ఒక భార్గవి – కొన్ని రాగాలు -17

మనోహరమైన మాండ్ రాగం

-భార్గవి

మదన మోహిని చూపులోన మాండు రాగమేలా? అని నాయకుడు నాయికని ప్రశ్నించగానే ,”అసలు మాండు రాగం యెలా వుంటుది?”అనే సందేహం తలెత్తడం ,పైగా అది చూపులో యెలా ప్రవహిస్తుంది అనిపించడం సహజం.సరే పదండీ ఆ రాగం గురించి తెలుసుకుందాం.

మాండ్ రాగం ఉత్తర హిందూస్థానంలో బాగా ప్రాచుర్యంలో వున్న రాగం,ప్రణయానీ,ఉల్లాసాన్నీ,సూచించడానికి యెక్కువగా వాడినా యే అనుభూతినైనా అలవోకగా పలికించగలిగే రాగంగా భావిస్తారు.

నిజానికి ఇది రాగం కాదు అంటారు–

మాండ్ అనేది రాజస్థానీ జానపద సంగీత సంప్రదాయానికి చెందిన ఒక గాయన పథ్థతి అంటారు.వివాహాలలోనూ ,జన్మదినోత్సవాలలోనూ  పాడే పాటలు సాధారణంగా ఈ శైలిలో వుంటాయి అంటారు.

మొట్టమొదట హిందూస్థానీ సంగీతంలో  విరివిగా ఉపయోగించబడిన ఈ రాగం ,నెమ్మదిగా కర్ణాటక సంగీతంలో కూడా స్థానం సంపాదించింది.

హిందూస్థానీ సంగీతంలో గజల్స్ ,ఠుమ్రీలు యెక్కువగా ఈ రాగంలో వినపడతాయి .

కర్ణాటక సంగీతంలో 29వ మేళకర్త అయిన ధీర శంకరాభరణం నుండీ జన్యరాగంగా పరిగణిస్తారు.కచేరీలు ముగించేటప్పుడు తేలికగా పాడే భజన్సు ఈ రాగంలొ వుంటాయి సాధారణంగా.ఆరోహణలో అయిదు స్వరాలుంటాయి అవరోహణలో యేడు స్వరాలూ వుంటాయి కానీ ఒకక్రమ పధ్ధతిలో వుండవు వక్రంగా వుంటాయి. జనక రాగంలో లేని అన్య స్వరాలు వినపడినప్పుడు “మిశ్ర మాండ్ “అని పిలుస్తారు.

కర్ణాటక సంగీతంలో త్రిమూర్తులు (త్యాగయ్య,శ్యామశాస్త్రి,ముత్తుస్వామి దీక్షతర్ )ఈ రాగంలో చేసిన ప్రసిధ్ధ కీర్తనలేవీ కనపడవు

మైసూర్ వాసుదేవాచారి “జానకీ మనోహరం”అనే కీర్తన పేరొందినది. లాల్ గుడి జయరామన్ ఒక చక్కని తిల్లానా చేశారు ఈ రాగంలో

కర్ణాటక సంగీతంలో అనేక భక్తి గీతాలూ,ప్రేమ గీతాలూ ,భజనలు ఈ రాగంలో వుండటానికి కారణం సంతోషమూ,విషాదమూ కూడా సరిసమానంగా ఈ రాగంలో పలకడమే.అనేక రాగమాలికల్లో కూడా మాండ్ రాగాన్ని వాడడం కనపడుతుంది.

“సతీ సక్కుబాయి” నాటకంలో “కాలి అందియలు ఘల్లుఘల్లుమన ఆటలాడుకోరా నా ముద్దుల మాట గదరా”అనే పాట మధుర గాయని యస్ .వరలక్ష్మి మాండ్ రాగంలో చాలా హాయిగా పాడి రక్తి కట్టించారు

ప్రయివేట్ గీతాలను గురించి చెప్పాలంటే నండూరి .సుబ్బారావు గారి ఎంకి పాటలలో 

“కొమ్మలో కోకిల కోకో యంటదే” అనే పాటని చిట్టిబాబు గారు మాండ్ రాగంలో ప్రత్యేకంగా పలికించే వారు ముఖ్యంగా “కూ కూ” అనే పలుకు వీణ మీద విన్నప్పుడల్లా ప్రేక్షకులూ,శ్రోతలూ పరవసించే వారు.ప్రఖ్యాత గాయని శోభారాజు పాడిన “వాడల వాడల వెంట వాడెవో వాడేవో”అనే అన్నమయ్య పదం వున్నది కూడా మాండ్ రాగంలోనే.

