అంతర్జాల మాసపత్రికలు – అవలోకనం

-డా . జడా సుబ్బారావు

ఉపోద్ఘాతం: అంతర్జాలం ఒకప్పుడు అందని ద్రాక్ష. ఇప్పుడు మాత్రం అంగిట్లో ద్రాక్ష. కేవలం ఇంగ్లీషు మాత్రమే చెలామణిలో ఉన్న అంతర్జాలం స్థితి నుంచి తెలుగుభాషామానుల కృషి ఫలితంగా తెలుగులో కూడా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుకునే స్థితికి ఎదగడం అభినందనీయం. తెలుగులో ఎన్నో వెబ్సైట్లు మొదలవడమే కాకుండా విఙ్ఞానసర్వస్వంగా పేరుపడిన వికీపీడియా కూడా విజయవంతంగా ప్రారంభించబడి దేశభాషలన్నిటిలో అగ్రస్థానంలో నిలవడం విశేషం. అంతర్జాలం వల్ల తెలుగుభాషా సాహిత్యాల విషయంలో చాలా మేలు జరిగిందనే చెప్పాలి. ఒకప్పుడు ఆంధ్ర ప్రాంతానికే పరిమితమైన మన భాషా సాహిత్యాలు, సంప్రదాయాలు, ఆచారాలు మొదలైనవన్నీ ఎప్పటికప్పుడు వేగంగా ఇతర ప్రాంతాలకూ, దేశాలకూ, ప్రపంచానికీ కూడా అందుతున్నాయంటే దానికి కారణం అంతర్జాలమే అని చెప్పాలి. మనదేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళి స్థిరపడిన వాళ్ళు మనదేశం మీద ఉన్న భక్తినో, రక్తినో తలచుకుంటూ వాటిని అక్కడున్న వారికి కూడా చాటాలనే ఉద్దేశ్యంతో సాహిత్య పత్రికలు స్థాపించడం, వాటి ద్వారా మన దేశ ఉనికిని సాహిత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం అభినందించదగ్గ విషయం. ఖర్చులేకుండా, ఎటువంటి నిబంధనలు, ఆంక్షలు లేకుండా ఎన్నో విషయాలను స్వేచ్ఛగా పాఠకులతో పంచుకునే వేదికగా అంతర్జాలంలో తెలుగుసాహిత్యం పరిఢవిల్లడం ఎంతో హర్షణీయం. ప్రత్యేకించి కోవిడ్ లాంటి సందర్భాలలో ముద్రణా పత్రికలు మూతపడినప్పటికీ అంతర్జాల పత్రికలు మాత్రం ప్రాభవాన్ని కోల్పోకుండా నిలిచివుండడం గమనార్హం. ముద్రణావ్యయం పెరిగిపోవడం వంటి కారణాల వల్ల కూడా ఈనాడు అంతర్జాలంలో తెలుగు పత్రికలు ఇబ్బడిముబ్బడిగా వెలుగులోకొచ్చాయి. అనేక మాసపత్రికలు, త్రైమాస పత్రికలు, పక్షపత్రికలు, వారపత్రికలు, స్త్రీల పత్రికలు నేడు మనకు అంతర్జాలంలో అందుబాటలో ఉన్నాయి. వాటిలో అంతర్జాల మాసపత్రికలు కొన్నిటిని రేఖామాత్రంగా ప్రస్తావించడం, వాటి సేవలను వివరించడం ఈ వ్యాస ఉద్దేశ్యం.

1.సుజనరంజని అంతర్జాల సాహితీ పొదరిల్లు: www.sujanaranjani.org 2004 వ సంవత్సరం నుండి ప్రచురితమౌతున్న తెలుగువారి సాహిత్య పత్రిక ఇది. శ్రీ తాటిపాముల మృత్యుం జయుడుగారి సంపాదకత్వంలో సిలికానాంధ్రవారు దీనిని నిర్వహిస్తున్నారు. స్వయంగా తయారు చేసుకున్న ఫాంటుతో ఒక ముఖచిత్రాన్ని ప్రచురిస్తూ చక్కగా ప్రతీనెల మాసపత్రికలా ఈ పత్రిక అంతర్జాలంలో దర్శనమిస్తుంది. అనేక శీర్షికలు, కవితలు, వ్యాసాలు, కథలు, ఇంకా ఆధ్యాత్మిక వ్యాసాలు ఇందులో ప్రధాన శీర్షికలుగా కనిపిస్తాయి. ఉగాది, దసరా, సంక్రాంతి లాంటి పత్యేక పండుగల సందర్భాలలో కథ, కవితపోటీలు నిర్వహించి బహుమతులు ఇస్తూ ఉత్తమ సాహిత్యాన్ని పోత్సహించే దిశగా ఈ అంతర్జాల సాహిత్య పత్రిక నడుపుతున్నారు. కాలిఫోర్నియా బే ఏరియా నుంచి ఈ సాహిత్య పత్రిక ప్రచురించబడుతోంది. పద్యసమస్యలిస్తూ పాఠకుల నుంచి పూరణలు కోరుతూ వినూత్నంగా సాహిత్య సేవ చేస్తున్న అంతర్జాల పత్రికల్లో సుజనరంజని ఒకటి.           

