తెలుగు కథ – వృద్ధుల సమస్యలు

(నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం)

-డా .గురజాడ శోభా పేరిందేవి

సామాజిక దృక్పథంతో ముందుకు సాగుతూ వచ్చింది నాటి నుండి తెలుగు కథ. కులాధిపత్యంతో అణచివేతకు గురైన ప్రాంతం నుండి ఆర్తి కథలు,ఆకలి కథలు,అన్యాయాన్ని ఎదిరించిన కథలు వచ్చాయి.  పాతకాలం నాటి సామాజిక దృక్పథంతో ఉండి సమాజాన్ని ఓ కంట కనిపెడుతూ ఉన్నాయి.కంటకింపుగా ఉన్నవాటిని గూర్చి ప్రశ్నిస్తూ పరిస్థితి మారాలని ఘోషిస్తున్నాయి. కందుకూరి వారి రచనలు చదివి ప్రభావితమైనట్లు చెప్పుకున్న శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి తనలో ఊపిరి పోసుకున్న సంఘసంస్కార భావాల ప్రచారానికి తన చిన్న కధలను సాధనాలుగా చేసుకున్నారు. అందువల్ల వితంతు పునర్వివాహ కథలు,మూడాచార,దురాచార నిరసన కథలూ గృహస్థ జీవిత సమస్యల కథలూ ఎక్కువగా రాసారు. గాంధీయుగ ప్రభావితులైన వేలూరి శివరామశాస్త్రి  కథలు, జీవిత సత్యాలను పరిశీలించి రాసిన చాగంటి సోమయాజులు  కథలు నాటి పాఠకులను  ఆలోచింప చేశాయి, కార్మికులను మొదలుపెట్టి చెంచుల జీవితాల చిత్రణ వరకూ లిఖించిన కథక చక్రవర్తి చింతా దీక్షితులు, ‘ధర్మవడ్డీలాంటి కథ రాసిన గోపీచంద్, లాంటి మహా రచయితల కథలు   నిన్నటి సమస్యలన్నింటినీ చిత్రించి పాఠకుల మనసులను మంచి మార్గంవైపుకు మళ్లించాయి.

     ఆకలి కథలు ఆడవారి సమస్యల కథలు, కులాల కొట్లాటల కథల తర్వాత, సమస్యాయుతంగా సంఘంలో తలెత్తుతున్నాయి వృధ్ధుల సమస్యాత్మక కథలు అని చెప్పి తీరాలి. సంప్రదాయ సమాజంలో వృధ్ధాప్య సమస్య తలెత్తేదే కాదు. అప్పటి సమాజంలో వృధ్ధులకు తమ జీవిత చరమాంకంలో ఆనందాన్ని ఆరబోసుకునే ఒక జాగ్రదావస్థ  వలే వున్నట్లుగాను  బాధ్యతల భారంతో అలసి సొలసిన ఒక తరం ప్రతినిధులుగా  కుటుంబ ఆత్మీయత,అనుబంధాలకు  మధ్య ఆడే పాడే పసిపాపలలో ఒకరిగా మమేకమై గడిపి, మహాప్రస్థానాన్ని ముగిస్తూ మహాభినిష్క్రమణం చేసే మహోన్నత ఘట్టంగానూ నాటి  వార్ధక్య దశ గురించి  చెప్పుకోవచ్చు. అయితే నేటి సమాజంలో విలువలు కరువై మానవత్వం లోపించి నగరవాసంలో ఇరుకు గదుల నివాసంలో వలే సమాజంలోని వ్యక్తుల మనస్సు గదులు ఇరుకై కొందరు వృధ్ధులకువృధ్ధాప్యం ఒక శాపంలా, జీవితం దుర్భరంగా మారిపోయింది. తల్లితండ్రులకు పిల్లలకు పొసగని లోకంలో ఆర్ధిక సంబంధాలే తప్ప సామాజిక, మనసూ, మమతలతో కూడిన  సంబంధాలను, అనుబంధాలను శాసిస్తున్న, కన్న మమకారాన్ని కాదనుకునే ప్రబుధ్ధులు పెరుగుతుండడం వల్ల చాలామంది వృధ్ధులకు కాటికి కాళ్ళు చాపుకుని, చావుకోసం ఎదురుచూసే దురవస్థ  ఏర్పడింది. ఆర్ధిక క్లేశాల్లో  చిక్కుకుని బిడ్డల ప్రేమపాశం కోసం అలమటిస్తూ ఒంటరిగా బిక్కు బిక్కు మంటూ అనాథ ల్లాగే ఆర్తిగా తిండికి సైతం ముఖంవాచి బ్రతుకుతున్న వారు కొందరయితే, కన్నబిడ్డలు చూడటం లేదని వీధిన పడుతున్నవారు ఇంకొందరు. మారుతున్న కాలానికి అనుగుణంగా సమాజం మార్పులకు లోనవుతుంది. జీవితంలో వేగం పెరిగిన కారణంగా మానవ సంబంధాలలో సైతం మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గత దశాబ్దంలో ప్రపంచ వ్యాప్తంగా వఛ్చిన  ప్రపంచీకరణ ఆర్ధిక సరళీకరణలు దానికి సంబంధించిన పెనుమార్పులు కూడా సమాజంపై మానవ సంబంధాలపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. వీటన్నిటి ఫలితమే ఇటీవల పెరుగుతున్న వృధ్ధుల శరణాలయాలు. ఉద్యోగాలు చేస్తూ వృధ్ధులకు సేవ చేసే తీరిక లేక కొందరు తమ తల్లితండ్రులను వృధ్ధుల శరణాలయాల్లో చేరుస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న పెనుమార్పులు,ఆర్ధిక సరళీకరణల ప్రభావం మానవ సంబంధాల్లో అనూహ్య మార్పులకు శ్రీకారం చుడుతున్నాయి. 

