
కాసింత ఉపశమనం (కవిత)
-గవిడి శ్రీనివాస్
అలసిన దేహంతో
మేలుకుని ఉన్న రాత్రి
తెల్లారే రెప్పలు వాల్చి
నవ్వులు పూసిన తోటలో
ఉపశమనం పొందుతుంది .
మబ్బులు ఊగుతూ
చెట్లు వేలాడుతూ
పూవులు ముద్దాడుతుంటాయి .
కొన్ని క్షణాలు
ప్రాణాలు అలా లేచి
పరిమళం లోకి జారుకుంటాయి .
గాలి రువ్విన బతుకుల్లో
చీకటి దీపాలు వొణుకుతుంటాయి .
ఏదీ అర్ధం కాదు
బతుకు రెక్కల మీద
భ్రమణాలు జరుగుతుంటాయి .
నేటి దృశ్యం
రేపటి ఓ జ్ఞాపకం అవుతుంది .
వర్తమానాన్ని మోస్తూ
కాసిన్ని సంతోషాల్ని ఆస్వాదిస్తూ
విసిగిన క్షణాలు
కాసింత ఉపశమనం పొందుతాయి .
*****

గవిడి శ్రీనివాస్ ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం నుండి ఎం.సి.ఏ.పూర్తి చేశారు. సెయింట్ ఆన్స్ స్కూల్ లో గణిత ఉపాధ్యాయునిగా చేశారు. నోర్డ్ సిన్యూ, సిఎంబియోసిస్ టెక్నాలజీస్, సొనాటా (డెల్) వంటి సాఫ్ట్ వేర్ కంపెనీస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేశారు. కన్నీళ్లు సాక్ష్యం, వలస పాట ప్రచురితమైన కవితా సంపుటులు. 2016లో సాహితీ సమాఖ్య నుండి కవితాసృజన పురస్కారాన్ని, 2017లో పాలపిట్ట మాస పత్రిక నుండి గొట్టిపర్తి లక్ష్మి నరసింహారావు పురస్కారాన్ని అందుకున్నారు.