2.సిరిమల్లె: http://sirimalle.com శ్రీ మధు బుడమగుంట, శ్రీమతి ఉమ బుడమగుంట సంపాదకత్వంలో కాలిఫోర్నియా నుంచి వెలువడుతున్న మరో అంతర్జాల సాహిత్య పత్రిక సిరిమల్లె. ఏ మాత్రం లాభాపేక్ష లేకుండా కేవలం తెలుగుభాషను, సాహిత్యాన్ని అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో నడపబడుతున్న మాసపత్రిక ఇది. విలక్షణంగా చాలా విషయాలను అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించడం ఈ అంతర్జాల సాహిత్య మాసపత్రిక ముఖ్య ఉద్దేశ్యం. తెలుగువారిలో ప్రసిద్ధు లైన వారిని ఆదర్శమూర్తులుగా ప్రపంచానికి పరిచయం చేయడం ఇందులో కనిపిస్తుంది. బాల్యం, మన తెలుగువంటల గొప్పదనాన్ని చాటిచెప్పడం కూడా ఇందులో కనిపించే ముఖ్యాంశాలు.                                                               

3. కౌముది: www.koumudi.net సాహిత్య మాసపత్రికగా మనముందుకొచ్చే ఈ కౌముది కిరణ్ ప్రభగారి సంపాదకత్వంలో వెలువడుతోంది. ప్రతీనెల కిరణ్ ప్రభగారి కవిత ప్రత్యేకంగా ఇందులో కనిపిస్తుంది. బాల్యం తాలూకా జ్ఞాపకాలను, పుట్టిన ఊరు అనుభూతుల్ని ఈ కవితలు గుర్తుచేస్తూ ఉంటాయి. కవితలు, కథలు, వ్యాసాలతో పాటు ఆధ్యాత్మికతను కలిగించే అనేక శీర్షికల సమాహారంగా ఈ సాహిత్య మాసపత్రిక వెలుగొందుతోంది. ముఖచిత్రంతో పాటు లోపల శీర్షికలకు కూడా అవసరాన్ని బట్టి బొమ్మలు వేస్తుంటారు.                                                                                        

4. తానాపత్రిక: www.tana.org ఉత్తర అమెరికా తెలుగుసంఘం ఆధ్వర్యంలో, శ్రీ ఎస్. నారాయణస్వామి గారి సంపాదకత్వంలో వస్తున్న మాసపత్రిక తానాపత్రిక. ఉత్తమ సాహిత్యానికి పెద్దపీట వేసే దిశగానే తానాపత్రిక కార్యకలాపాలు ఉంటాయని చెప్పడం అతిశయోక్తి కాదు. కథ, కవిత అనే శీర్షికలతో పాటు అమెరికాలో తెలుగువారి స్థితిగతులు మొదలైన విషయాలను కూడా ఈ సాహిత్య పత్రికలో కనిపిస్తాయి. అంతేకాకుండా ప్రతీసంవత్సరం నవలల పోటీలు నిర్వహించి ఉత్తమ నవలలకు అధికమొత్తంలో బహుమతి అందజేయడం కూడా జరుగుతోంది.                        