  వృధ్ధుల  సమస్యల మీద కధలు వస్తున్నాయి. అవి సానుభూతికి మాత్రం పరిమితమవుతున్నాయి తప్ప మార్పు తీసుకు రాలేక పోతున్నాయి. పెద్దలకి ధైర్యం చెప్పే విధంగా పిల్లలే ప్రపంచంగా భావించకుండా ఉండేలా వెన్ను తట్టే కధలు అరుదుగా వస్తున్నాయి. అలాంటి కధలను కథకులు అందించవలసిన అవసరం చాలా ఉంది 

     తెలుగు భాషలో బాలసాహిత్యం, స్త్రీవాదసాహిత్యం, దళితసాహిత్యం, మతసాహిత్యం మొదలైనవాటిలో ఎన్నో గ్రంధాలు వెలువడుతున్నాయి. కానీ ప్రపంచమంతా పట్టి పీడిస్తున్నవృధ్ధుల సమస్యామయ జీవితాన్నిగురించిన గ్రంథ సాహిత్యం ఎక్కువగా రావడం లేదు.

నాకు తెలిసి ఇంత వరకూ ప్రచురితమైన పుస్తకాలు. 1.’హాయిగా రిటైర్డ్ జీవితం’ 2.’ప్రశాంతమైన వృధ్ధాప్యజీవితంఈ రెంటి రచయితా కే.రామిరెడ్డి. 3. ‘వృధ్ధాప్యం ఒక శాపం కారాదు’ ‘రచయిత పెవల్లి శ్రీరాములు.4. ’ముదిమి ముచ్చట్లురచయిత అట్లూరి వెంకటేశ్వరరావు 5..’నవజీవన్’  6  ‘ఓల్డ్ ఏజ్  హోమ్స్  ఎలా వుండాలి’ ? ఈ రెండు పుస్తకాల రచయిత్రి కామరాజు సరోజినీదేవి 7.’వృధ్ధుల సంక్షేమ సంస్థలు –ఆవశ్యకత కార్యక్రమాలు’, 8..’వృధ్ధుల ప్రపంచంరచయిత ఆచార్య తురగా సోమసుందరం 9. ‘ 60 లో 20 ‘ 10. ‘వార్ధక్యం వరమా శాపమారెంటి రచయిత్రి డా.గురజాడ శోభా పేరిందేవి 11’వృధ్ద శతకంకవి ఆచార్య ఎన్. గోపీ 12.’వృధ్ధాప్య శాస్త్రం’ –బి.ఏ.   పాఠ్య పుస్తకం  