ఇక సినిమా పాటలు మాండ్ రాగంలో తెలుగు,హిందీ ,తమిళ సినిమాలలో మరీ యెక్కువగా కాకపోయినా తగినన్ని వున్నాయి.

“జయభేరి”—-ఈ చిత్రంలో సంగీతం ఉన్నత స్థాయికి చెందిందని భావిస్తారు ,ఇందులో “నీదాన నన్నదిరా నిన్నే నమ్మిన చిన్నదిరా “అనే పాట మాండ్ రాగం ఆధారంగా చేసినది.పాడినది ఘంటసాల,రచన మల్లాది రామకృష్ణ శాస్త్రి.,సంగీతం చేసినది పెండ్యాల నాగేశ్వరరావు,ఈ పాట రికార్డ్ చేశారు కానీ సినిమాలో వినపడదెందుచేతో!

ఘంటసాల వెంకటేశ్వరరావు గారు యెంత మధుర గాయకుడో మనకు తెలిసిందే ,సంగీత దర్శకుడుగా కూడా అంత మధురమైన బాణీలు సృష్టిస్తారు.ఆయనకు హిందుస్థానీ సంగీతం మీద మంచి అభిరుచి యేర్పడటానికి కారణం బడే గులామ్ ఆలీఖాన్ .ఖాన్ గారు వారింట బస చేసినప్పుడల్లా ఆయన పాడుకుంటుంటే ఘంటసాల శ్రధ్ధగా వినేవారట

అందుకేనేమో  ఆయన సంగీతం చేసిన పాటలలో హిందుస్థానీ రాగాలైన భాగేశ్రీ,రాగేశ్రీ,.మాండ్ అలవోకగా ఒదిగిపోతూ వుంటాయి.

ఆయన దర్శకత్వంలోవి రెండు,మూడు పాటలు మాండ్ రాగం ఆధారంగా చేసినవి ఉదాహరిస్తాను

.”రహస్యం” చిత్రంలో చేసిన “సాధించనౌనా జగాన” పాట పాడినది సుశీల,ఘంటసాల –రచన శ్రీ మల్లాది.

“పుణ్యవతి” చిత్రంలో “మనసు పాడింది సన్నాయి పాట “—ఇది పాడింది కూడా సుశీల ఘంటసాలల యుగళమే (ఈ పాటలో సన్నాయి బహు అందంగా వినపడుతుంది)—రచన సి.నారాయణ రెడ్డి.

“పెళ్లిసందడి”—(పాతది,కొత్తదికాదు)—“రావే ప్రేమలతా నీవే నా కవితా”—పాడినది బాలసరస్వతి,ఘంటసాల —రచన జూనియర్ సముద్రాల,పాట యెంత సుతిమెత్తగా ఆహ్లాదంగా వుంటుందో వింటుంటే అంత పిచ్చెక్కుతుంది.

“కథానాయిక మొల్ల” చిత్రంలో “తనువు నీదే మనసూ నీదే వేరే దాచింది యేముంది స్వామీ” పాడినది సుశీల–సంగీత దర్శకత్వం యస్ .పి.కోదండపాణి.

రమేష్ నాయుడు సంగీత దర్శకత్వమంటే చాలా ఇష్టం నాకు అందులో ఈ పాట మరీ ఇష్టం “నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలి నే పంచుకోనా”–కలం వేటూరిది,గళం బాలూది,చిత్రం “ముద్ద మందారం.”

మా క్లాస్ మేటూ,ప్రముఖ వైద్యుడూ అయిన డాక్టర్ గురవారెడ్డికి ఈ పాటంటే పిచ్చి,బాలూ గారెప్పుడు వైద్యానికి తన దగ్గరకి వచ్చినా ఫీజు కింద ఈ పాట పాడించుకునే వాడు.

