మా అమ్మ విజేత-1

– దామరాజు నాగలక్ష్మి

వీరలక్ష్మి  “ఒరేయ్ సుబ్బారావ్ మన రోడ్డు చివర వీరభద్రయ్య గారి చెల్లెలు ఉంది.  నీకు ఈడూజోడూ సరిపోతుంది. సాయంత్రం వెళ్ళి చూసొద్దాం” అంది కొడుకు సుబ్బారావు. 

సుబ్బారావు “సరే అమ్మా” తల వూపి వెళ్ళిపోయాడు. 

మంచిరోజు చూసుకుని వీరభద్రరావు చెల్లెలు సుందరిని చూడ్డానికి వెళ్లారు.

“అమ్మాయి చక్కగా వుంది. మాకేమీ అభ్యంతరం లేదు. మీ అమ్మాయికి ఏం నగలు పెడతారో మీ ఇష్టం. మాకేమీ అక్కరలేదు” అంది వీరలక్ష్మి.

“నమస్కారం వీరలక్ష్మిగారు మంచి మాట చెప్పారు. ఇప్పుడే ముహూర్తాలు పెట్టుకుందాం” అని వీరభద్రయ్య పూజారి రామయ్యగారికి కబురు చేశాడు. 

“వీరభద్రం గారూ… శ్రావణమాసం, బుధవారం రోజు మంచి ముహూర్తం వుంది. ఖాయం చేసుకోండి” అన్నాడు.   

“రామయ్యగారూ… సరేనండీ మంచిది. మళ్ళీ వచ్చేవారం కలవండి. ఇంకా నెలరోజు వుందికదా” అంటూ వీరభద్రయ్య పూజారికి దక్షిణ ఇచ్చి పంపించేశాడు. 

ఊళ్ళో అందరూ “సుబ్బారావు చాలా అందగాడు. అమ్మాయి కొంచెం పొట్టిగా వున్నా… పద్ధతయిన కుటుంబం. పైగా ఆ రోడ్డు చివర వాళ్ళు, ఈ రోడ్డు చివర వీళ్ళు.  వెళ్ళి రావడం తేలికవుతుంది. సుబ్బారావు ఉద్యోగం ఏమీ చెయ్యకపోయినా 200 ఎకరాల మాగాణి వుంది. తిండికి లోటుండదు. అబ్బాయికి ఎటువంటి అలవాటు లేదు” అంటూ  ఈ విషయాలే చెప్పుకుంటున్నారు.

“పెళ్ళి వారంరోజులలోకి వచ్చింది. రేపు సుందరిని పెళ్ళికూతురిని చెయ్యాలి. కావలసిన ఏర్పాట్లు చూడండి” అంటూ తమ్ముళ్ళు పట్టెయ్య, శివయ్యలతో చెప్పాడు వీరభద్రయ్య. 

పట్టెయ్య, శివయ్య ఇల్లంతా మామిడాకుల తోరణాలు కట్టి, బంతి పువ్వులతో అలంకరణ చేయించారు. పాలేళ్ళు, పనివాళ్ళందరికీ తలో పని చెప్పి, ఇల్లూ వాకిలీ శుభ్రం చేయించారు.  

వెంకమ్మగారు సుందరికోసం చేయించిన నగలు, వెండి పళ్ళెం, చెంబు కంసాలి దగ్గర నుంచి తెప్పించి జాగ్రత్త పెట్టారు. ఊళ్ళో అందరూ బంధువులే కాబట్టి పెళ్ళికూతురుని చేసే కార్యక్రమంలో అందరూ హడావిడి పడుతున్నారు. 

ముందు పెళ్ళి కొడుకుని చెయ్యాలి కాబట్టి వీరలక్ష్మిగారింటికి అందరూ వెళ్లి సుబ్బారావుని పెళ్ళికొడుకుని చేసి ఆశీర్వదించి వచ్చారు.  “ఒరేయ్ సుబ్బారావ్ పెళ్ళికొడుకు అయిపోయావు. గుమ్మం దాటి బయటికి వెళ్ళకు” అంటూ సుందరీ వాళ్ళింటికి చేరిపోయారు అందరూ.

