ఇలాటి తాతయ్య వుంటే బావుండు!

(కారా మాస్టారి స్మృతిలో)

-శాంతారామ్

ఇలాటి తాతయ్య వుంటే బావుండు అనిపించేలా , తాతయ్య లేనివాళ్లకు అసూయ పుట్టించేలా కాళీపట్నం రామారావు గారి మనవడు  శాంతారామ్ గారి స్మృతులు నెచ్చెలి పాఠకుల కోసం ప్రత్యేకంగా ఇక్కడ ఇస్తున్నాం. (సేకరణ: ఫేస్ బుక్  నుండి)   

తాతగారు 4-6-2021 ఉదయం 8:20కి వెళ్ళిపోయారు. పొద్దున్నలేచి టీ తాగి అత్తతో ప్రేమగా మాట్లాడి, అత్త చేతిలో వెళ్ళిపోయారు. ఆయన వయసు 97 అయినా, తాతగారు లేని ఇల్లు, వాలు కుర్చీ, మంచం ఊహకే కష్టంగా ఉంది. ఆ వాలు కుర్చీ దగ్గరే 20 ఏళ్ళకు పైగా నేను గడిపింది. నాకు తాతగారు మాత్రమే కాదు, టీచర్, ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్  కూడాను. 

***

నేను పుట్టిన తరువాత నుండీ మామ్మ-తాతగారు మాతోనే ఉండేరు. గజపతినగరంలో ఏటి ఒడ్డున ఇంట్లో ఏళ్ల పిల్లవాడిగా ఉన్నప్పుడు కిటికీ దగ్గర కూర్చోపెట్టి తినకపోతే, ఆ ఎర్రటోపీ పోలీసు వాడికిచ్చేస్తానంటూ బామ్మ తినిపించేది. అర్థరాత్రి నేను లేచి ఆకలనేడిస్తే, అప్పటికే రోజంతా పనిచేసి అలసి నిద్రపోయిన అమ్మను లేపకుండా పాలన్నం కలిపి మామ్మే తినిపించేది. పొద్దున్న గోడకానుకుని గొంతుక్కూర్చున్న తాతగారు నాచేత పద్యాలు చెప్పించేవారు. 5 సార్లు ఆయన వెనక నేను చెప్పి, ఆరో సారి నన్నే చెప్పమనేవారు. ఇంగ్లీషు పోయమ్స్  కూడా నేర్పేవారు. స్కూల్లో చేరిన కొత్తల్లో నేను వెళ్ళనని ఏడిస్తే చాలా కాలం తాతగారే భుజాలమీద ఎత్తుకుని తీసుకువెళ్ళి తీసుకొచ్చేవారట. నాకు పదమూడు-పధ్నాలుగేళ్ళు వచ్చేవరకు కూడా ఎప్పుడడిగితే అప్పుడు తాతగారు భుజాల మీద ఎత్తుకునేవారు. మేం పెద్దవాళ్ళైనా సరే, ఏ అర్థరాత్రైనా కాళ్ళు పీకెడుతున్నాయంటే మామ్మే కాళ్ళు పట్టేది, మజ్జిగ-నూనె కలిపిన నీళ్ళు నిద్రపట్టేవరకూ కాళ్ళకు రాసేది. అలా రాసిన బామ్మ చేతి స్పర్శ ఇప్పటికీ గుర్తు.

