బతుకు చిత్రం-8

– రావుల కిరణ్మయి

ఈర్లచ్చిమ్మి ఓ రోజు ఉదయం రాజయ్యతో,

లగ్గం చాన దగ్గర్లచ్చె.చేయాల్సిన పనులు చానా ఉండే,ఎట్లనయ్య?నాకైతే కాల్జేతులు ఆడ్తలెవ్వు.అన్నది.

అదెనే?ఆడకపోను నువ్వు నేను లగ్గానికి చేసే పనేమున్నదని?అంత ఊరోల్లె చెయ్యవట్టిరి.యాళ్ళకు మనోన్ని తయారుజేసి తీస్కపోతె అయిపాయే,ఏమన్న ,ఆయిమన్నోళ్ళు అయిపట్టికనా?పైసలు కట్టలకు కట్టలు ఇచ్చపట్టికనా?గుట్టలకు గుట్టలు కాన్కలు పెట్టపట్టికనా?అవేడదాయాలె?ఇవేడ సదరాలనే ఆరాటపడ?అన్నాడు దెప్పిపొడుస్తూ.

గురివిందగింజ తన ఈపు నున్న కర్రె రంగు చూస్కోక తనది తనే సక్కదనాన్ని చూస్కొని,మురిసినట్టే ఉన్నది నీ ముచ్చట సుత.కట్నాలు,కాన్కల మీద యావ దప్పితే ,మగ పోరగాండ్ల ను నేనెంత సక్కగ పెంపుకం చేసిన?అని సోచాయిన్చుకున్నవా?ఇద్దరు మగోల్లె అయ్యి సుత బాధ్యత లేకుంటైనవ్?ఓ బిడ్డుంటే కష్టం..సుఖం తెలుసచ్చు.ఎప్పుడు నాకేంది?నాకేందని ఏనుగు మీన గూసున్నట్టే ఉంటావాయే?ఓ పండుగెరికనా?పబ్బమెరికేనా?లచ్చిమిదేవసొంటి ఆడపిల్లుంటే ఆ కళ ఏరే ఉండు.నీ గుణానికి దగ్గట్టు చేసిండు దేవుడు.అన్నది.

ఊ…అంటే ఆ …అంటే ఆడపిల్లలంటవ్?నాకు లేకున్టేంది?మా నాయనకు ముగ్గురు లేరా?ఏదో…మా తమ్మునికి నాకు దేవుడు మా మేలెంచి ఇయ్యలేదు గని.అన్నాడు కాలు మీద కాలేసుకుంట కూర్చుంటూ.

ముందున్నది ముసల్లపండుగని,మురువు …మురువు …పోయ్యేయాళ్ళ అచ్చిన్నాడు నీ ముకం తొంగి జూసెటోడు సుత ఉండకపోవచ్చు.

అదెనో..!ఇద్దరం అయినంత మాత్రాన మా అయ్యవ్వల అవతలికి వట్టిగనే పారేసినమానె?నెన్నాళ్ళు మంచాన వడితే ఎత్తిపోసినం.ఈగ వాలకుండ చూసుకున్నం.అదంత చేసింది గుడ నువ్వేకదెనే?ఎట్లా మర్సినవ్?ఆ పున్నెం అక్కరకు రాక పోదు.అన్నాడు.

పూసిందంతా పూత కాదు కాసిందంతా కాత కాదన్నట్టు బిడ్డ లెక్క జూస్కున్నా కోడలు కోడలే ఆయితది గని ప్రతీ కోడలు బిడ్డలెక్కన గాదు.గా నర్సిము మామ సంగతి జూస్తివి గదా!ఏడుగురు కొడుకులు,ఏడుగురు కోడళ్ళు,మనుమలు మనుమరాళ్ళు అందరుండి గూడ ఆస్తులు పాస్తులు అన్ని ఇచ్చి గూడ కడకు ఒక్కడే దిక్కు లేని చావు సచ్చి సూసినోడు లేక మూడొద్దుల దాంక బయటవడకపాయే. బిడ్డుంటే ..బుక్కెడు వెట్టి ఎత్తుక పోయిన్నాడు ఏడువక పోవునా ?ఏం జేస్తం?బిడ్డలు లేని రాతరాసిండు దేవుడు.అన్నది.