వృధ్ధుల కథల సంపుటిలు: – కేవలం వృధ్ధులకు సంబంధించిన కథల సంపుటిలు తెలుగులో చాలా తక్కువ సంఖ్యలో ప్రచురితమవ్వడం బాధాకరమైన విషయం. డా. గురజాడ శోభా పేరిందేవి  రాసినస్వీట్ 60’ మొట్టమొదటి వృధ్ధుల అరవై చిన్న కథల సంపుటి. వాణిశ్రీ రాసినసీనియర్ సిటిజెన్ కథలురెండవ కథల సంపుటి,డా. ముక్తేవిభారతి రాసినషష్టిపూర్తి కథలుమూడవ కధల సంపుటి. విరివిగా వృధ్ధుల కథలు పత్రికలలో కనిపిస్తున్నా పూర్తిగా వృధ్ధుల కథల సంపుటిలు వెలుగులోకి చాలా తక్కువగా వస్తుండడం శోచనీయం. 

***

కథానిర్మాణం:

వృధ్ధుల కధలు-రచనా వైవిధ్యం: కథన  శిల్ప సాఫల్యానికి తోడ్పడే ప్రధానోపకరణం భాషా, శైలి.  ఇది సమకాలీక సమాజవ్యవహారంలో జీవించి వున్నది కావడంవల్ల     అక్షరాల కూర్పులో కానీ అర్ధంలో  కానీ ఎదో ఒక అందం కోసం  కథకు ఏ పేరు పెట్టినప్పటికీ అది వస్తువుతో కానీ, పాత్రతో కానీ, జీవిత సత్యంతో కానీ సంబంధించి ఉండడం చాలా సమంజసమైన విషయం. 

     వస్తుగత, రూపగత, సంవిధానగతమైన  వివిదాంశాల కూర్పులో నైపుణ్యం ప్రదర్శించే కథ పదికాలాలపాటు నిలిచి ఆకట్టుకుంటుంది. అయితే మంచిదనిపించే ప్రతికథలోనూ పైన పేర్కొన్న అంశాలు అన్నీ లేకపోవచ్చు. ఒక్కొక్క కథలో ఒక్క అంశమే శిల్ప పారమ్యాన్ని అందుకోవచ్చు. అది వస్తు విన్యాసంలో కానీ, పాత్ర చిత్రణలో  కానీ, సంవాదశైలిలోకాని సంఘర్షణొత్పాదనలో కాని, సన్నివేశ కల్పనలో కాని, మరే అంశంలోనైనా ప్రస్ఫూటం కావచ్చు. అయితే కేవలం శిల్పపరంగా లోప రహితమైన కథలన్నీ మంచి కథలనిపించుకోడానికి అర్హమైనవి కావు. ఎన్నుకొన్న వస్తువు, చెప్పదలచిన పరమార్ధం అంటే, నిర్దిష్ట వస్తువు పట్ల రచయిత ప్రదర్శించే  దర్శనం ఉదాత్తమైనప్పుడు తప్ప సంవిధాన శిల్పం రాణించదు, మంచి కథ అనిపించుకోదు. 

మంచి కథ-  గొప్పకథ:  మంచి కథల్లోనే ఒకానొక విలక్షణత సంతరించుకొన్నది గొప్పకథ. మంచికథ అనిపించుకున్నదల్లా గొప్పకథ కాబోదు. మంచికథ కావడానికి తోడు, జీవితంలోని ఒకానొక మహత్తర సత్యాన్ని అద్భుత శిల్ప నైపుణ్యంతో కళ్ళకు కట్టించి, హృదయాన్ని ఒకానొక మహత్తర అనుభూతితో నిండించి, పదే పదే చదవాలనిపించే కథనుగొప్ప కథఅని చెప్పవచ్చు. 

