అనుసృజన-తిరుగుబాటు

మూలం: కేదార్ నాథ్ సింగ్

అనువాదం: ఆర్. శాంతసుందరి

ఇవాళ ఇంట్లోకి వెళ్ళగానే
కనబడింది ఒక వింత దృశ్యం
వినండి –
నా పరుపు అంది :
రాజీనామా చేస్తున్నా,
మళ్ళీ నా దూదిలోకి
వెళ్ళిపోవాలనుకుంటున్నా!
మరోవైపు కుర్చీ బల్లా
రెండూ కలిసి యుద్ధానికొచ్చాయి,
కాళ్ళూ చేతులూ కొట్టుకుంటూ –
ఇక చాలించండి
ఇన్నాళ్ళు భరించాం మిమ్మల్ని!
తెగ గుర్తుకొస్తున్నాయి మాకు
మా చెట్లు
మీరు హత్య చేసిన
వాటిలోని ఆ జీవరసం!
అటు అలమరలోని
పుస్తకాలు అరుస్తున్నాయి
విడిచిపెట్టు మమ్మల్ని
మా వెదురు గుబురుల్లోకి
వెళ్ళిపోవాలనుంది మాకు
కొండెలతో కాట్లు వేసే తేళ్ళనీ
మమ్మల్ని ముద్దాడే పాములనీ
కలుసుకోవాలనుంది మళ్ళీ –
అన్నిటికన్నాఎక్కువగా మండి పడింది
ఆ శాలువ
కొన్నాళ్ళక్రితమే కులూ లో కొన్నాను దాన్ని
అంది కదా – అయ్యా!
మీరు బలే పెద్దమనిషండీ!
నా ‘దుంబా’ గొర్రె ఎప్పట్నించో
పిలుస్తోంది నన్ను
మీరేమో మీ ఒంటి మీద కప్పుకుని
ఖైదు చేశారు నన్ను!
మరో వైపు టీవీ, ఫోనూ
అవస్థ పడిపోతున్నాయి
గట్టిగా ఏదో అంటున్నాయి
నాకర్థం కాని ఏదో భాషలో –
ఇంతలో
కొళాయిలో కారుతున్న నీళ్ళు కోపంగా –
మరీ హద్దు మీరిపోతున్నారండీ!
వినగలిగితే
వినండి ఈ నీళ్ళ చుక్కల గొంతు –
ఇక మేము
అంటే మీవద్ద బందీలుగా ఉన్న
మేమందరం
మనిషి జైలు నుంచి
విడుదల కోరుతున్నాం! –
ఇప్పుడు ఎక్కడికెళ్తున్నావ్ …?
అని గర్జించింది వీధి తలుపు
నేను బైటికి వెళుతూ ఉంటే .

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.