అవునే..లగ్గం ముందట వెట్టుకొని సచ్చుడు బతుకుడు మాట్లాడవడితివేమే?తథాస్తు దేవతలు మన భుజాల మీదనే ఉంటరట.అందుకే ఎప్పుడు మంచే అనుకోవాల్నాట.ఇప్పుడు అస్సలు ముచ్చటేందో సెప్పు.అన్నాడు.

ఏంటిదంటే…సిన్నోని పెండ్లి వాడంతట వాడే చెప్పకుంట చెయ్యకుండ చేసుకొని వచ్చె.అటెంకనన్న చేద్దమంటే కోడలుకు ఎవ్వరు లేరు.ఏం జేస్తరు?ఏమన్నుంటే ఆ పైసలే నాకియ్యున్డ్రి మా దోస్తులకు దావతిత్తనని పైసలు వట్టుకపోయి వాడు సాగనియ్యక వానిచ్చ వాడు జేస్కున్నడు.పురుళ్ళు,పుట్టిన రోజులన్ని పట్నంలనే చేసుకొనే.ఆ కోడలుకు ఊరన్నా.ఇల్లన్నా తొంటచేయి లెక్కన్నేనాయే.మింగ మెతుకు లేకున్నా మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు ఎచ్చులకు వోకుంట సంపాయించిన్దంతా ఎప్పటిదప్పుడే నాక్కుంట జల్సా జెయ్యవట్టిరి.ఎన్నడన్న…గిట్ల కాదుర కొడుకా!గిట్ల..గిట్లనీ యవ్వారం జెప్పబోతె,కోడలు చిన్నత్రం పెద్దత్రం లేకుండా నీతులు చెప్పెటందుకేనా?మీరు సుత పాటించేదేమన్నఉన్నదా?అనే,శకునం జెప్పే బల్లి కుడిదిల బడ్డట్టు మీరెందుకు కూడ బెట్టలేదో?అని దీర్ఘాలు దీసె.గుడ్డచ్చి పిల్లనెక్కిరిచ్చిందని నన్నెక్కిరిచ్చె.నా ఎత అది ఏం చూసె పట్కే ఎరుక గావడానికి?పొత్తుల సంసారం, ఇత్తుల సారం మొలుస్తే దప్ప తెలువదన్నట్టు ఎన్నడన్న జేత్తె  ఎరుకవు. అత్తంటే,మామంటే,బావంటే,వదినంటే,మరిదంటే…..మర్యాదంటే,మన్ననంటే.అత్తసేత పట్టిన కోడలు అవుసలాయన సేతపట్టిన పుత్తడి మెరుపువడ్తయన్నట్టు ఎనుకట మా అత్తల తోని ఉండి అన్ని ఎరుకజేసుకుంటిమి.అట్ల అంత బలగం గలిసి జేసిన పెద్ద పబోజనం మీ తమ్ముని లగ్గమే.అదే ఆఖరుది.ఇగ ఏరువడ్డంక ఏం జేసింది లేదు.మీ ముగ్గురు అక్కల బావల పిల్సి చెయి కడిగిచ్చింది లేదు.వాళ్ళు దూరాభారాలై చారాణా ధావతుకు భారాణా ఖర్చని రాను రాను రాఖీ కట్టేతందుకు కూడ వత్తలేరైరి.తప్పదనుకుంటే బావలే రావట్టిరి పోవట్టిరి.  ఇగ ఇప్పుడన్న కండ్లపండుగోలె అందర్ని పిల్సి శార వోసి బట్టలు పెడితె బాగుండని పాణం తొక్కులాడ్తాంది అన్నది నిమ్మళంగా.

మోకాళ్ళు నాయి గాకుంటే ఢిల్లీ దాన్క దేకుతనంటవ్?నీదేం పోయిందే?తెచ్చి పెట్టెటోన్ని నేను.అవతల పొల్ల నిచ్చెటోడు చిల్లి గవ్వ సుత ఇయ్యకుంట పొళ్ళను దాటిచ్చుకుంటాంటే,నేనిప్పుడు అప్పు జేసి పప్పు కూడు బెట్టాల్నా?అటెంక కొడుకు తీర్తడన్న ఆశ సుత లేదు.ఇల్లు మునిగే ముచ్చట్లు జెప్పుడాపి పని జూస్కోపో!

