యుద్ధం ఒక గుండె కోత-7

(దీర్ఘ కవిత)

-శీలా సుభద్రా దేవి

అల్లకల్లోలమౌతున్న సాగరాల్లో

మానవ వినాశనానికి జరిగే ప్రయత్నాలూ

వెన్న చిలికినట్లు నీటిబిందువుల్ని

పగలగొట్టే ప్రయత్నాలూ

ఆవిష్కరణలు జరిగేది 

మొట్టమొదట ప్రశాంత సముద్రగర్భంలోనే!

జలచర జీవనాన్ని విధ్వంసం చేస్తూ

నీటి అడుగున విచ్చుకుంటున్న బడబానలం

ఎక్కడ మొదలైందో తెలుసుకోలేక

తనని తానే చుట్టుకొంటున్న సుడిగుండాల్ని

నియంత్రించుకోలేని సంచలన సందర్భాల్ని

సముద్రగర్భ ఆయుధ ప్రయోగాల్ని

ఉధృతమౌతున్న ప్రకంపనాల్ని

ఎగసిపడుతూ అశాంతి ప్రతిబింబిస్తున్న తరంగాల్ని

జలాంతర్భాగాన జీవరాసుల్ని

అతలాకుతలం చేస్తున్న బడబాగ్ని

సముద్రజలాలతో మంట చల్లార్చుకోడానికి

ఉవ్వెత్తున ఎగసి ఉప్పెనై

వడ్డున వున్న ఊళ్ళని మింగేస్తోంది

మాతృగర్భంలో చిచ్చులు పెట్టటం అలవాటైన వాళ్ళకి

భూగర్భాలూ సముద్రగర్భాలూ ఒకలెక్కా

*   *   *

డొంకతిరుగుడు సందర్భాలన్నీ

అవిరామంగా చుట్టుముడుతూనే ఉన్నాయ్‌

ఏది నిజమో ఏది కాదో

ఏది హేతువో ఏది సహేతుకం కాదో

బహిరంగం చేయాల్సిన సమయం వచ్చింది

మానవాళి ప్రశాంత జీవనానికీ

మానసిక వికాసానికీ

అనుశృతంగా వస్తోన్న విలువలకీ

అవరోధం కలిగిస్తున్న

పరిస్థితుల నన్నింటినీ చెల్లాచెదురు చేయటానికి

ఎవరో ఒరు ముందుకు రాకతప్పదు

యుద్ధానికి యుద్ధమే సమాధానం అనుకొంటే

మొట్టమొదటి యుద్ధం మొదలయ్యేది నట్టింట్లోనే

*   *   *

ఒకసారి మన చరిత్ర పుస్తకాల్ని తిరగేద్దాం

ఏ పుటకి ఎంత రక్తం అంటిందో

ఏ రక్తం ఏ మతాన్ని సూచిస్తుందో

ఎన్ని పేరాల్ని పిండితే ఎన్ని ప్రాణాలు చిందుతాయో

మనకు ఇవన్నీ కొత్తకాదుకదా

మరోసారి కొత్త పాఠాల్ని కూడా చేర్చి సమీక్షిద్దాం

ఏ యుద్ధమైనా ఆధిపత్యం కోసం చేసే పోరే

ఏ వ్యూహమైనా దొంగదెబ్బ తీయటానికే

ప్రపంచశాంతి ప్రతిజ్ఞల్ని వల్లెవేయిస్తూనే అది

మెల్ల మెల్లగా దేశాల్ని తన చెప్పుకిందకి తోసేస్తూ

స్వలాభంకోసం నిప్పుల్ని సైతం మింగుతుంది

చేతులు శూన్యమే అనిచూపుతూ

వీపువెనక అణ్వాయుధాలు దాచుకుంటుంది

తనని ఉలికిపడేలా చేసినవాళ్ళకు

కొత్త నీతిపాఠాల్ని బోధిస్తుంది

ఇక్కడ ఎవరు నీతిమంతులో బేరీజు వేయటానికి

చరిత్ర పుటలు సరిపోవు

అసలైన యుద్ధం మొదలైంది

గుండెకాన్వాసుమీద కన్నీటితో లిఖిస్తున్న

స్త్రీల ఆలోచనల్లోనే!

ఎక్కడ ఏ యుద్ధం జరిగినా

పరిజన సమేతంగా దిగుడు బావుల్లోకి దూకాల్సిందీ

సామూహిక సజీవ దహనాలు కావల్సిందీ

అంత:పురాలు ఆహుతి కావల్సిందీ

రహస్య చిత్రహింసలపాలు కావల్సిందీ

వారేకదా!

ఈ కథలన్నీ చరిత్రపుటల్ని

పుటం పెడితే బయట పడేవేకదా!

కుప్పకూలిన రాజరిక వ్యవస్థ బురుజులపైనో

చితికిపోయిన ఆర్థిక వ్యవస్థలపైనో

శిథిల అధికార భవంతుల గోడలమీదో

రగులుతోన్న చితిమంటల మధ్యనో

ఎగసిపడుతోన్న అస్తికల రాశులమీదనో కదా

విజయ స్తంభాల్ని ప్రతిష్టించాల్సి ఉంటుంది

చరిత్ర పుస్తకాలనైనా

పురాణేతి హాసాలనైనా

ప్రతిపుటనీ తల్లి ఒడిలో దులిపి దులిపి

అప్పుడు తెరచి యిక చదువుకోండి

లేకపోతే ప్రతి పేజీలో

కుటిల రాజనీతితో మేటవేసిన బూడిద కుప్పలు

చరిత్రదాచిన సత్యాలై

కళ్ళనిండా ముఖంనిండా కొట్టుకుంటాయి

తర్వాత యిక చదువుకోవటానికి చరిత్ర మిగలదు

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.