నాకు తాతగారే అక్షరాభ్యాసం చేయించారు. చిన్నప్పుడు నేర్చుకున్నదంతా తాతగారి ఒళ్ళోనే. స్కూల్ డైరీలో హోంవర్క్ చేసానని అమ్మనాన్నల కన్నా తాతగారి సంతకాలే ఎక్కువ. నాకు తెలుగు, లెక్కలు, ఇంగ్లీషు అన్నీ తాతగారే నేర్పారు. బడికి బయల్దేరే అరగంట ముందు బట్టలేసుకుని తాతగారి దగ్గరకి వెళ్తే చాలు, తెలుగు, లెక్కలు, ఆయన నేర్పిన తీరు, పాఠాలు ఇప్పటికీ గుర్తే. పెన్ ఏ వేళ్ళతో ఎలా పట్టుకోవాలి, ఎంత వాల్చి తేలిగ్గా రాస్తే దస్తూరి బాగుంటుందన్నది తాతగారే నేర్పారు. మామ్మైనా, తాతగారైనా ఎంత అల్లరి చేసినా, “హఠ్ దొంగవెధవా” అని అనటమే కానీ ఏనాడూ గట్టిగా తిట్టింది కూడా లేదు. “భయమేస్తుంది మామ్మా” అంటే, “భయమా బారికాడి దెయ్యమా, పడుకో” అనేది.  నిద్ర పట్టట్లేదు అంటే కళ్ళుమూసుకుని అంకెలు లెక్కపెట్టుకో అనేది. నిద్ర లేచేసరికి గోడకానుకుని పేపరు చదువుతున్న తాతగారు, ఎదురుగా కాఫీ తాగుతూ కిళ్ళీ కడుతున్న మామ్మ కనిపించేవారు. నాన్నగారో, అమ్మో కోప్పడితే నాకూ, చెల్లికీ కాపు తాతగారు మామ్మే.

తాతగారు తెల్లవారు 5కే నిద్రలేచేవారు. ఆయన లేచారన్న కాసేపటికి మామ్మ కూడా లేచేది. ఇద్దరూ చాలా ఏళ్ళు పదుంపుల్ల తోనే తోముకునేవారు. తాతగారు చాలా కాలం యోగాసనాలు వేసి, ధ్యానం చేసేవారు. ఆయన శీర్షాసనం వేస్తే చూడటం అదో వండర్ లా ఉండేది. ఆఖరున శవాసనం వేసినప్పుడు 5 నిముషాల తరువాత చెప్పు అనేవారు. ఇద్దరూ కలిసి తినటమో లేదా తాతగారి తరువాత తినటమో చేసేది మామ్మ.  మధ్యాహ్నం అసలు పడుకునే వారే కాదు. పడుకున్నా పావుగంట తరువాత లేపు అని చెప్పేవారు. పావుగంటంటే పావుగంటే, ఒక్క నిముషం కూడా ఎక్కువ కాకూడదు. మామ్మ మటుకు పడుకునేది. వారానికోసారో ఎప్పుడో తాతగారు, మామ్మ మాత్రమే కూర్చుని పేకాట ఆడేవారు. వాళ్ళిద్దరూ ఆడుతుంటే చూడటం సరదాగా ఉండేది. చాలా కాలం ఇద్దరూ పట్టెమంచాల మీదే పడుకునేవారు. ఆ పట్టె వదులైనప్పుడు రెండు వైపులా కూర్చుని వాళ్ళిద్దరే బిగించుకునేవారు. మధ్యాహ్నం వేళ  పడుకున్న తాతగారు నిద్రలేచారేమో, కాఫీ గానీ టీ గానీ తాగుతారేమో  అడగమని మామ్మ పంపేది. తాతగారి దగ్గరకి వెళ్ళి అలా చూడాలంటే కాస్త భయముండేది. ఎలా తెలుస్తుంది మామ్మ అంటే, “తాతగారి కాలి బొటన వేలు కదులుతుంటే లేచినట్టు, లేదంటే లేవనట్టు, వెళ్ళి చూసి రా” అనేది. 

***

తాతగారు రోజూ కథానిలయానికి వెళ్ళి చాలా సేపు, సాయంత్రం 8 వరకూ కూడా అక్కడే పనిచేసేవారు. టీ-కాఫీలు, కిళ్ళీలు కావాలంటే మాచేత పంపించేవారు. ఆదివారాలు, వేసవిసెలవులు వచ్చినప్పుడు నేను కూడా సాయం చేస్తానని వెళ్తే, ఏ కాగితం ఎలా కొయ్యాలో, పుస్తకాలు ఎలా కట్టలు కట్టాలో, అట్టలెలా వెయ్యాలో, అన్నీ పక్కన కూర్చోపెట్టుకుని చేసి చూపించి, అలాగే చెయ్యమని నేర్పేవారు. తాతగారు కథ కొన్ని నెలల తరబడి రాసేవారు. రాసే సమయంలో ఆయన దగ్గరకు వెళ్ళటానికి అందరికీ జంకే. నువ్వెంతవరకూ చదువుకున్నావు మామ్మ అంటే, “నా మొహానికి చదువు కూడానూ , ఐదో ఆరో అంతే” అనేది. కానీ అడపా దడపా కథానిలయం నుంచి తాతగారు తెచ్చిన పుస్తకాలు, పత్రికలు, కథల కటింగ్లు చదువుతుండేది. ఒక కథ కూడా రాసింది. కానీ బామ్మ దస్తూరి సరిగ్గా అర్థమయ్యేది కాదు. 