అయ్యో…!గంత మాటంటివేందయ్యా?

లేకుంటే ఇల్లెక్కి ఇరువయి మందిని పందిరెక్కి పడి మందిని పిల్సి జెయ్యమంటవా?ఏంది?

మగోని లగ్గానికి అప్పుఇయ్యిమని ఎవర్నన్న అడుగవోయినా దిమాకు లేనోన్ని చూసినట్టు జూత్తరు.మూలకు మూలుక్కుంట ఏమన్న ధన రాసులుంటే చెయ్యంగ నేనద్దంటాన్నా?ఎచ్చులకు వోయి ఎల్లెలుకల వడద్దంటాన.గంతే.నా అక్క చెల్లెండ్ల పిలుత్తనంటే నాకేమి నొప్పి అన్నాడు.

నొప్పి కాదయ్యా,ఇలవేల్పులసొంటి ఇంటాడిబిడ్డలను సంబురంగ తోల్కచ్చుకొని,కొత్త బట్టలు గట్టిచ్చి  బోనాలు చేసుకొని శార వోసి సాగదోల్తే వాళ్ళ దీవెనార్తుల తోటి గుడిసైనా భమంతి కాక పోదు అన్నది గట్టి నమ్మకంగా.

ఇన్నొద్దులు వాళ్ళను మర్యాద జెయ్యకనే ఇట్లున్నమంటవా?భమంతి సంగతి దేవుడెరుగు గని ఉన్న గోచీ కూడ లేకుండ జేసుకునే పరిస్థితి రానీయకు.అన్నాడు ఎకసక్కెంగా.

నీకన్నీ ఎకసక్కాలే.ఎన్నడన్న ఒక్క మంచి ముచ్చటన్నజెప్పినవా?జేసినవా?నమ్మి నాన ఓత్తె పుచ్చి బుర్రలైనట్టు నిన్ను ఇచారించుడు తప్పైంది.నువ్వేం తేవద్దు.తీర్పద్దు గని ఇంటికి తెల్లసున్నం.జాజు గవి గివి తెచ్చియ్యి.ముందుగాల ఇంటికి సున్నమేసుకోని లగ్గం పనులు సురువు జేసుకుందం.సర్నా..!అన్నది.

రాజయ్య… సర్లేవే..!ఇగ నేనేం మాట్లాడ.నువ్వెట్లంటే గట్లనే.నేన్సుత.ఆకలైతాంది గింత బువ్వెట్టే ముందుగాల అన్నాడు.

ఆకలికి ఆగలేని భర్తకు మారు మాట్లాడకుండా  భోజనం వడ్డించి తానూ తిని కొడుకు సైదులు తో  కూడా ఈ విషయాలన్నీ మాట్లడాలనుకున్నది.

     ****

మరునాడు సైదులు పనేమీ లేక ఇంట్లోనే ఉండడం తో రాజయ్యతో మాట్లాడిన విషయాలన్నీ పూస గుచ్చినట్టుగా చెప్పింది.దానికి సైదులు 

అవ్వా…!నీకు ఎట్లా నచ్చుతే అట్లనే చెయ్యి.నాకు తోచిన కాడికి చేతనైన కాడికి నేనూ ఓ చెయ్యి వేస్తా.నేను దాచినది ఏమీ లేదని నీకూ తెలుసు.నా బలహీనత కూడా నీకు తెలుసు.ఏదన్నా అమ్మి చేసే ఇగురం మాత్రం చెయ్యకమ్మా.ఎందుకంటే అండ్ల తమ్ముడి పాలు గూడ ఉంటది కాబట్టి అట్ల చేసి లగ్గం చేసుకునుడు నాకు ఇష్టం లేదు.అన్నాడు.ఉన్నంతలనే కార్యం గట్టేక్కిన్చుమని చెప్పినట్టు తోచింది ఈర్లచ్చిమికి.

అది కాదురా..!బంగారు వస్తువేదన్నపెడితే బాగుండనుకుంటాన,అందుకని మహిళా పొడుపు సంఘం ల వచ్చిన కాడికి అప్పు దెచ్చి గొట్టాలగొలుసు చేపిద్దామనుకుంటానా.అన్నది.

