అస్థిత్వపు ఆనవాళ్ళు

-పి.సుష్మ

మీరంతా వేరువేరుగా విడిపోయిండొచ్చు

 ఆమె ఎప్పటిలాగే ఒక్కటిగానే ఉంది

ఒంటరిగానే, ఓడుతూనే  ఉంది

సమానత్వపు,అస్తిత్వపు పొరల్లో

అరచేయి పిడికిలి అర్ధభాగం తేలి వర్ధిల్లాలంటూ

అసలు కారణాలు పక్కకు పెట్టి

నాగరికతకు నడుమ్మీద అనాగరికపు కొలతలు కొలవకు

ఆకాశం, అవనిలా రూపురేఖలు మారుతున్నా

అరచేయి రేఖల్లో కూడా కొత్తదనం లేని

ఆమె జీవితంలో సగభాగాల వాటాలంటూ మోసం చేసిందెవరు

 నాలుగు గోడల మధ్యనైతేనేమి, నాలుగు దిక్కులు నడుమనైతేనేమి

అడుగడుగున గీత గీసి, ఆమె  స్వేచ్ఛను హరించుకుతినిందెవరు

శరీరాలపై వ్యామోహాలకు అబద్ధపు పేర్లు పెట్టి

వాళ్ల ఆకలిని అవకాశంగా చేసుకుని వ్యాపారం చేసిందెవరు 

పురుషాహంకారంతో పుచ్చు పట్టిన నీ పుర్రెనడుగు

అసలు అస్తిత్వపు యుద్ధాలకు పునాదులు వేసింది ఎవరో

నీకెప్పుడు అనిపించలేదా 

నీ మనుగడకు ఆనవాళ్ల నిలువుటద్దాన్ని  మొరటుగా ముక్కలు చేస్తే నీ అస్తిత్వం ఎక్కడుంటుందని

పాకర పట్టిన నీ బుద్ధి మీద

ఆమె మాత్రం ఇంకెన్నాళ్లు పాకులాడుతుంది

నిజంగా నీ అస్తిత్వం మీద ఆశలుంటే

ఆమె దారిలో ఆమెను నడవనివ్వు

నిజంగా నీకు  ఆమె ఇష్టమైతే

నీరింకిన ఆమె కళ్ళల్లోకి చూడు

తడారని కలల గూడులెన్నున్నాయో

నిజంగా నువ్వు ఆమెను ఆరాధిస్తే

ఆమెను ఆమెకు తిరిగివ్వు

నిజంగా నీకు నువ్వు కావాలంటే

ఆమె చీరకొంగును ఓ కపోతంలా ఎగరనివ్వు

*****

Please follow and like us:

2 thoughts on “అస్థిత్వపు ఆనవాళ్ళు (కవిత)”

Leave a Reply to Anonymous Cancel reply

Your email address will not be published.