5. అక్షరదీపిక: www.natsworld.org/aksharadeepika   ఉత్తర అమెరికా తెలుగుసమితి ఆధ్వర్యంలో, శ్రీ మేడిచర్ల మురళీకృష్ణగారి సంపాదకత్వంలో వెలువడే మరో అంతర్జాల సాహిత్య మాసపత్రిక అక్షరదీపిక. వివిధ రంగాలలో లబ్ధప్రతిష్టులైన వ్యక్తులను అమెరికాకు పిలిపించి అక్కడ కార్యక్రమాలను నిర్వహించుకోవడం సంప్రదాయంగా ఈ సమితి నిర్వహిస్తోంది.  అత్యంత ప్రతిభ కలిగిన కళాకారులను సన్మానించడం, తెలుగుదనం ఉట్టిపడేలా అమెరికాలో కార్యక్రమాలను ఈ ఉత్తర అమెరికా తెలుగు సమితి నిర్వహి స్తోంది. ఈ సమితి ఆధ్వర్యంలో నడుస్తున్న అక్షరదీపిక మాసపత్రికలో కూడా వివిధ సాహిత్యాంశాలను ప్రతిబింబించేలా తీర్చిదిద్దడం విశేషంగా చెప్పుకోవాలి.    

6. తెలుగుతల్లి కెనడా పత్రిక: www.telugutalli.ca కెనడా నుంచి వెలువడుతున్న మరో అంతర్జాల సాహిత్య మాసపత్రిక తెలుగుతల్లి కెనడా పత్రిక.  కెనడాలో ఉన్న ప్రసిద్ధ ప్రాంతాలను పరిచయం చేయడంతో పాటు అక్కడ స్థిరపడిన తెలుగువారు రాసిన మంచి కథలను కూడా ఈ మాసపత్రికలో చదువుకోవచ్చు. సాహిత్యానికి సంబంధించిన కథ కవితల పోటీలను నిర్వహించి ఉత్తమ సాహిత్యానికి తగిన బహుమతులను కూడా అందజేస్తున్నారు.                                

7. తెలుగునాడి మాసపత్రిక: www.telugunaadi.org 2003 లో ప్రారంభించబడిన అంతర్జాల మాసపత్రిక.  తెలుగుభాషలో ముద్రించబడుతూ ISSN నంబరుతో శ్రీ వి. చౌదరి జంపాల సంపాదకత్వంలో వెలువడుతున్న పత్రిక. భారతదేశ ప్రాచీన సాహిత్యం, భాష, తెలుగువారి సంప్రదాయాలు, సంస్కృతి మొదలైన అంశాల సమాహారంగా ఈ మాసపత్రిక కొనసాగుతోంది.                                   

8. మా తెలుగు: www.taluk.org/magazine .html లండన్ తెలుగుసంఘం వారు వెలువరిస్తున్న మరో అంతర్జాల పత్రిక మా తెలుగు. 2005 వ సంవత్సరంలో ఉగాది రోజు ప్రారంభించబడిన ఈ పత్రిక ప్రతీ సంవత్సరం ఉగాది రోజున ఒక ప్రత్యేక సంచికను విడుదల చేస్తుంది. అందులో కథ, కవిత, వ్యాసం ఇంకా సంస్కృతీ సంప్రదాయాలకు సంబంధించిన అంశాలు ఉంటాయి. శ్రీమతి మాచర్ల హేమగారి సంపాదకత్వంలో ఈ పత్రిక వెలువడుతోంది.

9. ఈనాడు మాసపత్రికలు: (chatura.eenadu.net) (vipula.eenadu.net) ఒకప్పుడు ముద్రణలో అత్యంత ప్రాభవాన్ని కనపర్చిన రామోజీ గ్రూపుసంస్థల నుంచి వెలువడిన చతుర, విపుల మాసపత్రికలు కోవిడ్ నేపథ్యంలో అంతర్జాలంలో మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. తెలుగుకథలకు పెద్దపీట వేయడంతో పాటు ఇతరభాషలనుంచి తెలుగులోకి అనువాదమైన కథలకు స్థానం కల్పించడం విపుల ప్రత్యేకత. ప్రతీనెల ఒక రచయిత నవలను పరిచయం చేయడం చతుర మాసపత్రికలో మనం గమనించవచ్చు.            

 10. తెలుగుజ్యోతి: (http://www.tfas.net) తెలుగు కళాసమితి ఆధ్వర్యంలో నడిచే మాసపత్రిక తెలుగుజ్యోతి. కథ, కవిత, వ్యాసాలతో పాటు తెలుగు వంటలకు సంబంధించిన వివరాలు కూడా ఈ పత్రికలో ప్రచురిస్తారు. ప్రతీ సంవత్సరం దీపావళి సందర్భంగా కథ, కవిత, వంటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తారు. తెలుగు ప్రముఖుల ముఖచిత్రంతో వార్షిక సంచికలను కూడా తెలుగుజ్యోతి మాసపత్రిక ప్రచురిస్తుంది.                  