గొలుసా…?తమ్ముడికి పెట్టకుండా నాకు పెడితే వాడు ఊరుకోడేమోనే?అన్నాడు అనుమానంగా.

వాడికెందుకు పెట్టలేదురా?కాకుంటే ఎంత పెట్టినా వాడికి సరిపోలేదంతే!ఇగ నువ్వేమనకు.ఇషయం నీకు తెలియడానికి జెప్పాను.ఎట్లా జెయ్యాల్నో నేను జేసుకుంటా అన్నది.

సైదులు కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా,

అవ్వా..!నువ్వొక్కదానివేనే నన్ను మనిసి లాగ జూసేది.నీకెరికేనా?పనికి పోయిన కాడ గీ తాగుబోతుగానికి గూడ పొల్లనిత్తాన్డ్రంటే వాడెంత దరిద్రుడో అని గుసగుసలు వెట్టుకుంటాంటే మరసి పోను ఇక్కెక్కువ తాగబుద్ధైతాందని వాళ్ళు వీళ్ళు అనంగ తను విన్న  మాటలు చెప్పుకున్నాడు.

కొడుకా..!నవ్విన నాప చేనే పండుతది. నీ నెత్తిన ఆ అచ్చింతలు పడి జాజులమ్మ తోని ముడివడితే నవ్విన నోళ్లన్ని మూతలు వడుతయ్.నువ్వు ఆ ముచ్చట మర్సి పొయ్యి హుషారుగుండు.ఆ తాగుడు జర తగ్గియ్యరా..!అన్నది తల్లి ప్రేమతో.

సైదులు తలాడించాడు.కానీ,అతనికి తెలుసు.అది లేకుండా తను ఉండలేనని.కానీ ఇక్కెక్కువ పని చేసి అవ్వకు సాయం చెయ్యాలని మాత్రం అనుకున్నాడు .

                         ****

హలో…!సిన్నోడా…!ఇంట్ల పెండ్లాయే అదోటిదోటి పనుంటదాయే..!ఇంట్ల పనులు బయటి పనులు ఒక్కదాన్నే చేసుకోలేక పోతాన.మీరెన్నడత్తర్రా?అడిగింది ఫోన్ జేసి.     

అంతగనం ఏం పనులే ?పెండ్లో పెండ్లని ముర్సి ఎక్కువ తక్కువ పనులు పెట్టుకొని చాతగాకుంట కాకున్డ్రి.ఏదో అయ్యిందనిపించండి చాలు.ఇగ నేనచ్చి చేసేదేమున్నది?

అరేయ్…!శోపత్రికలు ఇచ్చిరాను నువ్వు పోకుంటే ఎవరు పోతర్రా?ఆఖరు లగ్గమాయే..!నువ్వు కోడలు ఇంట్ల అదోటిదోటి సర్దుతాంటే నేనూ..నాయ్నా మేనత్తలకు గిన ఇచ్చి చెప్పత్తం.

ఇద్దరు పోను మిరెందుకే?చార్జీలు దండుగ పెండ్లికొడుకు వాడేం జేత్తాండు?వాణి పెండ్లికి వాన్నే తోలక అన్నాడు.

వాడెట్లపోతడ్రా?వాని సంగతి నీకు బాగ ఎరికే గదా!ఏడ తాగి పడేది తెల్వది.ఇదంత వాదం ఎందుకుగని ?నువ్వెన్నడస్తవ్?అది జెప్పు ముందు?

నేను ఓ రెండు రోజుల ముందుగాలైతే వత్తెనే.నీ కోడలుకు ఊరు వాతావరణం పడదు.పిలగాండ్లకు కూడా పొద్దు పోదు.ఉండలేరు.నువ్వు ఊర్లు తిరుగవోతే ఇంటి పనంత అదొక్కతి చెయ్యలేదే.అందుకే ఉన్నదున్నట్టు చెప్పిన.ఇంతకంటే నేనేం చెయ్యలేను,జెప్పలేను.అన్నాడు.