ఎ.యమ్ .రాజా సుతిమెత్తని గాయకుడే కాదు అతి చక్కని సంగీత దర్శకుడు కూడా తెలుగు ,తమిళ చిత్రాలకి సంగీత దర్శకత్వం నెరపారు .రాశిలో తక్కువయినావాసి లో గొప్పవి.

“పెళ్లి కానుక” లోని ఈ చలాకి పాట చూడండి -“కన్నులతో పలకరించు వలపులూ యెన్నటికీ మరువరాని తలపులూ”–పాడినది సుశీల తనతో గొంతు కలిపినది ఎ.యమ్ .రాజా.–రచన ఆచార్య ఆత్రేయ.ఈ పాటకీ మాండ్ రాగం ఆధారంగా చేసిందే.

“సతీసక్కుబాయి” సినిమాలో పి.ఆదినారాయణ రావు గారి సంగీత దర్శకత్వంలో పి.సుశీల పాడిన “ఘల్లుఘల్లు మని గజ్జలు మ్రోగగ గంతులు వేయుచు రారా” పాట మాండ్ రాగానికి మంచి ఉదాహరణ.

“డ్యూయట్ “అనే సినిమాలో యస్ .పి.బాలు పాడిన “అంజలీ అంజలీ పుష్పాంజలీ”అనే పాట ఎ.ఆర్ రహ్మాన్ దర్శకత్వంలో మాండ్ రాగాన్ని వినూత్నంగా ఆవిష్కరిస్తుంది,మధ్య మధ్యలో వచ్చే శాక్సఫోన్ బిట్లూ,పియానో బిట్లూ చాలా బాగుంటాయి,ఆయనే “సంగమం” అనే తమిళ సినిమాలో నిత్యశ్రీ మహదేవన్ తో పాడించిన “సౌక్యమా” అనే పాటకి కూడా మాండ్ రాగమే ఆధారం.

హిందీ సినిమాలలో నౌషాద్ ,మదనమోహన్ ,యస్ .డి బర్మన్ లు ఈ రాగం ఆధారంగా బాణీలు చేశారు,అయితే దాదాపు ఈ సినిమా పాటలన్నీంటిలోనూ అన్య స్వరాలు వినిపించే అవకాశముంది.అలా అన్య స్వరాలు వినిపించినప్పుడు దానిని “మిశ్రమాండ్ “అంటారు.

“దిల్ దియా దర్ద్ లియా”–చిత్రంలో నౌషాద్ దర్శకత్వంలో లతా పాడిన “ఫిర్ తెరీ కహానీ యాద్ ఆయీ”అనే పాట.

“బైజు బావరా” చిత్రం—“బచ్ పన్ కీ మొహబ్బతే”—రఫీ ,లతా –మళ్లీ నౌషాదే

“స్వామి” అద్భుతమైన చిత్రమూ ,పాటలూ హేమమాలినీ తల్లి జయా చక్రవర్తి ,బాసూ ఛటర్జీ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం.సంగీత దర్శకుడు రాజేష్ రోషన్ ,అందులో “ఫల్ భర్ మే యే క్యా హోగయా” అనే పాటంటే పిచ్చి ఇష్టం నాకు ,పాడినది ఇంకెవరు లతాయే

“రేష్మా అవుర్ షేరా”—చిత్రం లో లతా పాడిన “తూ చందా మై చాందినీ” కి సంగీత దర్శకుడు జయదేవ్ 

“హీర్ రాంజా” సినిమాలో “దోదిల్ టూటే దో దిల్ హారే”–రచన కైఫీ ఆజ్మీ,సంగీతం మదనమోహన్ ,పాడినది మరెవరూ కాదు లతా దీదీయే.

“అభిమాన్ “సినిమాకి అసమానమైన సంగీతం అందించినది యస్ .డి.బర్మన్ ,అందులో లతా పాడిన “అబ్ తో హై తుమ్ సే హర్ ఖుషీ అపనీ”అనే పాట —-ఇవన్నీ మాండ్ రాగం లో పరిమళించినవే

చూశారుగా అదీ మాండ్ రాగ మహిమ

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.