 11. వాహిని: (www.sydneytelugu.org విజయమాధవి గొల్లపూడి సంపాదకురాలిగా వ్యవహరిస్తున్న మరో అంతర్జాల పత్రిక వాహిని. సిడ్నీలో నివసిస్తున్న తెలుగువారు నడుపుతున్న మాసపత్రిక ఇది. ప్రతీనెలలోనూ వచ్చే ఆయా పండుగలు, పర్వదినాలను గుర్తు చేస్తూ వ్యాసాలను ప్రచురించడమే కాకుండా కథకు, కవిత్వానికి కూడా పెద్దపీట వేస్తున్న అంతర్జాల మాసపత్రిక ఇది. 

12. మాలిక: (magazine.maalika.org)  ప్రారంభంలో సంక్రాంతి, ఉగాది, దీపావళి మొదలైన పండుగలకు త్రైమాస పత్రికగా, ఆ తర్వాత ద్విమాస పత్రికగా వెలువడి ప్రస్తుతం మాసపత్రికగా కొనసాగుతున్న అంతర్జాల పత్రిక మాలిక మాసపత్రిక. ఇజాల ఇనుపసంకెళ్ల నుంచీ, వాదాల సంకుచిత దృష్టినుంచీ కాకుండా శ్రేష్టత, ప్రమాణాలలో రాజీపడకుండా, పాఠకుల్ని కూడా వ్యాఖ్యల ద్వారా లేదా ఇతర పద్ధతుల ద్వారా రచయితలుగా ఎదిగడానికి దోహదపడుతున్న మాసపత్రిక ఇది.                   13. పొద్దు: (www.poddu.net) ‘జెండాలు – అజెండాలు లేకుండా, లాభాపేక్ష లేకుండా అనేకుల ప్రతిభకు వేదికగా నిలుస్తున్న అంతర్జాల  మాసపత్రిక పొద్దు. కథలు, కవితలు, సమీక్షలు, కబుర్లు, వ్యాసాలు, గడిని కూర్చడం మాత్రమే కాకుండా కొత్తగా పాఠకులు కూడా ఒక శీర్షికను కూర్చడానికి అవకాశం ఉన్న మాసపత్రిక ఇది. తెలుగును మర్చిపోయామనో, టైపింగ్ చేయలేమనే చింత లేకుండా యూనీకోడులో టైప్ చేసి పంపితే తగు సవరణలు, వివరణలతో ఈ అంతర్జాల మాసపత్రికలో ప్రచురిస్తారు.                      

 14. భూమిక: (www.bhumika.org) 1993 జనవరిలో ప్రారంభించబడిన అంతర్జాల మాసపత్రిక భూమిక. ఎన్నో సంఘర్షణలు, ఎంతో శ్రమ అనంతరం ప్రారంభించబడిన ఈ అంతర్జాల మాసపత్రిక స్త్రీవాదసాహిత్యంలోని అన్ని ప్రక్రియల్ని ప్రభావితం చేసిందని చెప్పడం అతిశయోక్తి కాదు. ఏ మాత్రం గుర్తింపునకు నోచుకోని  స్త్రీల చరిత్రను, కళలను, సాహిత్యాన్ని ఇతర సాహిత్యాల నుంచి సేకరించి ప్రచురించడం, సృజనాత్మక ప్రక్రియలో స్త్రీలు వివిధ రంగాలవారితో పరిచయం పెంచుకోవడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్త్రీల సాహిత్యాన్ని పరిచయం చేయడం… లాంటి ఎన్నో లక్ష్యాలను భూమిక పాటించింది. కొండవీటి సత్యవతి గారి సంపాదకత్వంలో వెలువడుతున్న ఈ భూమిక అంతర్జాల మాసపత్రిక ప్రతీ సంవత్సరం ‘భూమిక వార్షిక పోటీలు’ అనే పేరుతో కథ, కవిత, వ్యాసం మొదలైన ప్రక్రియల్లో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతి ప్రదానోత్సవం కూడా చేయడం గమనార్హం. స్త్రీ అణచివేతలను ప్రశ్నిస్తూ, స్త్రీవాద సాహిత్యానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న భూమిక దక్షిణభారతదేశంలో వస్తున్న ఏకైక స్త్రీవాద పత్రికకగా ప్రాచుర్యం పొందింది.     