ఎలా చదవాలిది, ఏం చెయ్యాలి అని ఎప్పుడైనా అంటే, “నాకవన్నీ తెలీదురా, మీ తాతనో, నాన్ననో అడుగు” అనేది. తాతగారిని అడిగితే ఏది ఎలా చెయ్యాలి అని వివరంగా చెప్పేవారు. అలా చెప్పినప్పుడల్లా మామ్మ ఒక చెవితో వింటూనే ఉండేది. ఖాళీ వేళల్లో, “తాతగారు, చదవటానికి నాకేదైనా పుస్తకం ఇవ్వండి” అంటే జాగ్రత్తగా నా వయసు, పరిణితికి తగ్గట్టు వెతికి మరీ ఇచ్చేవారు. ఇచ్చిన దాంట్లో కూడా ఇంత వరకూ చదువు, ఏమైనా సందేహాలొస్తే నా దగ్గరకు రా అనేవారు. ఫలానా ఏదైనా పుస్తకం అని నేనంటే, అది ఇప్పుడు కాదు, పెద్దయ్యాకనో ఎప్పుడో చదువు అనేవారు. వినాయక చవితి లాంటి పండుగలొస్తే తాతగారే పక్కన కూర్చుని వ్రతవిధానం, కథ చదివి చేయించేవారు. ఈలోగా మామ్మ, అమ్మ నైవేద్యాలు సిద్ధం చేసేవారు. ఏడాదికోసారి వేసవి సెలవుల్లో పెదనాన్నలు, అత్త వాళ్ళ పిల్లలు అందరూ వచ్చేవారు. చాలా సందడిగా ఉండేది. పిల్లలందరికీ మామ్మ  అన్నం కలిపి ముద్దలు తినిపించేది. ఆ కొద్దిరోజులు మామ్మ-తాతగార్లు చాలా ఆనందంగా ఉండేవారు.

కథానిలయం వార్షికోత్సవం వస్తే దసరా-దీపావళి కన్నా సంబరంగా ఉండేది ఇంట్లో. తాతగారిని కలవటానికి వార్షికోత్సవానికి వచ్చిన రచయితలు, స్నేహితులు, గంటల తరబడి అందరూ కూర్చుని చర్చలు చేయటం, ఒక కాన్ఫరెన్సులా ఉండేది. పైదేశాలనుంచి వచ్చినవారు, ప్రొఫెసర్లు లాంటి వాళ్ళు డాబామీద, నేలమీద పడుకునేవాళ్ళు. ఇంట్లో మనుషుల్లా అంతంత పెద్దవాళ్ళు కలిసి తిరుగుతుంటే, వాళ్ళ మాటలు అర్థం కాకపోయినా, ఇలా కూడా ఉంటారా అని ఆశ్చర్యం కలిగేది. 3 రోజుల వార్షికోత్సవమైనా, వచ్చిపోయే వాళ్ళ సందడి వారం ముందుగానే మొదలయ్యేది. అంతమందికీ మామ్మ, అమ్మ వంటగదిలోంచి బయటకి రాకుండా వండి పెట్టేవారు. వచ్చిన వాళ్ళందరూ కూడా తాతగారిని మాస్టారు అని,  మామ్మని  మాత్రం సీతమ్మా అనేవారు.

