పనలవిగాదు.

ఆ తర్వాత మేం ఆస్పత్రికి వెళ్ళి క్షతగాత్రులలో ఎందర్ని వెంటనే సైగ్లో-20 తీసుకెళ్ళిపోగలమో, మరెందర్ని తీసుకెళ్ళడం వీలుపడదో చూసివచ్చాం. మైదానంలో చూసినప్పుడు చనిపోయారనుకొని, ఐనాసరే తీసుకెళ్తామని తీసుకొచ్చిన ముగ్గురు వ్యక్తులు ప్రాణంతో ఉండడమేకాదు, తేరుకొని ఉండడం మేం చూశాం. వాళ్లలో ఒకతను కొద్ది కాలం కింది వరకూ మా నాయకుడుగా కూడా ఉన్నాడు. ఇంతకూ ఆ రాత్రి సైన్యం రానేలేదు. అప్పటికే లోపాజ్లో వాళ్లకెన్నో సమస్యలున్నాయి. ఆ తర్వాత కొన్ని వారాలకే ఓ మోస్తరు సైనిక తిరుగుబాటు జరిగి అధ్యక్షుడు పాజ్ ఎస్టెన్ సోరో దేశం నుంచి పారిపోవాల్సి వచ్చింది. కార్మికులు చెల్లించిన మూల్యం

1964 నవంబర్ 4న జనరల్ బారియెంటోస్ అధికారానికొచ్చాడు.

మా నాయకులు ఎంత స్పష్టతగల వాళ్లంటే వాళ్లు మొదటినుంచే బారియెంటోస్ ఒక మిలిటరీ మనిషనీ కనుక ఆయనను సమ్మే వీలు లేదనీ ప్రచారం చేస్తూ వచ్చారు. ఈ ప్రచారంలో వాళ్ళు జనానికెన్నో విషయాలు తెలియజెప్పారు. మరో మాటల్లో చెప్పాలంటే ప్రభుత్వం పట్ల జనం తమ అసమ్మతిని ప్రకటించారు. ఏర్పడినది ప్రజా ప్రభుత్వం కాదనీ, అది బొలీవియాను రక్షించబోవడం లేదనీ జనం కచ్చితంగా తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలకు తలపడుతుందని మా నాయకులు ముందే హెచ్చరించారు. తాము నడిపించిన ప్రభుత్వానికీ, తమ పై రుద్దబడిన ప్రభుత్వానికీ తేడా ఏమిటో ప్రజానీకం గుర్తించడం మొదలైంది. పైనుంచి తమ పై రుద్దపడిన ప్రభుత్వాన్ని ఎప్పుడూ నమ్మవీలు లేదని వాళ్ళు గుర్తించారు. బారియెంటోస్ సైగ్లో-20కి సైన్యాన్ని వెంటబెట్టుకొని వచ్చాడు. వాళ్ళు వచ్చీ రాగానే యూనియన్ భవనపు సైరన్ మోగించారు. సైనికులు ఇల్లిల్లూ తిరిగి మమ్మల్నందర్నీ ప్రదర్శనశాలకు లాక్కుపోయారు. అక్కడ బారియెంటోస్ మాకో ఉపన్యాసమిచ్చాడు.  “నా ప్రభుత్వం ఎట్లా ఉంటుందో తెలియకుండానే నా మీద ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు? నేనెన్ని మంచి పనులు చేయతల పెట్టానో మీకు తెలుసా? ఐతే మీకొక సంగతి స్పష్టం చేయవలసి ఉంది. కొమిబొల్ పూర్తిగా దివాళా తీసి ఉంది. బొలీవియన్లందరూ త్యాగాలకు సిద్దపడవలసిన కాలం ఇది. నేను నా జీతంలో సగం వదిలేస్తున్నాను. సైన్యంలో ప్రతి ఒక్కరూ నాలాగ సగం జీతంతోనే పనిచేయబోతున్నారు. మేం ఎందుకిట్లా త్యాగం చేయాలి? కొమిబొల్ చేతులెత్తేసింది గనుక. గని కార్మికులకు సాయపడేందుకే మేం మా జీతాలొదులుకుంటున్నాం. ఐతే ఈ దుస్థితి రావడానికి నా తప్పేమీ లేదు. పాజ్ ఎస్టెన్సొరో ఎంతో డబ్బు తినేసి ఈ నష్టాలు తెచ్చాడు. ఈ నష్టాల వల్ల ముప్పై ఐదువేల మంది కార్మికుల ఉద్యోగాలు ఊడబోతున్నాయనీ, వాళ్ళు వీథుల్లో పడాలి వస్తుందనీ మీకు తెలుసా? అదే జరిగితే పరిస్థితులెట్లా ఉంటాయి? బొలీవియా అల్లకల్లోలమై పోదూ?! మనం అందుకు సిద్దపడి ఉన్నామా? లేదు. కార్మికులందరూ దేశం కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారని నాకు తెలుసు. అందుకే ఒక్క సంవత్సరం, కేవలం ఒక్క సంవత్సరం పాటు మాత్రం నేను మీకు సగం జీతాలే చెల్లిస్తాను. ఏడాది తర్వాత కొమిబొల్ దగ్గర డబ్బు జమకూడగానే మీ డబ్బు మీరు తీసుకుందురు గాని! లాభాలువస్తే సమానంగా మీ అందరికీ పంచుతాం!”

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.