15. విహంగ: (www.vihanga.com) తొలి తెలుగు మహిళా వెబ్ పత్రికగా ప్రఖ్యాతి వహించిన ‘విహంగ’ 11.11.2011 తారీఖున ప్రారంభించ బడింది. ప్రారంభంలో మహిళల కోసం ఒక్క వెబ్ పత్రిక కూడా లేకపోవడం విహంగ ఆవిర్భావానికి ఒక కారణంగా చెప్పొచ్చు. వ్యక్తి స్వేచ్ఛను, అక్షర స్వేచ్ఛను గౌరవిస్తూనే విశాలభావాల పట్ల ఆదరణను మనోవైఙ్ఞానిక వికాసానికి కూడా విహంగ దోహదం చేయడం విశేషం. డా. పుట్ల హేమలత వ్యవస్థాపకులుగా, మానస ఎండ్లూరి సంపాదకులుగా వెలువడుతున్న ఈ విహంగ అంతర్జాలంలో స్త్రీ సాహిత్య వ్యాప్తికి విశేష కృషి చేస్తున్నది.                

16. నెచ్చెలి: (www.neccheli.com ) ‘అంతర్జాతీయ స్థాయిలో స్త్రీలకు సంబంధించిన సాహిత్యాన్నీ, అభ్యున్నతినీ, గెలుపుల్ని, స్ఫూర్తిదాయకమైన అనేక అంశాలనూ పరిచయం చేయాలనే’ ఆలోచనతో వచ్చిన మరో అంతర్జాల మాసపత్రిక ‘నెచ్చెలి’. పురుషులు రాసినా స్త్రీలకు సంబంధించిన రచనలకు పెద్దపీట వేయడం నెచ్చెలి లక్ష్యం. వ్యవస్థాపకులు డా. కె. గీత సంపాదకులుగా వెలువడుతున్న ఈ మాసపత్రిక తెలుగు ఇంగ్లీషు భాషల్లో వెలువడుతుంది. కథ, కవిత, ధారావాహిక నవల, జీవిత చరిత్ర, అనువాద రచనలు, ట్రావెలాగ్స్, సమీక్షలు, బాలనెచ్చెలి, ఆడియో వీడియోలు, వ్యాసాలు మొదలైన ఎన్నో అంశాల కలయికగా  నెచ్చెలి కొనసాగడం ఎంతో ఆనందదాయకం.                                        

17. ఈ మాట: (www.eemaata.com)  ఈమాట సంపాదక వర్గంలో మాధవ్ మాచవరం, సుధామయి సత్తెనపల్లి, మానస చామర్తి ఉన్నారు. గతంలో వేలూరి వేంకటేశ్వర రావు, పాణిని శంఖవరం, ఇంద్రగంటి పద్మ, కె.వి.ఎస్.రామారావు, కొలిచాల సురేశ్, కొంపెల్ల భాస్కర్, విష్ణుభొట్ల లక్ష్మన్న సంపాదకులుగా పనిచేశారు. ఈ మాట అంతర్జాల మాసపత్రిక 1998 దీపావళినాడు ప్రారంభించబడింది. తాము నమ్మిన ఆశయాలను కొనసాగిస్తూ కాలానుగుణమైన మార్పులతో పాఠకుల అభిరుచి మేరకు మార్పులు చేసుకుంటూ అంతర్జాల అగ్రగణ్య పత్రికగా వెలువడడం వెనుక నిర్వాహకుల కృషి ఎంతో ఉన్నది. మిగతా అంతర్జాల పత్రికలకు భిన్నంగా పద్యసాహిత్యానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్న పత్రిక ఇది. కథ, కవిత, వ్యాసం, సమీక్ష, శబ్దతరంగాలు, స్వగతం, గడినుడి లాంటీ శీర్షకలతో పాటు ముఖాముఖిని కూడా నిర్వహిస్తూ ముందుకు సాగుతున్న అంతర్జాల మాసపత్రిక ఇది. లాభాపేక్ష లేకుండా ప్రవాసంలో ఉన్న తెలుగువారికోసం స్థాపించబడిన పత్రిక. ఉన్నత స్థాయి సాహిత్యాన్ని అందించడమే కాకుండా అనేక అంశాల మీద విలువైన చర్చలు నిర్వహించడం ముదావహం. తెలుగు సాహిత్యానికి సంబంధించిన ఎన్నో విలువైన సమాచారాన్ని ఈమాట కూడబెట్టింది. తెలుగుపుస్తకాలను దిగుమతి (డౌన్లోడ్) చేసుకునే వెసులుబాటు కూడా ఉంది.                      