***

నేను ఏడవ తరగతిలో ఉన్నప్పుడు అమ్మకి గుండె ఆపరేషన్ అయ్యింది. నాన్నగారు అమ్మ వెంటే హైదరాబాద్ వెళ్ళి ఉన్నారు. అప్పుడు తాతగారు బామ్మే మాకు చేసేవారు. పిన్ని, అమ్మమ్మ వచ్చి కొద్ది రోజులుండి సాయం చేస్తుండేవారు. నేను అ వయసులో ఏదో అన్నందుకు, “వెధవ, మీ అమ్మ చచ్చి బతుకుతోంది, అలా అంటావా?” అని మందలించింది మామ్మ. నాన్నగారు ఎప్పుడైనా కోప్పడ్డా, ఈ వయసు వరకు కూడా నేనేమైనా చేసినా, “అలా కాదు నాన్నా, నువ్వలా చేస్తే అమ్మ నాన్న బాధపడతారు. తండ్రి ఆలోచన ఇలా ఉంటుంది, అమ్మ ఆలోచన ఇలా ఉంటుంది” అని తాతగారు దిద్దేవారు. ఎప్పుడైనా దిగులుగా కూర్చుంటే, “ఏరా అలా ఉన్నావు, నాన్న ఏమైనా అన్నాడా, నేను చెప్తానుండు” అనేది మామ్మ. నాకు టీనేజ్ వచ్చాక, చదువుకోసం ఇంటి నుండి బయటకి వచ్చేముందు తాతగారు ఒకరోజు పిలిచి, “నువ్వు పెద్దవాడివవుతున్నావు కదా, అమ్మనాన్నలతో చెప్పుకోలేనిదేదైనా, ఎలాంటి విషయమైనా నాతో చెప్పు. బయటకి వెళుతున్నావు, ఈ ఈ ప్రమాదాలు ఉంటాయి, చెడు అలవాట్ల జోలికి వెళ్ళకు”  అని చాలా చెప్పారు. ఇబ్బందుంటే నాతో చెప్పు అని ఇప్పటివరకు కూడా ఇంటికెళ్లిన ప్రతిసారీ నన్ను బయట విషయాలు అడిగి గైడ్ చేసేవారు. ఇంట్లో ఏ ఇబ్బంది ఉన్నా, ఎవరైనా మొదట పరిగెట్టేది తాతగారి సలహాకే.

“సినిమాకొస్తావా మామ్మ” అంటే, “అన్నేసి గంటలు కూర్చేలేనురా” అనేది. అన్నమయ్య, స్వరాభిషేకం సినిమాలు హాలులో చూసింది. తాతగారు మాత్రం ఓపికున్నంతకాలం చిరంజీవి, రజనీకాంత్, మహేష్ బాబు, కమల్ హాసన్, ప్రభాస్ సినిమాలు హాలుకి వచ్చి మరీ మాతో చూసేవారు. ‘అతడు’ సినిమా ఎన్ని సార్లు టీవీలో వచ్చినా చూసేవారు. నేనెప్పుడైనా హాస్టల్ నుండి ఇంటికి వచ్చినప్పుడు, “ఒరేయ్ బడుద్ధాయ్, అదేదో మహేష్ బాబు లేదా ప్రభాస్ సినిమా వచ్చిందట, నువ్వెళ్ళేలోపు నన్ను తీసుకెళ్ళాలి” అనేవారు. 2006లో కేదార-బదరీ యాత్రకు తాతగారు మాతో వచ్చారు, వారి అమ్మ-నాన్నలకి బదరీలో కర్మ చేదామని. ట్రైన్లో కూర్చుని వివిధ ప్రాంతాలు ఎలా ఎందుకు ఉంటాయో, ప్రయాణాలు చేసేటప్పుడు చుట్టూ మనుషులనీ పరిసరాలనీ ఎలా గమనించాలో, ఆయనే ఏ ఏ చోట్లకు తిరిగారో, తాతగారి చిన్నప్పటి విషయాలు, అవన్నీ చెప్పేవారు. తాతగారు చేయగలిగినంతకాలం వాళ్ళ అమ్మనాన్నల తద్దినం మా ఇంట్లోనే జరిగేది. అలా కాకుండా వేరే చోటైన రోజు మధ్యాహ్నం వరకూ తినకుండా ఉండి, కర్మ అయిపోయిందని తెలిసాక భోంచేసేవారు. నేను హాస్టల్ నుండి ఇంటికి వచ్చినప్పుడు 8 గంటలు దాటాక కూడా పడుకుంటే, అలసట తీరేలా ఒళ్ళు కాళ్ళు పట్టి, “లేరా కోతి వెధవా” అని నిద్రలేపేవారు.