   వర్ణన, శైలి, కథనంలో అంతర్భాగాలు. భౌతిక వాతావరణ పరిసరాల వర్ణనకు పాత్ర చిత్రణను జోడించి కాల స్థల వశైక్యం సాధిస్తే కథనం రమణీయమవుతుంది. మాట్లాడేటప్పుడు కానీ, రాసేటప్పుడు కానీ భాషాభివ్యక్తంలో కనబడే తీరును శైలి అంటాం. ఇది కనీసం ఒక మాండలికాన్ని ఆశ్రయించుకుని ఉంటుంది. ఈనాటి కథానికా రచయితలూ వివిధ ప్రాంతీయ ,సామాజిక వర్గ మాండలీకాలను సముచితంగా ప్రయోగిస్తున్నందువల్ల కథన సంవాదాలు రెంటికీ సహజసౌందర్యం సమకూరుతోంది. 

     సాహిత్య రచనకు పెట్టె పేరు, ఆ రచనలో ఏదో ఒక  ప్రధానాంశానికి సంబంధించి ఉండటం అవసరం. పేరు పెట్టడంలో రకరకాల పద్ధతులున్నాయి. కథన శిల్పం, వర్ణన శిల్పం,శీర్షికా శిల్పం, కథనంలో వర్ణన,అంతర్భాగమే అయినప్పటికీ కథాత్మక వచన సాహిత్యంలో దానికున్న ప్రాముఖ్యం దృష్ట్యా ప్రత్యేకంగా పేర్కొనడం జరిగింది.

కథా రచయిత తాను  చెప్పదలచుకున్న విషయాన్ని ఒక ప్రత్యేకమైన పద్ధతిలో  చెప్పటాన్నే శిల్పం అంటారు. అయితే చెప్పదలచకున్న విషయాన్ని అందంగా, శక్తివంతంగా, స్పష్టంగా ఉత్కoఠతను రేకెత్తించే విధంగా చెప్పటంలోనే ఒక రచయిత ప్రతిభ ద్యోతకమవుతుంది. విషయం ఎంత గొప్పదైనా ఆ విషయానికి అక్షర రూపం ఇచ్చిన పధ్ధతి పేలవంగా ఉంటే ఆ రచన విఫలమౌతుంది . కథ ఒకే సంఘటనతో నిండి ఉంటుంది. మిగిలిన విషయాలన్నీ ఆ సంఘటనలోనే ఇమిడి ఉంటాయి. కథా రచనలో భాష సరళంగాను అర్ధమయ్యేటట్లుగా ఉండాలి.

శరీర సౌష్టవానికి ప్రతీ అంగం ఎలా పొందిగ్గా ఉండాలో అలానే కథ మొదలుపెట్టడం ,కథ ముగించడం కూడా కథ సౌష్టవాన్ని పెంపొందించేదే . ఎటొచ్చీ  శరీరానికి ముఖ సౌందర్యం లాంటిది కథ ప్రారంభం.  

కథలో ప్రారంభ వాక్యాలు — ఉదా: 

     అ)పోస్ట్

పడక కుర్చీలో కూర్చుని దినపత్రిక తిరగేస్తున్న పరమేశ్వర్ టక్కున పేపర్ పక్కన   పడేసి గబగబా వీధిలోకెళ్ళాడు. 

కొబ్బరి చెట్టు చుట్టూ మట్టిని గుండ్రంగా తవ్విపోస్తున్న పార్వతి చిన్నపిల్లలాగ లేచి   వీధిలోకి పరిగెత్తింది. 

వాళ్ళిద్దరికీ రోజూ విదేశంలో వున్న వాళ్ళబ్బాయి ఉత్తరంకోసం అలా ఎదురుచూడడం అలవాటు. (మమకారం )

ఆ) నగరం నిద్రిస్తున్న నడి రాత్రివేళ  అది. ఎక్కడా ఏ శబ్దమూ లేదు.  