18. కొత్తపల్లి: (kottapalli.in) అంతర్జాలంలో బాలసాహిత్యాన్ని ప్రోత్సహించే దిశగా ఆవిర్భవించిన పత్రిక ‘కొత్తపల్లి’ పిల్లల కథల పుస్తకం. మానవీయస్పర్శ ఉన్న కథల్ని, ఆటపాటల్ని, విద్యా, వినోద, విఙ్ఞానాల్ని అందించాలనే ఉద్దేశ్యంతో నారాయణ ప్రధాన సంపాదకులుగా ఈ అంతర్జాల బాలల పత్రిక అవతరించింది. ఈనాడు పిల్లలకంటూ ప్రత్యేకమైన సాహిత్యం లేదు. ఒకవేళ ఉన్నా అది పిల్లల కోసం పెద్దలు రాసిందే. అందుకు భిన్నంగా పిల్లల చేత కథలు రాయించి వాటిని అందమైన బొమ్మలతో ప్రచురించడం కొత్తపల్లి ప్రత్యేకత. చిన్నచిన్న కథలద్వారా మేధోవికాసం పొందిన చిన్నపిల్లలు ఉత్తమ భావి భారత పౌరులుగా, భావి సృజనాత్మక కథారచయితలుగా ఎదుగుతారని చెప్పడం అతిశయోక్తి కాదు. కథలు రాయడానికి వారికి కావలసిన ప్రోత్సాహాన్నిస్తూ, అవసరమైన సవరణలు, వివరణలు చేస్తూ బాలసాహిత్యానికి ఎంతో కృషిచేస్తున్న కొత్తపల్లి పత్రిక ఎంతైనా అభినందనీయం.              

19. అచ్చంగా తెలుగు: (www.acchamgatelugu.com)  భావరాజు పద్మిని సంపాదకత్వంలో వెలువడుతున్న మరో అంతర్జాల మాసపత్రిక ‘అచ్చంగా తెలుగు’. ఎనిమిది కథలు, నాలుగు ధారావాహికలు మాత్రమే కాకుండా ఆయా ప్రత్యేకరోజుల్లో వచ్చే పండగ పర్వదినాలను గుర్తుచేసుకుంటూ విలువైన వ్యాసాలకు కూడా ఇందులో చోటు కల్పించారు. అంతేగాక ‘తెలుగుబాల’ పేరుతో బాలలకు ప్రత్యేక శీర్షికను కూడా కేటాయించారు.                                          

20. చైతన్యం సంకల్పబలం: (www.chaitanyam.net) వ్యవస్థాపక సంపాదకురాలు శ్రీమతి తీగవరపు శాంతి గారు వెలువరిస్తున్న మరో అంతర్జాల మాసపత్రిక చైతన్య సంకల్పబలం. కథలు, వ్యాసాలతో పాటు సినీరంగంలో ప్రసిద్ధులైన వారితో ఇంటర్వ్యూలు కూడా ఈ మాసపత్రికలో మనకు కనిపిస్తాయి. తెలుగు పద్యరత్నాలు పేరుతో కావ్యాలలోని ప్రసిద్ధి చెందిన పద్యాలకు చక్కటి వివరణ కూడా మనకు ఈ మాసపత్రికలో కనిపిస్తాయి.                                                     

21. గోదావరి: (www.thegodavari.com)   ఆచార్య కాత్యాయనీ విద్మహే గౌరవ సంపాదకులుగా, వంగాల సంపత్ రెడ్డి సంపాదకులుగా అంతర్జాలంలో  వెలువడుతున్న మరో మాసపత్రిక ‘గోదావరి’. ‘మానవ సంబంధాలను ప్రభావితం చేసే ఉత్పత్తి సంబంధాలను, ఆ ఉత్పత్తి సంబంధాలను నియంత్రించే ఉత్పత్తి సాధనాలను, వాటిని తమ స్వాధీనంలో పెట్టుకున్న ఉత్పత్తి శక్తులను వాటికి సంబంధించిన మూలాలను’ చిత్రించే ఉద్దేశ్యంతో ఈ మాసపత్రిక ప్రారంభించబడింది. కథ, కవిత, వ్యాసాలు, నవలలు మొదలైన శీర్షికలతో ప్రత్యేకమైన లక్ష్యంతో కొనసాగుతున్న మాసపత్రిక గోదావరి.    