***

ఇన్నేళ్ళలో జలుబు, జ్వరం వంటివి కూడా తాతగారికి రావటం ఎరగను. మామ్మ మాత్రం కీళ్ళనొప్పులు వంటి వాటితో ఇబ్బందిపడుతుండేది. ఏ రోజైనా మామ్మ ఒంట్లో బాలేక పడుకుంటే, పుస్తకం చదువుతున్న తాతగారు, ఒక కంట చూస్తూనే ఉండేవారు. తాతగారు-మామ్మకి ఐదుగురు కొడుకులు, ఒక కూతురు. ఒక పెదనాన్నగారు నేను పుట్టక మునుపే చనిపోయారు. నా చిన్నప్పుడే తాతగారి ఒక తమ్ముడు చనిపోయారు. మరో ఇద్దరు పెదనాన్నలు 2007-2011 మధ్యలో చనిపోయారు. ఇన్ని జరుగుతున్నా వాళ్ళిద్దరూ మానసికంగా బలంగానే ఉన్నారు. అన్నీ ఓపిగ్గానే భరించారు. 2011 తరువాత మామ్మకు కాన్సర్ వ్యాధి వచ్చింది. రేడియాలజీ, అవనీ ఇవనీ చేసిన చికిత్సలు, కాన్సర్ మామ్మ ఆరోగ్యాన్ని బాగా లాగేసాయి. ఆ బాధంతా మౌనంగానే సహించింది. అలా వాటి వలనే 1-7-2013 న మామ్మ వెళ్ళిపోయింది. ఆ తర్వాతే క్రమేపీ తాతగారి ఆరోగ్యం కూడా తగ్గసాగింది. 

బామ్మ ఫోటో వైపు చూస్తూ ఏడవటం, కళ్ళంట నీళ్ళు తిప్పుకోవటం తాతగారికి మామూలైపోయింది. వచ్చినవాళ్ళకీ, ఇంట్లోవాళ్ళకీ మామ్మ ఫోటో చూపించి, “మా గృహిణి” అని చెప్తుండేవారు. ఆ తర్వాత క్రమేపీ కథానిలయం వెళ్ళటం కూడా తగ్గించి, కొంత కాలానికి పూర్తిగా మానేసారు. కథానిలయం విషయాలు పట్టించుకోటమే మానేసారు. వాళ్ళ సొంతూరు మురపాకకి అప్పుడప్పుడూ ఎవరో ఒకరి సాయంతో వెళ్ళొచ్చేవారు. మామ్మ చనిపోయిన గత ఎనిమిది ఏళ్ళలో స్నేహితులు, శిష్యులు, చెల్లెళ్ళు ఇలా తాతగారికంటే చిన్నవారు, సమవయస్కులు వెళ్ళిపోవటం ఆయన మీద బాగా ప్రభావం చూపించింది. ఒక్కొక్కరూ వెళ్ళిపోతుంటే ఒంటరితనం వలన భయం కూడా తెలియకుండానే కమ్మింది. ఒకసారి “మీరు ఇంకా ఎంత కాలం బ్రతుకుదాం అనుకుంటున్నారు” అనడిగితే, “ఇంకా చాలా చెయ్యాలి రా, ఎక్కువ కాలం ఉంటే బాగుండు” అన్న ఆయన 2018 ప్రాంతంలో అదే ప్రశ్న అడిగితే, “వద్దురా” అని నిట్టూర్చేసారు. ఎప్పుడూ పుస్తకాలు చదివేవారు, భారత-భాగవత-రామాయణాలు తిరగేస్తూండేవారు. ఎక్కడికైనా వెళ్ళడం కూడా తగ్గించేసారు. కేవలం ఆరోగ్యం తనిఖీకి మాత్రమే వెళ్ళేవారు. 2018లో నేను సరదాకి ఖర్గపూర్ వస్తారా అంటే ఓపిక చేసుకుని అమ్మని తోడు తీసుకుని వచ్చి నాలుగైదు  రోజులు నాతో  ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఎన్నిసార్లు అడిగినా రాననేవారు. నన్ను మాత్రం “తరచుగా వస్తూండు రా” అనేవారు. ఇంటికి వెళ్ళినప్పుడు, “ఒరేయ్, ఈ ఈ పుస్తకాలు నీ కోసం మార్క్ చేసుంచాను. ఇవన్నీ నువ్వు చదవటానికి” అనేవారు. 2019 తర్వాత ఆరోగ్యం అంతంత మాత్రమే అయిపోయింది. ఏరోజుకారోజే అన్నట్టు ఉండేవారు. నడిచే మనిషి కాస్త చక్రాల కుర్చీలోకి, తరువాత మంచానికీ వచ్చారు. గత రెండు నెలలుగా తిండి కూడా తగ్గిపోయింది. గత వారంలో మాట కూడా రాలేదు. ఏదైనా చెప్పాలంటే పలకమీదో, కాగితం మీదో రాసేవారు. మొన్న 3-6-2021 పొద్దున్న పెదనాన్నగారు, నాన్నగారు, అమ్మ, అందరినీ పట్టుకుని చాలాసేపు ఏడవసాగారు. మాట రాకపోవటం వలన ఆయన బాధ సరిగ్గా తెలిసేది కాదు. 