ఊరకుక్కల కూతలు కూడా వినిపించడంలేదు. ఆ వేళలో ఒక డెబ్బై ఏళ్లావిడ దిగ్గున మంచం దిగింది.(ఆడాళ్ళూ మీకు  జోహార్లు)

’’ఒరేయ్ నువ్వుకూడా విదేశాలకెళ్లి బాగా సంపాదించి రారా. లేకపోతే   నలుగురిలోనూ మాకు నామర్దాగా ఉంది .ఏమి ఫర్వాలేదు వెళ్ళిరా.మేమిప్పటిలో చావం ‘’ అన్నారు నాన్నగారు. (కనువిప్పు)

ఈ .’’నిన్న గుత్తివంకాయకూర రాధగారికి ఇష్టమని చేశారు. ఇవాళ క్యాబేజి కూర రామంగారికి ఇష్టమని చేశారు. నేనడిగిన అరటికాయ ఆవపెట్టిన కూర మాత్రం చెయ్యలేదు. నేనేమీ గతిలేక ఈ వృధ్ధాశ్రమంలో చేరలేదు మా పిల్లలు లక్షలు పోసి ఇక్కడ నన్ను చేర్చారు’’ గర్వం గా అంది దమయంతి. (సర్దుబాటు)

ఉ). ‘’ అదేంటండీ అన్నం ముందునుండి లేచిపోతున్నారు?’’

      ‘’తినాలనిలేదు’’ 

      ‘’ఎందుకు ?’’

      ‘’ జావలా వుంది .పైగా పత్యం కూర బీరకాయతో అస్సలు తినలేను’. 

    ‘’మీరే మెత్తగా లేకపోతె తినలేకపోతున్నానని అన్నారుగా ఒంటికి మంచిదని బీరకాయ చేసాను‘’        

      ‘’ నాకవి వద్దు.  ఇప్పుడేమి తినమంటావు ? వీధి లోంచి గడ్డికోసుకొచ్చి  తినమన్నావా . వెళ్లి పూరీలు ఆలూ మసాలా చేసి కూర, దాల్ ఫ్రై చెయ్యడం మర్చిపోకు.” (రిటైర్ అయిన మొగుడు) 

ఊ.) ’’బామ్మా! శ్రీరాముడుత్రేతాయుగంవాడుకదామరిఆయన నీలాగా ముసలి  వాడు కాకుండా యవ్వనం గా ఉండిపోయాడేమిటి?’’ అడిగింది గ్రీష్మ (జీవితసంధ్య) 

అలాగే ముగింపుతో కథ లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరుతుంది. 

ముగింపు వాక్యాలు …..  కథ మంచి కొసమెరుపు తో లేదా చిన్న ఆలోచన రేకెత్తించడంతో ఆపితే పాఠకుల మనసులు అభినందిస్తాయి. కొన్నిఉదాహరణలు.

అ.) ‘’మన ఇల్లు అమ్మి డబ్బు అబ్బాయికి ఇచ్చ్చి మనం వృధ్ధాశ్రమానికి వెళ్ళేది లేదని వాడికి వెంటనే ఉత్తరం రాయండి. మన పూలతీగలు ఆడపిల్లలు లేని లోటు తీరుస్తున్నాయి. పళ్లచెట్లు పిల్లలు మనవలు ఇవ్వనంత ప్రేమని తీయగా అందిస్తున్నాయి.’’ అంది దృఢంగా 

ఆ). మొన్నటి వస్తువులకు,మొన్నటి కట్టడాలకీ, మొన్నటి వాహనాలకీ వుండే వైశిష్యమే వేరు. ఎన్ని ఆటుపోట్లకయినా తట్టుకోగల స్థైర్యం, ఆఖరుదాకా పోరాడగల ప్రత్యేక లక్షణం పాతకాలవారందరికీ స్వంతం.(ఓల్డ్ ఈజ్ గోల్డ్) 

ఇ).తాను మారాలి. కాస్తయినా తగ్గి ఉండాలి.లేకపోతే  తను ఛస్తే ఏడ్చేవాళ్ళు నాలుగురైనా ఉండరేమోఅనుకుంది (సర్దుబాటు)

కథారచనకు ముఖ్యమైనది కథా  నిర్మాణం. రచయిత   కథలలోని ఇతివృత్తాన్ని ఎలా నిర్మిస్తాడో దాన్ని బట్టి రచన వైశిష్యము తేటతెల్లమవుతుంది. 