22. ఔచిత్యమ్: (www.auchithyam.com) అక్టోబర్ 2020 విజయదశమి సందర్భంగా ‘ఔచిత్యమ్’ మొదటి అంతర్జాల మాసపత్రికను ప్రారంభించారు.  అన్ని సమయాలలోనూ, అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రామాణికమైన పరిశోధన వ్యాసాలను ప్రచురించే సంకల్పంతో డా. రాంభట్ల వెంకటరావు మెమోరియల్ ట్రస్ట్, విశాఖపట్నం వారు ఈ మాసపత్రికకు అంకురార్పణ చేశారు. ప్రామాణిక పరిశోధన పద్ధతులకు పెద్దపీట వేస్తూ, విధివిధానాలను అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసే వ్యాసాలను ప్రచురించడం  ఈ మాసపత్రిక ప్రత్యేకత. శ్రీకాకుళం అర్జీయూకేటీ తెలుగుశాఖ అధ్యాపకులు, శతావధాని డా. రాంభట్ల పార్వతీశ్వర శర్మగారు ప్రధాన సంపాదకులుగా, డా. రాంభట్ల వెంకటరాయశర్మ సంపాదకులుగా, అనుభవఙ్ఞులైన విశ్వవిద్యాలయాల ఆచార్యుల, విషయ నిపుణుల పర్యవేక్షణలో e-research journal గా ఈ మాసపత్రిక కొనసాగడం విశేషం.                                             

 23. కథామంజరి: (www.kathamanjari.in) జయంతి ప్రకాశశర్మ సంపాదకత్వంలో వెలువడిన మరో అంతర్జాల మాసపత్రిక కథామంజరి. ప్రతీనెలా ఒకటో తారీఖున కేవలం పది కథలతో అంతర్జాలంలో కనిపిస్తుంది ఈ మాసపత్రిక. ప్రచురితమయ్యే పది కథలలో మూడు కథలను న్యాయనిర్ణేతలు ఉత్తమ కథలుగా నిర్ణయించి వాటికి బహుమతులు అందజేస్తారు. యువరచయితల ఆలోచనలకు ప్రాధాన్యం ఉంటుంది. వేలసంఖ్యలో పెరుగుతున్న పాఠకులు, రచయితల కోసం, వారిని అనుసంధానం చేయడానికి ఈ మాసపత్రిక దోహదపడుతుందని సంపాదకుల అభిలాష.                                 

24. 64 కళలు.కాం: (www.64kalalu.com) ఆంధ్రుల కళా కౌశలాన్ని విశ్వవ్యాప్త తెలుగువారికి అందించే లక్ష్యంతో కళాసాగర్ తన సంపాదకత్వంలో వెలువరించిన మాసపత్రిక ‘64కళలు.కాం’. సకల కళల సమాహారం అనే పేరుతో స్థాపించిన ఈ మాసపత్రిక ఎనిమిదన్నర సంవత్సరాల కాలంలో తెలుగు అంతర్జాల పత్రికల్లో సంచలనం సృష్టించింది. అంతేగాక ఇరవై ఐదు దేశాల్లోని తెలుగువారికి ఈ మాసపత్రిక వారధిగా నిలబడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్’లోని ఎన్నో ప్రాంతాలను సందర్శించి ఎంతోమంది కళాకారులను కలిసి వారితో ఇంటర్వ్యూలు తీసుకున్నాడు. రాష్ట్రమంతటా ఉన్న చిత్రకారులు, కార్టూనిస్టులు, శిల్పకారులందరినీ ఒకే వేదిక మీదకి తెచ్చే ఉద్దేశ్యంతో కళాసాగర్ ఈ మాసపత్రికను స్థాపించాడు.   

25. స్వర్ణపుష్పం: (http://swarnapushpammonthly.blogspot.in/) డా. మక్కపాటి మంగళ ప్రధాన సంపాదకులుగా ఉన్న స్వర్ణపుష్పం మాసపత్రిక భాషా, సాహిత్య, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ అంశాల సమాహారంగా తీర్చిదిద్దారు. ISSN నంబరుతో మూడు నెలలకోసారి వెలువడే మధురవాణి అంతర్జాల త్రైమాస పత్రిక తర్వాత బహుశా ISSN (2394-2193) నెంబరుతో వెలువడే అంతర్జాల పత్రిక ఇదే కావచ్చు. పరిశోధక విద్యార్థులకు ఎంతో ఉపయుక్తమయ్యే ISSN నంబరుతో ఈ మాసపత్రిక వెలువడదం ఎంతో ఆనందదాయకం.                                                               