తెల్లవారి సుందరికి మంగళహారతి ఇచ్చి, ముత్తయిదువులందరూ తలస్నానం చేయించి చక్కటి ఆకుపచ్చరంగు పట్టు చీర కట్టి, కాసులపేరు, వడ్డాణం, చేతినిండా గాజులు వేసి అలంకరించారు. 

పేరంటానికి వచ్చినవాళ్ళందరూ బంగారు బొమ్మలా వున్నావు. నూరేళ్ళు చల్లగా వుండు అని ఆశీర్వదించారు”. సుందరి ముసిముసి నవ్వులు నవ్వుతోంది. 

అందరూ సుందరితో వేళాకోళాలు ఆడుతూ, సందడి సందడి చేస్తున్నారు. 

వీరభద్రంగారు “రండి!  రండి! అందరూ భోజనాలు చెయ్యండి చాలా పనులున్నాయి” అని అందరినీ పిలుస్తూ… “వీరలక్ష్మి గారిని కూడా ఇక్కడికే రమ్మనండి. ఆవిడ తినేసి అబ్బాయికి తీసుకెడతారు” అంటూ తమ్ముళ్ళకి చెప్పారు.

మగపెళ్ళివారు కాబట్టి వీరలక్ష్మిగారిని దగ్గరుండి తీసుకుని వచ్చి ఆవిడకి తగిన మర్యాదలు అందించారు. ఆవిడకి ప్రత్యేకంగా ఒకచోట భోజనం ఏర్పాటు చేసి. ఈలోపున పెళ్ళికొడుకుకి కూడా భోజనం పంపించారు వీరభద్రయ్యగారు. 

పెళ్ళి ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు.  వీరభద్రయ్యగారు “ఒరేయ్ రంగా పొలానికి వెళ్ళి, తాటాకులు కొట్టించి తీసుకురా… సంతలో అమ్ముతున్న వెదురుకర్రలు పందిరివెయ్యడానికి తీసుకురా… మొత్తం పందిరి సంగతి నువ్వే చూసుకో… ” అనేసి వెళ్ళిపోయారు. 

అక్కడే ఉన్న పట్టెయ్యని చూసి, “పట్టెయ్యా… వంటమనిషిని వారం రోజులకి మాట్లాడు. ఇంటినిండా చుట్టాలు వస్తారు. అందరికీ దేనికీ లోటు లేకుండా చూడాలి. పెళ్ళిరోజు మాత్రం 300 మందికి తక్కువ రారు. విస్తరాకులు అన్ని ఏర్పాట్లు నువ్వు చూసుకో”  అంటూ…

“ఏం బంగారయ్యా… రాజమండ్రి నుంచి బట్టలు తెచ్చావా… అక్కడ పక్కన కూచో.. భోజనం చేశాక అందరికీ చూపించి, మిగిలినవి తీసుకుని వెళ్దువుగాని” అని చెప్పారు. బంగారయ్య లేచి నమస్కారం పెట్టి పక్కన కూచున్నాడు. 

అప్పుడే వచ్చిన రామయ్యగారిని చూసి, “రామయ్య గారూ… మీరు పెళ్ళికి కావలసిన లిస్టు తెచ్చినట్టున్నారు కదా… ఏది ఎంతెంత కావాలో రాశారు కదా… మనకి ఇక్కడ ఊళ్ళో దొరకనివి పక్క ఊళ్ళో తెచ్చుకోవాలి ” అంటూ లిస్టుని చదువుకుని పంతులుగారికి కొంత డబ్బు ఇచ్చి పంపించేశారు.

పెళ్ళి రోజు రానే వచ్చింది. హడావుడిగా తిరుగుతున్నారు. చక్కగా సంప్రదాయబద్ధంగా తాటాకు పందిర, మామిడి తోరణాలు, స్తంభాలకి అరటి చెట్లు, బంతిపువ్వులతో చక్కగా అలంకరించారు.  ఊరంతా చుట్టాలే కావడంతో ఎవరింట్లో పెళ్ళయినా అందరి భోజనాలు అక్కడే. హడావిడంతా అక్కడే. 

