జ్ఞాపకాల ఊయలలో-6

-చాగంటి కృష్ణకుమారి

బడికెళుతూ  చదివే ఒకటవ క్లాసు చదువు  ఆగిపోయాక  రోజంతా ఏమిటి చేస్తుంది ఏ  చిన్నపిల్లైనా?  అందునా “ ఎడపిల్ల “  స్థానంలోనున్న , పదిమందిలో పెరుగుతున్న పసిపిల్ల!  అల్లరి తప్ప.నిజానికి ఆపిల్ల ఆడుకొంటూ వుంటే పెద్దలంతా దానిని అల్లరి కింద జమ కట్టి  తిట్టిపోస్తూవుంటారు. సరే అల్లరనే అందాం. ఏఅల్లరికి ఎప్పుడు ఎందుకు తిట్టేవారూ? ఉదాహరణకి భోజనాలకి  అందరూ కూర్చున్నప్పుడు  పరుగులుపెడుతూ వచ్చి  చూసు కోకుండా  మంచినీళ్ళ గ్లాసును కాలితో తన్ని నీళ్లు  వలకపోసిందనీ  , ఆనీళ్లు  తనకాలికి తగలగా మడి కట్టుకొని వడ్డిస్తున్న అత్తయ్య  మైల పడిందనీ , ఆవిడ అప్పటికప్పుడు  నూతిదగ్గర మళ్లీ స్నాంనంచేసి  బట్ట మార్చుకోవలసి వచ్చిందనీ ,   పెరట్లో  బామ్మ  ఆరేసుకొన్న మడి బట్టను ముట్టుకొందనీ  , మడికట్టుకొని వడ్డిస్తూన్న   అత్తయ్య  చేతికి  తన  చేయి తగిలించిందనీ.  ఇలాంటివి , నాకు గుర్తున్నంత మేరకే !  అందరూ నన్నే అంటా రు  , నన్నే తిడతారు అంటూ ఏడుస్తూవుండేదాన్ని.   “ ఎందుకు అది ఏడుస్తునాది? దాన్ని ఎందుకు ఏడిపిస్తున్నారు”  అనేవాడు  మానాన్న.  “అమ్మ పెట్టే వి నాలుగూ పెడితే  కానీ    అల్లరి  మానదు”   అనేవారు.  ఒకరోజు మానాన్న  “ దాన్ని ఎవరూ ఏమీ అనడానికి వీల్లేదు. ఎంత అల్లరిచేసినా ఏమీ అనడానికి వీల్లేదు”  అని రూలు  పాస్ చేసాడు.   అప్పటి కుటుంబ వ్యవస్థలో  ఇంటి యజమాని అయిన  పురుషునికి  అలాంటి  ‘పవర్స్’  వుండేవి.  ఆయన మాట శాసనమే!  “ వాళ్లనాన్న దాన్ని ఏమీ అనడానికి వీల్లేదన్నాడుగా ’  గట్టిగా చెపితే  తిట్టేరని చెపుతుంది. తిడితే కొట్టేరంటుంది-  అనేది మాఅత్తయ్య . అవును కదా మరి!   చెంప చెళ్ళు మనేలా  చెప్పారనీ , కొట్టినట్టూ  చెప్పారనీ   చెప్పుకొనే  సందర్భాలు  మనకిప్పుడు బాగానే తెలుసు.  చిన్నపిల్లలకి  పాడుపనులు  చేయొద్దని చెప్పినప్పుడు ,అలా మనం చెప్పేతీరులో వారికలా అనిపిస్తుందేమో మరి!  

 “ ఓ చంటిపిల్ల   పుట్టినప్పుడు  అదందరి  దృ ష్టీ  , ధ్యాసా , ముద్దూ, మురిపం ఆ చంటిపిల్ల  వైపుకి మరలి  ఎడపిల్ల పట్ల  సహజంగా తగ్గుతాయి.అంతదాకా అటువంటి వాటిని అమితంగా పొందుతూవున్న ఎడపిల్లకి అవి కరువైయ్యేసరికి  దాని ప్రభావం ఆపిల్ల పైన పడుతుంది .  ఎడపిల్లకి   అటువంటి  ‘సైకలాజికల్’  స్థితి రాకుండా  చూడాలి”  అని  ఓరోజు  మా అమ్మకీ , అత్తయ్యకీ  బోధ చేసి చెప్పాడుట మానాన్న ! అలా  తిట్ల వర్షం నుండి  గొడుగు పట్టి  నన్ను కాపాడాడు. అలాఅయినాకూడా ఒకసారి నాకు  చాలా కఠిన శిక్ష పడింది. అది ఏమిటంటే- 