 26. కొలిమి (www.kolimi.org) ప్రజాసమూహాలలో నిరంతరం కలిగే సంఘర్షణ, సంక్షోభం ఇంకా తీవ్రమై, లోపలి మనిషి విధ్వంసమౌతున్న విషాద పరిస్థితిని పోగొట్టడానికి ‘సృజనకారులుగా మనమేం చేయవలసింది ఉంది, ఏం చేద్దాం’ అనే ఆలోచనలో నుంచి పుట్టిన అంతర్జాల మాసపత్రిక కొలిమి. సమాజంలో చైతన్యం కలిగిస్తూ, విలువల్ని ఉన్నతీకరించే దిశగా కళా సాహిత్యాలు నిర్వహించే కర్తవ్యాన్ని ఈ మాసపత్రిక ప్రధాన లక్ష్యం. ఇది ఒక ప్రజాస్వామిక, కళా సాహిత్య సాంస్కృతిక వేదికగా అంతర్జాలంలో దర్శనమిస్తుంది. ప్రతీనెలా ఒకటో తారీఖున వెలువడే ఈ మాసపత్రికలో కథలు, కవిత్వం, పాటలు, వ్యాసాలు మొదలైన శీర్షికలుంటాయి.              

      ముగింపు: ఒకప్పుడు మన ప్రాంతంలోనో లేక ఇతర దేశాల్లో కొన్ని ప్రాంతాల్లోనే పరిమితమైన తెలుగుభాష, సాహిత్య, సంప్రదాయాలు అంతర్జాలం వేదికగా ప్రపంచమంతటా విస్తరించడం హర్షణీయం. ప్రపంచంలోని ఏ ప్రాంతానికి వెళ్ళిన తెలుగువారైనా వారు పుట్టిన ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకునే క్రమంలో, వారి భాషని వ్యాప్తి చేసుకునే క్రమంలో అంతర్జాలంలో వార, పక్ష, మాస, త్రైమాస పత్రికలు నిర్వహిస్తూ సాహిత్య సేవ చేయడం అభినందనీయం. నవతరంగం, ప్రాణహిత, ప్రజాకళలాంటి కొన్ని మాసపత్రికలు ప్రస్తుతం అందుబాటులో లేనికారణంగా వాటిని నేను పేర్కోలేదు. కేవలం నేను ప్రస్తావించిన అంతర్జాల మాసపత్రికలే కాకుండా ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. నా అవగాహనలో నాకు లభించిన సమాచారాన్ని ఉపయోగించుకుని పై అంతర్జాల మాసపత్రికల్ని వ్యాసంగా రాసే ప్రయత్నం చేశాను. అంతర్జాలం వల్ల లాభమా, నష్టమా అనే మీమాంస కంటే తెలుగుభాషా, సాహిత్యాలకు అంతర్జాలం వేదికగా జరుగుతున్న కృషి మాత్రం అభినందనీయం. ………………  

ఉపయుక్త గ్రంథాలు/వ్యాసాలు:

1. అంతర్జాలంలో తెలుగు సాహిత్యం, డా. పుట్ల హేమలత              

2. అంతర్జాలంలో తెలుగుసాహిత్యం ఆవిష్కరణ, ప్రసంగాలు, 26 అక్టోబర్ 2015, vrdarla.blogspot.com                 

3. అంతర్జాలంలో తెలుగు వెలుగులు, సెప్టెంబర్ 2010, జ్యోతి వలబోజు                

4. నాలుగు స్తంభాలాట అను పత్రికారంగం – సాధకబాధకాలు, సత్యం మందపాటి, మధురవాణి త్రైమాపత్రిక                

5.  అంతర్జాల సాహిత్యం, మధుకర్ వైద్యుల, ఫిబ్రవరి9, 2020, నమస్తే తెలంగాణ               6. అంతర్జాలంలో తెలుగు పత్రికలు, కె. రాజు, అంతర్లోచన బ్లాగ్ స్పాట్, ఫిబ్రవరి 20, 2013.                              

7. అంతర్జాల పత్రికలు, పొద్దు మాసపత్రిక, ఫిబ్రవరి 2008             

8. తేనెలొలుకు తెలుగు – తెలుగు అంతర్జాల పత్రికలు, తుమ్మూరి రామ్మోహనరావు, 4 ఫిబ్రవరి 2020.                  

9. అంతర్జాల పత్రికలు, 1 మార్చి 2008, timesofap.blogspot.com 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.