                                                       ***

 నేను తెలుగు కథవృధ్ధుల సమస్యలుఅనే సిధ్ధాంత వ్యాసాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సమర్పించినప్పుడు వందలాది కథలు విదేశ స్వదేశ భాషల కథలని  చదివాను. ప్రస్తుత సమాజంలో వృధ్ధుల సమస్య బాగా జటిలంగా ఉండడం వల్ల. వయోధికుల సంస్థలు, వృధ్ధాశ్రమాలతో అవినాభావ సంబంధం ఉండడంవల్ల వృధ్ధుల కోరిక మీదటే వారి సమస్యలపై పరిశోధన ప్రారంభించాను. సాహిత్యానికి నా పరిశోధసని  పరిమితం చెయ్యకుండా వృధ్ధ రైతన్నలు, రైతక్కల వెతలు, ఆత్మహత్యలను గూర్చి,పెద్దలను గ్రామాలలో  వదిలి పిల్లలు పట్టణాలకు వలస పోవడం వల్ల ఏర్పడిన సమస్యలను గూర్చి, 80, 90 వత్సరాల్లో సైతం శ్రమించి కడుపు నింపుకుంటున్న పెద్దలను గూర్చి, గణాంకాలతో సహా అన్ని వయోధికుల సమస్యలను, పరిష్కారాలను పొందుపరుస్తూ  సమర్పించాను.  తన చుట్టూ ఉన్న సమాజంలోని వస్తువులను తీసుకున్నంత కాలం తెలుగు కథ తన స్థానాన్ని నిలబెట్టుకుంటుంది. సాహిత్యం సమాజాన్ని చిత్రించడంతో పాటు ఒక సందేశానివ్వాలి. అది చదువరులు స్వయంగా గ్రహించేదిగా ఉండాలి. సాహిత్యం ఉత్తమ ఆదర్శాలను సమాజానికి అందించాలి.  ఆధునిక సాహిత్య ప్రక్రియల్లో గోరంత దీపం కొండంత వెలుగు అన్నట్లు నిలిచింది.  కథలు మానవ జీవితంలోని తాత్వికతను, సామాజిక, ఆర్ధిక, మానసిక, మానవసంబంధాలను, విశ్లేషణలను,వైఫల్యాలను, వైరుధ్యాలను ప్రతిబింబిస్తూ శక్తివంతమైన సాధనంగా పాఠకుని కదిలిస్తున్నాయి.   

మనదేశంలో వృధ్ధుల జనాభా 1991లో 5 కోట్ల అరవై ఏడు లక్షలుగా 2001 కి 7 కోట్ల 20లక్షలమందికి పెరిగింది. 2021 చివరికల్లా  పదమూడుకోట్ల డెభ్భై లక్షల మందికిపెరుగుతుందని అంచనా.  భారతదేశంలో పెరుగుతున్న వృధ్ధుల జనాభాతో పాటు వారి సమస్యలు కూడా పెరుగుతున్నాయి.   

      అరవైఏళ్ళు రాగానే జీవితం ఆగిపోదని మరో నలభైఏళ్ళు ముందున్నాయి కనక వృధ్ధులు విజయపధంలో పయనించే అవకాశాలు ప్రోత్సాహకారకాలు ఉన్నాయని తెలిపి, పిల్లలే ప్రపంచంగా భావించి వాళ్ళు రెక్కలొచ్చి  పిల్లలు  వెళ్ళిపోగానే వ్యధ చెందక అంతవరకూ కుటుంబంకోసం ఆలోచించిన వారు ఆపైన సమాజం మంచి కోసం ఓపిక ఉంటే శ్రమించాలని, ’కాటికి కాళ్ళు చాచుకున్నవాడు వృద్ధుడుఅని కాకఅనుభవాల సంపదలు ఆర్జించుకున్న వయోశ్రేష్టుడిగాఅభివర్ణించడం అత్యవసరం.  

