
సరి లేరు నీకెవ్వరు!!
-సుభాషిణి ప్రత్తిపాటి
నీ కన్నీటిని దొర్లించటానికో…
పాత్ర కావలసినప్పుడు,మ
నీ వ్యధో,బాధో వెలికిబెట్టుకోడానికో…
గురి అవసరమైనప్పుడూ..,
నీ గుండె గాయాలకు… మాటల మలాము కావలసినప్పుడు,
నీ కడగండ్ల కడలినీదే తెరచాప అవసరమైనప్పుడు,
నీలోపలి సొదేదో వినడానికో
చెవి కావలసినప్పుడు,
నీ స్వోత్కర్షల నాదస్వరానికి ఊగే తల అవసరమనుకున్నప్పుడు,
నీ సిద్ధాంతాలు, రాద్ధాంతాలు
బలపరచుకునే భజనపరులు
కావలసినప్పుడు…
నీకు ఆసరాకో భుజం, చెక్కిలి జారే నీటిని తుడిచే చేయి,
ఓ మాట , ఓ ఆశ …నీకందించే
స్నేహం నీకు కావాలనుకున్నప్పుడు
మాత్రమే…. తోటి మనుషులతో
మాట్లాడే…మనిషీ!! సరిలేరు నీకెవ్వరూ!! కరుడుగట్టిన స్వార్థంలో!!!
సంకుచిత బుద్ధిలో!!!
*****
Please follow and like us:

ప్రత్తిపాటి సుభాషిణి నివాసం బాపట్ల. గత 20 సంవత్సరాల నుంచి తెలుగు ఉపాధ్యాయినిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు.
కళాశాలనుంచి కవితలు వ్రాస్తున్నా, ఇటీవలనుంచే వివిధ పోటీలలో పాల్గొంటూ కృష్ణ శాస్త్రి, సినారె, అద్దేపల్లి పురస్కారాలు, టీచర్స్ ఫెడరేషన్ వారి సావిత్రి బాయి పూలే అవార్డులు పొందారు. బడి పిల్లల కవితలు 3 పుస్తకాలు వేయించారు. పుస్తక పఠనం, మొక్కల పెంపకం, రచనలు చేయడం ఇష్టమైన వ్యాపకాలు.