పరిస్థితి ఇలా ఉందని తెలిసి అత్త-మామయ్యలు వెంటనే హైదరాబాదు నుండి 3వ తేదీ రాత్రికి చేరుకున్నారు. 4వ తేదీ ఉదయాన అత్తని చూసి, సంతోషంగా మాట్లాడి, టీ తాగి, కిళ్ళీ వేసుకుని వెళ్ళిపోయారు.

ఇంటికి వెళ్తే మెరిసే కళ్లతో వాలు కుర్చీలోంచి “కోతివెధవా” అన్న పిలుపు ఇక లేదు.

*****

Please follow and like us:

2 thoughts on “ఇలాటి తాతయ్య వుంటే బావుండు! (కారా మాస్టారి స్మృతిలో)”

  1. శాంతారామ్ గారి స్మృతుల్లో తారట్లాడిన కధా నిలయాన్నీ, కారాగారినీ చూసే భాగ్యం కోసం ఓ నాలుగేళ్ళ క్రితం శ్రీకాకుళం వెళ్ళినప్పుడు ఆయన కథా నిలయానికి కొద్ది అడుగుల దూరంలో ఉన్న ఒక ఇంట్లో ఒక కుర్చీలో కూర్చుని వున్నారు. వెంటనే మొబైల్లో కథా నిలయాన్ని చూపించాల్సిందిగా పురమాయించారు. వయోభారం అప్పటికే ప్రస్ఫుటంగా కనబడుతోంది ఆయన మోములో…ఎక్కువ సేపు విసిగించ కూడదన్న నేను ముందే పెట్టుకొని వెళ్లిన నియమంతో వెను దిరిగాను… శాంతారామ్ గారి అనుభూతులు కారా అనే కథా మేరు నగరి సానువుల్లో సేదతీరిన జ్ఞాపకాలు… తెలుగు కథా శిఖరం కూలిపోయింది… అయితేనేం… కథ కథనీ మెట్టు మెట్టుగా కట్టిన కథా నిలయంలో ఆయన శ్వాస నిరంతరం నినదిస్తూనే వుంటుంది…. ఎన్నో అనుభూతులను ప్రోది చేసిపంచుకున్న శాంతారామ్ గారికి ధన్యవాదాలు.

  2. తాతగారు అంటే ఇలాగే ఉంటారు.చిట్టి పొట్టి అల్లరులు సహిస్తూ , అల్లిబిల్లి కబుర్లు కథలు చెబుతూ , అంతలోనే ఎదో ఒక మంచి సలహా ఇస్తూ…ఈ తాతయ్య గారి గురించి
    వారందరి గుండెల్లో సదా కథల తాతయ్య గా ప్రతిష్టించే వ్యాసం ఇది. అమూల్యం.

Leave a Reply to K.Sailaja Cancel reply

Your email address will not be published.