సరస్వతి గోరా

-ఎన్.ఇన్నయ్య

నేను ప్రపంచంలో ముఖ్యమైన నాస్తిక కేంద్రాలను చూశాను. అమెరికా ఇంగ్లండ్ లో నాస్తి కేంద్రాల దగ్గిరకి వెళ్లాను. కాని ప్రపంచంలో ఎక్కడా కూడా విజయవాడలో ఉన్న నాస్తిక కేంద్రం వంటిది లేదు.  గోరా (గోపరాజు రామచంద్రరావు) స్థాపించిన నాస్తిక కేంద్రం విజయవాడలో ఉన్నది. ఈ కేంద్రం విశిష్ట స్థానాన్ని సంపాదించుకుని గౌరవం పొందింది. దీనికి చేయూతనిచ్చిన, అండగా నిలిచిన ప్రధాన వ్యక్తి సరస్వతి. ఈమె గోరా భార్య. 

సరస్వతి 1912లో సెప్టెంబరు 28న సనాతన కుటుంబంలో పుట్టారు. గాంధీ గారి వలే గోరా కూడా పదేళ్ళ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నారు. ఆమె సరస్వతి. విజయనగరానికి చెందిన సరస్వతి పెళ్ళయిన అనంతరం గోరాతోపాటు కొన్నాళ్ళు శ్రీలంక వెళ్ళి గడిపారు. తరువాత విజయవాడ వచ్చి (ఆనాడు అది బెజవాడ) స్థిరపడ్డారు. గోరా దంపతులకు తొమ్మిదిమంది సంతానం. అందులో ప్రధానంగా పేర్కొనదగినవారు విద్య, లవణం, విజయం, సమరం, మైత్రి, మారు బహుళ ప్రచారం పొందినవారు. పెద్ద కుమారుడు లవణం ఆనాడే కులాంతర వివాహం చేసుకున్నారు. సుప్రసిద్ధ కవి, రచయిత  జాషువా కుమార్తెను పెళ్ళి చేసుకున్నారు. పెద్ద కుమార్తె విజయ పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికయింది కూడా.  మనోరమ అర్జునరావును గాంధీగారి ఆశ్రమంలో పెళ్ళి చేసుకుంది. గాంధీగారికిచ్చిన మాట ప్రకారం వీరు తమ పెళ్ళి  వార్ధా ఆశ్రమంలో జరుపుకున్నారు. మరో కుమార్తె విద్య లోక్ సభకు ఎన్నికై అనేక విధాల నాస్తిక కేంద్రానికి అండగా నిలిచారు. 

నాస్తిక కేంద్రం విజయవాడ వచ్చి నెలకొల్పటానికి చెన్నుపాటి శేషగిరిరావు దానం చేసిన స్థలమే కారణం. 

సరస్వతి గోరాకు అండగా నిలిచి కష్టసుఖాలలో కీలకపాత్ర పోషించింది. ఆమె నాస్తిక కేంద్రంలో ఒక బల్ల, కుర్చీ వేసుకుని ప్రవేశ ద్వారం వద్ద కూచుని వచ్చిన వారికి స్వాగతం పలికేది. అందరికీ భోజనాలు పెట్టి ఆశ్రయమిచ్చేవారు. సరస్వతి సేవలను గుర్తించిన కారణంగా జమన్ లాల్ బజాజ్ అవార్డు ఇచ్చాడు.  ఆమె కృషిని దృష్టిలో పెట్టుకుని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గౌ. డాక్టరేట్ ప్రసాదించింది. శ్రీలంకలో పర్యటించిన సరస్వతి ఆద్యంతాలు నిరాడంబరంగా గడిచాయి. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ నాస్తిక కేంద్రానికి వచ్చినప్పుడు ఉచిత రీతిని అతనికి సరస్వతి సన్మానించి స్వాగతం పలికారు. ప్రపంచ నాస్తిక సభలు విజయవాడలో జరిగినప్పుడు వచ్చిన ప్రతినిధులకు, అతిథులకు భోజన వసతి సౌకర్యాలు సరస్వతి పర్యవేక్షించి జాగ్రర్తపడ్డారు.  వేదకమీద కూర్చొని అతి పరిమితంగానే మాట్లాడేవారు. అన్ని ఒడుదుడుకులకు తట్టుకుని గోరాతో సహకరించారు. ఇందులో పేర్కొనదగినది ఆవుమాంసం, పంది మాంసం వండి భోజనాలు వడ్డించినపుడు ఉద్రిక్తమైన వాతావరణంలో ఆమె నిబ్బరంగా నిలిచారు. ఆమె పేరిట పోస్టల్ శాఖవారు 2011లో స్టాంపు విడుదల చేశారు. 

ప్రపంచంలో అతిముఖ్యమైన నాస్తిక కేంద్రాలు అమెరికాలోనూ ఇంగ్లండ్ లోనూ ఉన్నప్పటికీ విజయవాడ నాస్తిక కేంద్రంతో పోల్చదగినవి కావు.  నాస్తిక కేంద్రం యువతీ యువకులకు శిక్షణ ఇవ్వడం హాస్టల్ నిర్వహించడం, ప్రెస్ నడపటం, ఇంగ్లీషు తెలుగు పత్రికలు వెలువరించడం గమనిస్తే కేంద్రంతో పోల్చదగిన నాస్తిక కేంద్రాలు మరెక్కడా లేవంటే ఆశ్చర్యంలేదు. నాస్తిక నాయకులు, నాయకురాండ్రు విజయవాడలో సరస్వతి స్వాగతం అందుకుని ఆతిథ్యం స్వీకరించారు. తొణికిసలాడకుండా నిబ్బరంగా ఉండటం సరస్వతి స్వభావం. ఇది చాలా అరుదైన లక్షణం.  93 సంవత్సరాలు తిరుగులేని నాస్తికురాలిగా ఉంటూ సరస్వతి విజయవాడలో గడిపారు. అమెరికా నుండి వచ్చిన నాస్తిక నాయకురాలు నడల్యా ఓహేర్ ఆమెను కలిసి రెండు రోజులు గడిపారు. మానవవాదులలో ప్రముఖులు, కొందరు హేతువాదులు నాస్తిక కేంద్రంలో ఆమెను కలిసి ముచ్చటించారు. సరస్వతి అన్ని విధాల విశిష్టమైన నాస్తికురాలు. 93 సంవత్సరాలు గడిపిన ఆమె నాస్తిక కేంద్రం నిలదొక్కు కోవటానికి కృషిచేసింది.  ఈ రంగంలో ఆమెతో పోల్చదగినవారు ఎవరూ లేరు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.