
చిత్రలిపి
“నాకలలే నా ఊపిరి !”
-మన్నెం శారద
రాత్రంతా రేపటి వికాసంకోసం
ఒకానొక మొగ్గనై …..కలలుకంటూ
యోగనిద్రలో తేలియాడుతూ
రేపటి వెలుగురేఖకై నిరీక్షిస్తుంటానా ….
ఎక్కడివో కొన్ని దుష్టక్రిములు నా రేకులపై వాలి
నా కలల్ని ఛిద్రం చేస్తుంటాయి
చిరుగాలితో సయ్యాటలాడుతూ
నునులేత కిరణ స్పర్శతో
పులకించి పులకించి
తరియించి తరియించి
రంగుల హంగుతో
రాసక్రీడలో ఉండగా
అండగా ఉండవలసిన
నాకొమ్మ ముళ్ళే ననుగీరి
గాయపరుస్తున్నాయి
ఒకానొక భావుకతని
మనసు ఆపుకోలేక
గుండె సైపలేక ….
చిరుగాలిని సుగంధభరితం చేసి
నిన్ను చుట్టుకోవాలని ఆశపడతానా …
కాలుష్యమంతా కొట్టుకొచ్చి
నాకళ్ళలో దుమ్ముకొట్టి
కన్నీరు పెట్టిస్తుంది .
వేయేల ,,,
ఇక్కడ అక్కరలేనిదేమీ లేదు
నోటిమాటజారకుండానే
నీతిచంద్రికలు పట్టుకుని
ఊదరగొట్టే
ఈ రసహీన
జనావళి లో
కలలు గాక మరేమి మిగిలివుంది నాకు !
*****

నా పదహారవ ఏటనుండి కథలు రాస్తున్నాను. నా మొదటి మూడు నవలకి బహుమతులు వచ్చాయి. అనేక కథలు బహుమతులు అందుకున్నాయి. రెండుసార్లు నంది అవార్డ్స్ అందుకున్నాను. తెలుగు యూనివర్సిటీ నుండి ఉత్తమ రచయిత్రి అవార్డు అందుకున్నాను. నంది అవార్డ్స్ కమిటీ లో రెండుసార్లు పనిచేసాను. The week Magazaine నన్ను Lady with golden pen గా ప్రశంసించింది. దాదాపు వెయ్యి కథలు, 45 నవలలు రాసాను. చిత్రకళ నా హాబీ.