బాధ్యత లేకుండా చాలా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్న కొడుకును ఇంక ఏమీ అనలేక సరేరా!అట్నే కానియ్!అని ఫోన్ పెట్టేసింది.

రాజు లేకుంటె రాజరికం పడిపోతదా?వీడు రానంత మాత్రాన,చెయ్యనంత మాత్రాన అయ్యేది ఆగుతదా? నేను ఆగనిత్తనా?అనుకొన్నది.

ఇగ ఎవరి మీద పనికి ఆశ పడద్ధనుకొని రెండు రోజుల్లో ఇంటికి సున్నం సైదులు తో వేయించి రాజయ్య తో కలిసి సామానంతా సదురుకున్నది.

మరో మంచిరోజు నాడు ముగ్గురు కలిసి పట్నం వెళ్ళి పెండ్లి బట్టలు పెట్టుపోత బట్టలు అన్ని తీస్కొని, కిరాణం సామాను గూడ తీస్కొని అరటాకు నమూనా ల ఉన్న పెండ్లి పత్రికలకు ఆర్డర్ ఇచ్చి ఇల్లు చేరుకున్నారు.

ఈర్లచ్చిమికి ఆనందం పట్టరాకుండా ఉన్నది.జాజులమ్మ కోసం సైదులు తానే ప్రత్యేకంగా సెలెక్ట్ చేయడమే దానికి కారణం.

రాజయ్యకు కూడా పట్టు దోవతులే తీసుకున్నది.పెండ్లి బట్టల కాడికి చిన్నకొడుకు సాయిలును పిలువద్దనే ఊరుకున్నది.రమ్మనంటే రానని రాగాలు తీసిండని,తాగుబోతని సైదులు ను అన్నని కూడా చూడకుండా చులకన చూస్తున్నాడని ఆమె మనసుల బాధపడింది కనుకనే అలా చేసింది.

మరుసటి రోజు పెండ్లి పత్రికలతో పాటు సైదులు ఈర్లచ్చిమికని ప్రత్యేకంగా పట్టుచీర  లాంటి చీర తీసుకురాగా 

నాకెందుకురా?ఇంత ధరది?అన్నది అపురూపంగా చూస్కుంటూ.

అవ్వా..!నన్నెవ్వలు అర్థం చేసుకోరు.ఒక్క నువ్వు తప్పితే.గసొంటి నీకు నా కష్టం బెట్టి తేవాల్ననే తెచ్చిన.ఉంచుకోయే అన్నాడు.

చీర కన్నా కొడుకు లో వస్తున్న మార్పుకు మురిసి పోయింది.పెండ్లి పత్రికలు ముందు ముందు రామాలయం తీసుకెళ్ళి అయ్యవారి చేత అర్చనల తో దేవుడి పాదాల వద్ద ఉంచి పూజ చేసి మొదటి పిలుపు దేవుడికే అన్నట్టుగా ఇచ్చి దీవించమని మనస్పూర్తిగా మోకరిల్లింది.

అవ్వా..!నా దోస్తుగాడు రాయేశం,నేను పత్రికలు పంచుతమని దగ్గర దగ్గరోల్లకు అందరికి ఇచ్చి వచ్చాడు.మేనత్తల ఇండ్లకు మాత్రం పోనన్నడు.వరుసైనా  వాళ్ళెవ్వలు బిడ్డలనిత్తమని అడుగక పోవడమే అందుకు కారణం.

అందుకే రాజయ్య,ఈర్లచ్చిమే ఇచ్చి వచ్చారు.ముగ్గురూ ఆడబిడ్డ కట్నం ఏమిత్తవ్?వదినే అని పరాచికం ఆడిండ్రు.

ఎందుకంటే మరిది పెండ్లప్పుడు గిట్లనే ఆడబిడ్డల కట్నం అని మాట్లాడుకొని అన్నదమ్ములు ఇద్దరు మీరే అమ్మాయిలోళ్ళను అడుక్కోండ్రని తప్పించుకున్నారు.అదే ఇప్పుడు గుర్తు చేస్కుంట నవ్విండ్రు.

పాపం..!వాళ్ళకు మాత్రం పుట్టింటి నుండి కాన్కలంటే ఆశే ఉంటది కదా!ఏం చేద్దామనుకున్నది.  

*****

ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.