మా అత్తయ్యకూడా నాకేవో పాఠాలు నేర్పుతూవుండేది ఆవిడ నాకు ‘ ఎ బి సి  డి’  లు   నేర్పుతున్నప్పుడు అది కాదు ఇదీ అంటూనో మరేమిటోకానీ ఆమెను ఎదిరించి ఎదో అన్నాను. అంతే!  పెద్దవాళ్ల ని అలా అనొచ్చాఅంటూ  చీవాట్లు పెడుతూ తప్పు ఒప్పుకో మన్నారు.  ఆమెకు దండంపెట్టి “ఇంకెప్పుడూ అలా అనను”  అని చెప్పాలన్నారు. నేను  వారి మాటవినలేదు. అప్పుడు నన్ను ఒక చీకటి కొట్టులో పెట్టి తలుపులు  వేసి  బయట నుండి  గడియ  పెట్టారు. పల్లే లో  మాది మట్టి ఇల్లు అని  చెప్పాగదా-  ఆకొట్టులో  ఎండి పోయిన  తాటి టెంకలు ,మట్టలు, కొబ్బరి చిప్పలు, కొబ్బరి గిలకలు వంటివి వుంచేవారు, పైగా దాని నేలని అలికేవారు కాదు,అంతామట్టి మట్టిగా వుంది. మూసిన తలుపుల మధ్య నుండీ  గుమ్మం సందుల్లోంచీ లోపలికి ప్రవేశించే వెలుగు తప్ప మరో కాంతి లేదు. అక్కడున్న ఆ ఎండు వంట చెరుకులో  ఏదో ఒకటి  పాములాగా వంకర్లు తిరిగి  నరదలతో పగడవిప్పి ఒకటి కనిపించింది. చాలాభయపడ్డాను.భయపడుతూ ఏడుస్తూవుంటె  వాళ్లు చెప్పిన ట్టూ  చెపతానని  ఒప్పుకొన్నాకనే  తలుపు తెరిచారు.  అత్తయ్య కి దండంపెట్టి లెంపలేసు కొంటూ .  వాళ్లు  చెప్మన్ననట్టూ చెప్పాను. మనకంటె పెద్దవాళ్లను  గౌరవించాలి , గౌరవంగా మాట్లాడాలి వారికి నమస్కారంపెట్టాలి అని పాఠాలు చెప్పారు. ఇంతకీ నేను పామను కొని భ్రమపడినది  రజు సర్ప భ్రాంతి కాదు . ఇది పడగవిప్పిన పొడుగాటి నాగు పాములాంటి తాటి కలప . తాటి చెట్లలో     పిందెలు రాలిపోయిన  పొడుగాటి గిలకలు గాలికి  కిందకి జారి పడతాయి . తాటిగిలకలేకాదు  కొబ్బరి పిందెలతో రాలి పోయిన గిలకలు కూడా అలాగే వుంటాయి. ఆ చీకటింటిలో   అటువంటి దానిని చూచి పామని భ్రమపడి  భయపడడం  సబబేకదా! 

*****

Please follow and like us:

One thought on “జ్ఞాపకాల ఊయలలో (భాగం-6)”

  1. చాగంటి కృష్ణకుమారి గారి జ్ఞాపకాల ఊయలలో 6వ భాగం చాలా బాగుంది మేడం.
    బాల్యంలో ఆడపిల్లలకు విధించే ఆంక్షలను గురించి పద్దతి సంప్రదాయం అంటూ నేర్పే విలువల గురించి చదువుతుంటే నా బాల్యం గుర్తుకు వచ్చింది.
    పేరు: చాగంటి కృష్ణకుమారి గారు
    శీర్షిక: జ్ఞాపకాల ఊయలలో-6.

Leave a Reply to వురిమళ్ల సునంద, ఖమ్మం Cancel reply

Your email address will not be published.