తెల్లారగట్ల పెళ్ళి, అందరూ సాయంత్రం భోజనాలు కానిచ్చి, ఇళ్ళకి వెళ్ళి పట్టుచీరలు, నగలు పెట్టుకుని వచ్చారు. పెళ్ళి తంతు మొదలైంది.  కొంతమందికి నిద్ర వచ్చినా హడావిడికి మళ్ళీ హుషారు తెచ్చుకుంటున్నారు.  ముహూర్తం టైము దగ్గర పడింది.  

రామయ్యగారు మంత్రాలు పద్ధతిగా చదువుతున్నారు.  మంగళసూత్రధారణ అయ్యింది.  అందరూ వర్షం పడుతోందా అన్నట్లు సుందరి, సుబ్బారావుల మీద అక్షింతలు వేసి ఆశీర్వదించారు.  ఇద్దరూ చిన్నవాళ్ళే. చూడ్డానికి ముచ్చటగా వుంది జంట. 

ఇంక తలంబ్రాల తంతు మొదలైంది. కన్నెపిల్లలందరూ చుట్టూ చేరి చాలా హడావుడి చేశారు. ఇంతలోకే వంట బ్రాహ్మడు మంచి ఘుమ ఘుమలాడే కాఫీ తీసుకువచ్చాడు.  అది కూడా పెద్ద పెద్ద బంగారంలా మెరిసిపోతున్న ఇత్తడి గ్లాసులతో… అందరూ కాఫీ తాగుతూ పెళ్ళి తంతు ఆనందంగా చూశారు.  పెళ్ళి తర్వాత జరిగే తంతులన్నీ బ్రాహ్మడు చేయిస్తున్నాడు. తెల్లవారిపోయింది.  

అందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళి కాసేపు నిద్రపోయి, మళ్ళీ పెళ్ళింటికి వచ్చారు. అప్పట్లో పెళ్ళి ఇంట్లో ఒకటికి రెండుసార్లు కాఫీ ఇచ్చేవారు కానీ టిఫిన్లు వుండేవి కాదు. 

ఉదయం పది గంటలకల్లా వంటలు పూర్తయ్యాయి. భోజనాలకి సిద్ధం చేస్తున్నారు. పెద్ద తాటాకు పందిరి కింద వరసగా జంపఖానాలు పరిచారు. చక్కటి అరిటాకులు అందరికీ వరసగా పెట్టారు. పెళ్ళింటికి కొంతమంది వాళ్ళ గ్లాసులు, చిన్నపాటి చెంబులు మంచినీళ్ళు తాగడానికి తెచ్చుకున్నారు. 

ఇంక వడ్డన మొదలైంది.  పులిహోర, బూరెలు, బొబ్బట్లు, లడ్డూలు,  ముద్దపప్పు, వంకాయి కూర, ముక్కల పులుసు,  కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి, దోసావకాయ, గుమ్మడి వడియాలు, అప్పడాలు, గడ్డ పెరుగు, కమ్మని వాసనతో నెయ్యి, పొడి పొడిలాడుతున్న అన్నం.  ఇన్నిరకాల పదార్థాలతో ఆకులు కళకళలాడుతున్నాయి.  అందరూ ఆనందంగా కడుపునిండా భోజనాలు చేసి, తాంబూలం తీసుకుని ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళారు.

పెద్ద పెద్ద లడ్డూలు, అరిసెలు,  జంతికలు, మినపసున్ని, కజ్జికాయలు ఐదు రకాల పిండివంటలు, పట్టు బట్టలు, పువ్వులు, గాజులు కాసులపేరు, చిన్న సైజు వడ్డాణం, వెండి పళ్ళాలు, వెండి చెంబులు,  గ్లాసులు, అరటిపళ్ళ గెలలు అన్నీ సారెగా ఇచ్చి ఐదుమంది ముత్తయిదువలని తోడు ఇచ్చి అత్తవారింట్లో దింపారు. 

రోడ్డుచివరే ఇల్లయినా ఆడపిల్లని వదిలి పెట్టడం అంటే అందరికీ బాధే. 

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.