వృధ్ధులకోసం వృధ్ధులు పరిశ్రమించి, మార్గదర్శకులుగా అయ్యి  నూరేళ్ళ వృధ్ధులు కూడా మంచి ఆరోగ్యంతో గొప్ప స్థాయిలో ఉండటాన్ని వివరించి వెన్నుతట్టేలా  తెలుగుకథ తోడ్పడాలి. తన చుట్టూ ఉన్న సమాజంలోని వస్తువులను తీసుకున్నంత కాలం తెలుగు కథ తన స్థానాన్ని నిలబెట్టుకుంటుంది. సాహిత్యం సమాజాన్ని చిత్రించడంతో పాటు ఒక సందేశానివ్వాలి.  అది చదువరులు స్వయంగా గ్రహించేదిగా ఉండాలి. సాహిత్యం ఉత్తమ ఆదర్శాలను సమాజానికి అందించాలి. అనన్య సామాన్య ప్రజాదరణ పొందిన సాహిత్య ప్రక్రియగా తెలుగువారి  జీవితాల్లోకి ప్రవేశించిన కథానిక మరే ప్రక్రియా అడుగు మోపని మారుమూల చీకటి కోణాలను సైతం స్పృశించింది. వారి రాగద్వేషాలను చిత్రించింది. ఆధునిక సాహిత్య ప్రక్రియల్లో గోరంత దీపం కొండంత వెలుగు అన్నట్లు నిలిచింది.ఈవిధంగా కథలు మానవజీవితంలోని తాత్వికతను, సామాజిక, ఆర్ధిక, మానసిక, మానవసంబంధాలను, విశ్లేషణలను,వైఫల్యాలను, వైరుధ్యాలను ప్రతిబింబిస్తూ శక్తివంతమైన సాధనంగా పాఠకుని కదిలిస్తున్నాయి.   

కథ ఒక కిటికీ వంటిది. కిటికీలోంచి ప్రపంచాన్ని చూడ్డం  వంటిది. కథ అనే కిటికీ లోంచి పాఠకులు ప్రపంచాన్ని చూస్తుంటారు. కథ ఒక ఫోటో ఫ్రేమ్ వంటిది. కిటికీకి ఆవల ఎంతో  ప్రపంచం ఉంటుంది.  కిటికీ తలుపు తీసిన మేరకే కథలో ప్రపంచం కనబడుతుంది.లేదా మనుషుల మనస్తత్వాలు, పాత్రలు, సంఘటనలు కనబడతాయి.          

 ’సూర్యకాంతం పప్పురాసినఅమెరికా ప్రయాణంకథ, ’వంగూరి చిట్టెంరాజురాసినకంప్యూటర్ కంపెనీకథ, గురజాడశోభా  పేరిందేవి రాసిన  ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్కథలు ఎప్పుడు చదివినా  కొత్తదనంతో పాఠకులను  అలరిస్తాయి.

   వృధ్ధులకోసం వృధ్ధులు పరిశ్రమించి, మార్గదర్శకులుగా అయ్యి  నూరేళ్ళ వృధ్ధులు కూడా మంచి ఆరోగ్యంతో గొప్ప స్థాయిలో ఉండటాన్ని వివరించి వెన్నుతట్టేలా  తెలుగుకథ తోడ్పడాలి.

***

పాద సూచికలు :

ఆధునిక కథా సాహిత్యం-డా ద్వానాశాస్త్రి 

కథానిక నిర్మాణ శిల్పం–శీలా వీర్రాజు వ్యాసం మహతి వ్యాససంకలనం 

వాస్తవికత –తెలుగు కథానికలు-కొలకలూరి ఇనాక్  

స్వీట్ 60–డా. గురజాడ శోభాపేరిందేవి 

కథానిక స్వరూప స్వభావాలు-పోరంకి దక్షిణామూర్తి 

కథారచనకు కథకుడి పాఠాలు—సామాజిక తత్వవేత్త  —బి. ఎస్ .రాములు 

కథనరంగం –డా.వేదగిరి రాంబాబు 

మమలు -మానవసంబంధాలు  

ముందుమాట – జి . గంగాధర్ పి.  వి. రమణ —

కథల పరిశీలన—ఆకునూరి విద్యాదేవి 

అడవిబాపిరాజు —కథలు కవిత్వం    

తెలుగు కథ తెలుగుదనం–మధురాంతకం రాజారామ్

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.